వైద్యారోగ్య శాఖకు నిర్లక్ష్య రోగం | 300 above files pending due to dmho in long leave | Sakshi
Sakshi News home page

వైద్యారోగ్య శాఖకు నిర్లక్ష్య రోగం

Published Tue, Dec 31 2013 3:23 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

300 above files pending due to dmho in long leave

నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: జిల్లా వైద్యారోగ్యశాఖలో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. డీఎంహెచ్‌ఓ దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ఏడీఎంహెచ్‌ఓకు పూర్తి బాధ్యతలు అప్పగించలేదు. ఈ కారణంగా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. 300కు పైగా ఫైళ్లు పరిష్కారానికి ఎదురు చూస్తున్నాయి. వీటి గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ సుధాకర్ దీర్ఘకాలిక సెలవులో భాగంగా 23 రోజులుగా ఆయన విధులకు హాజరుకాలేదు. నాటి నుంచి ఏడీఎంహెచ్‌ఓ కోటేశ్వరికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు.

కాని పూర్తిస్థాయిలో బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) ఇవ్వలేదు. దీంతో ఆమె ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓగానే కొనసాగుతున్నారు. దీంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. నిత్యం ప్రజలకు సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారి 15 రోజులకు పైగా సెలవు పెడితే ఇన్‌చార్జ్ అధికారికి ఎఫ్‌ఏసీ కల్పిస్తూ పూర్తి బాధ్యతలు అప్పగించాలి. కాని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అలా జరగలేదు. ఈ కారణంగా డాక్టర్ కోటేశ్వరి కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఎఫ్‌ఏసీ ఇవ్వనప్పుడు తానేందుకు ఫైళ్లపై కీలక నిర్ణయాలను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఉన్నట్టు తెలిసింది. అలాగే డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కీలకమైన విభాగాల్లో  అకౌంటెంట్ సెక్షన్ ఒకటి. ఈ విభాగంలో గత ఆరు నెలలుగా పర్యవేక్షకులు (సూపరింటెండెంట్) లేరు. ఈ విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన మధుసూదనమ్మ జూన్ 30న ఉద్యోగ విరమణ చేయడంతో ఈ సీటు ఖాళీ అయింది.  

 గత నెల 23న గుంటూరు నుంచి ప్రకాష్‌బాబు అనే ఉద్యోగి పదోన్నతిపై సూపరింటెండెంట్‌గా  డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నియమితులయ్యారు. ఈయనకు నేటికీ ఏ విభాగంలో కూడా సూపరింటెండెంట్ బాధ్యతలు కేటాయించలేదు. ప్రకాష్‌బాబు మాత్రం రోజూ డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి వస్తూ పోతూ ఉన్నారు. అకౌంట్ సెక్షన్‌లో సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉన్నా సంబంధిత పోస్టుకు అర్హుడైన అధికారి ఉన్నప్పటికీ సీటును కేటాయించక పోవడం చూస్తే అధికారుల పనితీరు ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. డీఎంహెచ్‌ఓ లేని కారణంగా ఈ కార్యాలయంలో 300కు పైగా ఫైళ్లు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. ప్రధానంగా ఉద్యోగుల సరెండర్ లీవ్స్, మెడికల్ లీవ్స్, సర్వీసు మేటర్లకు సంబంధించిన ఫైళ్లతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన ఫైళ్ల సైతం నిలిచిపోయాయి.

 ఈ ఫైళ్లన్నీ అయ్యగారి సంతకం కోసం ఎదురు చూస్తున్నాయి. అలాగే కొందరి ఉద్యోగుల సర్వీస్ రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన ఫైళ్లు డీఎంహెచ్‌ఓ పరిశీలించి ప్రాంతీయ సంచాలకులు(రీజనల్ డెరైక్టర్) కార్యాలయానికి పంపించాల్సి ఉంది. ఈ ఫైళ్లు కూడా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో దుమ్ము పట్టాయి. ఎవరి ఇష్టం వారిదే..: డీఎంహెచ్‌ఓ సెలవులో ఉండటంతో ఆ కార్యాలయంలోని ఉద్యోగులంతా ఎవరి ఇష్టం వారిదే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తమ సొంత పనులు చూసుకుని తీరికగా కార్యాలయానికి రావడం, లేకుంటే అసలు రాకుండా ఉండటం జరుగుతోంది.

 డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కుష్టు, మలేరియా, ఇమ్యునైజేషన్, డెమో తదితర విభాగాలున్నాయి. ఆయా విభాగాల్లో పని చేసే ఉద్యోగులు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో ఎవ్వరికి తెలియడంలేదు. ఆయా పనులపై వచ్చిన వారు సంబంధిత ఉద్యోగులు లేకపోవడంతో  ఉసూరుమంటూ తిరిగి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఇంతటి కీలకమైన జిల్లా వైద్యారోగ్యశాఖ విషయంలో జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ఉన్నతాధికారులు  పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement