Long Leave
-
భారత్‌పే ఎండీకి ఉద్వాసన! అసలేం జరుగుతోందంటే..
ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పే ఎండీ, సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌కు ఉద్వాసన దిశగా కంపెనీ నిర్ణయం తీసుకోనుందా? తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నప్పటికీ.. తెర వెనుక వ్యవహారం మరోలా ఉందని తెలుస్తోంది. కొటక్ మహీంద్రా బ్యాంక్ ఉద్యోగిని ఫోన్‌కాల్‌లో దుర్భాషలాడుతూ.. అష్నీర్ గ్రోవర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక క్లిప్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో న్యాయపరమైన చర్యలకు దిగిన కొటాక్ మహీంద్రా, భారత్‌పే ఎండీకి నోటీసులు సైతం పంపింది. దీంతో కంపెనీ అష్నీర్‌ను హడావిడిగా సెలవుల మీద బయటికి పంపింది. తాజాగా మార్చి చివరినాటి వరకు ఆయన సెలవుల్ని పొడిగిస్తున్నట్లు భారత్‌పే ఒక ప్రకటనలో పేర్కొంది. శాశ్వతంగా..? ‘ఇది పూర్తిగా అష్నీర్ తీసుకున్న నిర్ణయం.. కంపెనీ, ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా అష్నీర్ నిర్ణయంతో మేం ఏకీభవిస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొంది కంపెనీ. అయితే అష్నీర్ లాంగ్ లీవ్ వెనుక బోర్డు ఒత్తిడి ఉన్నట్లు ఓ ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం అష్నీర్ స్థానంలో సీఈవో సుహాయిల్ సమీర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శక్తివంతమైన మేనేజ్మెంట్ టీంతో ముందుకు వెళ్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేయడం ఆసక్తిని రేకెత్తించింది. మరోవైపు సెలవుల పరిణామంపై స్పందించేందుకు అష్నీర్ విముఖత వ్యక్తం చేయడంతో.. భారత్‌పే ఎండీ ఉద్వాసన దాదాపు ఖరారైనట్లేనని జోరుగా ప్రచారం సాగుతోంది. అలాంటిదేం లేదు! 3 బిలియన్ డాలర్ల విలువ ఉన్న భారత్‌పేలో ఇలాంటి విషపూరిత సంప్రదాయం మంచిది కాదనే ఉద్దేశానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చినట్లు సమాచారం. బోర్డు సభ్యులతో పాటు ఇన్వెస్టర్లుగా సెకోయియా ఇండియా, రిబ్బిట్ క్యాపిటల్, కోవాట్యు మేనేజ్మెంట్తో పాటు పలువురు బ్యాంకింగ్ దిగ్గజాలు ఉన్నారు. వీళ్లంతా ప్రతిపాదించినందునే.. అష్నీర్ లాంగ్ లీవ్ మీద వెళ్లాడే తప్ప.. ఉద్వాసన లాంటి పరిణామం ఏం లేదని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపినట్లు ఓ ప్రముఖ మీడియాహౌజ్ కథనం ప్రచురించింది. ‘బోర్డుకు ఆయన్ని తొలగించే ఉద్దేశం లేదు. కానీ, మీడియా ఊహాగానాల్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో మాత్రం ఉంది. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత వ్యవహారం. ప్రొఫెషనల్‌కి సంబంధించింది కాదు’.. అంటూ బోర్డులోని ఓ కీలక సభ్యుడు వెల్లడించాడు. నైకా ఐపీవో సంబంధిత షేర్ల కేటాయింపులో కొటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని అష్నీర్ గ్రోవర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆపై 500 కోట్ల రూపాయలకు కొటక్ మహీంద్రా మీద దావా వేశారు. అంతటితో ఆగకుండా అష్నీర్, ఆయన భార్య మాధురి.. కాల్లో బ్యాంక్ ప్రతినిధిని అసభ్యంగా దూషించడంతో.. కొటక్ మహీంద్రా బ్యాంక్ లీగల్ నోటీసులు పంపింది. సంబంధిత వార్త: 500 కోట్ల పరిహారం.. ఆపై భార్యతో ఫోన్లో బండబూతులు! -
ఐసీసీ సీఈవో మనూ సాహ్నీకి షాక్
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సీఈవో మను సాహ్నీని సెలవుపై పంపించారు. ఐసీసీలోని సభ్య దేశాలు, ఉద్యోగులతో ఆయన ప్రవర్తన సరిగా లేదని విచారణ జరిపిన ప్రైస్ వాటర్‌హౌజ్ కూపర్స్ తేల్చి చెప్పడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. 2022లో సాహ్నీ పదవీకాలం ముగియనుండగా.. ఆలోపే ఆయన రాజీనామా చేస్తారని తెలుస్తోంది. 2019 వరల్డ్‌కప్ తర్వాత డేవ్ రిచర్డ్సన్ నుంచి బాధ్యతలు అందుకున్న సాహ్నీ.. అప్పటి నుంచి అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఐసీసీని కూడా శాసించగలిగే సామర్థ్యం ఉన్న బీసీసీఐ ఆయన తీరుపై గుర్రుగా ఉంది. అంతేకాకుండా ఐసీసీ చైర్మన్ పదవికి న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లేను ఈ బోర్డులు ప్రతిపాదించగా.. సాహ్నీ మాత్రం తాత్కాలిక చైర్మన్ ఇమ్రాన్ ఖవాజాకు మద్దతు తెలిపారు. ఇక ప్రతి ఏటా ఐసీసీ ఒక టోర్నీ నిర్వహించాలన్న సాహ్నీ ప్రతిపాదన కూడా ఈ మూడు బోర్డులకు రుచించలేదు. దీంతో సాహ్నీ తీరుపై ఈ మూడు పెద్ద బోర్డులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనను సెలవుపై పంపించింది. ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే.. తొలగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసింది. చదవండి: 'ప్లేయర్ ఆఫ్ ద మంత్' రవిచంద్రన్ అశ్విన్ 'మామా.. ఇప్పటికైనా మీ పంతం వదిలేయండి' -
ఒకే ఒక్కడు!
జగిత్యాల : జిల్లాలో వైద్యశాఖలో ఒకే అధికారి పలు శాఖలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రంగా అవతరించి రెండేళ్లు అయింది. అయినా వైద్య శాఖలో పూర్తిస్థాయి అధికారుల నియామకం జరుగడంలేదు. దీంతో ఉన్న అధికారులకే పలు శాఖల అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నారు. దీంతో పలు శాఖల్లో పూర్తిస్థాయిలో అధికారులు కేటాయించలేదు. వైద్యశాఖలో డెప్యూటీ డీఎంహెచ్‌వోగా జైపాల్‌రెడ్డి నియమితులయ్యారు. డీఎంహెచ్‌వో సుగంధిని ఇటీవల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో జైపాల్‌రెడ్డికి అదనంగా ఇన్చార్జి డీఎంహెచ్‌వోగా బాధ్యతలు అప్పగించారు. డెప్యూటీ డీఎంహెచ్‌వోతోపాటు, ఇన్చార్జి డీఎంహెచ్‌వో, రాష్ట్ర బాలస్వస్తీయ కార్యక్రమం(ఆర్బీఎస్కే) జిల్లా కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైంది. జిల్లాలోని ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్కూళ్లకు వెళ్లి చికిత్స అందిస్తుంటారు. 10 వాహనాలు, 10 మంది ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటారు. ఈ శాఖకు సైతం ఆయన జిల్లా కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే కేసీఆర్ కిట్ పథకానికి జిల్లాలో ఎలా అమలు జరుగుతుందనే విషయం తెలుసుకునేందుకు అధికారులను నియమించారు. కేసీఆర్ కిట్‌కు సైతం జిల్లా ఇన్చార్జిగా జైపాల్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైద్యశాఖలో నాలుగు ప్రధానమైన ఈ శాఖలను జైపాల్‌రెడ్డి ఇన్చార్జి. నాలుగు శాఖలకు ఒకరే ఇన్చార్జి కావడంతో ఆయన ఒత్తిడికి లోనవుతున్నారు. -
లాం..గ్ లీవ్!
ఆర్డర్ టు సర్వ్‌తో ఇరుక్కుపోయిన ఉద్యోగులు కొత్త జిల్లాలో హెచ్ఆర్ఏ కోత జిల్లా అవతరించి మూడు నెలలు తుది కేటాయింపుపై లేని స్పష్టత జగిత్యాల :జిల్లాలో పలు ప్రభుత్వ శాఖలకు ఉద్యోగుల కొరత ముప్పు పొంచి ఉందా..? జిల్లాస్థాయి అధికారులకూ ఉద్యోగుల సెలవు భయం పట్టుకుందా..? ఇప్పటికే వివిధ కారణాలతో లాంగ్‌లీవ్ పెట్టిన ఉద్యోగుల బాటలో ఇంకొందరు ఉన్నారా..? ఉద్యోగుల సెలవు సమస్య జిల్లా అభివృద్ధి ప్రగతిపై ప్రతికూల ప్రభావం చూపనుందా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే లాంగ్‌లీవ్ పెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 11 జిల్లా ఆవిర్భావం రోజున... ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులతో విధుల్లో చేరిన వివిధ జిల్లాలకు చెందిన వీరు తుది కేటాయింపులపై ఆశలు పెట్టుకున్నారు. ఆ ప్రక్రియ ఇంతవరకు ప్రారంభం కాకపోవడంతో దీర్ఘకాల సెలవు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలువురు తమ పలుకుబడితో పాత స్థానాలకు బదిలీ చేయించుకోగా.. ఇంకొందరు వివిధ కారణాలతో సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఇంకా అనేకమంది ఉద్యోగులు, అధికారులు లాంగ్‌లీవ్ పెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ విషయంలో అనేక శాఖల్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో దీర్ఘకాలిక సెలవు పెట్టి జిల్లాను వీడాలనే ఆలోచనతో ఉన్న ఉద్యోగులపై అధికారులు దృష్టిసారించారు. జగిత్యాల జిల్లాగా ఆవిర్భవించి నేటికి 90 రోజులవుతోంది. ఆ సమయంలో కొత్త జిల్లాల్లో తాత్కాలికంగా విధులు నిర్వర్తించాలంటూ ఆర్డర్ టు సర్వ్ కింద ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. దీంతో కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి వందకు పైనే ఉద్యోగులు, అధికారులు జగిత్యాలకు బదిలీ అయ్యారు. కొత్త జిల్లా కార్యాలయాల్లో కరువైన కనీస వసతులు.. స్థానికంగా నివాస వసతి ఇబ్బందులతో ఉద్యోగులు ఇప్పటివరకు కాలం వెళ్లదీశారు. కరీంనగర్ నుంచి బదిలీ అయిన ఉద్యోగుల హెచ్ఆర్ఏ 20శాతం నుంచి 14.5శాతానికి పడిపోయింది. దీంతో ప్రతి ఉద్యోగి రూ. 2వేల నుంచి రూ.10వేలకుపైనే నష్టపోతున్నాడు. అయినా.. ప్రభుత్వ మాటకు కట్టుబడి ఉద్యోగులు విధులు నిర్వర్తించారు. అప్పట్లో ప్రభుత్వం..నెల రోజుల్లో కొత్త జిల్లాల్లో ఆప్షన్లు తీసుకుని ఉద్యోగులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇంతవరకు ఆప్షన్లు తీసుకోకపోవడం.. కనీసం ఒక్క ప్రకటన కూడా విడుదల చేయకపోవడం.. తుది కేటాయింపులకు సంబంధించిన కసరత్తు ప్రారంభం కాకపోవడంతో ఏం చేయాలో తోచక ఉద్యోగులు ఆందోళనలో పడ్డారు. ఇదేక్రమంలో కొత్త జిల్లాలో అభివృద్ధికి సంబంధించి పని ఒత్తిడి పెరగడంతోనూ విధుల నిర్వహణకు మొండికేస్తున్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి, తమ కార్యాలయాలకు రాకపోకలు సాగిస్తున్న ఉద్యోగులు లాంగ్‌లీవ్ పెట్టాలని నిర్ణయించారు. ఈ విషయం ఉద్యోగవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారడంతో బాధిత ఉద్యోగులందరూ దీర్ఘకాలిక సెలవులు పెట్టేందుకు ముందుకు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
దీర్ఘకాలిక సెలవులో కమిషనర్
అనంతపురం న్యూసిటీ : నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. గురువారం నుంచి రెండు వారాల పాటు సెలవు మంజూరు చేయాలని డీఎంఏకు ఆయన ఓ లేఖ రాశారు. పాలకవర్గంలోని గ్రూపు రాజకీయాలతో ఆయన మనస్థాపం చెందిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో కమిషనర్ ఇక ‘అనంత’లో పని చేయకపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇన్చార్జ్ కమిషనర్‌గా పగడాల కష్ణమూర్తి వ్యవహరించనున్నారు. -
630 మంది సబ్ ఇంజినీర్ల దీర్ఘకాలిక సెలవు
హైదరాబాద్ : ఏపీ ట్రాన్స్‌కోలో ప్రమోషన్ల వ్యవహారం దుమారం రేపుతోంది. పదోన్నతుల్లో తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఇటీవల ఏపీ వ్యాప్తంగా ట్రాన్స్‌కో సబ్ ఇంజినీర్లు చేపట్టిన ఆందోళన క్రమక్రమంగా అన్ని జిల్లాలకు వ్యాపిస్తోంది. సోమవారం ఒకటీ, రెండు జిల్లాలకే పరిమితమైన నిరసన మంగళవారానికి మిగతా ప్రాంతాలకూ పాకింది. మంగళవారం అనంతపురం, వైఎస్సార్ , కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన దాదాపు 630 మంది సబ్ ఇంజినీర్లు సామూహిక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. -
వైద్యారోగ్య శాఖకు నిర్లక్ష్య రోగం
నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: జిల్లా వైద్యారోగ్యశాఖలో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. డీఎంహెచ్ఓ దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ఏడీఎంహెచ్‌ఓకు పూర్తి బాధ్యతలు అప్పగించలేదు. ఈ కారణంగా ఇన్చార్జి డీఎంహెచ్ఓ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. 300కు పైగా ఫైళ్లు పరిష్కారానికి ఎదురు చూస్తున్నాయి. వీటి గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ సుధాకర్ దీర్ఘకాలిక సెలవులో భాగంగా 23 రోజులుగా ఆయన విధులకు హాజరుకాలేదు. నాటి నుంచి ఏడీఎంహెచ్ఓ కోటేశ్వరికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. కాని పూర్తిస్థాయిలో బాధ్యతలు (ఎఫ్ఏసీ) ఇవ్వలేదు. దీంతో ఆమె ఇన్చార్జ్ డీఎంహెచ్‌ఓగానే కొనసాగుతున్నారు. దీంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. నిత్యం ప్రజలకు సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారి 15 రోజులకు పైగా సెలవు పెడితే ఇన్చార్జ్ అధికారికి ఎఫ్ఏసీ కల్పిస్తూ పూర్తి బాధ్యతలు అప్పగించాలి. కాని డీఎంహెచ్ఓ కార్యాలయంలో అలా జరగలేదు. ఈ కారణంగా డాక్టర్ కోటేశ్వరి కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఎఫ్ఏసీ ఇవ్వనప్పుడు తానేందుకు ఫైళ్లపై కీలక నిర్ణయాలను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఉన్నట్టు తెలిసింది. అలాగే డీఎంహెచ్ఓ కార్యాలయంలో కీలకమైన విభాగాల్లో అకౌంటెంట్ సెక్షన్ ఒకటి. ఈ విభాగంలో గత ఆరు నెలలుగా పర్యవేక్షకులు (సూపరింటెండెంట్) లేరు. ఈ విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన మధుసూదనమ్మ జూన్ 30న ఉద్యోగ విరమణ చేయడంతో ఈ సీటు ఖాళీ అయింది. గత నెల 23న గుంటూరు నుంచి ప్రకాష్‌బాబు అనే ఉద్యోగి పదోన్నతిపై సూపరింటెండెంట్‌గా డీఎంహెచ్ఓ కార్యాలయంలో నియమితులయ్యారు. ఈయనకు నేటికీ ఏ విభాగంలో కూడా సూపరింటెండెంట్ బాధ్యతలు కేటాయించలేదు. ప్రకాష్‌బాబు మాత్రం రోజూ డీఎంహెచ్ఓ కార్యాలయానికి వస్తూ పోతూ ఉన్నారు. అకౌంట్ సెక్షన్లో సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉన్నా సంబంధిత పోస్టుకు అర్హుడైన అధికారి ఉన్నప్పటికీ సీటును కేటాయించక పోవడం చూస్తే అధికారుల పనితీరు ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. డీఎంహెచ్ఓ లేని కారణంగా ఈ కార్యాలయంలో 300కు పైగా ఫైళ్లు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. ప్రధానంగా ఉద్యోగుల సరెండర్ లీవ్స్, మెడికల్ లీవ్స్, సర్వీసు మేటర్లకు సంబంధించిన ఫైళ్లతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన ఫైళ్ల సైతం నిలిచిపోయాయి. ఈ ఫైళ్లన్నీ అయ్యగారి సంతకం కోసం ఎదురు చూస్తున్నాయి. అలాగే కొందరి ఉద్యోగుల సర్వీస్ రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన ఫైళ్లు డీఎంహెచ్ఓ పరిశీలించి ప్రాంతీయ సంచాలకులు(రీజనల్ డెరైక్టర్) కార్యాలయానికి పంపించాల్సి ఉంది. ఈ ఫైళ్లు కూడా డీఎంహెచ్ఓ కార్యాలయంలో దుమ్ము పట్టాయి. ఎవరి ఇష్టం వారిదే..: డీఎంహెచ్ఓ సెలవులో ఉండటంతో ఆ కార్యాలయంలోని ఉద్యోగులంతా ఎవరి ఇష్టం వారిదే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తమ సొంత పనులు చూసుకుని తీరికగా కార్యాలయానికి రావడం, లేకుంటే అసలు రాకుండా ఉండటం జరుగుతోంది. డీఎంహెచ్ఓ కార్యాలయంలో కుష్టు, మలేరియా, ఇమ్యునైజేషన్, డెమో తదితర విభాగాలున్నాయి. ఆయా విభాగాల్లో పని చేసే ఉద్యోగులు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో ఎవ్వరికి తెలియడంలేదు. ఆయా పనులపై వచ్చిన వారు సంబంధిత ఉద్యోగులు లేకపోవడంతో ఉసూరుమంటూ తిరిగి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఇంతటి కీలకమైన జిల్లా వైద్యారోగ్యశాఖ విషయంలో జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.