ఉంగరం లేని వేలు నాది | I dont have the ring to my finger | Sakshi
Sakshi News home page

ఉంగరం లేని వేలు నాది

Published Sun, Feb 21 2016 2:19 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

ఉంగరం లేని వేలు నాది - Sakshi

ఉంగరం లేని వేలు నాది

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
 
 సాక్షి   విజయవాడ బ్యూరో:  ‘‘నేను రాజకీయాల్లో ఎప్పుడూ సంపాదించుకోవాలని అనుకోలేదు. చూడండి నేను చేతికి గడియారం కట్టుకోను. వేలికి ఉంగరం పెట్టుకోను. జేబులో డబ్బులు కూడా పెట్టుకున్నది లేదు. అలాంటి నాపై, మా కుటుంబంపై బురద చల్లుతారా?’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆత్మస్తుతి చేసుకున్నారు. ఆయన శనివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంకోసం తానెంతో త్యాగం చేస్తున్నా కొందరు ప్రజల్లో అనుమానాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రతి అంశంలోనూ తనను, తన కుటుంబాన్ని పేపర్లో తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

తప్పుడు ఆరోపణలు చేసి అనవసరంగా తన కుటుంబాన్ని ఇందులోకి తీసుకొస్తుంటే చాలా బాధేస్తోందన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నా, వాళ్ల తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా తనభార్య 25 సంవత్సరాలుగా ఎక్కడైనా కనపడిందా అని ప్రశ్నించారు. ఆమె ఇల్లు, వ్యాపారం చూసుకుంటోందని, హెరిటేజ్ కంపెనీని నడిపిస్తుందని చెప్పారు. అందుకే ఆ కంపెనీ రూ.2,500 కోట్ల టర్నోవర్‌కు పెరిగిందని, ఈ సంవత్సరం రూ.వంద కోట్లు లాభం వస్తుందని తెలిపారు. ప్రతి ఏటా తనవి, కుటుంబసభ్యుల ఆస్తులను ప్రకటిస్తున్నానని, ఇతరులు ఎవరైనా అలా చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

సింగపూర్‌కు వెళితే అక్కడ ఆస్తులు ఉన్నాయని దుమ్మెత్తి పోస్తున్నారని, ఎక్కడైనా ఆస్తులు ఉంటే వాటి అడ్రసులు ఇవ్వాలని, వారికి కమీషన్ ఇవ్వడంతో పాటు ఆ ఆస్తులను కూడా రాయించేస్తానని ప్రకటించారు. తన సింగపూర్ పర్యటన సమయంలో ఓ డ్రైవర్‌కు రూ.50 టిప్ ఇవ్వగా తీసుకోలేదని గుర్తుచేశారు. అక్కడ ఎవరు కూడా అవినీతికి పాల్పడరని ఆ డ్రైవర్ చెప్పాడన్నారు. తన కుమారుడు, కోడలు స్టాన్‌ఫోర్డు యూనివర్శిటీలో ఎంబీఏ చేశారని, వారు వ్యాపారాలు చేసుకుంటే డబ్బులు సంపాదించుకోవచ్చని చెప్పారు. లోకేష్ ఒక లెగసీ అని, వారు రాజకీయాలు, ఛారిటీ వ్యవహారాలు చూసుకుంటున్నారని తెలిపారు. తమ ఆస్తులను ప్రతి ఏటా వెల్లడిస్తున్నానని, ఇతరులు వారికి ఎక్కడెక్కడ ఆస్త్తులు ఎలా వచ్చాయో చెప్పగలరా? అని ప్రశ్నించారు. తమపై ప్రతి విషయంలో ఏదోవిధంగా బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

 ‘సాక్షి’ కథనాలన్నీ అన్యాయం
 సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపులో జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో జీర్ణించుకోలేకపోయిన ముఖ్యమంత్రి ఇష్టానుసారం మాట్లాడారు. తనపై ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనాలన్నీ దారుణం, అన్యాయమని... వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని, గర్హిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజల్లో అనుమానాలు కలిగించడానికి ప్రతిరోజూ ఇలా రాస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వారికి తమను విమర్శించే అర్హత లేదని చెప్పారు. రెండు, మూడు సంవత్సరాల్లో ప్రాజెక్టుల్ని పూర్తిచేస్తామని చెప్పి పదేళ్లలో కూడా చేయలేని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఇద్దరు సీఎస్‌లు అంచనాల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించారని రాయడం సరికాదన్నారు. మొదటి మంత్రివర్గ సమావేశంలో ప్రాథమికంగా దానిపై చర్చించామని, రెండో మంత్రివర్గ సమావేశంలో అంకెల్లో కొంత సమస్య ఉండడంతో సీఎస్ వాటిని సరిచేశారని తెలిపారు. దానికి ఏదో జరిగిపోయిందని రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ప్రాజెక్టుల్లో తన పేరు రాస్తున్నారని, కొన్నింట్లో తన కుమారుడు లోకేష్ పేరు కూడా వాడుతున్నారని వాపోయారు. పెదబాబు, చినబాబు అంటూ ఏదేదో రాస్తున్నారని, ఆ కక్కుర్తి టీడీపీకి అవసరం లేదని, అన్నింట్లోనూ పారదర్శకంగా వ్యవహరించామని తెలిపారు.
 
 ‘సాక్షి’ని స్వాధీనం చేసుకుంటాం

  ‘సాక్షి ’ ప్రభుత్వ పత్రికని, దాన్ని స్వాధీనం చేసుకుంటామని చంద్రబాబు చెప్పారు. ‘‘ఎటాచ్‌మెంట్‌లో ఉన్న పేపర్ అది. అంటే ప్రభుత్వానిది. ప్రభుత్వ పత్రికలో ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు ఎలా రాస్తున్నారు?’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం కోర్టులో ఉంది కదా అని ఒక విలేకరి ప్రశ్నించగా... ‘‘అటాచ్‌మెంట్‌లో ఉన్న పత్రికేగా... సత్యం కంప్యూటర్స్ ఏమైంది? గ్లోబల్ ట్రస్టు ఏమైంది? ప్రభుత్వం టేకోవర్ చేసుకుని వేరే వారికి అప్పజెప్పింది. ‘సాక్షి’ని కూడా అలాగే చేస్తాం’’ అని చెప్పారు. రాజకీయ అవినీతి ఆస్తుల స్వాధీనానికి కేంద్రానికి లేఖ రాశామని, అనుమతి రాగానే స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement