గోదావరిలో ‘కౌట‘ వద్ద అడ్డుకట్ట
బాసర, కందకుర్తిల వద్ద గోదావరి నీటి మట్టం పెంచే ప్రయత్నం
సర్వే చేసిన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు
పుష్కరాలకు ఆరు రోజులే గడువు
{పత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి
ఆదిలాబాద్: గోదావరి పుష్కరాలకు కేవలం ఆరు రోజులే గడువుంది. కానీ, వరుణుడి జాడ లేకపోవడం.. మహారాష్ట్ర ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై స్పష్టత లేకపోవడంతో అధికారులు ప్రత్యామ్నయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలం కౌట గ్రామం వద్ద గోదావరి నదిలో రాళ్లు, మట్టితో కలిపి అడ్డుకట్ట కట్టాలని యోచిస్తున్నారు. అడ్డుకట్ట నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మంగళవారం నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శంకర్ నేతృత్వంలో అధికారుల బృందం ముథోల్ మండల పరిధిలోని గోదావరి నదిని పరిశీలించింది. కౌట గ్రామం వద్ద గోదావరిలో ఎత్తుగడ్డ వద్ద అడ్డుకట్ట కట్టేందుకు వీలవుతుందని ప్రాథమికంగా నిర్ధారించారు. రాళ్లు, మట్టితో కూడిన మూడు మీటర్ల ఎత్తులో అడ్డుకట్ట కట్టడం ద్వారా బాసరతో పాటు, ఎగువన ఉన్న కొన్ని పుష్కర ఘాట్ల వద్ద నీటి మట్టాన్ని కొంతమేరకు పెంచవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం బాసర వద్ద మోకాళ్ల మట్టుకు నీళ్లున్నాయి. కొన్ని రోజులుగా ఎండల తీవ్రత ముదురుతుండటంతో పుష్కరాల సమయానికి నీటిమట్టం మరింత తగ్గే అవకాశాలున్నాయి. ఈక్రమంలో అడ్డుకట్ట వేయాలనే యోచనలో ఉన్నారు. అడ్డుకట్ట వేసేందుకు సర్వే చేపట్టామని నీటి పారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ భగవంత్‌రావు ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఈ కట్ట నిర్మాణంతో బాసరతో పాటు, నిజామాబాద్ జిల్లా కందకుర్తి (త్రివేణి సంగమం) వంటి పుష్కర ఘాట్ల వద్ద నీటిమట్టం కొంత పెరిగే అవకాశాలున్నాయని అన్నారు. అయితే, గడువు తక్కువగా ఉండడంతో పుష్కరాల లోపు పనులు పూర్తిచేయగలమా.. లేదా అన్నదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.
షవర్ల కోసం ఏర్పాట్లు..
నదిలో నీళ్లు లేకపోవడంతో షవర్ల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. బాసరలోని అన్ని ఘాట్ల వద్ద కలిపి 150 షవర్లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ పనులను వేగవంతం చేయాలని భావిస్తున్నారు. అయితే, బాసరలోని ఒక్క వీఐపీ ఘాట్ వద్ద మాత్రమే పైపుల బిగింపు జరిగింది. ఇంకా నల్లాల ఫిట్టింగ్ కాలేదు. మిగిలిన ఘాట్ల వద్ద ఈ మేరకు కూడా పనులు జరగలేదు. ఈనెల 10వ తేదీ వరకు ఈ షవర్ల పనులు పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణారెడ్డి పేర్కొన్నారు.