'సాక్షి'పై మారని చంద్రబాబు తీరు
Published Sat, Sep 20 2014 2:35 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
సాక్షి సహా కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులకు తిరస్కారం
తీవ్రంగా ఖండించిన ఐజేయూ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశా నికి ‘సాక్షి’ మీడియా సంస్థల ప్రతినిధులను ఆహ్వానించి, తీరా వారిని లోపలి కి అనుమతించకపోవడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. చంద్ర బాబు విలేకరుల సమావేశాలకు కొన్ని పత్రికలు, కొన్ని చానళ్లను అనుమతించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇండియన్ జర్నలిస్టు యూనియన్ సెక్రటరీజనరల్ దేవులపల్లి అమర్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.సోమసుందర్, ఐవీ సుబ్బారావు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.శేఖర్, విరాహత్ అలీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె.అమరనాథ్ పేర్కొన్నారు.
ప్రభుత్వం కొన్ని మీడియా సంస్థలను అనుమతించకపోవడం పూర్తి అప్రజాస్వామికమన్నారు. సాక్షి దినపత్రిక, సాక్షి న్యూస్ చానల్, నమస్తే తెలంగాణ పత్రిక, టీన్యూస్ చానల్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ ఆహ్వానాలు పంపినా, ముఖ్యమంత్రి విలేకరుల సమావేశాలకు సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడం సరైంది కాదన్నారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని ఇటీవల జరిగిన సంపాదకుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఐజేయూ జాతీయ నాయకుడు కె.శ్రీనివాసరెడ్డికి హామీ కూడా ఇచ్చారని గుర్తుచేశారు. అయినా, అదే మళ్లీ పునరావృతం కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామనిచెప్పారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మార్కేండయ కట్జూ దృష్టికి ఈ విషయం తీసుకెళతామన్నారు.
Advertisement
Advertisement