పుష్కరాలకు ప్రత్యేక నిఘా
150 పోలీసులతో జీఆర్పీ సిద్ధం
ఆర్పీఎఫ్‌తో నిరంతర గస్తీ
పాత నేరగాళ్లపైనా దృష్టి
విశాఖపట్నం సిటీ : గోదావరి పుష్కరాలకు రైల్వే పోలీసు శాఖ కొత్త ప్రణాళికలను అమలు చేయనుంది. భక్తుల భద్రతకు పెద్ద పీట వేయనుంది. రైల్వే స్టేషన్‌లోనే ముమ్మర తనిఖీలతో పాటు ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించనుంది. విశాఖ రైల్వే స్టేషన్‌లో ఒక ఇన్‌స్పెక్టర్, ముగ్గురు ఎస్‌ఐలు, 150 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. పుష్కరాల కోసం మరో 150 మంది అదనపు సిబ్బంది కావాలని రైల్వే పోలీసు శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం మాత్రం రైళ్లలోని ప్రయాణికుల భద్రత తాము చూసుకుంటామని రైల్వే స్టేషన్‌లో మాత్రమే చూసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో జీఆర్పీ పోలీసులు పూర్తిగా స్టేషన్‌పైనే నిఘా పెట్టనున్నారు. అందుకనుగుణమైన ఏర్పాట్లు చేయడంలో జీఆర్పీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్)తో కలిసి జీఆర్పీ ప్రణాళిక రూపొందించింది. పలాస నుంచి విశాఖ వరకూ ఉన్న జీఆర్పీల నుంచి పోలీసులను విశాఖకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. పుష్కరాల్లో రోజూ 2.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు చేస్తారన్న అంచనాతో జీఆర్పీ, ఆర్పీఎఫ్‌లు సంయుక్తగా ఏర్పాట్లు చేస్తున్నాయి. అంతకన్నా ఎక్కువ మంది రైల్వే స్టేషన్‌కు వచ్చినా చేయి దాటకుండా కసరత్తు చేస్తున్నాయి.
ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై నిఘా !
ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై ఒకే సారి ఎక్కువ మంది రాకపోకలు సాగించడం వల్ల కూడా బ్రిడ్జి పడిపోయే ప్రమాదం ఉంటుందని గ్రహించి ఆ మేరకు ప్రయాణికుల రద్దీకి ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. స్టేషన్ మధ్యలో ఉన్న ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై రాకపోకలు గణనీయంగా తగ్గించాలని భావిస్తున్నారు. రైల్వే ప్రవేశ ద్వారాల వద్ద, బయటకు వెళ్లే మార్గాల వద్ద కూడా నిఘా వ్యవస్థను వినియోగించుకోనున్నారు. ప్లాట్‌ఫారాలపై పూర్తిగా జీఆర్పీ ఫోర్స్, ఆర్పీఎఫ్ ఫోర్సులుంటాయి.
అనుమానితులపై ప్రత్యేక నిఘా !
రైల్వే స్టేషన్‌లో అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ఇప్పటికే పలు నేరాల్లో అరెస్టయి మళ్లీ ఇలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నేరగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. రాత్రీ పగలు అనే తేడా లేకుండా ఈ నెల 14వ తేదీ నుంచి నెలాఖరు వరకూ పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మొహరింపజేయనున్నారు.