దగ్ధమైన కోడిగుడ్లను పరిశీలిస్తున్న జిల్లా అసిస్టెంట్ ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి మేరి భారతి తదితరులు
గుంటూరు, మాచర్ల: పట్టణంలోని అంగన్‌వాడీ సెంటర్లకు గుడ్లను సరఫరా చేసే నిల్వ కేంద్రం ఆదివారం దగ్ధమైంది. మంటల్లో అధికశాతం గుడ్లు దగ్ధమయ్యాయి. అధికార పార్టీకి చెందిన ఓ కాంట్రాక్టర్ మాచర్ల ఐసీడీఎస్ పరిధిలోని అన్ని అంగన్‌వాడీ సెంటర్లకు గుడ్లను సరఫరా చేస్తారు. అయితే ఆ తరువాత ఇదే కాంట్రాక్టర్ చాలా కేంద్రాలకు బార్‌కోడ్ ప్రకారం గుడ్లను మూడు రోజులుగా హడావుడిగా సరఫరా చేశారు. అందులో చాలా సెంటర్లకు ఈ దగ్ధమైన కేంద్రంలో పాక్షికంగా దెబ్బతిన్న గుడ్లను బాగున్న కేసులతో కలిపి సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఆయా అంగన్‌వాడీ సెంటర్ల వారు గుడ్లను తీసుకోవడానికి నిరాకరించడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. మాచర్ల, వెల్దుర్తి మండలాలలోని కేంద్రాలకు ఈ గుడ్లు సరఫరా అయినట్లు తెలుస్తోంది. స్థానిక ప్రాజెక్టు అధికారి కూడా ఈ విషయం పై స్పందించలేదని సమాచారం. ఈ గుడ్లు నిల్వ కేంద్రం దగ్ధమైనప్పుడు కరెంట్ సరఫరా లేదని తెలుస్తోంది. అటువంటప్పుడు ఏ విధంగా అగ్ని ప్రమాదం జరిగిందనే దానిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
జిల్లా అధికారుల తనిఖీ
మొత్తంగా ఈ వివాదం జిల్లా అధికారులకు చేరింది. వారు స్పందించి బుధవారం జిల్లా కేంద్రం నుంచి ఐసీడీఎస్ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి మేరి భారతిని విచారణ నిమిత్తం పంపారు. ఆమె వచ్చి మొదటగా గుంటూరు రోడ్డులోని కోడిగుడ్ల నిల్వ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఇందులో ఉన్న గుడ్లన్నీ బాగానే ఉన్నా.. పక్కనే మరో రూంలో దగ్ధమైన వాటిలో కొన్నింటిని వేరు చేసి నిల్వ ఉంచినట్లు తెలిసింది. ఈ రూంను మాత్రం ఆమెకు చూపించలేదు. దాన్ని కూడా తనిఖీ చేసి ఉంటే దగ్ధమైన గుడ్లు నిల్వ విషయం వెల్లడయ్యేది. దీనిపై మళ్లీ సమాచారం అదుకున్న జిల్లా అధికారి వెనక్కి తిరిగి వచ్చి సదరు కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసినట్లు తెలిసింది. తాళాలు తమ వద్ద లేదని చెప్పి తప్పించుకోగా, అధికారులు వారి కోసం కొంత సేపు వేచి చూసి వెళ్లి పోయారు. తూతూమంత్రంగా విచారణ కాకుండా అన్నికోణాల్లో విచారించినప్పుడే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు కూడా విషయాన్ని సీరియస్‌గా తీసుకుని అన్ని కోణాల్లో విచారించినప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment