కావడి యాత్ర
ప్రతి ఏటా శ్రావణ మాసంలో హిందువులు పవిత్రంగా భావించే గంగా జలాన్ని హరిద్వార్ నుండి కావడిలో కాలినడకన తెచ్చి తమ గ్రామాలలోని శివాలయాల్లో అభిషేకం చేయడం పరిపాటి. ఇందుకోసం భక్తులు ఢిల్లీ హరిద్వార్ జాతీయ రాదారిపై లక్షల సంఖ్యలో కాలి నడకన ప్రయా ణిస్తారు. శతాబ్దాలుగా ఈ కావడి (కావడ్) యాత్ర జరుగుతోంది. పంజాబ్, రాజస్థాన్, హరియాణా, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల వారు ఈ యాత్రలో పాల్గొంటూ ఉంటారు. హరిద్వార్ నుండే కాకుండా గంగోత్రి, బిహార్‌లోని హజారీబాగ్ దగ్గర్లోని గంగానది నుండి కూడా కావడి పాత్రల్లో జలాన్ని సేకరించి తీసుకువెళుతూ ఉంటారు.
ఈ యాత్ర సందర్భంగా భక్తులు ప్రయాణించే ఢిల్లీ–హరిద్వార్ జాతీయ రహదారి పొడవునా ఉన్న దాబాలు, హోటళ్లు; పండ్లు, కూరగాయల బండ్ల పైనా, రేషన్ షాపుల పైనా యజమానులు, పనిచేసే వర్కర్ల పేర్లు రాసి ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక ఉత్తర్వు జారీ చేశారు. దీన్ని చూసి మరో బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రీ ఇదే తరహా ఉత్తర్వు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల జారీలో ఒక వర్గాన్ని దెబ్బతీయడం మరో వర్గానికి మేలు చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యమని అర్థమవుతోంది.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో యూపీ, ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వాలకు ఎదురుగాలి వీచింది. ఈ యాత్రా మార్గంలో ఉన్న సహారన్ పుర్‡ డివిజన్‌లో బీజేపీ ప్రభ తుడిచిపెట్టుకు పోయింది. అంతేకాకుండా శామలి, ముజఫర్‌నగర్ నియోజకవర్గాల్లో ‘ఇండియా’ బ్లాక్ విజయం సాధించింది. మీరట్‌లో బీజేపీ మెజారిటీ బాగా తగ్గింది. కాంగ్రెస్ గెలుచుకున్న ముజఫర్‌నగర్ సీట్ హరిద్వార్ దగ్గరలో ఉండటం, ఇటీవల ఉత్తరా ఖండ్‌లో జరిగిన ఉపఎన్నికల్లో హరిద్వార్‌ను ఆనుకొని ఉన్న మంగ్లర్, బద్రీనాథ్ అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ గెలవటం; త్వరలో యూపీలో 10 సీట్లలో ఉప ఎన్నికలు జరగనుండడంతో... మెజారిటీ వర్గ ఓట్లను దక్కించుకోవడానికి బీజేపీ వేసిన ఎత్తుగడగా రాజకీయ పరిశీలకులు ఈ ఉత్తర్వుల జారీని భావి స్తున్నారు.
మూడేళ్ల క్రితం బీజేపీకి చెందినవారు ముజఫర్ నగర్ ఏరియాలో ఉన్న ముస్లిం హోటళ్ల యజమానుల పేర్లు హోటళ్లపై రాయాలని ఆందోళన చేశారు. ఆ హోటళ్లలో శాకాహారులు భోజనం చేస్తే కరప్టు అవుతారనేది వారి వాదం. 2023లో పోలీసులు ముస్లిం దాబాలను అనధికారికంగా మూసి వేయించారు. అయితే యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. దాబాలు, హోటల్స్ కేవలం శాకాహారమా, మాంసాహారమా అని తెలుపుతూ బోర్డులు పెడితే చాలని ఉత్తర్వులిచ్చింది. – డా. కె. సుధాకర్ రెడ్డి, విశ్రాంత లెక్చరర్, 89850 37713
Comments
Please login to add a commentAdd a comment