Ganges
-
Supreme Court: ఆహార బోర్డులు ప్రదర్శిస్తే చాలు
న్యూఢిల్లీ/భోపాల్: ఉత్తరాదిన వివాదం రేపుతున్న కావడి యాత్ర వివాదానికి తెర దించే దిశగా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. భక్తులు వెళ్లే మార్గాల్లో దుకాణాలు, హోటళ్ల ముందు యజమానులు, సిబ్బంది పేర్లతో బోర్డులు ప్రదర్శించాలన్న యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వల ఆదేశాలపై స్టే విధిస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. బదులుగా లభించేది శాకాహారమో, మాంసాహారమో తెలిపే బోర్డులు ప్రదర్శిస్తే సరిపోతుందని స్పష్టంచేసింది. శ్రావణమాసంలో గంగాజలాన్ని కావడిలో సేకరించి భక్తులు తిరిగి తమ సొంతూరిలోని శివాలయాల్లో జలాభిషేకం చేస్తారు. పుణ్యజలాలను తీసుకెళ్లే భక్తులకు శాకాహారం అందించే హోటళ్ల వివరాలు తెలియాలంటూ ఆయా రాష్ట్రాలు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. తాను కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా ముస్లింలు నడిపే శాకాహార భోజనంలోనే తినేవాడినని జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఈ సందర్భంగా చెప్పారు. యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల తరఫున ఎవరూ హాజరు కాకపోవడంతో విచారణను శుక్రవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. -
గంగే మాం పాహి
విష్ణుమూర్తి స్పర్శచేత పరమపావనియైన గంగలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయన్నది సనాతన ధర్మ విశ్వాసం. అంటే... పాపాలు చేసి గంగలో మునిగి వాటిని పోగొట్టుకోవచ్చని అర్థం చేసుకోకూడదు. తెలిసో తెలియకో ఇప్పటివరకు చేసిన పాపాలు గంగాస్నానంతో పోగొట్టుకుని, ఇక మీదట ఎటువంటి పాపపు పనులు చేయకుండా నన్ను నేను నియంత్రించుకునే శక్తినీయవలసిందిగా భగవంతుని వేడుకోవాలి. అదే ధర్మాచరణం. వద్దన్న పని వదిలిపెట్టడమే ధర్మాచరణ. అది విష్ణువుకు ప్రీతిపాత్రం. ముత్తుస్వామి దీక్షితార్ వారు గంగపై కీర్తన చేస్తూ... ‘‘గంగే మాం పాహి గిరీశ శిర స్థితే/గంభీర కాయే గీత వాద్య ప్రియే/అంగజ తాత ముదే అసి వరుణా మధ్యే/అక్రూర పూజితే అఖిల జనానందే...’’ అన్నారు. గంగమ్మ గొప్పదనాన్ని చెబుతూ... అక్రూరపూజితే అని కూడా అన్నారు. గంగను కీర్తిస్తూ అక్రూరుడి ప్రస్తావన ఎందుకు తెచ్చినట్టు ..? మిగిలిన పురాణాలన్నింటినీ వ్యాస భగవానుడు రాస్తే... విష్ణు పురాణాన్ని పరాశర మహర్షి ఇచ్చాడు. శమంతకోపాఖ్యానం దీనిలోనిదే. అయితే ఇక్కడ గమ్మత్తయిన ఒక విషయం చెప్పుకోవాలి. వినాయక చవితినాడు వ్రత మహాత్మ్యంలో మనం ఒక కథ చదువుకుంటూంటాం. ఒక పసిపిల్ల ఉయ్యాల్లో ఉందనీ, ఆ పిల్లను కృష్ణుడు పెళ్ళి చేసుకున్నాడనీ, ఆమే జాంబవతి అనీ... ఇలా సాగుతుంది.. కానీ నిజానికి విష్ణు పురాణంలో చెప్పింది వేరు. ఉయ్యాల్లో ఉన్నది పసిపిల్లవాడు. దానిని ఊపుతున్న యవ్వని జాంబవతిని కృష్ణపరమాత్మ పెళ్లి చేసుకున్నాడు. వినాయక చవితి రోజున మిగిలిన కథను పూర్తిగా చదివినా చదవకపోయినా...‘‘...తవ హియేషా శమంతకః’’ అంటూ ముగిస్తారు. నిజానిక శ్రీకృష్ణుడు శమంతక మణివల్ల ఎన్ని కష్టాలుపడాలో అన్ని కష్టాలు పడ్డాడు. అటు సత్యభామకు దూరమయిపోయాడు, ఇటు జాంబవతికీ దూరమయ్యాడు. శమంతక మణిని కృష్ణుడే కాజేసాడని వారిద్దరే కాదు, బలరాముడు, ఇతర బంధువులు, ద్వారకానగరవాసులూ అందరూ అనుమానించారు. ఇంతకూ అసలు శమంతకమణి ఎక్కడుంది? అక్రూరుడి దగ్గర. అక్రూరుడు ఎక్కడున్నాడు? అంటే... ఆ మణికి ఒక నియమం ఉంది. బాహ్యాభ్యంతర శౌచం ఎవరికుంటుందో వారిదగ్గర అది బంగారం పెడుతుంది, దాన్ని దాచుకోకుండా లోకసంక్షేమం కోసం వెచ్చించే పరమ భాగవతోత్తముడి దగ్గర ఉంటుంది. లేకపోతే చంపేస్తుంది. ప్రసేనుడు, సత్రాజిత్తు అలాగే చచ్చిపోయారు. కాబట్టి అది ఉన్నచోట నిత్యాన్నదానాలతో నవ వసంతశోభ ఉంటుంది. అలా కాశీ వెలిగిపోతున్నది కాబట్టి అక్కడ అక్రూరుడు ఉంటాడని భావించి ‘అక్కడికి వెళ్ళి అక్రూరుడిని పిలుచుకురండి’ అని కృష్ణుడు ఆదేశించాడు. గంగను పూజిస్తూ గంగలో స్నానం చేస్తున్న అక్రూరుడికి కృష్ణుడి సందేశం వినిపించగానే.. అక్రూరుడు వెళ్ళి ఆ శమంతకమణిని ఇవ్వబోతే...‘‘అంతః శౌచం, బాహ్య శౌచం’ నీలో ఉన్నాయి కనుక అది నీవద్దే ఉంచుకో’ అని కృష్ణుడు చె΄్పాడు. అక్రూరుడు ద్వారకానగరం వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు కాశీ వెళ్ళి అక్కడే ఉండిపోయాడు గంగకోసం. పరమ భక్తితో రోజూ పూజిస్తూ నిత్యం గంగలో స్నానం చేసేవాడు. శాస్త్రాలు చదవకపోయినా గంగానది ఒడ్డున గురువుగారి శుశ్రూషలో ఇన్ని విషయాలు తెలుసుకున్న దీక్షితార్ వారి కీర్తనల్లో అనేక శాస్త్ర రహస్యాలను ప్రస్తావిస్తారు. వాటిలో గంగను స్తుతిస్తూ చేసిన ఈ కీర్తన ఒకటి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గంగమ్మకూ నీటి కష్టాలు!
సాక్షి, అమరావతి: తన తాత ముత్తాతలకు సద్గతుల ప్రాప్తి కోసం భగీరథుడు దివి నుంచి భువికి రప్పించిన గంగమ్మకూ నీటి కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుతం జీవ నదులైన గంగ, బ్రహ్మపుత్ర, సింధు, తీస్టా సహా 12 నదుల్లో ప్రవాహం 2100 నాటికి వర్షాలపైనే ఆధారపడే పరిస్థితి రావచ్చు. మన దేశంతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా ఆసియా ఖండంలోని 16 దేశాల్లో 167.40 కోట్ల మంది ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తప్పవని చెబుతోంది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్ (ఐసీఐఎంవోడీ) సంస్థ ఈ నెల 20న విడుదల చేసిన అధ్యయన నివేదిక. ఇందుకు ప్రధాన కారణం.. ఆ జీవ నదులకు జన్మ స్థానమైన హిమాలయ పర్వతాల్లోని హిందూకుష్ శ్రేణుల్లో హిమనీ నదాలు శరవేగంగా కరిగిపోతుండటమేనని తేల్చింది. వాతావరణ మార్పులు, భూఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్లే హిమనీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం హిందూకుష్ పర్వత శ్రేణుల్లోని హిమనీ నదాల పరిమాణం 2010 నాటికి 80 శాతానికి తగ్గిపోవడం ఖాయమని అంచనా వేసింది. ఆసియా ఖండపు నీటి శిఖరం ధ్రువ ప్రాంతాల తర్వాత భూగోళంపై అతి పెద్ద హిమనీ నదాలకు నిలయం హిందూకుష్ పర్వత శ్రేణులే కావడం గమనార్హం. హిమాలయ పర్వత శ్రేణుల్లోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లోనే గంగా, బ్రహ్మపుత్రా, సింధు, తీస్టా సహా 12 నదులు పురుడు పోసుకుని మనదేశంతోపాటు పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ తదితర 16 దేశాల్లో ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఈ నదులకు ప్రధాన ఆధారం హిందూకుష్ పర్వత శ్రేణుల్లోని హిమనీ నదాలే. హిమపాతంలో గణనీయంగా తగ్గుదల కాలుష్యంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల హిందూకుష్ పర్వత శ్రేణుల్లో హిమపాతం గణనీయంగా తగ్గుముఖం పడుతోందని ఐసీఐఎంవోడీ అధ్యయనంలో వెల్లడైంది. 1971 నుంచి 2000 సంవత్సరాల మధ్య హిందూకుష్ పర్వత శ్రేణుల్లో అంచనా వేసిన దానికంటే హిమపాతంలో సగటున 15 శాతం తగ్గుదల కనిపించిందని తెలిపింది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే.. 2070 నుంచి 2100 సంవత్సరాల మధ్యలో అంచనా వేసిన దాని కంటే సింధూ బేసిన్లో 30 నుంచి 50, గంగా బేసిన్లో 50 నుంచి 60, బ్రహ్మపుత్రా బేసిన్లో 50 నుంచి 70 శాతం హిమపాతం తగ్గుతుందని అంచనా వేసింది. శరవేగంగా కరుగుతున్న మంచు 2000 సంవత్సరం నుంచి 2009 మధ్య ఏటా సగటున 0.18 మీటర్ల మేర హిమనీ నదాల పరిమాణం తగ్గితే.. 2010 నుంచి 2019 మధ్య అది 0.28 మీటర్లకు పెరిగిందని ఐసీఐఎంవోడీ తెలిపింది. అంటే.. 2000–2009తో పోల్చి తే 2010–2019 మధ్య హిమనీ నదాల మంచు కరుగుదల 65 శాతం పెరిగినట్టు స్పష్టమవుతోంది. మంచు శరవేగంగా కరుగుతుండటం వల్ల 2100 సంవత్సరం నాటికి హిందూకుష్ పర్వత శ్రేణుల్లోని హిమనీ నదాల పరిమాణం 80 శాతం తగ్గుతుందని లెక్కగట్టింది. దీనివల్ల గంగా, సింధు, బ్రహ్మపుత్ర సహా 12 నదుల్లో వర్షాకాలం తప్ప మిగతా సమయాల్లో నీటి ప్రవాహం ఉండే అవకాశాలు తక్కువని అంచనా వేసింది. ఇది ఆ నదీ పరీవాహక ప్రాంతాల్లోని 167.40 కోట్ల మంది ప్రజల జీవనోపాధులను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. హిమపాతం తగ్గడం వల్ల 1979 నుంచి 2019 మధ్య గంగా, బ్రహ్మపుత్ర, సింధు బేసిన్లలో నీటిలభ్యత తగ్గడం వల్ల 1.29 కోట్ల మంది రైతుల జీవనోపాధులు దెబ్బతిన్నాయని తమ అధ్యయనంలో తేలిందని ఐసీఐఎంవోడీ వెల్లడించింది. -
దేశంలోనే అతిపెద్ద ఘాట్
కోటిలింగాలరేవు నుంచి చింతలరేవు వరకు నిర్మాణం 1.20 కిమీల నిడివి రూ.12.85 కోట్లతో నిర్మాణం రాజమండ్రి : రాజమండ్రిలో దేశంలోనే అతిపెద్ద ఘాట్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. గోదావరి పుష్కరాల సందర్భంగా కోటిలింగాల ఘాట్‌ను దేశంలో మరెక్కడా లేని విధంగా 1.20 కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నారు. దేశంలో గంగానది మీద వారణాసిలోనూ, అలహాబాద్, గోదావరి మీద నాశిక్‌లో మాత్రమే పెద్ద ఘాట్లున్నాయి. ఇప్పుడు వీటిని మించి పెద్ద ఘాట్‌ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి కోటిలింగాలరేవు వద్ద నుంచి చింతలరేవు వరకు దీనిని నిర్మిస్తున్నారు. రోజుకు ఈ ఘాట్‌లో ఐదు లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఘాట్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.12.85 కోట్లు కేటాయించింది. సాగునీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. మే నెలాఖరు నాటికి ఘాట్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఘాట్ నిర్మాణం పూర్తయితే దేశంలో అతి పెద్ద ఘాట్‌గా రికార్డును సొంతం చేసుకుంటుంది. ఈ ఏడాది గోదావరి పుష్కరాలకు కనీసం ఐదు కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని ఇప్పుడున్న పుష్కర్ ఘాట్లకు మరమ్మతులు చేయడం, విస్తరించడం, కొత్త ఘాట్ల నిర్మాణం వంటి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రాజమండ్రి కోటిలింగాల రేవు వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని గుర్తించి ప్రభుత్వం ఇక్కడ ఈ భారీ ఘాట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాజమండ్రిలో మిగిలిన ఘాట్ల నిర్మాణాలను పరిశీలిస్తే కోటిలింగాల ఘాట్ నిర్మాణ పనులు కొంతవరకు వేగంగా జరుగుతున్నాయనిపిస్తోంది. కోటిలింగాల ఘాట్ నిర్మాణంతోపాటు ఘాట్ పొడవునా ఆరు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తిగా రాతికట్టడం పద్ధతిలో ఈ ద్వారాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే ఘాట్ వద్ద ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయడంతోపాటు ఘాట్‌ను సుందరీకరణ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అడుగు ముందుకు వేయని పుష్కర్‌ఘాట్ విస్తరణ కోటిలింగాల ఘాట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతుండగా పుష్కరఘాట్ విస్తరణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. రైల్వేపాత వంతెన, మూడవ వంతెన కింద నుంచి ఈ ఘాట్ నిర్మాణ పనులు జరగాల్సి ఉంది. ఇందుకు రైల్వేశాఖ అనుమతి తప్పనిసరి. దీనిపై రైల్వే శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఇక్కడ ఘాట్‌ను రూ.1.72 కోట్లతో 140 మీటర్ల మేర విస్తరించాల్సి ఉంది.