ఏమార్చడంలో దిట్ట
ఆడి తప్పడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేర్పరి. ఒకే అంశంపై విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడంలో ఆయనది అందెవేసిన చేయి. రాజకీయ లబ్ధే పరమావధిగా రెండు నాల్కల ధోరణితో ముందుకెళ్లడమే చంద్రబాబు జీవిత పరమార్థం. ఇందుకు చంద్రబాబునాయుడి రాజకీయ జీవిత పుటలను తిరగేస్తే పేజీకో ఉదాహరణ కన్పిస్తుంది.
అప్పుడు
2004 కృష్ణా పుష్కరాల్లో ఘాట్ రెయిలింగ్ కూలీ ఐదుగురు మరణించడానికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
►కృష్ణా పుష్కరాల ఘటనపై... మీకు చేతకాకపోతే తప్పుకోండి అంటూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై గంభీర స్వరంతో విరుచుకుపడ్డారు.
►అప్పటి దుర్ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
►కృష్ణా పుష్కరాల్లో విజయవాడ వద్ద ఐదుగురు మరణించిన సంఘటనపై స్మారక స్థూపం నిర్మించాలని చంద్రబాబు డెరైక్షన్‌లో టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
► కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఏపాటివో తొలిరోజు జరిగిన ఘటనతోనే డొల్లతనం బయట పడిందని బాబు విరుచుకుపడ్డారు. (నిజానికి కృష్ణా పుష్కరాలు జరగడానికి మూడు నెలల ముందు మాత్రమే వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.)
►‘కాంగ్రెస్ నిర్వాకం వల్లే కృష్ణా పుష్కరాల్లో ఘోరం జరిగింది. గతంలో గోదావరి పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించాం. మేమే గ్రేట్’ అని చంద్రబాబు డబ్బా కొట్టుకున్నారు.
ఇప్పుడు
► గోదావరి పుష్కరాలు తొలిరోజున.. బాబు ప్రచార ఆర్భాటం కారణంగా 29 మంది మరణించడాన్ని చిన్న దుర్ఘటనంటూ కొట్టిపారేస్తున్నారు. రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌పై కనీసం స్పందించడంలేదు.
► తన నిర్వాకం వల్ల 29 మంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోతే.. సంఘటన జరిగి వారం రోజులు కావ స్తున్నా ఉలుకు పలుకు లేదు.
► తన నేతృత్వంలోనే జరిగిన పుష్కరాల్లో జరిగిన అపశ్రుతికి, తనకూ సంబంధమేమీ లేదంటున్నారు.
► ఇప్పుడు 29 మంది మరణించినా బాబుగానీ, ఆయన ప్రభుత్వంలోని మంత్రులుగానీ, టీడీపీ నేతలెవరికీ స్థూపం విషయం గుర్తుకు రావడంలేదు.
► మరి ఇప్పుడు కూడా తొలిరోజే తొక్కిసలాట జరిగి అంతకు మించిన జనం విగతజీవులయ్యారు. మరి ఈ ప్రభుత్వం ఏర్పాట్లు ఏపాటివో? (ఏడాది పాలన పూర్తి చేసుకున్న బాబు దాదాపు ఎనిమిది నెలల ముందు నుంచి పుష్కరాల పనులు ప్రారంభించారు. స్వయంగా చంద్రబాబే పనులను సమీక్షించారు. )
►మరి ఈసారి గోదావరి పుష్కరాల్లో ‘ఆ పకడ్బందీ’ ఏమైంది? ప్రచారం కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టారా? అని ప్రశ్నిస్తే.. సమాధానమే లేదు.