Dr sudhakar
-
కావడి యాత్రపై ఎందుకీ రభస?
ప్రతి ఏటా శ్రావణ మాసంలో హిందువులు పవిత్రంగా భావించే గంగా జలాన్ని హరిద్వార్ నుండి కావడిలో కాలినడకన తెచ్చి తమ గ్రామాలలోని శివాలయాల్లో అభిషేకం చేయడం పరిపాటి. ఇందుకోసం భక్తులు ఢిల్లీ హరిద్వార్ జాతీయ రాదారిపై లక్షల సంఖ్యలో కాలి నడకన ప్రయా ణిస్తారు. శతాబ్దాలుగా ఈ కావడి (కావడ్) యాత్ర జరుగుతోంది. పంజాబ్, రాజస్థాన్, హరియాణా, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల వారు ఈ యాత్రలో పాల్గొంటూ ఉంటారు. హరిద్వార్ నుండే కాకుండా గంగోత్రి, బిహార్‌లోని హజారీబాగ్ దగ్గర్లోని గంగానది నుండి కూడా కావడి పాత్రల్లో జలాన్ని సేకరించి తీసుకువెళుతూ ఉంటారు.ఈ యాత్ర సందర్భంగా భక్తులు ప్రయాణించే ఢిల్లీ–హరిద్వార్ జాతీయ రహదారి పొడవునా ఉన్న దాబాలు, హోటళ్లు; పండ్లు, కూరగాయల బండ్ల పైనా, రేషన్ షాపుల పైనా యజమానులు, పనిచేసే వర్కర్ల పేర్లు రాసి ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక ఉత్తర్వు జారీ చేశారు. దీన్ని చూసి మరో బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రీ ఇదే తరహా ఉత్తర్వు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల జారీలో ఒక వర్గాన్ని దెబ్బతీయడం మరో వర్గానికి మేలు చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యమని అర్థమవుతోంది.ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో యూపీ, ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వాలకు ఎదురుగాలి వీచింది. ఈ యాత్రా మార్గంలో ఉన్న సహారన్ పుర్‡ డివిజన్లో బీజేపీ ప్రభ తుడిచిపెట్టుకు పోయింది. అంతేకాకుండా శామలి, ముజఫర్‌నగర్ నియోజకవర్గాల్లో ‘ఇండియా’ బ్లాక్ విజయం సాధించింది. మీరట్‌లో బీజేపీ మెజారిటీ బాగా తగ్గింది. కాంగ్రెస్ గెలుచుకున్న ముజఫర్‌నగర్ సీట్ హరిద్వార్ దగ్గరలో ఉండటం, ఇటీవల ఉత్తరా ఖండ్‌లో జరిగిన ఉపఎన్నికల్లో హరిద్వార్‌ను ఆనుకొని ఉన్న మంగ్లర్, బద్రీనాథ్ అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ గెలవటం; త్వరలో యూపీలో 10 సీట్లలో ఉప ఎన్నికలు జరగనుండడంతో... మెజారిటీ వర్గ ఓట్లను దక్కించుకోవడానికి బీజేపీ వేసిన ఎత్తుగడగా రాజకీయ పరిశీలకులు ఈ ఉత్తర్వుల జారీని భావి స్తున్నారు.మూడేళ్ల క్రితం బీజేపీకి చెందినవారు ముజఫర్ నగర్ ఏరియాలో ఉన్న ముస్లిం హోటళ్ల యజమానుల పేర్లు హోటళ్లపై రాయాలని ఆందోళన చేశారు. ఆ హోటళ్లలో శాకాహారులు భోజనం చేస్తే కరప్టు అవుతారనేది వారి వాదం. 2023లో పోలీసులు ముస్లిం దాబాలను అనధికారికంగా మూసి వేయించారు. అయితే యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. దాబాలు, హోటల్స్ కేవలం శాకాహారమా, మాంసాహారమా అని తెలుపుతూ బోర్డులు పెడితే చాలని ఉత్తర్వులిచ్చింది. – డా. కె. సుధాకర్ రెడ్డి, విశ్రాంత లెక్చరర్, 89850 37713 -
‘నేను మోనార్క్‌ని నన్నెవరూ మోసం చేయలేరు..’
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘‘నేను మోనార్క్‌ని నన్నెవరూ మోసం చేయలేరు...’’ ఓ సినిమాలో డైలాగు. అదే మాదిరిగా ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్ పనితనం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన వ్యవహార శైలిపై ఇటు విద్యార్థులు.. అటు ఉద్యోగులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు సైతం వెళ్లాయి. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే వైద్య విద్యార్థుల స్నాతకోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి అప్పట్లో స్థానిక మంత్రిని గాని, కలెక్టర్‌ను గాని, ఎంపీని కానీ ఆహా్వనించలేదు. ఇదేంటని వైద్య విద్యార్థులు ప్రశ్నిస్తే ‘‘మీకు సర్టిఫికెట్లు కావాలా... అతిథులు కావాలా’’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మెడికల్ కాలేజీకి సంబంధించిన మెస్ విషయంలోనూ ఈయన వ్యవహరించిన తీరుపై పెద్ద వివాదం జరిగింది. చివరకు కలెక్టర్ జోక్యంతో సద్దుమణిగింది. వీడియో కాన్ఫరెన్స్‌లకు గైర్హాజరు రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ నుంచి జిల్లా స్థాయిలో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రిన్సిపల్ తరచూ గైర్హాజరు అవుతుంటారు. కలెక్టర్, రాష్ట్ర స్థాయి అధికారుల వీడియో సమావేశాలైనా...వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి జరిగితే ప్రిన్సిపల్ హాజరైన దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియను చేపడితే దానిలో సైతం అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కానీ, ఇటు జీజీహెచ్ అధికారులకు కానీ సహకరించకుండా జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఎనీమియా వ్యాధికి సంబంధించి సర్వే చేయాల్సి ఉండగా దానిపై ప్రొఫార్మా తయారు చేసే విషయంలోను ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులే తయారు చేసి కలెక్టర్‌కు సమర్పించారు. మహిళా ఉద్యోగి రాజీనామా... ప్రిన్సిపల్‌తో పాటు ఈయన అనుచరుల వేధింపుల దెబ్బకు ఒక మహిళా ఉద్యోగి తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేశారు. ప్రిన్సిపల్‌కు ప్రధాన అనుచరుడుగా ఉన్న మెడికల్ కాలేజీలో ఎల్రక్టీషియన్ కూడారి ఆంజనేయులు మహిళా ఉద్యోగిపై లైంగికంగా వేధింపులకు గురిచేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆమె 2022 అక్టోబర్ 20న రిమ్స్ అవుట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆంజనేయులుపై ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ విషయమై ప్రిన్సిపల్‌కు కూడా ఫిర్యాదు చేసింది. అయినా అతని అనుచరుడు కావటంతో చర్యలు తీసుకోలేదు. దీనిపై మనస్థాపం చెందిన మహిళా ఉద్యోగి రాజీనామా చేసింది. దళిత సామాజిక వర్గానికి చెందిన అటెండర్లు ఆయనకు కనీసం ఆహారం కూడా అందించకూడదనే మౌఖిక ఆదేశాలు జారీ చేశాడంటే ఆ సామాజిక వర్గాల ఉద్యోగులంటే ఎంత చిన్న చూపో ఉందో అర్థమవుతోంది. చదవండి: ఆఫీస్‌కు వచ్చి పని చేయాల్సిందే.. చివరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ షాకింగ్ నిర్ణయం బయోమెట్రిక్ నుంచి మినహాయింపు రూల్ ఈజ్ రూల్...రూల్ ఫర్ ఆల్...కానీ ఈ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్‌కు మాత్రం కొన్ని మినహాయింపులు. విధి నిర్వహణకు వచ్చిన సమయంలో ఉద్యోగులందరూ బయో మెట్రిక్ ద్వారా హాజరు వేయాలి. కానీ ఈయనకు బయో మెట్రిక్ విధానం మినహాయింపు. ఆయన ఎప్పుడైనా రావచ్చు...వెళ్లిపోవచ్చు...అసలు రాకుండా కూడా ఉండవచ్చు. ఇదీ ఆయన తీరు. ఆరోపణలన్నీ అవాస్తవమే.. నాపై వచ్చినవన్నీ నిరాధారమైన ఆరోపణలే. మహిళా ఉద్యోగి విషయంలో లేనిపోని రాజకీయాలు చేస్తున్నారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే నేను పని చేస్తున్నాను. సెలవులు ఎవరైనా పెట్టుకోవచ్చు. గైర్హాజరైతేనే ఒప్పుకోను. – డాక్టర్ పీవీ సుధాకర్, జీఎంసీ ప్రిన్సిపాల్ -
డాక్టర్ సుధాకర్ కేసులో దర్యాప్తు పూర్తి చేశాం
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన అనస్తీషియా వైద్యుడు డాక్టర్ కె.సుధాకర్ విషయంలో అధికారులు అనుచితంగా వ్యవహరించారన్న ఘటనపై కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు పూర్తి చేశామని సీబీఐ హైకోర్టుకు బుధవారం నివేదించింది. సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు అనుమతిన ఇవ్వాలని కోరింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉందని, వారిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తామని సీబీఐ వివరించింది. వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు చార్జిషీట్ దాఖలుకు అనుమతి ఇచ్చింది. అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామంటూ విచారణను అక్టోబర్ 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ సుధాకర్ విషయంలో అధికారులు అమానుషంగా ప్రవర్తించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖతో పాటు ఓ వీడియోను కూడా జత చేశారు. ఆ వీడియోను ఎడిట్ చేసి సీఎం జగన్మోహన్రెడ్డి ఫొటోను జత చేశారు. దీనిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యంపై ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. -
అనస్థీషియా వైద్యుడు సుధాకర్ గుండెపోటుతో మృతి
సాక్షి విశాఖ క్రైం: వివాదాస్పద అనస్థీషియా వైద్యుడు కె.సుధాకర్ శుక్రవారం గుండెపోటుతో విశాఖలో మరణించారు. గురువారం అర్ధరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కింగ్ జార్జి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. గతేడాది నర్సీపట్నం ప్రభుత్వ వైద్యశాలలో మాస్కులు పంపిణీ చేయడం లేదంటూ దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై విమర్శలు చేసి సస్పెండయ్యారు. ఆ తర్వాత రోడ్డుపై మద్యం మత్తులో నానా యాగీ చేసి పీఎంను, సీఎంను తీవ్రంగా దూషించారు. కొంతకాలానికి తాను తప్పు చేశానని.. సీఎం వైఎస్ జగన్ తనని క్షమించాలని వేడుకున్నారు. -
టీడీపీ దౌర్జన్యం.. ఎమ్మెల్యేతో కలిసి ఫిర్యాదు..
సాక్షి, కర్నూలు : అధికారం కోల్పోయినా టీడీపీ నాయకుల ఆగడాలు ఆగడం లేదు. ప్రభుత్వమేదైనా అభివృద్ధి పనుల కాంట్రాక్ట్ తామే తీసుకుంటామని, అడ్డొస్తే అంతమొందిచేందుకు వెనుకాడేది లేదని గ్రామాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నారు. మండల పరిధిలోని ఆర్.కొంతలపాడు జెడ్పీ హైస్కూల్లో నాడు–నేడు అభివృద్ధి పనుల కింద రూ.40లక్షలు విడుదలయ్యాయి. పనులను పాఠశాల పేరెంట్స్ కమిటీకి అప్పగించింది. దీంతో పేరెంట్స్ కమిటీ సభ్యురాలు సుజాత ఆధ్వర్యంలో పాఠశాలకు మరుగుదొడ్లు, ప్రహరీ తదితర పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో శనివారం సాయంత్రం టీడీపీ కోడుమూరు ఇన్చార్జ్ విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు సాయికృష్ణ, గిడ్డయ్య పాఠశాల వద్దకు వచ్చి గొడవ పెట్టుకున్నారు. పనులు తామే చేస్తామని, కాదంటే అంతు చూస్తామని బెదిరించి వెళ్లారు. ఆదివారం మరో టీడీపీ నాయకుడు గిరి.. సుజాత ఇంటికి వెళ్లి కాంపౌండ్‌లోని వస్తువులను ధ్వంసం చేసి, చీర లాగి, కులంపేరుతో దూషించాడు. అడ్డొచ్చిన ఆమె మరిది మాసుంపై దాడికి దిగాడు. చదవండి: చంద్రబాబు, రామోజీలకు లీగల్ నోటీసు ఎమ్మెల్యేతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు తమపై దాడి జరిగిందని బాధితురాలు సుజాత, ఆమె మరిది మాసుం కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్.సుధాకర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించి బాధితులను వెంటబెట్టుకుని రాత్రి 8 గంటల ప్రాంతంలో కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐ ఓబులేసుకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల నుంచి గ్రామంలో ఘర్షణ జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
డాక్టర్ సుధాకర్ పదే పదే న్యూసెన్స్ చేస్తున్నారు
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల సస్పెన్షన్‌కి గురైన వివాదాస్పద వైద్యుడు సుధాకర్ పదే పదే పోలీస్ స్టేషన్‌కు వస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని నగర పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మీనా మండిపడ్డారు. సుధాకర్‌పై నమోదైన కేసును హైకోర్టు ఆదేశాలమేరకు సీబీఐకి అప్పగించారని, ఈ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందన్నారు. గురువారం విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన కమిషనర్ దివ్య హత్యకేసు విచారణను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. తనను అరెస్ట్ చేసినప్పుడు కారులో ఉండిపోయిన ఏటీఎం కార్డులు కావాలంటూ డాక్టర్ సుధాకర్ పోలీసుల వద్దకు రావడంపై మీడియా సీపీని ప్రశ్నించగా.. డాక్టర్ సుధాకర్ తరుచూ పోలీస్‌స్టేషన్‌కు రావడం వెనక ఓ రాజకీయ పార్టీ నాయకుల ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తు చేస్తుండగా స్టేషన్‌కు రావడం ఎందుకు? డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండగా ఆయన పోలీస్‌స్టేషన్‌కు రావడం ఎందుకని సీపీ మీనా ప్రశ్నించారు. ఆయన సీబీఐ వద్దకు ఎందుకు వెళ్లడం లేదంటూ అసహనం వ్యక్తంచేశారు. తన ఉద్యోగం తనకు ఇప్పించాలని సుధాకర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి డిమాండ్‌చేస్తున్నారని.. ‘పోలీసులు పోయిన ఉద్యోగాలు ఇస్తారా? ఏమైనా అడగాలనుకుంటే ప్రభుత్వాన్ని అడగాలి’ అని అన్నారు. -
డాక్టర్ సుధాకర్ వ్యవహార శైలిపై సీపీ ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: అనస్థీషియా డాక్టర్ సుధాకర్ వ్యవహార శైలిపై విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైకోర్టులో విచారణలో ఉన్న కేసును సీబీఐకు అప్పగించామన్నారు. డాక్టర్ సుధాకర్ కేసుకు సంబంధించి ఫైల్, స్వాధీనం చేసుకున్న ప్రొపర్టీ మొత్తాన్ని సీబీఐకు అప్పగించామన్నారు. సుధాకర్‌కు స్థానిక పోలీసు స్టేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని, హైకోర్ట్ ఆదేశాలను తాము పాటిస్తున్నామన్నారు. హైకోర్టు తీర్పుపై సుధాకర్‌కు గౌరవం లేదా అని, సీబీఐ విచారణ మీద నమ్మకం లేదా అని ఆర్కే మీనా ప్రశ్నించారు. (డాక్టర్ సుధాకర్‌పై 3 సెక్షన్ల కింద సీబీఐ కేసు) సీబీఐ విచారణ జరుగుతున్నప్పుడు స్థానిక పోలీసు స్టేషన్ ముందు సుధాకర్ మీడియా సమావేశం పెట్టడమేంటని వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడే ముందు సుధాకర్ రాజకీయ నాయకులను సంప్రదించి వస్తున్నారని, స్థానిక పోలీసులపై లేనిపోని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇది పోలీసులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలా ఉందని, సుధాకర్ తీరుపై సీబీఐకు ఫాక్స్ ద్వారా తెలియజేస్తామన్నారు. సీబీఐ కూడా సుధాకర్ ఎవరెవరిని సంప్రదిస్తూన్నారో, అతని వెనక ఉన్న వారెవరో ధృవీకరించాలన్నారు. (ఎన్ఐఆర్ఎఫ్-2020; టాప్‌లో ఐఐటీ మద్రాస్) -
డాక్టర్ సుధాకర్ పోలీసుల అదుపులో లేరు
సాక్షి, అమరావతి: అనస్థీషియా వైద్యుడు డాక్టర్ సుధాకర్ పోలీసుల అదుపులో లేరని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. మే 16 నుంచి ఆయన విశాఖపట్నం మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. డా.సుధాకర్ కావాలనుకుంటే ఆ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వొచ్చని, మరెక్కడికైనా వెళ్లి మరింత మెరుగైన వైద్యం పొందవచ్చని పేర్కొంది. ఈ విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని సీబీఐ తెలిపింది. ఇరు పక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, మెరుగైన వైద్యం కోసం డా.సుధాకర్ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జి కావొచ్చునని.. ఆయన సీబీఐ దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ సీతమ్మధార (ఉత్తర): వివాదాస్పద వైద్యుడు సుధాకర్.. ప్రభుత్వ మానసిక ఆస్పత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. గత నెల మే 16న మద్యం మత్తులో జాతీయ రహదారిపై కారును అడ్డంగా ఆపి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులతో పాటు, స్థానికులను దుర్భాషలాడిన ఘటనలో పోలీసులు వైద్యపరీక్షలు చేసి మానసిక ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతోంది. సుధాకర్‌ను డిశ్చార్జ్ చేసేందుకు హైకోర్టు సమ్మతించడంతో ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో డిశ్చార్జ్ చేసినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి చెప్పారు. -
డాక్టర్ సుధాకర్‌పై 3 సెక్షన్ల కింద సీబీఐ కేసు
సాక్షి, విశాఖపట్నం: నడిరోడ్డుపై ఇష్టారాజ్యంగా ప్రవర్తించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతోనే నర్సీపట్నానికి చెందిన అనస్తీషియా డాక్టర్ సుధాకర్‌పై కేసు నమోదు చేసినట్టు సీబీఐ పేర్కొంది. ఈ మేరకు తన వెబ్సైట్లో కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని బుధవారం పొందుపర్చింది. గత నెల 16న డాక్టర్ సుధాకర్ విశాఖ పోర్టు ఆస్పత్రి సమీపంలోని జాతీయ రహదారిపై తన పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు విధులకు ఆటంకం కలిగించారని ఫోర్త్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీబీఐ ఇన్స్పెక్టర్ ఎన్.రాఘవేంద్ర కుమార్ ఎఫ్ఐఆర్ ప్రతిలో పేర్కొన్నారు. హెడ్‌కానిస్టేబుల్ వెంకటరమణ ఘటన జరిగిన రోజే సుధాకర్‌పై ఫోర్త్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డాక్టర్ సుధాకర్‌పై ఐపీసీ 353 (ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం), 427 (తుంటరి చేష్టలతో న్యూసెన్స్ సృష్టిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం), 506 (ఎదుటి వ్యక్తులను నేరపూరితంగా బెదిరిస్తూ భయోత్పాతం సృష్టించడం) మొదలైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్ల ఆధారంగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో స్పష్టం చేసింది. -
డాక్టర్ సుధాకర్‌పై కేసు..
-
డాక్టర్ సుధాకర్‌పై సీబీఐ కేసు
సాక్షి, విశాఖపట్నం, మహారాణిపేట(విశాఖ దక్షిణ): వివాదాస్పద వ్యవహార శైలితో కలకలం రేపి.. ప్రస్తుతం మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసినట్టు సీబీఐ ఎస్పీ విమలా ఆదిత్య మంగళవారం రాత్రి వెల్లడించారు. కేసు వివరాలను తమ వెబ్సైట్లో పొందు పరిచినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలిలా ఉన్నాయి. ⇔ నర్సీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అనస్థీషియా డాక్టర్‌గా పని చేస్తున్న సుధాకర్ ఏప్రిల్ 6వ తేదీన కరోనా నియంత్రణపై ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ⇔ మే 16వ తేదీ సాయంత్రం 3.50 ప్రాంతంలో డాక్టర్ సుధాకర్.. విశాఖ నగరం మర్రిపాలెం నుంచి బాలయ్యశాస్త్రి లేఅవుట్లో ఉన్న తన ఇంటికి వెళ్తూ మార్గం మధ్యలో పోర్టు ఆస్పత్రి వద్ద జాతీయ రహదారిలో కారు ఆపి స్థానికులను, ఆటో డ్రైవర్లను దుర్భాషలాడారు. ⇔ దీంతో స్థానికులు 100 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో వెంటనే నాలుగో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డాక్టర్‌కు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ⇔ అయినా వినిపించుకోకుండా మతం, కులాల పేరిట దూషిస్తూ ప్రధాని, సీఎం, మంత్రులతో పాటు పోలీసులను, అక్కడ ఉన్న స్థానికుల్ని సైతం నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. ⇔ డాక్టర్ ప్రవర్తనను మొబైల్లో వీడియో చిత్రీకరిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ చేతి నుంచి సెల్‌ను లాక్కొన్ని రోడ్డుకేసి కొట్టారు. ⇔ చొక్కా విప్పుకుని జాతీయ రహదారిపై వాహనాలకు అడ్డంగా పడుకోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. నిలువరించాలని ప్రయత్నించిన పోలీసులపై తిరగబడి.. చొక్కాను చించుకుని హైవేపైకి మళ్లీ వచ్చి.. లారీకి అడ్డంగా వెళ్లారు. ⇔ ఈ పరిణామంతో అక్కడ ఉన్న స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే.. తనకు కరోనా ఉందని, తనను పట్టుకుంటే వైరస్ అంటించేస్తానంటూ భయపెట్టారు. పోలీసుల సహాయంతో.. స్థానిక ఆటోడ్రైవర్ వైద్యుడి చొక్కాతోనే.. అదుపు చేయడం కోసం అతని చేతులు కట్టేశారు. ⇔ మద్యం మత్తులో ఉన్న డాక్టర్‌ను ఎమ్మెల్సీ చేయించడం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కరోనా కారణంగా బ్రీత్ ఎనలైజర్‌ను వాడకుండా కేజీహెచ్‌లో రక్త నమూనాలను సేకరించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు సుధాకర్ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ప్రభుత్వ మానసిక వైద్యశాలకు రిఫర్ చేశారు. ⇔ సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి పంపించిన పరిణామాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత రాసిన లేఖ, ఎడిట్ చేసిన వీడియోను సుమోటో పిల్‌గా పరిగణించిన హైకోర్టు.. కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. ⇔ నాలుగు రోజులుగా విశాఖలో విచారణ చేపట్టిన సీబీఐ.. నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ సిబ్బందితో పాటు సుధాకర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను, ఆయనకు వైద్యం చేసిన కింగ్ జార్జ్ ఆస్పత్రి అధికారులను, వైద్యులను విచారించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సుధాకర్‌పై 188, 357 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ⇔ ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడి రోడ్డుమీద ప్రజాప్రతినిధులను దూషింంచడం, విధి నిర్వహణలో వున్న పోలీసులను తూలనాడటంతో పాటు స్థానికులను భయ బ్రాంతులకు గురి చేశారని సీబీఐ తన కేసులో పేర్కొన్నట్టు సమాచారం. కాగా, 23 మంది సాక్షుల సమాచారంతో పాటు 130 పేజీలతో కూడిన సిడి ఫైల్‌ను నాలుగో పట్టణ టౌన్ పోలీసులు సీబీఐకి అందించారు. -
నీకు 71 ఏళ్లు.. వైరస్ పసిగడుతుంది
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళవారం ఆయన స్పందిస్తూ.. ‘‘ సగం రాష్ట్రానికి తాగు, సాగు నీరందించే పోతిరెడ్డిపాడు గురించి నోరు మెదపడు. ఎవరో సస్పెండైన డాక్టరు తాగి రోడ్డుమీద చిందులేస్తే ఒకటే ట్వీట్లు పెడుతున్నాడు. ప్యాకేజీ తీసుకుని పనిచేసే జీతగాళ్లను కూడా ఎగదోస్తున్నాడు. వ్యక్తుల ప్రయోజనాలు తప్ప రాష్ట్రం గురించి పట్టదా చంద్రబాబూ?’’ ‘‘కరోనా మనతోటే ఉంటుంది కాబట్టి 65 ఏళ్లు దాటినోళ్లు బయటకు రావద్దని కేసీఆర్ గారు కూడా చెప్పారు. జాగ్రత్త బాబూ! నీకు 71 ఏళ్లు అని వైరస్ ఇట్టే పసిగడ్తుంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం, ప్రతిపక్ష నేతగా పదకొండేళ్లు లాంటివి కరోనాకు అర్థం కావు’’ అంటూ మండిపడ్డారు. (‘కుటుంబానికో గుడ్డు కూడా రాదు కదా బాబూ’) అంతకు క్రితం డాక్టర్ సుధాకర్ విషయంలో కొందరు నాయకులు, కొన్ని టీవీ ఛానళ్లు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. “ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరన్నా అనుకుంటారా.. “అని బాబు మాట్లాడిన రోజున నోరెత్తని నాయకులు, టీవీ ఛానళ్ళు ఇప్పుడు చేస్తున్న యాగి చూస్తున్నారు కదా..! బాబు, లోకేష్ నాయుడు, రాధాకృష్ణ, నారాయణ... వీరా దళితుల గురించి మాట్లాడేది?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సుధాకర్‌కు ఎమ్మెల్యే సీటు ఇస్తామని..
సాక్షి, విశాఖపట్నం : దళితుడైన అనస్థీషియా డాక్టర్ సుధాకర్‌కు పాయకరావుపేట ఎమ్మెల్యే సీటు ఇస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మోసం చేశారని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. సుధాకర్ మాటలపై అయ్యన్న సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయ్యన్నపాత్రుడు తనను కుక్కలా వాడుకున్నాడని సుధాకర్ చెబుతుంటే.. అయ్యన్న మాత్రం ఆయనతో పెద్దగా పరిచయం లేదని చెప్పటం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. సోమవారం ఉమాశంకర్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి డాక్టర్ సుధాకర్‌కు ఎమ్మెల్యే సీటు ఇస్తామని ఆశ చూపి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. దళితుడైన సుధాకర్‌ను తమ రాజకీయం కోసం చంద్రబాబు, అయ్యన్నలు బలి చేశారని అన్నారు. ( ‘అయ్యన్న పాత్రుడి ఇంట్లోనే ఆయనకు తర్ఫీదు ఇచ్చారు’ ) చంద్రబాబు, అయ్యన్న కలిసి శాడిస్టుల్లా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైజాగ్ టీడీపీ కార్యాలయం వేదికగా ప్రభుత్వంపై డాక్టర్ సుధాకర్‌తో కలిసి అయ్యన్నపాత్రుడు కుట్ర చేశారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందచేస్తున్న మొనగాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. ప్రజలు తమను మర్చిపోతారేమోనన్న భయంతో చంద్రబాబు, అయ్యన్నలు దళితులతో డ్రామాలాడించడం దళితులను మోసం చేయడమేనని అన్నారు. ( ‘బాబు చేతిలో ఆ డాక్టర్ కీలు బొమ్మ’ ) కాగా, ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్.. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు, డాక్టర్ సుధాకర్ల మధ్య బంధాన్ని బైట పెట్టారు. అయ్యన్న పాత్రుడు గురించి డాక్టర్ సుధాకర్ మాట్లాడిన వీడియోను ఆయన వెలుగులోకి తెచ్చారు. ‘‘ నన్ను అయ్యన్నపాత్రుడు కుక్కలా వాడుకున్నాడు’’ అని సుధాకర్ మాట్లాడిన వీడియో అది. -
అసభ్యంగా మాట్లాడుతూ.. అందర్ని తిట్టాడు
-
‘సుధాకర్‌ను స్థానికులే తాళ్లతో కట్టేశారు’
సాక్షి, విశాఖపట్నం : గతంలో ప్రభుత్వం, ఉన్నతాధికారులపై తప్పుడు ఆరోపణలు చేసి సస్పెన్షన్‌కు గురైన నర్సీపట్నం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ శనివారం తప్పతాగి అసభ్యంగా మాట్లాడుతూ అందర్ని తిట్టారని పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. నిన్న సాయంత్రం 3.45 నిమిషాల సమయంలో పోర్టు ఆసుపత్రి వద్ద జాతీయ రహదారిపై ఒక వ్యక్తి కారుపై వచ్చి తప్పతాగి గొడవ చేస్తున్నాడంటూ 100కి కాల్ వచ్చిందని ఆయన అన్నారు. గొడవ చేస్తున్న ఆయనను నియంత్రించడానికి స్ధానికులే తాళ్లు కట్టారని చెప్పారు. డాక్టర్ సుధాకర్ తప్పతాగి వీరంగం సృష్టించిన ఘటనపై ఆదివారం ఆర్కే మీనా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘100కు ఫోన్ రాగానే 4వ పట్టణ పోలీసులు వేంటనే అక్కడికి చేరుకున్నారు. సుధాకర్ షర్ట్ తీసి విసిరేసి, రోడ్డు మీద వీరంగం సృష్టించాడు. పోలీసులు అతన్ని అపే ప్రయత్నం చేసినా అతను ఆగలేదు. హైవేపై ఏర్పాటు చేసిన స్టాపర్స్ తీసివేస్తూ గొడవ సృష్డించాడు. దాదాపు 45 నిమిషాల పాటు గందరగోళం సృష్టించాడు. ( అనస్థీషియా వైద్యుడి వీరంగం ) ఆ సమయంలో అతను సుధాకర్ అని కానిస్టేబుళ్లకి తెలియదు. తాగి గొడవ చేస్తుండటంతో పాటు లారీ క్రిందకి వెళ్లాడు. స్థానికుల సాయంతో పోలీసులు అతనిని ఆపే ప్రయత్నం చేశారు. అక్కడినుంచి అతనిని కేజీహెచ్‌కి తరలించారు. అతని బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. ప్రస్తుతం డాక్టర్ సుధాకర్ మెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ని సస్పెండ్ చేశాం. అతని ఆరోగ్య పరిస్ధితిపై కుటుంబ సభ్యులకి చెప్పే మానసిక చికిత్సాలయానికి తరలించాం. అతను తాగిన మైకంలో లారీ క్రింద పడబోతే రక్షించామ’’ని అన్నారు. ( చంద్రబాబు పప్పులు ఉడికే పరిస్థితి లేదు ) -
‘అతన్ని మానసిక ఆస్పత్రిలో చేర్పించండి’
సాక్షి, కాకినాడ : దళిత కులాల మధ్య చంద్రబాబు నాయుడు పెట్టిన చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉందని అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు అన్నారు. కుల రాజకీయంలో చంద్రబాబు దిట్ట ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ స్వార్థ రాజకీయాలకు కోసం దళిత ఉద్యోగులను బలి చేస్తోందని మండిపడ్డారు. డాక్టర్ సుధాకర్ మద్యానికి బానిసై మానసిక రోగంతో బాధపడుతున్నాడని, అందుకే రహదారులపై బట్టలు విప్పుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. (చదవండి : అనస్థీషియా వైద్యుడి వీరంగం) అటువంటి వ్యక్తి రహదారిపై తిరుగుతూ తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడం కాకుండా ప్రజలకు కూడా ఇబ్బంది కలిగిస్తున్న నేపథ్యంలో భద్రత కోసం పోలీసులు పట్టుకొని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. దయచేసి అతన్ని వెంటనే మానసిక ఆస్పత్రిలో చెర్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ సుధాకర్ చాలా కాలంగా టీడీపీ టికెట్ కోసం ప్రయత్నం చేశాడని, చంద్రబాబు మోసం చేడయంతో మతి భ్రమించి చివరకు పిచ్చివాడిలా మిగిలిపోయాడని అన్నారు. ఇకనైనా టీడీపీ నేతలు స్వార్థం కోసం దళిత నేతలను బలి చేయొద్దని కోరారు. సీఎం జగన్ ప్రభుత్వంపై మీద దళితులకు పూర్తి నమ్మకం ఉందని రవీంద్రబాబు అన్నారు. -
విశాఖ గ్యాస్ లీకేజీ: ప్రత్యేక వైద్య బృందాల ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎల్జీ గ్యాస్ లీకేజీ బాధిత గ్రామాల ప్రజలకు భరోసా ఇచ్చేందుకు వెంకటాపురంలో 10 పడకలతో వైఎస్సార్ క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు వైద్య నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు బాధిత గ్రామాలలో 24 గంటలలో పాటు 3 షిఫ్టులలో 6 వైద్య బృందాలు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ బృందం ప్రజల ఆరోగ్య సమస్యలపై దీర్ఘకాలికంగా పర్యవేక్షించడానికి 10 మంది నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించామన్నారు. ఈ వైద్య నిపుణుల కమిటీ గ్యాస్ లీకేజీ బాధిత గ్రామాల్లో ప్రజల ఆరోగ్య సమస్యలను పరీక్షించడంలో దీర్ఘకాలికంగా పనిచేస్తుందని చెప్పారు. (బాధిత గ్రామాల్లో సహాయక చర్యలు) ఇందులో న్యూరో, పల్మనాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కంటి, జనరల్ మెడిసిన్, పాథాలజీ, చిన్న పిల్లల వైద్య నిపుణులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ కమిటీకి తాను చైర్మన్‌గా వ్యవహరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాధిత గ్రామాల ప్రజల ఆరోగ్య సమస్యలపై ఈ కమిటీ అధ్వర్యంలో ప్రజల ఆరోగ్య సమస్యలపై శాస్త్రీయమైన పద్దతిలో అధ్యయనం చేయడమే కాకుండా నిరంతరాయంగా పర్యవేక్షణ చేయనున్నామన్నారు. ఇక బాధిత గ్రామాల ప్రజల ఆరోగ్య సమస్యల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో వారి ఆరోగ్యంపై ఇబ్బందులు రాకుండా ఈ నిపుణుల కమిటీ పనిచేస్తుందన్నారు. స్టెరైనా గ్యాస్ వ్యవహారం, బాధితుల భవిష్యత్తు వైద్య సమస్యలపై ఢిల్లీలోని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ రాజీవ్ గర్గ్, ఇన్సిట్యూట్ ఆప్ న్యూక్లియర్ మెడిసిన్ నిపుణులతోనూ చర్చిస్తున్నామన్నారు. ప్రభుత్వం తరపు నుంచి హెల్త్ కార్డులను కూడా జారీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. (‘మంత్రుల బసతో బాధితుల్లో ధైర్యం’) -
డీఎంహెచ్ఓ సుధాకర్ అరెస్ట్
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుధాకర్‌ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. సెలైంట్ కిల్లర్‌గా పేరుపొంది పలు సంచలన హత్యలు చేసిన సయ్యద్ అబ్దుల్ కరీం అలియాస్ మున్నా గుప్తనిధులను కనిపెట్టే బాబాగా అవతారం ఎత్తి పలువురిని నిలువునా మోసం చేస్తూ వస్తున్నాడు. ఇటీవల కర్నూలులో ఒక కిడ్నాప్ కేసుకు సంబంధించి అక్కడి పోలీసులకు పట్టుబడటంతో వారి విచారణలో ఆయన చేసిన నేరాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన ఆర్టీసీ కండక్టర్ చింతమాల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒంగోలు తాలూకా ిసీఐ ఐ.శ్రీనివాసన్ డాక్టర్ సుధాకర్‌ను మరో నలుగురిని అరెస్ట్ చేసి సోమవారం ఒంగోలులోని మూడో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. నిందితులపై మోసం, కుట్ర, హత్యాయత్నం తదితర సెక్షన్లపై కేసులు నమోదయ్యాయి. ఒంగోలులోని ఇస్లాంపేటకు చెందిన మున్నా గతంలో ఆయుర్వేద వైద్యుడిగా ఉంటూ జాతీయ రహదారిపై మారణకాండను కొనసాగించాడు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడి బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ సుధాకర్‌తో పాటు మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడి బాబాగా అవతారమెత్తాడు. ఈ ముఠా గుప్తనిధుల తవ్వకాలతో పేరుతో పలువురిని మోసం చేసింది. వీరి ట్రాప్‌లో చిక్కుకున్న చింతమాల శ్రీనివాస్ లక్షలాది రూపాయలు మున్నా గ్యాంగ్‌కు సమర్పించుకున్నాడు. చివరకు మోసపోయానని గ్రహించి వాటిని తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో ఈ నెల 18న ఆయనను కిడ్నాప్ చేసి ప్రకాశం జిల్లా చేజర్ల మండలం సరుగుతోటల వద్ద హతమార్చేందుకు యత్నించారు. శ్రీనివాస్ వారి నుంచి తప్పించుకొని ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ సుధాకర్‌తో పాటు మరో నలుగురు నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఒంగోలు జైలుకు తరలించారు. -
వైద్యారోగ్య శాఖకు నిర్లక్ష్య రోగం
నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: జిల్లా వైద్యారోగ్యశాఖలో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. డీఎంహెచ్ఓ దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ఏడీఎంహెచ్‌ఓకు పూర్తి బాధ్యతలు అప్పగించలేదు. ఈ కారణంగా ఇన్చార్జి డీఎంహెచ్ఓ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. 300కు పైగా ఫైళ్లు పరిష్కారానికి ఎదురు చూస్తున్నాయి. వీటి గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ సుధాకర్ దీర్ఘకాలిక సెలవులో భాగంగా 23 రోజులుగా ఆయన విధులకు హాజరుకాలేదు. నాటి నుంచి ఏడీఎంహెచ్ఓ కోటేశ్వరికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. కాని పూర్తిస్థాయిలో బాధ్యతలు (ఎఫ్ఏసీ) ఇవ్వలేదు. దీంతో ఆమె ఇన్చార్జ్ డీఎంహెచ్‌ఓగానే కొనసాగుతున్నారు. దీంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. నిత్యం ప్రజలకు సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారి 15 రోజులకు పైగా సెలవు పెడితే ఇన్చార్జ్ అధికారికి ఎఫ్ఏసీ కల్పిస్తూ పూర్తి బాధ్యతలు అప్పగించాలి. కాని డీఎంహెచ్ఓ కార్యాలయంలో అలా జరగలేదు. ఈ కారణంగా డాక్టర్ కోటేశ్వరి కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఎఫ్ఏసీ ఇవ్వనప్పుడు తానేందుకు ఫైళ్లపై కీలక నిర్ణయాలను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఉన్నట్టు తెలిసింది. అలాగే డీఎంహెచ్ఓ కార్యాలయంలో కీలకమైన విభాగాల్లో అకౌంటెంట్ సెక్షన్ ఒకటి. ఈ విభాగంలో గత ఆరు నెలలుగా పర్యవేక్షకులు (సూపరింటెండెంట్) లేరు. ఈ విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన మధుసూదనమ్మ జూన్ 30న ఉద్యోగ విరమణ చేయడంతో ఈ సీటు ఖాళీ అయింది. గత నెల 23న గుంటూరు నుంచి ప్రకాష్‌బాబు అనే ఉద్యోగి పదోన్నతిపై సూపరింటెండెంట్‌గా డీఎంహెచ్ఓ కార్యాలయంలో నియమితులయ్యారు. ఈయనకు నేటికీ ఏ విభాగంలో కూడా సూపరింటెండెంట్ బాధ్యతలు కేటాయించలేదు. ప్రకాష్‌బాబు మాత్రం రోజూ డీఎంహెచ్ఓ కార్యాలయానికి వస్తూ పోతూ ఉన్నారు. అకౌంట్ సెక్షన్లో సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉన్నా సంబంధిత పోస్టుకు అర్హుడైన అధికారి ఉన్నప్పటికీ సీటును కేటాయించక పోవడం చూస్తే అధికారుల పనితీరు ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. డీఎంహెచ్ఓ లేని కారణంగా ఈ కార్యాలయంలో 300కు పైగా ఫైళ్లు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. ప్రధానంగా ఉద్యోగుల సరెండర్ లీవ్స్, మెడికల్ లీవ్స్, సర్వీసు మేటర్లకు సంబంధించిన ఫైళ్లతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన ఫైళ్ల సైతం నిలిచిపోయాయి. ఈ ఫైళ్లన్నీ అయ్యగారి సంతకం కోసం ఎదురు చూస్తున్నాయి. అలాగే కొందరి ఉద్యోగుల సర్వీస్ రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన ఫైళ్లు డీఎంహెచ్ఓ పరిశీలించి ప్రాంతీయ సంచాలకులు(రీజనల్ డెరైక్టర్) కార్యాలయానికి పంపించాల్సి ఉంది. ఈ ఫైళ్లు కూడా డీఎంహెచ్ఓ కార్యాలయంలో దుమ్ము పట్టాయి. ఎవరి ఇష్టం వారిదే..: డీఎంహెచ్ఓ సెలవులో ఉండటంతో ఆ కార్యాలయంలోని ఉద్యోగులంతా ఎవరి ఇష్టం వారిదే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తమ సొంత పనులు చూసుకుని తీరికగా కార్యాలయానికి రావడం, లేకుంటే అసలు రాకుండా ఉండటం జరుగుతోంది. డీఎంహెచ్ఓ కార్యాలయంలో కుష్టు, మలేరియా, ఇమ్యునైజేషన్, డెమో తదితర విభాగాలున్నాయి. ఆయా విభాగాల్లో పని చేసే ఉద్యోగులు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో ఎవ్వరికి తెలియడంలేదు. ఆయా పనులపై వచ్చిన వారు సంబంధిత ఉద్యోగులు లేకపోవడంతో ఉసూరుమంటూ తిరిగి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఇంతటి కీలకమైన జిల్లా వైద్యారోగ్యశాఖ విషయంలో జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.