బాబే బాధ్యుడు! | 27 dead in stampede at Godavari Pushkaralu in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

బాబే బాధ్యుడు!

Published Sun, Jul 19 2015 1:09 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

బాబే బాధ్యుడు! - Sakshi

బాబే బాధ్యుడు!

చంద్రబాబు ప్రచారార్భాటమే 29 మంది ప్రాణాలు తీసిందని దుమ్మెత్తిపోసిన జాతీయ మీడియా
 
గోదావరి పుష్కరాల తొలిరోజున రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం పాలవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదే బాధ్యత... డాక్యుమెంటరీ షూటింగ్‌కోసం లక్షలాదిమంది భక్తులను 2.30 గంటలపాటు పుష్కరఘాట్‌లోకి అనుమతించకపోవడంవల్లే తొక్కిసలాట జరిగింది. దానికి పూర్తి బాధ్యత చంద్రబాబుదే... అధికారులు, భక్తులే బాధ్యులనడం సిగ్గుచేటు... జరిగిన దుర్ఘటనకు సిగ్గుపడకుండా టీడీపీ నేతలు సమర్థించుకుంటున్నారు... ఇలాంటి సిగ్గులేని నాయకులున్నందుకు మనం సిగ్గుపడాలంటూ జాతీయ మీడియా విరుచుకుపడింది. గోదావరి పుష్కర దుర్ఘటనపై ప్రముఖ జాతీయ చానల్ ‘టైమ్స్ నౌ’లో ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి రెండు రోజులు ప్రత్యేక చర్చ నిర్వహించారు.       ఈ చర్చలో మాజీ కేబినెట్ సెక్రటరీ టీఆర్‌ఎస్ సుబ్రమణ్యం, మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ భాటియా, సామాజిక ఉద్యమకారులు కంచె ఐలయ్య, రావుల ఈశ్వర్, వినియోగదారుల హక్కుల నిపుణులు బెజోన్ మిశ్రా ఏపీ మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పి నారాయణ, కాంగ్రెస్ నేతలు బ్రజేశ్ కలప్ప, మధుయాష్కీగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 
పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేయడానికి వచ్చిన ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రచార యావను  ‘టైమ్స్ నౌ’ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామితోసహా ప్రముఖులంతా తీవ్రంగా ఎండగట్టారు. సామాజిక, రాజకీయ, పాలనారంగ నిపుణులను చర్చలో భాగస్వాములను చేసి నిర్వహించిన ఈ డిబేట్ చంద్రబాబు చేసిన తప్పును ప్రపంచానికి చాటిచెప్పింది. అర్ణబ్ గోస్వామి ప్రశ్నలు సంధించిన తీరు, టీడీపీ నేతలు తమ తప్పులను సమర్థించుకున్న తీరు ఎలా సాగిందో     ఓసారి మీరే చదవండి..

 ‘‘ముఖ్యమంత్రి, ఇతర వీవీఐపీలకోసం పుష్కరఘాట్‌ను బ్లాక్‌చేసి, అందులోకి భక్తులు ప్రవేశించకుండా రెండు గంటలపాటు నిలిపివేయడం, లక్షలాది మంది భక్తులను పోలీసులు నియంత్రించలేకపోవడమే తొక్కిసలాట జరగడానికి కారణమని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలోని అంశాలు స్పష్టంచేస్తున్నాయి. అసలు వీఐపీలకోసం ప్రత్యేక ఘాట్‌లు ఎందుకు? దాన్ని వదిలి ముఖ్యమంత్రి ప్రజలకోసం కేటాయించిన ఘాట్‌కు వెళ్లడం ఎందుకు? ఉదయం 6.26 గంటలకు పుష్కర తొలిస్నానం చేయడానికి ముఖ్యమంత్రికేమైనా ప్రత్యేక హక్కులున్నాయా? ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రచారంకోసం తీసే డాక్యుమెంటరీ షూటింగ్‌కోసం గంటల తరబడి ప్రజలను బయటనే నిలపడం ఎందుకు? దీనివల్ల జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణాలకు మీ ముఖ్యమంత్రి, మీ పార్టీ బాధ్యత తీసుకుంటారా?’’ అని అర్ణబ్ నిలదీశారు. పుష్కరాలు ప్రారంభించడం ముఖ్యమంత్రి హక్కు. ఆయన అక్కడ కేవలం పది నిమిషాలు మాత్రమే ఉన్నారు. అక్కడ ఎలాంటి ఫిలిం షూటింగ్ లేదు’’ అని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇచ్చిన సమాధానంతో అర్ణాబ్ నిర్ఘాంతపోయారు.

‘‘సరే కాస్సేపు మీరే కరెక్ట్ అనుకుందాం. సీఎం ఉదయం 6.26 గంటలకు తొలి పుష్కరస్నానం చేయడం నిజంకాదా?  ముఖ్యమంత్రి కంటే ముందు ఎంతమంది భక్తులు స్నానం చేశారో చెప్పండి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఏ అధికారంతో అక్కడున్నారు? వారేమైనా పబ్లిక్ సర్వెంట్సా?’’ అని ప్రశ్నించారు. ‘‘పుష్కరాలకోసం 40 వేలమంది పోలీసులను మోహరించాం. ప్రతిపక్షాలే దీన్ని రాజకీయం చేస్తున్నాయి. మృతుల కుటుంబ సభ్యులెవ్వరూ విమర్శించడంలేదు’’ అంటూ సీఎం రమేశ్ పొంతనలేని సమాధానం చెప్పారు. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమాధానమిస్తూ.. ‘‘రాజమండ్రిలో జరిగిన ప్రమాదానికి అధికారులదే బాధ్యత. ప్రజలను నియంత్రించాల్సిన బాధ్యతను వారు మరచిపోవడంవల్లనే ఈ దుర్ఘటన జరిగింద’ంటూ తప్పును అధికారులపైకి నెట్టివేశారు.
 ‘‘ముఖ్యమంత్రి తన మందీమార్బలంతో ఘాట్‌లో రెండు గంటలపాటు ఉంటే అధికారులేం చేస్తారు? పబ్లిసిటీ గిమ్మిక్ కోసం సీఎంను అక్కడకు ఎవరు వెళ్లమన్నారు?’’ అని సూటిగా అడిగారు. ‘‘చంద్రబాబు రాజకీయ నాయకుడు కాదు, రాజనీతిజ్ఞుడు. ఆయనకు ప్రచారం అవసరంలేదు. పుష్కరాల్లో పాల్గొనేలా మోటివేట్ చేసేందుకే ఆయన తొలిస్నానం చేశారు’’ అని పల్లె సమర్థించుకోచూశారు. ‘‘అవునా.. అయితే ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు నారాయణ, రావెల కిషోర్‌బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, సీఎం కుమారుడు లోకేశ్‌బాబు సీఎంతో పాటు పుష్కరస్నానం చేయలేదా? వారికోసం ఆ ఘాట్‌ను బ్లాక్‌చేయలేదా? భద్రతా బలగాలు మొత్తం వీవీఐపీల చుట్టూ  ఉండటంవల్లనే లక్షలాదిమంది భక్తులను నియంత్రించేందుకు ఎవరూ లేకపోవడం నిజంకాదా?’’ అని నిలదీశారు. ‘‘ఉదయం 6.26 గంటలకు పుష్కరస్నానం చేస్తే మంచిదన్న ప్రచారంవల్లనే ప్రజలు ఎక్కువగా వచ్చారు. అందుకే ఈ దుర్ఘటన జరిగింది. అయినా మా ప్రభుత్వం మీద ఉన్న విశ్వాసంవల్ల భక్తులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారు’’ అని నారాయణ సమర్థించుకోచూశారు. దీంతో చర్చలో పాల్గొన్న ప్రముఖులందరూ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అలా మాట్లాడటానికి సిగ్గులేదా? అని మండిపడ్డారు. భక్తుల మనోభావాలను ప్రచారం కోసం వాడుకోవాలని చూసి 27 మంది మరణానికి కారణమైన ముఖ్యమంత్రి, మంత్రి నారాయణ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  మంత్రి నారాయణపై అందరూ ప్రశ్నలు సంధించడాన్ని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తప్పుపట్టారు. ‘‘రాష్ట్ర సీఎం పుష్కరాల్లో తొలిస్నానం చేస్తే తప్పేమిటి? అలా చేయకూడదని రూలేమైనా ఉందా?’’ అని ఎదురుదాడికి దిగారు.

‘‘ఓకే.. మరి సీఎం కొడుక్కి ఏం హక్కుంది’’అని అర్ణబ్ నిలదీశారు. ‘‘వారంతా సీఎం కుటుంబసభ్యులు. వారికా హక్కుంది’’ అని వర్ల సమర్థించుకున్నారు. ‘‘మిస్టర్ రామయ్యా.. మీ మాటల్లో, గొంతులో వీవీఐపీని అన్న అహంకారం కనిపిస్తోంది. జరిగిన దానికి బాధ్యత తీసుకోకుండా, సిగ్గుపడకుండా అహంకారంతో మాట్లాడుతున్నారు. మీకు, మీ ముఖ్యమంత్రికి అహంకారం తగ్గే రోజు వస్తుంది. ఏదో ఒకరోజు మీరు అధికారం కోల్పోతారు. అప్పుడు మరో వీవీఐపీ మిమ్మల్నిలా గేటు బయటే ఆపినప్పుడు మీకు సామాన్యుడి బాధలేమిటో అర్థమవుతాయి’’ అంటూ అర్ణబ్ చర్చను ముగించారు.  
 
 లక్షలాదిమంది హాజరయ్యే మతపరమైన ప్రాంతాలకు ప్రత్యేక సెక్యూరిటీ కావాల్సిన వీఐపీలు దూరంగా ఉండటం మంచిది. వారికోసం సామాన్య ప్రజలను బలిచేయకూడదు. ప్రజలు ఎక్కువగా వచ్చే సమయాల్లో వీవీఐపీలు రాకుండా ఉంటే మంచిది. దేవుడి దగ్గర అందరూ సమానమేనని గుర్తించండి. అందుకే అక్కడైనా అందరినీ సమానంగా చూడాలి.
 - రావుల ఈశ్వర్, సామాజిక ఉద్యమకారుడు
 
 గత రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలంటే రాజమండ్రిలోనే అన్నట్లుగా ప్రచారం చేసింది. ఉదయం 6.26 గంటలకు ముహుర్తం నిర్ణయించారు. ఆ సమయంలో పుష్కరస్నానంచేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందన్న నమ్మకంతో లక్షలాదిమంది తరలివచ్చారు. అసలు లౌకిక దేశంలో మతపరమైన కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రచారం చేయడమేమిటి?
 -ప్రొఫెసర్ కంచె ఐలయ్య, సామాజిక ఉద్యమకారుడు
 
‘‘పుష్కరాల ప్రారంభం రోజున ఉదయం ఆరు గంటలకే అమ్మ ఘాట్ వద్దకు చేరుకుంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర స్నానం కోసం సుమారు రెండున్నర గంటలపాటు గేట్లు మూసివేయడంతో రద్దీ విపరీతంగా పెరిగి తొక్కిసలాట జరిగింది. పుణ్యానికని వెళితే తిరిగిరాని లోకాలకు పంపారు. చంద్రబాబు కారణంగా ఇప్పుడు అమ్మే లేకుండాపోయింది. ’’
 - బుద్దరాజు లక్ష్మి కుమారుడు సతీష్
 
‘మా అమ్మ దొడ్డి కన్నయ్యమ్మ పుష్కరాల్లో సేవలందించేందుకు మా గ్రామానికి చెందిన 23 మందితో కలిసి వచ్చారు. అయితే జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో పుష్కరస్నానంకోసం ఘాట్‌కు చేరుకున్నారు. దాహంతో ఘాట్‌లోని శివాలయం వద్ద కూర్చున్నారు. ఇంతలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో అక్కడికక్కడే మృతి చెందారు.’’
  - రామజోగినాయుడు, టెక్కలి
 
‘‘పుష్కరస్నానం కోసం ఉదయాన్నే ఘాట్‌కు చేరుకున్నాం. లోపల సీఎం ఉండటంతో గేట్లు మూసేశారు. సీఎం వెళ్లి పోయిన తర్వాత గేటు తెరువగా వెనుకనున్న వారు కెరటంలా వ చ్చి పడ్డారు. తేరుకునేలోపే నా భార్య, కుమార్తె  విగతజీవులై కనిపించారు. కింద పడిపోయిన వారిని లేపే వారున్నా ఎంతోమంది బతికి బైటపడేవారు.’’    - కృష్ణ, మారికవలస, విశాఖపట్నం
 
ఈ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ జరిపితే న్యాయం జరగదు. కేంద్రం జోక్యం చేసుకుని విచారణ జరిపించాలి. మతపరమైన ప్రాంతాల్లో వీఐపీ సంస్కృతిని నిషేధిస్తూ చట్టం తీసుకురావాలి.
 -టీఆర్‌ఎస్ సుబ్రమణ్యం,  మాజీ కేబినెట్ సెక్రటరీ
 
లక్షలాదిమంది వచ్చే ప్రాంతాల్లో క్యూ నిలిచిపోకూడదు. రాజమండ్రిలో చంద్రబాబు కోసం ప్రజలను ఆపడంవల్లే ప్రమాదం జరిగింది. క్యూ పక్కన పెట్టి సీఎం వెళ్లవచ్చని రూల్ ఎక్కడుంది? ఇది సిగ్గుచేటు.
 - అరుణ్ భాటియా, మాజీ ఐఏఎస్ అధికారి
 
పుష్కరాల్లో ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. అది మరచి వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యమివ్వడం సిగ్గుచేటు. మతపరమైన ప్రాంతాల్లో వివక్ష తగదు. పబ్లిక్ ప్లేస్‌లోకి నేతలు వెళ్లకుండా చట్టం తీసుకురావాలి. ఈ వీఐపీ సంస్కృతికి స్వస్తి పలకాలి.
 -బెజోన్ మిశ్రా, వినియోగదారుల హక్కుల నిపుణుడు
 
పుష్కరాల్లో తొలిరోజున తొలిస్నానం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందని చంద్రబాబు అనుకుంటున్నారేమో. ఇంతమంది మరణానికి కారణమైన ఆయనకు పుణ్యం రాదు. అన్ని రకాల పాపాలూ ఆయనను వెన్నాడతాయి.
 -శైలేశ్ గాంధీ, సమాచార హక్కు ఉద్యమకారుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement