Railway Police Department
-
ప్లాస్మా ఇస్తే పోలీసులకు సెలవు, నగదు పారితోషికం
సాక్షి, ముంబై: కరోనా రోగులకు అవసరమైన ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వచ్చిన పోలీసులకు ఒక రోజు సెలవు, నగదు పారితోషికంతో గౌరవిస్తామని రైల్వే పోలీసు కమిషనర్ కైసర్ ఖాలీద్ ప్రకటించారు. దీంతో వంద మంది రైల్వే పోలీసులు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వచ్చారు. ప్లాస్మా అవసరమైన కరోనా రోగుల జాబితాను వివిధ ఆస్పత్రులను తెప్పిస్తామని కమిషనర్ వెల్లడించారు. ఆ తరువాత జాబితాను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా వారికి అందజేసే ప్రయత్నం చేస్తామని ఖాలీద్ తెలిపారు. ప్రత్యేక వెబ్సైట్.. బ్రేక్ ది చైన్‌లో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో రైల్వే పోలీసులపై ఇప్పటికే అదనపు భారం పడుతోంది. దూరప్రాంతాలకు వెళ్లే సామాన్య ప్రయాణికులను, కూలీలను, కార్మికులను ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కూర్చోబెట్టడం మొదలుకుని ప్లాట్‌ఫారంపై, స్టేషన్ పరిసరిల్లో గస్తీ నిర్వహించే బాధ్యతలు వారిపై ఉన్నాయి. ఇప్పటి వరకు 700 మందికిపైగా రైల్వే పోలీసులు కరోనా బారిన పడ్డారు. అందులో అనేక మంది కరోనా నుంచి కోలుకుని ఎప్పటిలాగా మళ్లీ విధుల్లో చేరారు. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ విజృంభించడంతో అనేక మంది కరోనా రోగులకు ప్లాస్మా అవసరం ఏర్పడింది. ఇదిలా ఉండగా ప్లాస్మా అవసరమైన రోగుల మేసేజ్‌లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఖాలీద్ సంబంధిత రైల్వే అధికారులతో చర్చించారు. ప్లాస్మ దానం చేయడంవల్ల విధులు నిర్వహించే పోలీసులపై ఏమైనా ప్రభావం చూపుతుందా..? తదితర అంశాలపై ఆరా తీశారు. ప్లాస్మా దాతలను, ప్లాస్మా అవసరమైన రోగులను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా 1800120080000 అనే టోల్ ఫ్రీ హెల్ఫ్‌లైన్ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వంద మంది పోలీసులు ముందుకు వచ్చారు. ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీంతో ప్లాస్మాదాతల పేర్లు రిజిస్ట్రేషన్ చేశారు. మరోపక్క తమకు ప్లాస్మా కావాలని 110 మంది కరోనా బాధితులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వంద మంది రైల్వే పోలీసుల ప్లాస్మ సేకరించి అవసరమైన కరోనా రోగులకు వెంటనే అందజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఖాలీద్ తెలిపారు. అయితే మరోవైపు ప్లాస్మా చికిత్సను నిలిపివేయాలని పలువురు వైద్యనిపుణులు ఐసీఎంఆర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఐసీఎంఆర్ తుదినిర్ణయంపైనా ప్లాస్మా దానం ఆధారపడి ఉంది. -
సికింద్రాబాద్ రైల్వే గ్రౌండ్లో రిపబ్లిక్ డే రిహర్సల్స్
-
రైలు కిందపడి ప్రేమికుల ఆత్మహత్య
చివ్వెంల/మిర్యాలగూడ రూరల్: ఆమెకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. అయినా వరుసకు కుమారుడయ్యే యువకుడిని ప్రేమించింది. ఇంట్లోంచి పారిపోయి నెలపాటు కలసి ఉండి చివరకు రైలుకింద పడి ప్రాణాలు విడిచారు. వివరాలు... సూర్యాపేట జిల్లా చివ్వెలం మండలం గుడితండా ఆవాసం మల్యాతండాకు చెందిన ధరావత్ రవీందర్‌తో మిర్యాలగూడ మండలం రాయినిపాలెంవాసి ధరావత్ సరస్వతి (30)కి పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. రవీందర్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే తండాకు చెందిన అవివాహితుడు ధరావత్ భాస్కర్(30) వరుసకు రవీందర్, సరస్వతిలకు కుమారుడు అవుతాడు. డిగ్రీ చదవిన భాస్కర్.. చిన్నమ్మ, బాబాయ్ అంటూ రవీందర్ ఇంటికి వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో సరస్వతితో ఏర్పడిన చనువు ప్రేమగా మారింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది గమనించిన భర్త రవీందర్ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. గత డిసెంబర్ 6న కూడా రవీందర్ భార్యను మరోసారి హెచ్చరించాడు. దీంతో భాస్కర్, సరస్వతి అదేరోజు రాత్రి తండాను విడిచి పారిపోయారు. ఇరు కుటుంబాల సభ్యులు డిసెంబర్ 8న చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, మూడు రోజులుగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ ప్రాంతంలో వీరు తచ్చాడుతుండగా సిబ్బంది మందలించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. గురువారం రాత్రి మిర్యాలగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఆ ప్రేమికులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం రైల్వేట్రాక్ వెంట పడి ఉన్న మృత దేహాలను చూసిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలు సరస్వతి తండ్రి బాలాజీ, భర్త రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
పాఠ్యపుస్తకంలో పోలీస్
ముంబై రైల్వే పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులను నిర్వహిస్తున్నారు రేఖా మిశ్రా. ఆమె వయసు 32. పోలీసు శాఖలో మహిళలు ఉండటం తెలిసిందే! అయితే రేఖా మిశ్రా గురించి చెప్పుకోడానికి ప్రత్యేక కారణం ఉంది. ఈ ఏడాది నుంచి మరాఠా విద్యార్థులు రేఖ గురించి తమ పుస్తకాలలో చదవబోతున్నారు. అవును. టెన్త్ టెక్స్›్టబుక్‌లో రేఖా మిశ్రాపై స్ఫూర్తిదాయకమైన ఒక పాఠం ఉంది. పిల్లలు ఆమె గురించి తెలుసుకోవాల్సిన తప్పనిసరి అంశాలను అందులో చేర్చారు. పిల్లలకే కాదు, పెద్దలకూ ఈ మిశ్రా కథ ఆదర్శమే. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఆర్మీ అధికారుల కుటుంబం రేఖామిశ్రాది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో 2014లో ఆర్íపీఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్)లో చేరారు. గడిచిన నాలుగేళ్లలో మిశ్రా తన నెట్వర్క్ ద్వారా వివిధ రైల్వే స్టేషన్లలో తప్పిపోయిన వందలాది మంది చిన్నారులను కాపాడి, వాళ్ల తల్లిదండ్రుల దగ్గరికి చేర్చారు. కిడ్నాప్ అయిన చిన్నారులను కాపాడి వారికి రక్షణ కల్పించారు. కిడ్నాపింగ్ ముఠాలతో నేరుగా తలపడటంలో ఆమె చూపిన ధైర్యసాహసాలు ఎంత చెప్పినా తక్కువే. మైనర్ బాలికలే ఎక్కువ మిశ్రా అప్రమత్తం చేసిన బృందాలు గత నాలుగేళ్లలో ఇప్పటి వరకు 953 అమాయక బాలలను కాపాడాయి. అందులో మైనరు బాలికలు ఎక్కువగా ఉన్నారు. కొంతమంది చెవిటి, మూగ బాలురు కూడా ఉన్నారు. 2016లో మిశ్రా 434 మందిని, 2017లో 500 మందికి పైగా బాలల్ని వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌ల నుంచి తప్పిపోయి వచ్చినవారు కాగా, మిగతా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వేసవికాల సెలవుల్లోనూ, ముంబైలో షూటింగ్స్ జరిగే సందర్భాలలోనూ ముంబై వచ్చి దిక్కుతెలియక చిక్కుకుపోయిన వారు కూడా ఉన్నారు. కాపాడ్డం సామాజిక బాధ్యత మిశ్రా చూపిన ధైర్యసాహసాలకు ప్రభుత్వం ఇచ్చిన సముచితస్థానం ఆ శాఖనే అన్నింటా ఉన్నతంగా నిలబెట్టింది. సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ డి.కె.శర్మ నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కిందటి సోమవారం మిశ్రాను ఘనంగా సత్కరించారు. ‘మిశ్రా ఉద్యోగ విధులను అద్భుతంగా నిర్వర్తిస్తూనే, అదే సమయంలో సామాజిక సంరక్షణలో చొరవ చూపిస్తున్నారు. పాఠ్యపుస్తకంలో భాగమైన ఆమె వృత్తి నిబద్ధత ముందుతరాలకి గొప్ప స్ఫూర్తి’ అని శర్మ ఈ సందర్భంగా ప్రశంసించారు. తల్లిదండ్రులే శ్రద్ధ తీసుకోవాలి ‘‘చాలామంది పిల్లలు తమ ఇంట్లో వారితో గొడవలు పడో, ఫేస్బుక్ ఫ్రెండ్స్‌కి ఆకర్షితులయ్యో, తమ అభిమాన సినిమా తారలను కలుసుకోవడానికో.. రకరకాల కారణాలతో ముంబై వస్తుంటారు. కొన్ని కిడ్నాప్ కేసులు కూడా ఉంటాయి’ అని వివరిస్తూ.. ‘ముఖ్యంగా టీనేజ్‌లోని పిల్లలు ఇంటి నుంచి దూరమై దుర్మార్గుల చేతుల్లో పడి కష్టాలు ఎదుర్కొంటున్నారు’’ అని రేఖా మిశ్రా తనకు జరిగిన సన్మాన సభలో ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు పిల్లల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల దగ్గరకు పిల్లలను చేర్చగా, మిగిలిన వారిని బాలల సంరక్షణ కేంద్రాలలో ఉంచుతున్నారు రేఖా మిశ్రా. – ఎన్.ఆర్. -
పుష్కరాలకు ప్రత్యేక నిఘా
150 పోలీసులతో జీఆర్పీ సిద్ధం ఆర్పీఎఫ్తో నిరంతర గస్తీ పాత నేరగాళ్లపైనా దృష్టి విశాఖపట్నం సిటీ : గోదావరి పుష్కరాలకు రైల్వే పోలీసు శాఖ కొత్త ప్రణాళికలను అమలు చేయనుంది. భక్తుల భద్రతకు పెద్ద పీట వేయనుంది. రైల్వే స్టేషన్లోనే ముమ్మర తనిఖీలతో పాటు ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించనుంది. విశాఖ రైల్వే స్టేషన్లో ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు ఎస్ఐలు, 150 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. పుష్కరాల కోసం మరో 150 మంది అదనపు సిబ్బంది కావాలని రైల్వే పోలీసు శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం మాత్రం రైళ్లలోని ప్రయాణికుల భద్రత తాము చూసుకుంటామని రైల్వే స్టేషన్లో మాత్రమే చూసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో జీఆర్పీ పోలీసులు పూర్తిగా స్టేషన్‌పైనే నిఘా పెట్టనున్నారు. అందుకనుగుణమైన ఏర్పాట్లు చేయడంలో జీఆర్పీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్)తో కలిసి జీఆర్పీ ప్రణాళిక రూపొందించింది. పలాస నుంచి విశాఖ వరకూ ఉన్న జీఆర్పీల నుంచి పోలీసులను విశాఖకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. పుష్కరాల్లో రోజూ 2.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు చేస్తారన్న అంచనాతో జీఆర్పీ, ఆర్పీఎఫ్లు సంయుక్తగా ఏర్పాట్లు చేస్తున్నాయి. అంతకన్నా ఎక్కువ మంది రైల్వే స్టేషన్‌కు వచ్చినా చేయి దాటకుండా కసరత్తు చేస్తున్నాయి. ఫుట్ఓవర్ బ్రిడ్జిపై నిఘా ! ఫుట్ఓవర్ బ్రిడ్జిపై ఒకే సారి ఎక్కువ మంది రాకపోకలు సాగించడం వల్ల కూడా బ్రిడ్జి పడిపోయే ప్రమాదం ఉంటుందని గ్రహించి ఆ మేరకు ప్రయాణికుల రద్దీకి ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. స్టేషన్ మధ్యలో ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జిపై రాకపోకలు గణనీయంగా తగ్గించాలని భావిస్తున్నారు. రైల్వే ప్రవేశ ద్వారాల వద్ద, బయటకు వెళ్లే మార్గాల వద్ద కూడా నిఘా వ్యవస్థను వినియోగించుకోనున్నారు. ప్లాట్‌ఫారాలపై పూర్తిగా జీఆర్పీ ఫోర్స్, ఆర్పీఎఫ్ ఫోర్సులుంటాయి. అనుమానితులపై ప్రత్యేక నిఘా ! రైల్వే స్టేషన్లో అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ఇప్పటికే పలు నేరాల్లో అరెస్టయి మళ్లీ ఇలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నేరగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. రాత్రీ పగలు అనే తేడా లేకుండా ఈ నెల 14వ తేదీ నుంచి నెలాఖరు వరకూ పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మొహరింపజేయనున్నారు. -
హోలీపై ఆంక్షలు
సాక్షి, ముంబై: హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకొనేలా నగరంలో పోలీసులు కొన్ని ఆంక్షలు విధించనున్నారు. నీటితో నింపిన బెలూన్లు, ప్లాస్టిక్ సంచులు ఎక్కడ పడితే అక్కడ విసిరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర, రైల్వే పోలీసు శాఖ నిర్ణయించాయి. ఆకతాయిలపై నిఘా వేసేందుకు కూడా పత్యేక పోలీసు బలగాలను నియమించారు. గతంలో ఆకతాయిలు రాళ్లు విసరడంతో అనేక మంది గాయాలపాలవడం, ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. హోలీ వచ్చిందంటే చాలు రైలు పట్టాల దగ్గర్లోని మురికివాడల నుంచి పిల్లలు, ఆకతాయిలు రంగు నీటి సంచులను రైళ్లలోకి విసురుతుంటారు. దీంతో లోకల్ రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్కారు. పండుగ కాబట్టి సరదాగా విసిరినప్పటికీ రంగుల్లో ఉండే రసాయనాల వల్ల కంటి చూపు దెబ్బతినడం, ఫుట్‌బోర్డుపై ఉన్న వారు అదుపు తప్పి కిందపడుతున్నారు. వీటన్నంటిని దృష్టిలో పెట్టుకుని రైల్వే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రైలు పట్టాలకు ఆనుకుని ఉన్న సైన్, ఘాట్కోపర్, ములుండ్, కల్యాణ్, ముంబ్రా, వడాల, చెంబూర్, గోవండీ, మాన్‌ఖుర్ద్, ఖార్, బాంద్రా, మలాడ్, బోరివలి తదితర మురికివాడల్లో పండుగకు రెండు రోజుల ముందు నుంచి రైల్వే పోలీసులు గస్తీ నిర్వహించనున్నారు. లోకల్ రైళ్లపై బెలూన్లు, ప్లాస్టిక్ సంచులు విసరొద్దని, వాటివల్ల జరిగే అనర్థాలపై అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రైల్వే పోలీసు కమిషనర్ డాక్టర్ సింఘల్ చెప్పారు. అదేవిధంగా రోడ్లపై వెళ్లే మహిళలపై రంగునీళ్ల బెలూన్లు విసిరే ఆకతాయిలపై ముంబై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కొన్ని సమస్యత్మాక ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులను మోహరించనున్నట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ ధనంజయ్ కులకర్ణి వెల్లడించారు. రోడ్లపై తాగిన మత్తులో అశ్లీల నృత్యాలు చేయడం, మహిళల పట్ట అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. హోలీ సంబరాలు ముగిసిన తర్వాత యువకులు సముద్ర తీరాలకు వెళ్తుంటారు. అక్కడ ఎటుంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గజ ఈతగాళ్లను, లైఫ్ గార్డులను అందుబాటులో ఉంచాలని బీఎంసీకి సూచించారు.