వైద్యశాఖకు అవినీతి జబ్బు | Nellore DHMO Care Of Corruption | Sakshi
Sakshi News home page

వైద్యశాఖకు అవినీతి జబ్బు

Published Thu, Jul 4 2019 10:05 AM | Last Updated on Thu, Jul 4 2019 10:05 AM

Nellore DHMO Care Of Corruption - Sakshi

సాక్షి, నెల్లూరు: అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రక్షాళన చేస్తున్నా ఆశించిన ఫలితాలు కానరావడంలేదు. వైద్యశాఖ అధికారులు, ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఇటీవల ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో స్పందించిన కలెక్టర్‌ శేషగిరిబాబు బాధ్యులైన ఉన్నతాధికారిపై వేటేశారు. డీఎంహెచ్‌ఓ వరసుందరాన్ని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు సరెండర్‌ చేశారు. ఓ వైపు ప్రక్షాళన చేస్తున్నా వైద్యశాఖ కార్యాలయంలో మార్పు రావడం లేదు. పనిచేసే వారికి పనిష్‌మెంట్లు ఇస్తూ, చేయని వారిని అందలమెక్కిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

రాజీనామా చేసిన మహిళకే పోస్ట్‌ ఇచ్చేందుకు యత్నం
ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తూ రాజీనామా చేసిన మహిళకే మరోసారి పోస్టింగ్‌ ఇచ్చేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాధికారులు యత్నాలు చేస్తున్నారు. 2010లో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం (జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌) ద్వారా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేసేందుకు స్టాఫ్‌నర్స్‌ల పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టారు. ఇందులో భాగంగా ముత్తుకూరు పీహెచ్‌సీలో స్టాఫ్‌నర్స్‌ పోస్ట్‌ కోసం ముగ్గురు మహిళలు దరఖాస్తు చేసుకోగా, అందులో అర్హత ఉన్న ఒకర్ని నియమించారు. అయితే సదరు మహిళ ఆర్నెల్ల పాటు సక్రమంగా విధులు నిర్వర్తించి ఆపై తరచూ విధులకు గైర్హాజరయ్యేవారు. ఇలా నాలుగేళ్ల పాటు కొనసాగింది. చివరికి సదరు మహిళ 2014లో రాజీనామా చేశారు. దీంతో అక్కడి పీహెచ్‌సీలో స్టాఫ్‌నర్స్‌ లేక ఇబ్బందులు నెలకొన్నాయి. విషయాన్ని గుర్తించిన అక్కడి పీహెచ్‌సీ వైద్యాధికారి, హెచ్‌డీఎస్‌ చైర్మన్‌ ముత్తుకూరు పీహెచ్‌సీలో స్టాఫ్‌నర్స్‌ను వెంటనే నియమించాలని జిల్లా అధికారులను కోరినా ఫలితం లేకుండాపోయింది.

ఇదే పోస్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ముగ్గురు మహిళల్లో అర్హత కలిగిన కామాక్షమ్మ ఖాళీ అయిన స్టాఫ్‌నర్స్‌ పోస్ట్‌ను తనకు ఇవ్వాలంటూ అధికారులకు విన్నవించుకున్నారు. వాస్తవానికి రోస్టర్‌ ప్రకారం కామాక్షమ్మనే నియమించాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కామాక్షమ్మకు పోస్ట్‌ ఇవ్వమని  తెగేసిచెప్పారు. రాజీనామా చేసిన స్టాఫ్‌ నర్స్‌ తిరిగి పోస్ట్‌ కోసం వైద్య ఆరోగ్య కార్యాలయంలో రూ.ఐదు లక్షల వరకు  ముట్టజెప్పారని సమాచారం. ఈ క్రమంలోనే డీఎంహెచ్‌ఓ కార్యాలయాధికారులు ముత్తుకూరు పీహెచ్‌సీ వైద్యాధికారిని రాజీనామా చేసిన స్టాఫ్‌నర్స్‌కు ఆరోగ్యం బాగొలేని కారణంగా సెలవు పెట్టిందని లెటర్‌ రాసివ్వాలని కోరగా, అందుకు ఆ వైద్యాధికారి ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల క్రితం పోస్ట్‌ ఇచ్చేందుకు డీఎంహెచ్‌ఓ కార్యాలయం వారు జేసీకి ఫైల్‌ పెట్టగా తిరస్కరించారు.

పనిచేసే వారికే శిక్ష
పనిచేసే వారికేమో పనిష్‌మెంట్లు.. చేయని వారినేమో అందలమెక్కించడం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాధికారుల తీరుగా మారింది. గండిపాళెం పీహెచ్‌సీలో రెండో ఏఎన్‌ఎంగా విధులు నిర్వరిస్తున్న జమ్మాయమ్మపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా అనవసరంగా అదే పీహెచ్‌సీకి సంబంధించిన ఎస్వీ చింతాల సబ్‌సెంటర్‌కు ఇటీవల బదిలీ చేశారు. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై అధికారులు దృష్టి సారిస్తే మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఆ శాఖలోని ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. పోస్టింగ్‌లు, డిప్యుటేషన్లు, ఉద్యోగుల సర్వీస్‌ మ్యాటర్లు, తదితర అంశాలకు సంబంధించిన ఫైళ్లను లోతుగా పరిశీలిస్తే అవినీతిపరుల భరతం పట్టే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

డిప్యుటేషన్ల రద్దు ఒట్టి మాటే
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి సంబంధించి అడ్డగోలుగా జరిగిన డిప్యుటేషన్లను రద్దు చేస్తున్నట్లు గత డీఎంహెచ్‌ఓ వరసుందరం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ముడుపులివ్వని కొందరి డిప్యుటేషన్లను మాత్రమే రద్దు చేశారు. ముడుపులిచ్చిన దాదాపు 25 మంది వారు కోరుకున్న స్థానాల్లో డిప్యుటేషన్‌పై ఇప్పటికీ కొనసాగుతున్నారు. వీరిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో దాదాపు 10 మందికిపైగా, బయట పీహెచ్‌సీల్లో 15 మంది వరకు కొనసాగుతున్నట్లు సమాచారం. ఉదయగిరిలో ఒకే పోస్ట్‌లో ఇద్దరు ఉద్యోగులను నియమించి పనిచేయిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement