ప్రత్యేక ఆకర్షణ..కోటిలింగాల ఘాట్
1.20 కిలోమీటర్ల నిడివితో రూ.14 కోట్లతో నిర్మాణం
గంటకు 70 వేల మంది పుష్కర స్నానం
చేయొచ్చంటున్న అధికారులు
రాజమండ్రి: గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్ రికార్డుల మోత మోగించనుంది. విస్తీర్ణం, నిర్మాణ వ్యయంలోనే కాదు.. పుష్కర స్నానాలు చేస్తే భక్తుల సంఖ్యలో కూడా ఈ ఘాట్ అగ్రస్థానంలో నిలవనుంది. దేశంలో అతి పెద్ద ఘాట్‌గా చెబుతున్న దీని పొడవు 1.20 కిలోమీటర్లు కాగా, నిర్మాణానికి వెచ్చించిన వ్యయం రూ.14 కోట్లు. దాదాపు పూర్తి కావస్తున్న ఈ ఘాట్‌ను రాజమండ్రి సందర్శనకు వస్తున్న వారు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
గోదావరి ఎడమ తీరంలో 3వ రైలు వంతెన, కొత్తగా నిర్మిస్తున్న 4 లేన్ల వంతెనల మధ్య నిర్మిస్తున్న ఈ ఘాట్‌కు వెళ్లే అప్రోచ్ రోడ్లు, గోదావరి గట్టు రోడ్ల నిర్మాణం జరుగుతోంది. కోటిలింగాల ఘాట్‌ను గంటకు 70 వేల మంది స్నానం చేసే విధంగా విస్తరించామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. పుష్కరాలు జరిగే 12 రోజులు ఇక్కడ కోటి మంది వరకు స్నానాలు చేయనున్నారు. ఇందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 18 అడుగుల ఎత్తున ఉండే శివలింగాన్ని ఘాట్ మధ్యభాగంలో 10 అడుగుల ఎత్తున నిర్మించే ప్లాట్‌ఫామ్‌పై భక్తులకు కనిపించేలా ఉంచనున్నారు. ఇది ఘాట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.