district medical and health department
-
వైద్యశాఖకు అవినీతి జబ్బు
సాక్షి, నెల్లూరు: అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రక్షాళన చేస్తున్నా ఆశించిన ఫలితాలు కానరావడంలేదు. వైద్యశాఖ అధికారులు, ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఇటీవల ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో స్పందించిన కలెక్టర్ శేషగిరిబాబు బాధ్యులైన ఉన్నతాధికారిపై వేటేశారు. డీఎంహెచ్ఓ వరసుందరాన్ని డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేశారు. ఓ వైపు ప్రక్షాళన చేస్తున్నా వైద్యశాఖ కార్యాలయంలో మార్పు రావడం లేదు. పనిచేసే వారికి పనిష్మెంట్లు ఇస్తూ, చేయని వారిని అందలమెక్కిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాజీనామా చేసిన మహిళకే పోస్ట్ ఇచ్చేందుకు యత్నం ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తూ రాజీనామా చేసిన మహిళకే మరోసారి పోస్టింగ్ ఇచ్చేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాధికారులు యత్నాలు చేస్తున్నారు. 2010లో ఎన్ఆర్హెచ్ఎం (జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్) ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసేందుకు స్టాఫ్‌నర్స్‌ల పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టారు. ఇందులో భాగంగా ముత్తుకూరు పీహెచ్సీలో స్టాఫ్‌నర్స్ పోస్ట్ కోసం ముగ్గురు మహిళలు దరఖాస్తు చేసుకోగా, అందులో అర్హత ఉన్న ఒకర్ని నియమించారు. అయితే సదరు మహిళ ఆర్నెల్ల పాటు సక్రమంగా విధులు నిర్వర్తించి ఆపై తరచూ విధులకు గైర్హాజరయ్యేవారు. ఇలా నాలుగేళ్ల పాటు కొనసాగింది. చివరికి సదరు మహిళ 2014లో రాజీనామా చేశారు. దీంతో అక్కడి పీహెచ్సీలో స్టాఫ్‌నర్స్ లేక ఇబ్బందులు నెలకొన్నాయి. విషయాన్ని గుర్తించిన అక్కడి పీహెచ్సీ వైద్యాధికారి, హెచ్‌డీఎస్ చైర్మన్ ముత్తుకూరు పీహెచ్సీలో స్టాఫ్‌నర్స్‌ను వెంటనే నియమించాలని జిల్లా అధికారులను కోరినా ఫలితం లేకుండాపోయింది. ఇదే పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న ముగ్గురు మహిళల్లో అర్హత కలిగిన కామాక్షమ్మ ఖాళీ అయిన స్టాఫ్‌నర్స్ పోస్ట్‌ను తనకు ఇవ్వాలంటూ అధికారులకు విన్నవించుకున్నారు. వాస్తవానికి రోస్టర్ ప్రకారం కామాక్షమ్మనే నియమించాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కామాక్షమ్మకు పోస్ట్ ఇవ్వమని తెగేసిచెప్పారు. రాజీనామా చేసిన స్టాఫ్ నర్స్ తిరిగి పోస్ట్ కోసం వైద్య ఆరోగ్య కార్యాలయంలో రూ.ఐదు లక్షల వరకు ముట్టజెప్పారని సమాచారం. ఈ క్రమంలోనే డీఎంహెచ్ఓ కార్యాలయాధికారులు ముత్తుకూరు పీహెచ్సీ వైద్యాధికారిని రాజీనామా చేసిన స్టాఫ్‌నర్స్‌కు ఆరోగ్యం బాగొలేని కారణంగా సెలవు పెట్టిందని లెటర్ రాసివ్వాలని కోరగా, అందుకు ఆ వైద్యాధికారి ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల క్రితం పోస్ట్ ఇచ్చేందుకు డీఎంహెచ్ఓ కార్యాలయం వారు జేసీకి ఫైల్ పెట్టగా తిరస్కరించారు. పనిచేసే వారికే శిక్ష పనిచేసే వారికేమో పనిష్మెంట్లు.. చేయని వారినేమో అందలమెక్కించడం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాధికారుల తీరుగా మారింది. గండిపాళెం పీహెచ్సీలో రెండో ఏఎన్ఎంగా విధులు నిర్వరిస్తున్న జమ్మాయమ్మపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా అనవసరంగా అదే పీహెచ్‌సీకి సంబంధించిన ఎస్వీ చింతాల సబ్సెంటర్కు ఇటీవల బదిలీ చేశారు. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై అధికారులు దృష్టి సారిస్తే మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఆ శాఖలోని ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. పోస్టింగ్‌లు, డిప్యుటేషన్లు, ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్లు, తదితర అంశాలకు సంబంధించిన ఫైళ్లను లోతుగా పరిశీలిస్తే అవినీతిపరుల భరతం పట్టే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. డిప్యుటేషన్ల రద్దు ఒట్టి మాటే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి సంబంధించి అడ్డగోలుగా జరిగిన డిప్యుటేషన్లను రద్దు చేస్తున్నట్లు గత డీఎంహెచ్ఓ వరసుందరం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ముడుపులివ్వని కొందరి డిప్యుటేషన్లను మాత్రమే రద్దు చేశారు. ముడుపులిచ్చిన దాదాపు 25 మంది వారు కోరుకున్న స్థానాల్లో డిప్యుటేషన్‌పై ఇప్పటికీ కొనసాగుతున్నారు. వీరిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో దాదాపు 10 మందికిపైగా, బయట పీహెచ్‌సీల్లో 15 మంది వరకు కొనసాగుతున్నట్లు సమాచారం. ఉదయగిరిలో ఒకే పోస్ట్‌లో ఇద్దరు ఉద్యోగులను నియమించి పనిచేయిస్తున్నారు. -
కారుణ్య నియామకానికి రూ.లక్ష
సాంబమూర్తినగర్ (కాకినాడ) : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి ఊడలు పెరిగిపోతున్నాయి. కార్యాలయంలోకి పని కోసం వెళ్లాలంటేనే వైద్యాధికారులు, సిబ్బంది హడలెత్తిపోయే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. ప్రతి పనికీ ముక్కు పిండి మరీ వసూళ్లకు పాల్పడుతున్నా ఆ శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో సిబ్బంది అవినీతికి అంతేలేకుండా పోతోంది. తాజాగా వెలుగు చూసిన ఉదంతమే ఇందు కు నిదర్శనం. ఇంట్లో తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తూ మరణించినా, స్వచ్ఛంద పదవీ విరమణ పొందినా వారి కుటుంబంలో చదువుకున్న యువతీ యువకులలో ఒకరికి ప్రభుత్వం ఇచ్చే కారుణ్య నియామకానికి కూడా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఉద్యోగాల కోసం నలుగురు ఈ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. రాజానగరంలో ఒకటి, ఇందుకూరుపేటతో పాటు ఏజెన్సీలో మొత్తం మూడు కారుణ్య నియామక పోస్టులకు ఖాళీలున్నాయి. వాటి భర్తీకి అభ్యర్థులు ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ సిబ్బందిని ఆశ్రయించారు. ఇదే అదనుగా ఆ సెక్షన్ సిబ్బంది ఒక్కొక్క పోస్టుకు రూ.లక్ష చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎంహెచ్ఓ ఇన్చార్జ్ కావడంతో ఆమె స్థానంలో పూర్తిస్థాయి డీఎంహెచ్‌ఓగా వచ్చే వాళ్లు సంతకం చేయాల్సి ఉంది. వారికి ఎంతో కొంత ఇస్తేగానీ సంతకం చేసే పరిస్థితి లేదంటూ ఆ సెక్షన్ సిబ్బంది అభ్యర్థులకు చెప్పినట్టు సమాచారం. న్యాయపరంగా తమకు ఉద్యోగం రావాల్సి ఉన్నా డీఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది తమను వేధింపులకు గురిచేయడంపై వారు ఆందోళన చేసేందుకు సిద్ధపడుతున్నారు. దీనిపై ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ షాలినీదేవి దృష్టికి తీసుకెళ్లగా తన వద్దకు కారుణ్య నియామక అపాయింట్మెంట్ కోసం ఎవరూ రాలేదని, వారు ఫిర్యాదు చే స్తే పరిశీలిస్తానని వివరణ ఇచ్చినట్టు యునెటైడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు పలివెల శ్రీనివాసరావు తెలిపారు. చక్రం తిప్పుతున్న కీలక ఉద్యోగి డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ లో ఓ ఉన్నతోద్యోగి చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కోనసీమలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన సయమంలో ఆయన నాలుగైదు పీహెచ్‌సీలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తూ పలు అక్రమాలకు పాల్పడినట్టు యూనియన్ల నాయకులు విమర్శిస్తున్నారు. సుఖీభవ పథకంలో సుమారు 40 డెలివరీ కేసులకు సంబంధించిన సొమ్ములను స్వాహా చేసి వైద్యాధికారులకు అందజేయడంలో ప్రధాన భూమిక పోషించాడంటున్నారు. వైద్యాధికారులకు అపాయింట్మెంట్ ఇచ్చే విషయంలోనూ ఒక్కొక్కరి నుంచి రూ.పది వేలు పైబడి వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులకు ఎన్ని ఫిర్యాదులందినా చర్యలు లేకపోవడంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఉన్నతాధికారి, సిబ్బంది అవినీతిపై ప్రశ్నించేవారు తమను బ్లాక్మెయిల్ చేస్తున్నారని బెదిరిస్తున్నారంటూ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్రాసిటీ కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడడం లేదని, చేసేదేమీ లేక మిన్నకుండిపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. -
అందరూ పని దొంగలే!
►ఇదీ ఎఫ్‌ఆర్‌టీసీ విభాగం పరిస్థితి ►కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి వరకు అందరిదీ ‘మామూళ్ల’ బాటే కాకినాడ క్రైం : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖను అవినీతి భూతం వెంటాడుతూనే ఉంది. తాజాగా ఫైలేరియా విభాగంలో అవినీతి వెలుగుచూసింది. జిల్లాలో బోద వ్యాధిగ్రస్తులు అధికంగా ఉండడంతో డీఎంహెచ్ఓ కార్యాలయ ఆవరణలో ఫైలేరియా రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (ఎఫ్‌ఆర్‌టీసీ) ఏర్పాటు చేశారు. కాకినాడలో మూడు యూనిట్లు, రాజమండ్రిలో రెండు, పిఠాపురంలో రెండు, మండపేట, పెద్దాపురం, అమలాపురం, రామచంద్రపురంలో ఒక్కో యూనిట్ ఎఫ్‌ఆర్‌టీసీ నేతృత్వంలో పనిచేస్తుంటాయి. ఇన్సెక్ట్ కలెక్టర్ ప్రతి రోజు ఉదయం దోమలను సేకరించి వాటి వల్ల వ్యాప్తిచెందే వ్యాధులపై రీసెర్చ్ చేయాలి. ఫీల్డ్ వర్కర్లు పంపులతో కాల్వల్లో బయోటెక్స్, ఎబేట్ మందులను పిచికారీ చేయాలి. అయితే ఆ పంపులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఎఫ్‌ఆర్‌టీసీలో నెలకొంది. ఈ విభాగంలో 11 మంది ఇన్స్పెక్టర్లు, తొమ్మిది మంది మహిళా, 14 మంది పురుష ఫీల్డ్ వర్కర్లు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ విధులు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. వీరి నుంచి ముడుపులు తీసుకుంటున్న కొందరు అధికారులు వీరికి వంతపాడుతున్నారనే విమర్శలున్నాయి. ఉద్యోగుల సరెండర్ లీవులకు సంబంధించి బిల్లులు పాస్ చేసేందుకు ఒక్కో ఉద్యోగి నుంచి రూ.వెయ్యి వసూలు చేసినట్టు కొంత మంది సిబ్బంది చెబుతున్నారు. విధులకు హాజరుకాకుండానే... రాజమండ్రికి చెందిన ఓ ఉద్యోగి కాకినాడలో విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ విధులకు ఎగనామం పెట్టి, ఆ విభాగ అధికారులకు ముడుపులు అందజేసి ఉద్యోగాన్ని కాపాడుకుంటున్నాడని కొందరు ఉద్యోగులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. రాజమండ్రిలో విధులు నిర్వహిస్తోన్న ఓ మహిళా ఉద్యోగి రెండేళ్ల క్రితం కాకినాడ సరెండర్ చేశారు. అయితే ఆమె కూడా పనిలేకుండా కాకినాడలోని ఎఫ్‌ఆర్‌టీసీలో ఉంటూ కాలం వెళ్లదీస్తోంది. పిఠాపురంలో ఇన్సెక్ట్ కలెక్టర్ ఒకరు భారీగా ముడుపులిచ్చి ప్రస్తుతం కాకినాడలో ఎస్ఆర్డబ్ల్యూగా విధులు నిర్వహిస్తున్నా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రిపోర్టులు సేకరించాల్సిన హెల్త్ ఇన్స్పెక్టర్ పరిస్థితి కూడా ఇలానే ఉందని ఆ విభాగ ఉద్యోగులే నిరసన వ్యక్తం చేస్తున్నారు. మండపేటలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగిని పనిష్మెంట్ పేరిట రామచంద్రపురానికి మార్చారని, అనధికారికంగా ఎఫ్‌ఆర్‌టీసీలో డిప్యుటేషన్లు కొనసాగిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ తీరుపై విమర్శలు ఎఫ్‌ఆర్‌టీసీ ప్రోగ్రాం ఆఫీసర్ తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బందితో పనిచేయించడంతో పాటు, పీఓగా విధులు నిర్వహించడంలోనూ ఆయన విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నారు. కాకినాడలోని ఎఫ్‌ఆర్‌టీసీలో అవుట్ పేషెంట్ విభాగాన్ని కూడా నిర్వహించడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పీఓ జిల్లాలోని అన్ని యూనిట్లను సందర్శించాల్సి ఉండగా వాహనాన్ని కూడా దుర్వినియోగపరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పేకేరు పీహెచ్సీలో వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తూ సస్పెన్షన్‌కు గురైన వైద్యురాలిని ఎఫ్‌ఆర్‌టీసీ పీఓగా నియమించారని, ఆమె పర్యవేక్షణ విభాగంపై పూర్తిగా కొరవడిందని వైద్య నిపుణులు విమర్శిస్తున్నారు. దృష్టి సారిస్తాం ఫైలేరియా విభాగంలో జరుగుతున్న అవినీతి, నిర్లక్ష్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. సరెండర్ లీవు ఉద్యోగుల హక్కు. వారి నుంచి సొమ్ములు తీసుకోవడం బాధాకరం. దీనిపై విచారణ నిర్వహిస్తాం. అవుట్ పేషెంట్ విభాగం, ఉద్యోగులు, సిబ్బంది విధులపై కూడా దృష్టి కేంద్రీకరిస్తాం. రిజిస్టర్లు పరిశీలించి పనితీరు తనిఖీ చేస్తాం. - ఎం. పవన్‌కుమార్, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ -
వైద్యారోగ్య శాఖకు నిర్లక్ష్య రోగం
నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: జిల్లా వైద్యారోగ్యశాఖలో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. డీఎంహెచ్ఓ దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ఏడీఎంహెచ్‌ఓకు పూర్తి బాధ్యతలు అప్పగించలేదు. ఈ కారణంగా ఇన్చార్జి డీఎంహెచ్ఓ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. 300కు పైగా ఫైళ్లు పరిష్కారానికి ఎదురు చూస్తున్నాయి. వీటి గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ సుధాకర్ దీర్ఘకాలిక సెలవులో భాగంగా 23 రోజులుగా ఆయన విధులకు హాజరుకాలేదు. నాటి నుంచి ఏడీఎంహెచ్ఓ కోటేశ్వరికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. కాని పూర్తిస్థాయిలో బాధ్యతలు (ఎఫ్ఏసీ) ఇవ్వలేదు. దీంతో ఆమె ఇన్చార్జ్ డీఎంహెచ్‌ఓగానే కొనసాగుతున్నారు. దీంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. నిత్యం ప్రజలకు సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారి 15 రోజులకు పైగా సెలవు పెడితే ఇన్చార్జ్ అధికారికి ఎఫ్ఏసీ కల్పిస్తూ పూర్తి బాధ్యతలు అప్పగించాలి. కాని డీఎంహెచ్ఓ కార్యాలయంలో అలా జరగలేదు. ఈ కారణంగా డాక్టర్ కోటేశ్వరి కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఎఫ్ఏసీ ఇవ్వనప్పుడు తానేందుకు ఫైళ్లపై కీలక నిర్ణయాలను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఉన్నట్టు తెలిసింది. అలాగే డీఎంహెచ్ఓ కార్యాలయంలో కీలకమైన విభాగాల్లో అకౌంటెంట్ సెక్షన్ ఒకటి. ఈ విభాగంలో గత ఆరు నెలలుగా పర్యవేక్షకులు (సూపరింటెండెంట్) లేరు. ఈ విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన మధుసూదనమ్మ జూన్ 30న ఉద్యోగ విరమణ చేయడంతో ఈ సీటు ఖాళీ అయింది. గత నెల 23న గుంటూరు నుంచి ప్రకాష్‌బాబు అనే ఉద్యోగి పదోన్నతిపై సూపరింటెండెంట్‌గా డీఎంహెచ్ఓ కార్యాలయంలో నియమితులయ్యారు. ఈయనకు నేటికీ ఏ విభాగంలో కూడా సూపరింటెండెంట్ బాధ్యతలు కేటాయించలేదు. ప్రకాష్‌బాబు మాత్రం రోజూ డీఎంహెచ్ఓ కార్యాలయానికి వస్తూ పోతూ ఉన్నారు. అకౌంట్ సెక్షన్లో సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉన్నా సంబంధిత పోస్టుకు అర్హుడైన అధికారి ఉన్నప్పటికీ సీటును కేటాయించక పోవడం చూస్తే అధికారుల పనితీరు ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. డీఎంహెచ్ఓ లేని కారణంగా ఈ కార్యాలయంలో 300కు పైగా ఫైళ్లు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. ప్రధానంగా ఉద్యోగుల సరెండర్ లీవ్స్, మెడికల్ లీవ్స్, సర్వీసు మేటర్లకు సంబంధించిన ఫైళ్లతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన ఫైళ్ల సైతం నిలిచిపోయాయి. ఈ ఫైళ్లన్నీ అయ్యగారి సంతకం కోసం ఎదురు చూస్తున్నాయి. అలాగే కొందరి ఉద్యోగుల సర్వీస్ రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన ఫైళ్లు డీఎంహెచ్ఓ పరిశీలించి ప్రాంతీయ సంచాలకులు(రీజనల్ డెరైక్టర్) కార్యాలయానికి పంపించాల్సి ఉంది. ఈ ఫైళ్లు కూడా డీఎంహెచ్ఓ కార్యాలయంలో దుమ్ము పట్టాయి. ఎవరి ఇష్టం వారిదే..: డీఎంహెచ్ఓ సెలవులో ఉండటంతో ఆ కార్యాలయంలోని ఉద్యోగులంతా ఎవరి ఇష్టం వారిదే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తమ సొంత పనులు చూసుకుని తీరికగా కార్యాలయానికి రావడం, లేకుంటే అసలు రాకుండా ఉండటం జరుగుతోంది. డీఎంహెచ్ఓ కార్యాలయంలో కుష్టు, మలేరియా, ఇమ్యునైజేషన్, డెమో తదితర విభాగాలున్నాయి. ఆయా విభాగాల్లో పని చేసే ఉద్యోగులు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో ఎవ్వరికి తెలియడంలేదు. ఆయా పనులపై వచ్చిన వారు సంబంధిత ఉద్యోగులు లేకపోవడంతో ఉసూరుమంటూ తిరిగి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఇంతటి కీలకమైన జిల్లా వైద్యారోగ్యశాఖ విషయంలో జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
నకిలీ డాక్టర్ గుట్టు రట్టు
వరంగల్, న్యూస్‌లైన్ : ఎలాంటి విద్యార్హతలు లేకుండా రోగుల కు వైద్యం చేస్తున్న ఓ నకిలీ డాక్టర్‌ను వరంగల్ డీఎంహెచ్ఓ సాంబశివరావు బుధవారం పట్టుకున్నారు. అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుం చి ఎలాంటి అనుమతులు పొందకుండా నిర్వహిస్తున్న రెండు ప్రైవేట్ ఆస్పత్రులపై దా డులు నిర్వహించి వాటిని కూడా సీజ్ చేశారు. డీ ఎంహెచ్ఓ కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన హసన్‌భూపతి హన్మకొండ కాకాజీకాలనీలో కొన్నేళ్ల క్రితం శ్రీసాయి ఆస్పత్రిని ఏ ర్పాటు చేసుకుని ఎండోక్రైనాలజీ డీఎంగా చెలామణి అవుతున్నాడు. అయితే హసన్‌భూపతి నకిలీ వైద్యుడని, ఆయనపై విచారణ చేపట్టాల ని ఐఎంఏ, అప్నా సంఘాలు ఇటీవల డీ ఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశాయి. దీంతో ఆయన బుధవారం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయగా హసన్‌భూపతి వద్ద డీఎం ఎండోక్రైనాలజీకి సంబంధించిన ఎలాంటి అర్హత సర్టిఫికెట్లు లభించకపోవడంతో అతడిని నకిలీ డాక్టర్‌గా గుర్తించినట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. అలాగే ఆస్పత్రికి కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకపోవడంతో దానిని సీజ్ చేసినట్లు చెప్పారు. కాగా, ఇదే కాలనీలోని భవానీ ఆస్పత్రికి కూడా వైద్య ఆరోగ్యశాఖ నుంచి రిజిస్ట్రేషన్ లేకపోవడంతో దానిని కూడా సీజ్ చేసినట్లు చెప్పారు. అనంతరం డీఎంహెచ్ఓ సాంబశివరావు విలేకరుల తో మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా ఆస్పత్రులను నిర్వహిస్తున్నందుకు శ్రీసాయి, భవానీ ఆస్పత్రులను సీజ్‌చేసినట్లు చెప్పారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నకిలీ సర్టిఫికెట్ సృష్టించుకుని ఎండోక్రైనాలజీ డాక్టర్‌గా చెలామణి అవుతున్న హసన్‌భూపతిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రజలను మోసం చేస్తూ నకిలీ వైద్యం చేసే వారిపై కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌చందర్‌రెడ్డి, నాయకులు డాక్టర్ శేషుమాధవ్ పాల్గొన్నారు.