అంగన్‌వాడీ.. సమస్యల వేడి | Pregnant Womans Problem Faced In Anganwadi Guntur | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ.. సమస్యల వేడి

Published Fri, Jun 8 2018 1:21 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Pregnant Womans Problem Faced In Anganwadi Guntur - Sakshi

అంగన్‌వాడీ కేంద్రంలో నేలపై కూర్చొని భోజనం చేస్తున్న గర్భిణులు (ఫైల్‌)

అంగన్‌వాడీలలో సమస్యల వేడి రగులుతోంది. కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలకు సౌకర్యాలలేమి స్వాగతం పలుకుతోంది. కేంద్రాలు నిర్వహించే కార్యకర్తలు, ఆయాలకు వేతనాల సమస్య వేధిస్తోంది. చాలీచాలని గదుల్లో అద్దెల దరువు వణికిస్తోంది. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో జోగుతోంది. పర్యవేక్షించాల్సిన అధికార గణం    నిర్లక్ష్యపు మత్తులో మునిగితేలుతోంది.

గుంటూరు(లక్ష్మీపురం): ఐసీడీఎస్‌లో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని మహిళలు వాపోతున్నారు.   ప్రభుత్వం 2017 జూలై 1వ తేదీన అన్ని జిల్లాలో అమ్మ అమృత హస్తం పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా జిల్లాలో 5 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం 2,14,562 మందికి అందిస్తున్నారు. వీరికి రోజుకు రూ.6 వెచ్చించింది. అనంతరం 2017 డిసెంబర్‌ నుంచి రూ. 8లకు పెంచింది. గర్భిణులకు 27,482 మంది బాలింతలకు 24,971 మందికి పౌష్టికాహారం అందజేస్తున్నారు. వీరికి రూ.17 ఒక్క రోజుకు ఖర్చు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 4405 అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. రూరల్‌ జిల్లాలో 834, అర్బన్‌లో 3571 సెంటర్లు నడుస్తున్నాయి. వాటితోపాటు మినీ సెంటర్లు 54 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 23 మంది సీడీపీవోలు, 16 మంది ఏసీడీపీవోలు పని చేస్తున్నారు.

నామమాత్రంగా వసతుల కల్పన
గ్రామీణ ప్రాంతాలలో గర్భిణులు పౌష్టికాహారం అందించేందుకుగాను వసతుల కల్పనకు గ్రామ పంచాయతీల నిధులలో రూ.5 వేలు ఖర్చు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే చాలా కేంద్రాల్లో వసతులు కల్పన మృగ్యంగా మారింది. దీంతో గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. అనేక చోట్ల కుర్చీలు లేక నేలపైనే ఆహారం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో వారు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆహారం తీసుకోవడం లేదు. 

అంగన్‌వాడీ టీచర్లకు ఇక్కట్లు
రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా అంగన్‌వాడీ సిబ్బందిని తరలిస్తున్నారు. సంబంధించి ప్రయాణ ఖర్చులుగానీ, భోజన వసతిగానీ కల్పించడం లేదు. మరో వైపు కేంద్రాలకు సకాలంలో అద్దెలు చెల్లించడం లేదు. దీంతో పాఠశాలల్లోని ఇరుకు గదుల్లోనే తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

అందని జీతాలు
అంగన్‌వాడీ కార్యకర్త, ఆయాలకు రెండు నెలలుగా వేతనాలు అందలేదు. దీంతో పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు కేంద్రం నిర్వహణకుగాను ముందుగానే వెచ్చించాల్సి ఉండడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

విధులు ఫుల్‌..
అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తలు గర్భిణులు, బాలింతలకు పోషక ఆహారం, ఆరోగ్య పరీక్షలు, సలహాలు సంప్రదింపులు, వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య విద్య, పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తారు. చిన్నారులకు సంరక్షణ, ఆటపాటలు, మద్యాహ్న భోజనం వంటి విధులు నిర్వర్తిస్తారు. కేంద్రాలలోని ఆయాలు వీరికి సహాయకులుగా ఉంటారు.

అమలుకాని మెనూ
గర్భిణులకు ప్రతి సోమవారం అన్నం, కూరగాయల సాంబారు, గుడ్డు కూర, పాలు, మంగళవారం..అన్నం, పప్పు, ఆకు కూర, గుడ్డు, పాలు, బుధవారం.. అన్నం, ఆకుకూరతో పప్పు, గుడ్డు, పాలు, గురువారం కూరగాయాలతో సాంబరు, గుడ్డు కూర, పాలు, శుక్రవారం.. అన్నం, పప్పు, ఆకు కూర, గుడ్డు, పాలు, శక్రవారం.. ఆకు కూరతో పప్పు, గుడ్డు, పాలు ప్రభుత్వం నిర్ణయించిన తూకం ప్రకారం అందించాలి. ఇదే తరహాలో ప్రీ స్కూల్‌ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేయాలి. కానీ ఎక్కువ కేంద్రాల్లో ఈ మెనూ అమలు కావడం లేదు. కేంద్రాలపై సూపర్‌వైజర్ల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం సక్రమంగా బిల్లులు అందించకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతోందని అంగన్‌వాడీ నిర్వాహకులు వాపోతున్నారు.

వసతులు కల్పిస్తున్నాం
జిల్లాలో అన్ని కేంద్రాలలో పంచాయతీ నిధులతో వసతులు కల్పిస్తున్నాం. అర్బన్‌ జిల్లాలోనూ 75 శాతం కేంద్రాలలో సౌకర్యాలు పెంచాం. మిగిలిన వాటిలోనూ గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. అంగన్‌ వాడీ కేంద్రాలలో గర్భిణులకు, బాలింతలు, చిన్నారులకు మెనూ ప్రకారం ఆహారం అందించాల్సిందే.   -శ్యామ్‌సుందరి,జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement