ప్రత్తిపాడు సీహెచ్‌సీలో సురక్షితంగా ఫాతిమా ప్రసవించిన పసికందు
ఉద్యోగం అంటే టైమ్ టు టైమ్ జాబ్. అయితే రెవెన్యూ లాంటి కొన్ని శాఖల్లో అలా సమయపాలన కుదరదు. పని ఉంటే అహోరాత్రులూ పనిచేయాల్సి రావచ్చు. ముఖ్యంగా వైద్య శాఖలో గర్భిణి ప్రసవం కోసం వస్తే నా టైం అయిపోయిందని చేతులు దులుపుకొని వెళ్లిపోవడం మానవత్వం ఉన్న మనిషి చేసే పనికాదు. పెదనందిపాడు పీహెచ్‌సీలో ఇటువంటిదే ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.
గుంటూరు, ప్రత్తిపాడు: పెదనందిపాడు పీహెచ్‌సీ స్టాఫ్ నర్సులు గర్భవతులతో బంతాట ఆడుతున్నారు. స్టాఫ్ నర్సుల నిర్వాకానికి తోడు స్థానిక ఆరోగ్య సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో నిండు గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. అందుకు నిదర్శనమే ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన. వివరాల్లోకి వెళితే ఈనెల 25వ తేదీ సాయంత్రం సుమారు ఆరుగంటల సమయంలో మండల కేంద్రమైన పెదనందిపాడుకు చెందిన నిండు గర్భిణి ఫాతిమాకు నొప్పులు రావడంతో బంధువులు ఆమెను తీసుకుని అదే గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న స్టాఫ్‌నర్సు నా డ్యూటీ టైం అయిపోయిందని (సాయంత్రం ఆరుగంటలకే), తరువాత డ్యూటీకి వచ్చే స్టాఫ్‌నర్సుతో చేయించుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది.
ఫాతిమా బాధ చూడలేని ఆమె బంధువులు అలా అంటే ఎలాగమ్మా.. నీ తరువాత ఆమె ఎప్పుడు డ్యూటీకొస్తుందో.. ఎంత టైం అవుతుందో తెలియదు కదా, అప్పటిదాకా ఉంటే బిడ్డకు ఏమైనా అవుతుందేమో.. మీరు కాస్త జాలి చూపి కాన్పు చేయాలని బతిమాలారు. అయినా చలించని స్టాఫ్‌నర్సు నేను ఇప్పుడు చెయ్యను.. కావాలంటే మీరు ప్రత్తిపాడుకు పోండంటూ తేల్చిచెప్పింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో స్థానిక ఆశ కార్యకర్తను తీసుకుని వారు గర్భిణి ఫాతిమాను ఆటోలో ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. వాస్తవానికి స్టాఫ్‌నర్సులు రాత్రి ఎనిమిది గంటల సమయంలో డ్యూటీ రిలీవ్ అయి నైట్ డ్యూటీ వారికి చార్జ్ అప్పగిస్తారు. కానీ ఆరు గంటలకే నా డ్యూటీ టైం అయిపోయిందంటూ కాన్పు చేయకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం విమర్శలకు దారితీస్తోంది.
ఏఎన్‌ఎంకు ఫోన్ చేసినా...
ప్రత్తిపాడు సీహెచ్‌సీలో విధుల్లో ఉన్న స్టాఫ్ నర్సు గర్భవతి పరిస్థితిని చూసి వివరాలు తెలుసుకునేందుకు సంబంధిత గ్రామ ఏఎన్‌ఎంకు ఫోన్ చేశారు. వివరాలను అడిగి తెలుసుకున్న తరువాత ఫాతిమాకు మూడవ కాన్పు కావడంతో ప్రత్తిపాడు సీహెచ్‌సీకి వచ్చి కాన్పుకు సాయం అందించాలని స్టాఫ్ నర్సు ఏఎన్‌ఎంను కోరారు. అందుకు ఏఎన్‌ఎం విముఖత వ్యక్తం చేయడంతో స్టాఫ్ నర్సు విషయాన్ని సీహెచ్‌సీ గైనకాలజిస్ట్ ఇంద్రాణికి సమాచారం అందించారు. వెంటనే ఆమె ఆస్పత్రికి చేరుకుని కాన్పు చేశారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డా సురక్షితంగానే ఉన్నారని డాక్టర్ ఇంద్రాణి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment