kavadi yatra
-
కావడి యాత్రపై ఎందుకీ రభస?
ప్రతి ఏటా శ్రావణ మాసంలో హిందువులు పవిత్రంగా భావించే గంగా జలాన్ని హరిద్వార్ నుండి కావడిలో కాలినడకన తెచ్చి తమ గ్రామాలలోని శివాలయాల్లో అభిషేకం చేయడం పరిపాటి. ఇందుకోసం భక్తులు ఢిల్లీ హరిద్వార్ జాతీయ రాదారిపై లక్షల సంఖ్యలో కాలి నడకన ప్రయా ణిస్తారు. శతాబ్దాలుగా ఈ కావడి (కావడ్) యాత్ర జరుగుతోంది. పంజాబ్, రాజస్థాన్, హరియాణా, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల వారు ఈ యాత్రలో పాల్గొంటూ ఉంటారు. హరిద్వార్ నుండే కాకుండా గంగోత్రి, బిహార్‌లోని హజారీబాగ్ దగ్గర్లోని గంగానది నుండి కూడా కావడి పాత్రల్లో జలాన్ని సేకరించి తీసుకువెళుతూ ఉంటారు.ఈ యాత్ర సందర్భంగా భక్తులు ప్రయాణించే ఢిల్లీ–హరిద్వార్ జాతీయ రహదారి పొడవునా ఉన్న దాబాలు, హోటళ్లు; పండ్లు, కూరగాయల బండ్ల పైనా, రేషన్ షాపుల పైనా యజమానులు, పనిచేసే వర్కర్ల పేర్లు రాసి ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక ఉత్తర్వు జారీ చేశారు. దీన్ని చూసి మరో బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రీ ఇదే తరహా ఉత్తర్వు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల జారీలో ఒక వర్గాన్ని దెబ్బతీయడం మరో వర్గానికి మేలు చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యమని అర్థమవుతోంది.ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో యూపీ, ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వాలకు ఎదురుగాలి వీచింది. ఈ యాత్రా మార్గంలో ఉన్న సహారన్ పుర్‡ డివిజన్లో బీజేపీ ప్రభ తుడిచిపెట్టుకు పోయింది. అంతేకాకుండా శామలి, ముజఫర్‌నగర్ నియోజకవర్గాల్లో ‘ఇండియా’ బ్లాక్ విజయం సాధించింది. మీరట్‌లో బీజేపీ మెజారిటీ బాగా తగ్గింది. కాంగ్రెస్ గెలుచుకున్న ముజఫర్‌నగర్ సీట్ హరిద్వార్ దగ్గరలో ఉండటం, ఇటీవల ఉత్తరా ఖండ్‌లో జరిగిన ఉపఎన్నికల్లో హరిద్వార్‌ను ఆనుకొని ఉన్న మంగ్లర్, బద్రీనాథ్ అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ గెలవటం; త్వరలో యూపీలో 10 సీట్లలో ఉప ఎన్నికలు జరగనుండడంతో... మెజారిటీ వర్గ ఓట్లను దక్కించుకోవడానికి బీజేపీ వేసిన ఎత్తుగడగా రాజకీయ పరిశీలకులు ఈ ఉత్తర్వుల జారీని భావి స్తున్నారు.మూడేళ్ల క్రితం బీజేపీకి చెందినవారు ముజఫర్ నగర్ ఏరియాలో ఉన్న ముస్లిం హోటళ్ల యజమానుల పేర్లు హోటళ్లపై రాయాలని ఆందోళన చేశారు. ఆ హోటళ్లలో శాకాహారులు భోజనం చేస్తే కరప్టు అవుతారనేది వారి వాదం. 2023లో పోలీసులు ముస్లిం దాబాలను అనధికారికంగా మూసి వేయించారు. అయితే యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. దాబాలు, హోటల్స్ కేవలం శాకాహారమా, మాంసాహారమా అని తెలుపుతూ బోర్డులు పెడితే చాలని ఉత్తర్వులిచ్చింది. – డా. కె. సుధాకర్ రెడ్డి, విశ్రాంత లెక్చరర్, 89850 37713 -
Supreme Court: ఆహార బోర్డులు ప్రదర్శిస్తే చాలు
న్యూఢిల్లీ/భోపాల్: ఉత్తరాదిన వివాదం రేపుతున్న కావడి యాత్ర వివాదానికి తెర దించే దిశగా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. భక్తులు వెళ్లే మార్గాల్లో దుకాణాలు, హోటళ్ల ముందు యజమానులు, సిబ్బంది పేర్లతో బోర్డులు ప్రదర్శించాలన్న యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వల ఆదేశాలపై స్టే విధిస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. బదులుగా లభించేది శాకాహారమో, మాంసాహారమో తెలిపే బోర్డులు ప్రదర్శిస్తే సరిపోతుందని స్పష్టంచేసింది. శ్రావణమాసంలో గంగాజలాన్ని కావడిలో సేకరించి భక్తులు తిరిగి తమ సొంతూరిలోని శివాలయాల్లో జలాభిషేకం చేస్తారు. పుణ్యజలాలను తీసుకెళ్లే భక్తులకు శాకాహారం అందించే హోటళ్ల వివరాలు తెలియాలంటూ ఆయా రాష్ట్రాలు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. తాను కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా ముస్లింలు నడిపే శాకాహార భోజనంలోనే తినేవాడినని జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఈ సందర్భంగా చెప్పారు. యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల తరఫున ఎవరూ హాజరు కాకపోవడంతో విచారణను శుక్రవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. -
మీరు రద్దు చేస్తారా? మేము చేయాలా?
న్యూఢిల్లీ : కరోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కావడ్ యాత్రపై పునరాలోచించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం సోమవారం వరకు గడువు ఇచ్చింది. ప్రజల ఆరోగ్యం, ప్రాణాల కంటే మతపరమైన కార్యక్రమాలు ముఖ్యం కాదని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ బిఆర్ గవాయ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మనందరం భారత పౌరులం. ఆర్టికల్ 21 జీవించే హక్కు అందరికీ వర్తిస్తుంది. యూపీ సర్కార్ ఇలాంటి యాత్రలని 100శాతం నిర్వహించకూడదు’’అని వ్యాఖ్యానించింది. ప్రజల ఆరోగ్యం, ప్రాణాల కంటే మనోభావాలు ఎక్కువ కాదని స్పష్టం చేసింది. ‘‘మీకు మరో అవకాశం ఇస్తున్నాం. యాత్రని ఆపేస్తారా, లేదంటే ఆపేయాలనే మేమే ఆదేశాలివ్వాలా?’’అని సూటిగా ప్రశ్నించింది. శ్రావణమాసంలో శివభక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి గంగా జలాలను తమ ఊళ్లకి తీసుకువచ్చి శివుడికి అభిషేకం చేసే ఈ కావడ్ యాత్రకు కోట్లాదిగా భక్తులు హాజరవుతారు. కరోనా నేపథ్యంలో ఉత్తరాఖండ్ దీనిని రద్దు చేసినా, యూపీ సర్కార్ ఆంక్షల మధ్య అనుమతులిచ్చింది. దీంతో దీనిని సూమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు కేంద్రం, యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.