మీడియా స్వేచ్ఛను కాపాడాలి
పుంగనూరు సాక్షి టీవీ విలేకరిపై దాడి హేయమైన చర్య
నల్లబ్యాడ్జీలతో జర్నలిస్టుల నిరసన ర్యాలీ
ఎస్పీ నేతృత్వంలో దాడుల నిరోధక కమిటీని నియమించాలని డిమాండ్
తిరుపతి సిటీ: రాజకీయ దాడుల నుంచి రక్షణ కల్పిస్తూ, మీడియా స్వేచ్ఛను కాపాడాలని వివిధ జర్నలిస్టు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సాక్షి టీవీ విలేకరిపై దాడికి నిరసనగా ఆదివారం తిరుపతిలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేశారు. ప్రెస్‌క్లబ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నాలుగుకాళ్ల మండపం వరకు సాగింది. అక్కడ మానవహారం చేపట్టారు. విలేకరిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శి డాక్టర్ మురళీమోహన్, మన్నెం చంద్రశేఖర్‌నాయుడు మాట్లాడుతూ వార్తను కవర్ చేయడానికి వెళ్లిన సాక్షి టీవీ విలేకరి వసంత్‌కుమార్‌పై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. దాడికి పాల్పడిన నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు భయపడడం దారుణమన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి మురళి, సారుుకుమార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధిపై టీడీపీ నాయకులు దాడులు చేయడం సిగ్గుచేటన్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులపై దాడులు ఎక్కువయ్యాయని చెప్పారు. ’జాప్’ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లుపల్లి సురేంద్రరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం హైపవర్ కమిటీని వేసి వారం రోజులు కూడా తిరక్కముందే సీఎం సొంత జిల్లాలో మీడియాపై దాడి చేయ డం దుర్మార్గపు చర్య అని చెప్పారు. ఎస్పీ నేతృత్వంలో మీడియాపై జరుగుతున్న దాడులను ఆరికట్టేందుకు దాడుల నిరోధక కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సాక్షి బ్యూరో ఇన్‌చార్జీ గంగిశెట్టి.వేణుగోపాల్, సాక్షి టీవీ జిల్లా ఇన్‌చార్జ్ మధుసూదన్‌రెడ్డి, మల్లారపు శివశంకరయ్య, సౌపాటి.ప్రకాష్, ఏపీ జర్నలిస్టుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు హెచ్.ద్వారకనాథ, సీమాంధ్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడు మబ్బు గోపాల్‌రెడ్డి, మునిరాజా, శ్రీకాళహస్తి గిరిబాబు, పన్నీరు సెల్వం, రాజు, జగదీష్, ఆదిమూలం శేఖర్, శ్యామ్ నాయుడు, మబ్బు నారాయణరెడ్డి పాల్గొన్నారు.