టీడీపీ శాశ్వతంగా అధికారంలో ఉండాలి
⇒ వర్క్‌షాపులో పార్టీ నేతలతో చంద్రబాబు
⇒ మీడియాలో వచ్చే సెన్సేషనల్ న్యూస్‌కు అడ్డుకట్ట వేయాలి
⇒ పదవులు ఎవరికి ఇవ్వాలనేది నా ఇష్టం
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మీడియాలో వచ్చే సెన్సేషనల్ న్యూస్‌కు అడ్డుకట్ట వేయకపోతే నష్టం పెరుగుతుందని చెప్పారు. స్పీకర్ కోడెల మాటలను వక్రీకరించారని, జాతీయ మీడియా ఏదో రాద్ధాంతం జరిగినట్లు చూపించిందన్నారు. పదవులు ఎవరికివ్వాలనేది తన నిర్ణయమన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. బడ్జెట్ సమావేశాలపై చర్చించేందుకు శుక్రవారం విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్‌లో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలతో ఒకరోజు వర్క్‌షాపు నిర్వహించారు.
ఇందులో చంద్రబాబు మాట్లాడారు.ప్రజల విశ్వాసం చూరగొనకపోతే ఓట్లు రావని చెప్పారు. బంధువులు, కులాలను చూసి ఓట్లేయరని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కులం, కేంద్రంలో ప్రధాని కులం చూసి ఓట్లేశారా అని ప్రశ్నించారు. నాలుగైదు జిల్లాల్లో క్రమశిక్షణారాహిత్యం మొదలైందని, మంత్రులు ఇతర నియోజకవర్గాల్లో, ఇతర జిల్లాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు. కర్నూలు జిల్లాలో విభేదాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అందరూ కలసి పనిచేయాలని చెప్పారు.
అందరూ పసుపు చొక్కాలు వేసుకోవాలి
ఉదయం తాను వచ్చేసరికి చాలామంది నేతలు రాకపోవడంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తాను సీనియర్ నేతనని, పార్టీ కార్యకర్తగా పసుపు చొక్కా, గుర్తింపు కార్డు ధరించి వచ్చానని అందరూ అలాగే రావాలన్నారు. కొందరు ఖద్దరు చొక్కాలు వేసుకుని రావడాన్ని తప్పుబట్టారు. జిల్లాల్లోని సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు గ్రూప్ డిస్కషన్లు జరిపారు. కొందరు నేతలు రేషన్ షాపుల్లో నగదు రహిత లావాదేవీలు తప్పనిసరి చేయొద్దని బాబును కోరారు.
అమరావతిని హార్డ్‌వేర్ కేంద్రంగా చేస్తా
అమరావతిని కేవలం సాఫ్ట్‌వేర్ హబ్‌గానే కాకుండా హార్డ్‌వేర్ కేంద్రంగా కూడా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకోసం రూ.200 కోట్లతో ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో 106 హార్డ్‌వేర్ షాపులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విజయవాడ ఆటోనగర్ ఇండ్‌వెల్ టవర్స్‌లో ఏర్పాటు చేసిన ఐటీ సర్వీస్ టెక్ పార్క్‌ను బాబు శుక్రవారం ప్రారంభించారు.