దుకాణాల యజమానుల పేర్లు అక్కర్లేదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ/భోపాల్: ఉత్తరాదిన వివాదం రేపుతున్న కావడి యాత్ర వివాదానికి తెర దించే దిశగా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. భక్తులు వెళ్లే మార్గాల్లో దుకాణాలు, హోటళ్ల ముందు యజమానులు, సిబ్బంది పేర్లతో బోర్డులు ప్రదర్శించాలన్న యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వల ఆదేశాలపై స్టే విధిస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. బదులుగా లభించేది శాకాహారమో, మాంసాహారమో తెలిపే బోర్డులు ప్రదర్శిస్తే సరిపోతుందని స్పష్టంచేసింది.
శ్రావణమాసంలో గంగాజలాన్ని కావడిలో సేకరించి భక్తులు తిరిగి తమ సొంతూరిలోని శివాలయాల్లో జలాభిషేకం చేస్తారు. పుణ్యజలాలను తీసుకెళ్లే భక్తులకు శాకాహారం అందించే హోటళ్ల వివరాలు తెలియాలంటూ ఆయా రాష్ట్రాలు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. తాను కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా ముస్లింలు నడిపే శాకాహార భోజనంలోనే తినేవాడినని జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి ఈ సందర్భంగా చెప్పారు. యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల తరఫున ఎవరూ హాజరు కాకపోవడంతో విచారణను శుక్రవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment