Kotilingala Ghat
-
రాజమండ్రి కోటిలింగాల ఘాట్ లో కార్తీక లక్ష దీపోత్సవం
-
చేపా.. చేపా.. ఉన్నావా?
సాక్షి, రాజమహేంద్రవరం: మత్స్యసంపదను పెంచడం ద్వారా వేసవిలో మత్స్యకారులకు ఆదాయం వచ్చేలా చూసే లక్ష్యంతో మత్స్యశాఖ చేపట్టిన కార్యక్రమం.. దాని అమలులో చోటు చేసుకున్న లోపాల కారణంగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. నగరంలో గోదావరి తీరాన మత్స్యశాఖ చేపపిల్లలను పెంచే కార్యక్రమం చేపట్టింది. అయితే, ఆయా ప్రాంతాల్లో ఇసుక మేటలు తొలగించకపోవడంతో.. తగినంత నీరు లేక, నదిలో వేసిన చేపపిల్లలు నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతానికి వెళ్లిపోతున్నాయని మత్స్యకారులు అంటున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో చేపలు ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి ఏర్పడింది. నగరంలోని కోటిలింగాల రేవు, పుష్కర ఘాట్లలో స్థానిక ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేతుల మీదుగా ఇటీవల 2.25 లక్షల చేపపిల్లలను గోదావరిలో వదిలారు. వాస్తవానికి నీరు ఎక్కువగా ఉన్నచోటనే మత్స్యసంపద వృద్ధి చెందుతుంది. ఎక్కడ నీరు ఎక్కువగా ఉంటే అక్కడకు చేపలు తరలివెళతాయి. స్థానిక మత్స్యకారులు అప్పట్లోనే ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఆకుల దృష్టికి తీసుకెళ్లారు. నీటిమట్టం ఎక్కువగా ఉండేందుకుగానూ నదిలో ఉన్న ఇసుక మేటలు తొలగించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. లేకుంటే చేపపిల్లలు వేసినా తమకు ఎటువంటి ప్రయోజనమూ ఉండదని వివరించారు. దారి తప్పిన మేటల తొలగింపు పనులు వాస్తవానికి కాటన్ బ్యారేజీకి మూడు కిలోమీటర్ల ఎగువన గోదావరిలో దాదాపు 50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మేటలు వేసింది. దీనిని తొలగించే ప్రక్రియలో భాగంగా మొదట 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించాలని గత ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వం రూ.16.20 కోట్లు మంజూరు చేసింది. డ్రెడ్జింగ్ చేసే పనిని హైదరాబాద్‌కు చెందిన ఓషన్ స్పార్కిల్ సంస్థకు జలవనరుల శాఖ కేటాయించింది. తొలుత కోటిలింగాల ఘాట్ వద్ద వేసిన మేటల్లో 2 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించేందుకు రూ.3 కోట్లు కేటాయించారు. ఈ పనులను గత జనవరి మొదటి వారంలో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, 41వ డివిజన్ కార్పొరేటర్ మర్రి దుర్గా శ్రీనివాస్ ప్రారంభించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇసుక మేటల తొలగింపు వల్ల కోటిలింగాల ఘాట్‌లో వేసవిలోనూ పుష్కలంగా నీరుంటుందని, చేపలు పెరిగేందుకు దోహదపడుతుందని చెప్పారు. అయితే ఎమ్మెల్యే ప్రకటనలకు భిన్నంగా పనులు జరిగాయి. పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకూ ఇసుక పెద్ద ఎత్తున మేటలు వేసింది. అందులో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగాయి. ఆ మేటలను తొలగించాల్సిన అధికారులు పేపర్ మిల్లు వ్యర్థాలు కలిసేచోట, ప్రస్తుతం వేసిన ర్యాంపు వద్ద నదీగర్భంలో ఇసుకను యంత్రం ద్వారా తోడారు. దానిని గట్టుపై పోసి పిఠాపురం, విశాఖకు చెందిన ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర క్యూబిక్ మీటరు రూ.162కు విక్రయించారు. అయితే ఆయా కంపెనీలవారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన లారీ యజమానులకు నిబంధలనకు విరుద్ధంగా అక్కడే క్యూబిక్ మీటరు రూ.500 చొప్పున విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా ఇసుక మేటలు తొలగింపజేయాల్సిన స్థానిక ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తూ మిన్నకుండిపోయారు. ఫలితంగా మేటలు తొలగించడానికి కేటాయించిన ప్రజాధనం వృథా కావడంతోపాటు.. మత్య్సశాఖ వేసిన చేపపిల్లలు పెరిగేందుకు తగినంత నీరు లేక.. స్థానిక మత్స్యకారులకు ఎటువంటి ప్రయోజనమూ లేకుండా పోతోంది. ఇప్పటికైనా కోటిలింగాల ఘాట్‌లో పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించాలని మత్స్యకారులు కోరుతున్నారు. -
మంత్రులు హరీశ్, ఈటెల పడవ షికారు..
లక్కెట్టిపేట్ (ఆదిలాబాద్): రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్ ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట పుష్కర ఘాట్‌ను ఆదివారం సందర్శించారు. దండెపల్లిలోని గూడెం పుష్కర ఘాట్ వద్ద కూడా పుష్కర ఏర్పాట్లు, పనులను పరిశీలించారు. అక్కడ భక్తులకు అందుతున్న వసతులను పరిశీలించారు. అనంతరం గోదావరిలో పడవపై బయల్దేరి సమీపంలోని కోటిలింగాల పుష్కరఘాట్ చేరుకున్నారు. -
కేరాఫ్ అడ్రస్ శివుడు..
కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోటిలింగాల ఘాట్‌లో కొత్తగా నిర్మించిన భారీ మహాశివుని విగ్రహం పుష్కర భక్తులకు అండగా ఉంది. ఎవరెక్కడున్నా నేనిక్కడున్నా అంటు శివుని విగ్రహాన్ని బండగుర్తుగా చెప్పుకుంటున్నారు. తప్పిపోయిన వారు సైతం శివుని విగ్రహం దగ్గరకు రమ్మంటున్నారు. ఇలా పుష్కరాలకు వచ్చి తప్పిపోయిన వారికి, తమ బంధువులకు తాము ఎక్కడున్నది తెలిపేందుకు శివుడి విగ్రహాన్ని కేరాఫ్ అడ్రస్ గా చెబుతున్నారు. -
అమ్మాయే అమ్మైంది...
కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : అమ్మాయే తన అమ్మకు అమ్మగా మారిన ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దర్శనమిచ్చింది. తల్లీబిడ్డల పుష్కర స్నానం పూర్తయింది. తల్లి బిడ్డకు తలదువ్వి జడ వేసింది. ఆ తల్లి తన జడ తానే అల్లుకోగలదు. కానీ, జనసమ్మర్దంలో అందుకు వీలు కాకపోవడంతో అమ్మాయే అమ్మ డ్యూటీ చేస్తూ తల్లికి ఇలా జడ అల్లింది. -
శివయ్యా.. నీకెన్నాళ్లీ కోటింగ్
కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : తూర్పుగోదావరి జిల్లా కోటిలింగాల ఘాట్ లో ఏర్పాటు చేసిన భారీ ఈశ్వరుడు విగ్రహానికి ఇంకా మోక్షం లభించలేదు. పుష్కరాల నాలుగో రోజైన శుక్రవారం కూడా శివుని విగ్రహానికి మెరుగులు దిద్దుతూనే ఉన్నారు. ఇంకెప్పటికీ ఈ పనులు పూర్తిచేస్తారో వేచిచూడాల్సిందే మరి.. అలలపై ‘మెయిల్’ తెప్ప.. పుష్కర కల్చరల్ (కొవ్వూరు) : భారతీయ సంస్కృతిలో మరణానంతరం వారి ఆత్మీయులు నిర్వర్తించే విధులెన్నో! వాటిలో ఒకటే మైలతెప్ప. కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఏడాదిలోపు వారి ఆత్మశాంతి కోసం నదిలో మైలతెప్ప వదల డం రివాజు. పుష్కరాల సందర్భంగా.. వెదురు కర్రముక్కలతో తయారుచేసిన తెప్పలాంటి దానిపై దీపాలు ఉంచి పసుపు, కుంకుమలు వేసి నదిలో వదిలే వారి సంఖ్య ఎక్కువే. ఆ తెప్ప అలలపై ఊగుతూ అలా పయనించిపోతుంటే.. పైలోకంలో ఉన్న తమ వారికి గోదారి ద్వారా ‘మెయిల్’ (సందేశం) పంపుతున్నట్టుంటుంది. -
అక్కడ బిలబిల ... ఇక్కడ వెలవెల !
కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : కోటిలింగాల ఘాట్‌లో భక్తుల రద్దీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంది. అధికారులు యాత్రికులను ఖాళీగా ఉన్నచోట్లకి తరలించకపోవడంతో దాదాపు ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది స్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో పలు ప్రాంతాలు రద్దీగా మారుతుండగా కొన్ని ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. ఒకే ప్రాంతంలో రద్దీ ఎక్కువగాా ఉండటంతో భక్తులు సైతం పలు ఇక్కట్లకు గురౌతున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించి ఘాట్‌లో రద్దీ తక్కువగా ఉన్న ప్రాంతాలకు భక్తులను తరలిస్తే భక్తులందరూ సౌకర్యవంతంగా స్నానాలు ఆచరించే అవకాశం ఉంది. -
మెట్టెక్కితే గట్టెక్కినట్టే..
కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : పుష్కర స్నానం కోసం లక్షలాదిమంది ఘాట్లకు తరలి వస్తున్నారు. కానీ వృద్ధులు మెట్లెక్కలేక అవస్థలు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోటిలింగాల ఘాట్‌లో పుష్కర స్నానానికి వచ్చిన వృద్ధులు మెట్లు ఎక్కడానికి పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వీరికి ప్రత్యేకంగా ర్యాంపులు నిర్మిస్తే ఉపయోగకరంగా ఉండేదని భక్తులంటున్నారు. -
తొలిరోజు వరదలా.. మరునాడు వెలవెలా
ప్రతిమెట్టూ.. ఓ ఊరిపెట్టుగా, మొత్తం స్నానఘట్టం చూస్తే.. ఓ పట్టణమే తరలి వచ్చిందా అన్నట్టుగా కిక్కిరిసిపోయింది కోటిలింగాల ఘాట్. ఆసేతు శీతాచల పర్యంతం మరే జీవనది తీరానా లేనంత భారీ ఘాట్‌గా పరిగణిస్తున్న ఈ రేవు.. పుష్కరాల రెండో రోజైన బుధవారం భక్తజన పారావారమే అయింది. అయితే అది ఉదయం మాత్రమే. పుష్కర ఘాట్ దుర్ఘటనతో రాజమండ్రి నగరంలో భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. జిల్లాలోని మిగిలిన ఘాట్లలోనూ గణనీయంగా భక్తులు నదీస్నానం ఆచరించారు. బోసిపోయిన పుష్కర ఘాట్ తొక్కిసలాట మరణాల ప్రభావం రెండో రోజు రాజమహేంద్రికి తగ్గిన భక్తులు రాజమండ్రి : పావన వాహిని మహాపర్వం తొలిరోజైన మంగళవారం రాజమండ్రికి జనవాహిని ఉప్పెనై ఉరికి వచ్చింది. గోదావరి స్నానరేవులతోపాటు, నగరంలోని ప్రతి వీధీ.. ప్రతి రహదారీ.. జనప్రవాహాన్ని తలపించాయి. వాహనాలతో కిక్కిరిసిపోయాయి. చివరికి జాతీయ రహదారిపై కూడా వెల్లువై వచ్చిన వాహనాలతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అయితే, దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి రాజమండ్రిలో బుధవారం కనిపించింది. తొలి రోజు పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాట.. 27 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన నేపథ్యంలో నగరానికి భక్తుల తాకిడి గణనీయంగా తగ్గింది. భక్తజనవెల్లువ గోదావరి పల్లెతీరాలకు తరలిపోయింది. అయితే ప్రభుత్వం మాత్రం పుష్కర స్నానాలు చేసేవారి సంఖ్యను అధికం చేసి చూపించేందుకు సిద్ధమవుతోంది. పుష్కర ఘాట్ ఘటన నేపథ్యంలో పుష్కర స్నానాలకు రాజమండ్రి రావాలంటేనే భక్తజనం భయపడే పరిస్థితి ఏర్పడింది. మంగళవారం పుష్కరాలకు జనం పోటెత్తారు. ఘాట్లవద్ద బారులు తీరారు. పుష్కరాల ఆరంభ ముహూర్తానికన్నా ముందే భక్తులు పుష్కర, వీఐపీ ఘాట్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్నానాలు చేశారు. చివరకు చిన్నచిన్న ఘాట్లలో సైతం భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. అయితే ఒక్క రోజులోనే పరిస్థితి తల్లకిందులైంది. పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృత్యువాత పడడంతో నగరానికి వచ్చేందుకు జనం వెనుకంజ వేశారు. విషాద ఘటన జరిగిన పుష్కర ఘాట్‌లోనే కాకుండా మిగిలిన ఘాట్ల వద్ద కూడా జనం తగ్గారు. పుష్కర ఘటనకు తోడు ఘాట్ల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, ఘాట్లకు రావాలంటే కిలోమీటర్ల మేర నడిచి రావాల్సి ఉండడం, వేసవిని తలపించే ఎండ.. ఆపై అమావాస్య కావడం భక్తుల సంఖ్య తగ్గడానికి కారణమైంది. అయితే భక్తులు అధికంగా హాజరైనట్టు ప్రభుత్వం అంకెలు ఎక్కువ చేసి చూపిస్తోంది. జిల్లావ్యాప్తంగా 17.29 లక్షల మంది భక్తులు స్నానం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఆ పరిస్థితి మాత్రం లేదు. దేశంలోనే అతి పెద్దదిగా చెబుతున్న కోటిలింగాల ఘాట్‌కు తొలి రోజు 4.20 లక్షల మంది భక్తులు రాగా, గురువారం రెండు లక్షలలోపే భక్తులు వచ్చారు. రాజమండ్రి గ్రామీణ ప్రాంతాల్లో అధికార లెక్కల ప్రకారం సుమారు రెండు లక్షల మంది భక్తులు స్నానం చేయగా, రెండో రోజు ఏకంగా నాలుగు లక్షల మందికి పైగా స్నానాలు చేశారు. ఒక్క కోటిపల్లి ఘాట్‌లోనే 1.50 లక్షల మంది స్నానాలు చేసినట్టు అంచనా. కాట్రేనికోన, అయినవిల్లి, సోంపల్లి, అప్పనపల్లి, అంతర్వేది ఘాట్ల వద్ద సైతం భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. అయితే అధికారుల లెక్కలకు, స్నానాలు చేస్తున్నవారి సంఖ్యకు పొంతన ఉండడంలేదన్న విమర్శలున్నాయి. గ్రామీణ ప్రాంతంలో పుష్కర స్నానాలు చేసేవారి సంఖ్యను తగ్గించి. రాజమండ్రి నగరంలో స్నానాలు చేసేవారి సంఖ్యను పెంచి చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుష్కర ఘాట్ వెలవెల పుష్కరాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పుష్కర ఘాట్. 2003లో ఇక్కడ అత్యధికంగా 63.34 లక్షల మంది భక్తులు స్నానం చేశారు. ఇక్కడ పుష్కర స్నానం చేస్తేనే అధిక పుణ్యమని భక్తుల నమ్మకం. అటువంటి పుష్కర ఘాట్‌ను చూసి భక్తులు ఇప్పుడు భయపడుతున్నారు. పుష్కర ఆరంభం రోజైన మంగళవారం ఈ ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగి 27 మంది మృత్యువాత పడడంతో ఈ ఘాట్‌కు వెళ్లేందుకు భక్తులు వెనకాడుతున్నారు. ఇక్కడ పుష్కరాల తొలి రోజు అత్యధికంగా 1.40 లక్షల మంది స్నానాలు చేయగా, బుధవారం మాత్రం వారి సంఖ్య లక్షకు లోపే ఉందని అంచనా. రాజమండ్రి వచ్చే భక్తులను పోలీసులు ముందు జాగ్రత్తగా పుష్కర ఘాట్‌వైపు కాకుండా, ఇతర ఘాట్లవైపు మళ్లించారు. భక్తులు సైతం అటు వెళ్లే సాహసం చేయలేకపోయారు. దీంతో ఈ ఘాట్ చాలాసేపు వెలవెలబోతూ కనిపించింది. అధికారుల తప్పుడు లెక్కలు పుష్కర ఘాట్ సంఘటనను తక్కువ చేసి చూపించేందుకు, ఈ ఘటనతో సంబంధం లేకుండా భక్తులు అధిక సంఖ్యలో రాజమండ్రి తరలివస్తున్నట్టు చెప్పుకునేందుకు ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ప్రయత్నిస్తోంది. రాజమండ్రిలో పుష్కర ఘాట్‌తోపాటు మిగిలిన ఘాట్ల వద్ద భక్తజనం లేకున్నా లక్షల సంఖ్యలో భక్తులు వచ్చినట్టు ప్రభుత్వం చూపిస్తోంది. తొలి రోజు మంగళవారం తొక్కిసలాట జరిగిన తరువాత కూడా పుష్కర ఘాట్‌కు భక్తుల తాకిడి అధికంగానే ఉంది. అయితే బుధవారం మాత్రం ఉదయం కొద్దిగా జనసంచారం కనిపించినా, మధ్యాహ్నం 11 గంటల నుంచి భక్తుల రాక అంతంతమాత్రంగానే ఉంది. బారికేడ్లు, ఘాట్లు ఖాళీగా కనిపించాయి. మంగళవారం ఈ ఘాట్‌లో 1.40 లక్షల మంది స్నానాలు చేశారని ప్రకటించిన ప్రభుత్వం, బుధవారం ఏకంగా రెండు లక్షల మంది స్నానాలు చేసినట్టు చెప్పడం విడ్డూరం. మరోపక్క కోటిలింగాల ఘాట్ కూడా మధ్యాహ్నం ఖాళీగా కనిపించింది. కానీ ఇక్కడ ఏకంగా 7.64 లక్షల మంది స్నానం చేసినట్టు ప్రభుత్వం చెప్పుకొస్తోంది. మంగళవారం ఘాట్ కిటకిటలాడిన సమయంలో ఇక్కడ 4.20 లక్షల మంది ఉన్నారని చెప్పి, జనం లేని రోజున రెట్టింపు సంఖ్యలో జనం వచ్చినట్టు చెప్పడం విచిత్రం. అసలు యాత్రికుల సంచారం పెద్దగా లేని గౌతమ ఘాట్‌లో ఏకంగా 1.19 లక్షల మంది స్నానాలకు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. పుష్కర ఘాట్ ఘటనను నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాజమండ్రి నగరంలో స్నానాలు చేసేవారి సంఖ్యను పెంచి చూపించేందుకు ప్రభుత్వం తాపత్రయపడడం విమర్శలకు తావిస్తోంది. -
ప్రత్యేక ఆకర్షణ..కోటిలింగాల ఘాట్
1.20 కిలోమీటర్ల నిడివితో రూ.14 కోట్లతో నిర్మాణం గంటకు 70 వేల మంది పుష్కర స్నానం చేయొచ్చంటున్న అధికారులు రాజమండ్రి: గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్ రికార్డుల మోత మోగించనుంది. విస్తీర్ణం, నిర్మాణ వ్యయంలోనే కాదు.. పుష్కర స్నానాలు చేస్తే భక్తుల సంఖ్యలో కూడా ఈ ఘాట్ అగ్రస్థానంలో నిలవనుంది. దేశంలో అతి పెద్ద ఘాట్‌గా చెబుతున్న దీని పొడవు 1.20 కిలోమీటర్లు కాగా, నిర్మాణానికి వెచ్చించిన వ్యయం రూ.14 కోట్లు. దాదాపు పూర్తి కావస్తున్న ఈ ఘాట్‌ను రాజమండ్రి సందర్శనకు వస్తున్న వారు ఆసక్తిగా తిలకిస్తున్నారు. గోదావరి ఎడమ తీరంలో 3వ రైలు వంతెన, కొత్తగా నిర్మిస్తున్న 4 లేన్ల వంతెనల మధ్య నిర్మిస్తున్న ఈ ఘాట్‌కు వెళ్లే అప్రోచ్ రోడ్లు, గోదావరి గట్టు రోడ్ల నిర్మాణం జరుగుతోంది. కోటిలింగాల ఘాట్‌ను గంటకు 70 వేల మంది స్నానం చేసే విధంగా విస్తరించామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. పుష్కరాలు జరిగే 12 రోజులు ఇక్కడ కోటి మంది వరకు స్నానాలు చేయనున్నారు. ఇందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 18 అడుగుల ఎత్తున ఉండే శివలింగాన్ని ఘాట్ మధ్యభాగంలో 10 అడుగుల ఎత్తున నిర్మించే ప్లాట్‌ఫామ్‌పై భక్తులకు కనిపించేలా ఉంచనున్నారు. ఇది ఘాట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. -
దేశంలోనే అతిపెద్ద ఘాట్
కోటిలింగాలరేవు నుంచి చింతలరేవు వరకు నిర్మాణం 1.20 కిమీల నిడివి రూ.12.85 కోట్లతో నిర్మాణం రాజమండ్రి : రాజమండ్రిలో దేశంలోనే అతిపెద్ద ఘాట్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. గోదావరి పుష్కరాల సందర్భంగా కోటిలింగాల ఘాట్‌ను దేశంలో మరెక్కడా లేని విధంగా 1.20 కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నారు. దేశంలో గంగానది మీద వారణాసిలోనూ, అలహాబాద్, గోదావరి మీద నాశిక్‌లో మాత్రమే పెద్ద ఘాట్లున్నాయి. ఇప్పుడు వీటిని మించి పెద్ద ఘాట్‌ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి కోటిలింగాలరేవు వద్ద నుంచి చింతలరేవు వరకు దీనిని నిర్మిస్తున్నారు. రోజుకు ఈ ఘాట్‌లో ఐదు లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఘాట్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.12.85 కోట్లు కేటాయించింది. సాగునీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. మే నెలాఖరు నాటికి ఘాట్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఘాట్ నిర్మాణం పూర్తయితే దేశంలో అతి పెద్ద ఘాట్‌గా రికార్డును సొంతం చేసుకుంటుంది. ఈ ఏడాది గోదావరి పుష్కరాలకు కనీసం ఐదు కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని ఇప్పుడున్న పుష్కర్ ఘాట్లకు మరమ్మతులు చేయడం, విస్తరించడం, కొత్త ఘాట్ల నిర్మాణం వంటి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రాజమండ్రి కోటిలింగాల రేవు వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని గుర్తించి ప్రభుత్వం ఇక్కడ ఈ భారీ ఘాట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాజమండ్రిలో మిగిలిన ఘాట్ల నిర్మాణాలను పరిశీలిస్తే కోటిలింగాల ఘాట్ నిర్మాణ పనులు కొంతవరకు వేగంగా జరుగుతున్నాయనిపిస్తోంది. కోటిలింగాల ఘాట్ నిర్మాణంతోపాటు ఘాట్ పొడవునా ఆరు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తిగా రాతికట్టడం పద్ధతిలో ఈ ద్వారాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే ఘాట్ వద్ద ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయడంతోపాటు ఘాట్‌ను సుందరీకరణ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అడుగు ముందుకు వేయని పుష్కర్‌ఘాట్ విస్తరణ కోటిలింగాల ఘాట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతుండగా పుష్కరఘాట్ విస్తరణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. రైల్వేపాత వంతెన, మూడవ వంతెన కింద నుంచి ఈ ఘాట్ నిర్మాణ పనులు జరగాల్సి ఉంది. ఇందుకు రైల్వేశాఖ అనుమతి తప్పనిసరి. దీనిపై రైల్వే శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఇక్కడ ఘాట్‌ను రూ.1.72 కోట్లతో 140 మీటర్ల మేర విస్తరించాల్సి ఉంది.