భాస్కర్, సరస్వతి (ఫైల్)
చివ్వెంల/మిర్యాలగూడ రూరల్: ఆమెకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. అయినా వరుసకు కుమారుడయ్యే యువకుడిని ప్రేమించింది. ఇంట్లోంచి పారిపోయి నెలపాటు కలసి ఉండి చివరకు రైలుకింద పడి ప్రాణాలు విడిచారు. వివరాలు... సూర్యాపేట జిల్లా చివ్వెలం మండలం గుడితండా ఆవాసం మల్యాతండాకు చెందిన ధరావత్ రవీందర్‌తో మిర్యాలగూడ మండలం రాయినిపాలెంవాసి ధరావత్ సరస్వతి (30)కి పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. రవీందర్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే తండాకు చెందిన అవివాహితుడు ధరావత్ భాస్కర్(30) వరుసకు రవీందర్, సరస్వతిలకు కుమారుడు అవుతాడు. డిగ్రీ చదవిన భాస్కర్.. చిన్నమ్మ, బాబాయ్ అంటూ రవీందర్ ఇంటికి వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో సరస్వతితో ఏర్పడిన చనువు ప్రేమగా మారింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఇది గమనించిన భర్త రవీందర్ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. గత డిసెంబర్ 6న కూడా రవీందర్ భార్యను మరోసారి హెచ్చరించాడు. దీంతో భాస్కర్, సరస్వతి అదేరోజు రాత్రి తండాను విడిచి పారిపోయారు. ఇరు కుటుంబాల సభ్యులు డిసెంబర్ 8న చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, మూడు రోజులుగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ ప్రాంతంలో వీరు తచ్చాడుతుండగా సిబ్బంది మందలించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. గురువారం రాత్రి మిర్యాలగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఆ ప్రేమికులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం రైల్వేట్రాక్ వెంట పడి ఉన్న మృత దేహాలను చూసిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలు సరస్వతి తండ్రి బాలాజీ, భర్త రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment