దేశంలోనే అతిపెద్ద ఘాట్
- కోటిలింగాలరేవు నుంచి చింతలరేవు వరకు నిర్మాణం
- 1.20 కిమీల నిడివి
- రూ.12.85 కోట్లతో నిర్మాణం
రాజమండ్రి : రాజమండ్రిలో దేశంలోనే అతిపెద్ద ఘాట్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. గోదావరి పుష్కరాల సందర్భంగా కోటిలింగాల ఘాట్‌ను దేశంలో మరెక్కడా లేని విధంగా 1.20 కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నారు. దేశంలో గంగానది మీద వారణాసిలోనూ, అలహాబాద్, గోదావరి మీద నాశిక్‌లో మాత్రమే పెద్ద ఘాట్‌లున్నాయి. ఇప్పుడు వీటిని మించి పెద్ద ఘాట్‌ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి కోటిలింగాలరేవు వద్ద నుంచి చింతలరేవు వరకు దీనిని నిర్మిస్తున్నారు.
రోజుకు ఈ ఘాట్‌లో ఐదు లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఘాట్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.12.85 కోట్లు కేటాయించింది. సాగునీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. మే నెలాఖరు నాటికి ఘాట్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఘాట్ నిర్మాణం పూర్తయితే దేశంలో అతి పెద్ద ఘాట్‌గా రికార్డును సొంతం చేసుకుంటుంది. ఈ ఏడాది గోదావరి పుష్కరాలకు కనీసం ఐదు కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఈ కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని ఇప్పుడున్న పుష్కర్ ఘాట్‌లకు మరమ్మతులు చేయడం, విస్తరించడం, కొత్త ఘాట్‌ల నిర్మాణం వంటి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రాజమండ్రి కోటిలింగాల రేవు వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని గుర్తించి ప్రభుత్వం ఇక్కడ ఈ భారీ ఘాట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాజమండ్రిలో మిగిలిన ఘాట్‌ల నిర్మాణాలను పరిశీలిస్తే కోటిలింగాల ఘాట్ నిర్మాణ పనులు కొంతవరకు వేగంగా జరుగుతున్నాయనిపిస్తోంది.
కోటిలింగాల ఘాట్ నిర్మాణంతోపాటు ఘాట్ పొడవునా ఆరు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తిగా రాతికట్టడం పద్ధతిలో ఈ ద్వారాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే ఘాట్ వద్ద ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయడంతోపాటు ఘాట్‌ను సుందరీకరణ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
అడుగు ముందుకు వేయని పుష్కర్‌ఘాట్ విస్తరణ
కోటిలింగాల ఘాట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతుండగా పుష్కరఘాట్ విస్తరణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. రైల్వేపాత వంతెన, మూడవ వంతెన కింద నుంచి ఈ ఘాట్ నిర్మాణ పనులు జరగాల్సి ఉంది. ఇందుకు రైల్వేశాఖ అనుమతి తప్పనిసరి. దీనిపై రైల్వే శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఇక్కడ ఘాట్‌ను రూ.1.72 కోట్లతో 140 మీటర్ల మేర విస్తరించాల్సి ఉంది.