సాక్షి, ముంబై: హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకొనేలా నగరంలో పోలీసులు కొన్ని ఆంక్షలు విధించనున్నారు. నీటితో నింపిన బెలూన్‌లు, ప్లాస్టిక్ సంచులు ఎక్కడ పడితే అక్కడ విసిరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర, రైల్వే పోలీసు శాఖ నిర్ణయించాయి. ఆకతాయిలపై నిఘా వేసేందుకు కూడా పత్యేక పోలీసు బలగాలను నియమించారు. గతంలో ఆకతాయిలు రాళ్లు విసరడంతో అనేక మంది గాయాలపాలవడం, ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.
హోలీ వచ్చిందంటే చాలు రైలు పట్టాల దగ్గర్లోని మురికివాడల నుంచి పిల్లలు, ఆకతాయిలు రంగు నీటి సంచులను రైళ్లలోకి విసురుతుంటారు. దీంతో లోకల్ రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్కారు. పండుగ కాబట్టి సరదాగా విసిరినప్పటికీ రంగుల్లో ఉండే రసాయనాల వల్ల కంటి చూపు దెబ్బతినడం, ఫుట్‌బోర్డుపై ఉన్న వారు అదుపు తప్పి కిందపడుతున్నారు.
వీటన్నంటిని దృష్టిలో పెట్టుకుని రైల్వే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రైలు పట్టాలకు ఆనుకుని ఉన్న సైన్, ఘాట్కోపర్, ములుండ్, కల్యాణ్, ముంబ్రా, వడాల, చెంబూర్, గోవండీ, మాన్‌ఖుర్ద్, ఖార్, బాంద్రా, మలాడ్, బోరివలి తదితర మురికివాడల్లో పండుగకు రెండు రోజుల ముందు నుంచి రైల్వే పోలీసులు గస్తీ నిర్వహించనున్నారు. లోకల్ రైళ్లపై బెలూన్లు, ప్లాస్టిక్ సంచులు విసరొద్దని, వాటివల్ల జరిగే అనర్థాలపై అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రైల్వే పోలీసు కమిషనర్ డాక్టర్ సింఘల్ చెప్పారు.
అదేవిధంగా రోడ్లపై వెళ్లే మహిళలపై రంగునీళ్ల బెలూన్లు విసిరే ఆకతాయిలపై ముంబై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కొన్ని సమస్యత్మాక ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులను మోహరించనున్నట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ ధనంజయ్ కులకర్ణి వెల్లడించారు.
రోడ్లపై తాగిన మత్తులో అశ్లీల నృత్యాలు చేయడం, మహిళల పట్ట అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. హోలీ సంబరాలు ముగిసిన తర్వాత యువకులు సముద్ర తీరాలకు వెళ్తుంటారు. అక్కడ ఎటుంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గజ ఈతగాళ్లను, లైఫ్ గార్డులను అందుబాటులో ఉంచాలని బీఎంసీకి సూచించారు.