సముద్రంలోకి వెళుతున్న ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సముద్ర తీరాలకు చేరుకుంటున్నాయి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ఈ జాతి తాబేళ్లను రక్షించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులు ఉన్నాయి. వీటిలో 5 రకాలు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఎక్కువ. రెండు అడుగుల వెడల్పు.. 50 కిలోల వరకూ బరువు పెరిగే ఈ తాబేలు ఎక్కడైతే గుడ్డు నుంచి పిల్లగా బయటకు వస్తుందో.. తిరిగి అక్కడికే వచ్చి గుడ్లు పెట్టడం ఈ జాతి ప్రత్యేకత.
ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు సుమారు 20 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి తీరానికి వస్తాయి. దేశంలోని ఒడిశా తీరంలో ఈ జాతి తాబేళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తరువాతి స్థానం ఆంధ్రప్రదేశ్‌దే. మన రాష్ట్రంలో కాకినాడ తీరంలోని ఉప్పాడ, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణా జిల్లాలోని కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకూ, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, బాపట్ల పరిధిలోని సూర్యలంక ప్రాంతం వరకు ఈ జాతి తాబేళ్లు ఎక్కువగా వస్తుంటాయి.
ఆడా.. మగా నిర్ధారించేది ఉష్ణోగ్రతలే
ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లు పెట్టి పిల్లగా మారడానికి 28 డిగ్రీల నుంచి 32 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. 30 నుంచి 32 డిగ్రీల మధ్య పుట్టిన తాబేలు ఆడ తాబేలు అవుతుంది. అంతకంటే తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలో పుట్టే పిల్లలు మగ తాబేళ్లు అవుతాయి. సృష్టిలో ఒక్క తాబేలు జాతికి మాత్రమే ఇలాంటి ప్రత్యేకత ఉంది. ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఏటా అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఫలదీకరణ కోసం వస్తుంటాయి.
డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో గుడ్లు పెడతాయి. ఇసుకలో 30 నుంచి 45 సెం.మీ. లోతున కుండాకారంలో గొయ్యి తీసి.. 60 నుంచి 120 వరకూ గుడ్లు పెడతాయి. గొయ్యి తీసేదగ్గర నుంచి గుడ్లు పెట్టడానికి 45 నిమిషాల నుంచి ఒక గంట సమయం తీసుకుంటుంది. ఈ గుడ్లు 45 నుంచి 50 రోజుల తరువాత పిల్లలు బయటకొస్తాయి. ఆలివ్ రిడ్లే తాబేళ్ల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది.
సముద్రంలో ఆక్సిజన్ శాతం పెంచేందుకు.. చేపల సంతానం వృద్ధి చెందేందుకు తాబేలు ఎంతగానో దోహదపడుతుంది. చేప పిల్లలను తిని జీవించే జెల్లీ చేపలను తాబేలు తినడం వల్ల చేపల ఉత్పత్తి పెరుగుతుంది. తాబేలు ఎంత లోతులో ఉన్నా ప్రతి 45 నిమిషాలకు ఒకసారి నీటిపైకి వచ్చి ఆక్సిజన్ తీసుకుని లోపలకు వెళుతుంటుంది. అవి నీటిలో పైకి, కిందకు రావడం వల్ల నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఈ విధంగా పర్యావరణానికి తాబేలు ఎంతో మేలు చేస్తుంది.
గుడ్డు పెడుతున్న తాబేలు, నాగాయలంక మండలం ఐలాండ్ వద్ద సముద్రంలోకి తాబేళ్లను వదులుతున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది
ప్రత్యేక హేచరీల ద్వారా రక్షణ
అరుదైన ఆలివ్ రిడ్లే జాతి తాబేలుని రక్షించేందుకు అటవీ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అవనిగడ్డ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద ఒకటి, నాగాయలంక మండలం లైట్‌హౌస్ శివారు ఐలాండ్ దగ్గర మూడు, సంగమేశ్వరం వద్ద ఒకటి, నిజాంపట్నం, సూర్యలంక వద్ద రెండు హేచరీలను ఏర్పాటు చేశారు. 2009 నుంచి ఇప్పటి వరకూ 5 లక్షల తాబేళ్లను సముద్రంలోకి వదిలారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ కృష్ణా జిల్లా పరిధిలో 12,624 గుడ్లను సేకరించినట్టు అధికారులు చెప్పారు.
తాబేళ్ల సంఖ్య పెరుగుతోంది
ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టే కాలంలో వాటి ప్రాణాలకు ముప్పు వాటిల్లే వలలు వేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై మత్స్యశాఖ అధికారులతో కలసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో కంటే గుడ్లు పెట్టేందుకు వచ్చే తాబేళ్ల సంఖ్య ఏటా పెరుగుతోంది.
– కేవీఎస్ రాఘవరావు, ఫారెస్ట్ అధికారి, అవనిగడ్డ రేంజ్
Comments
Please login to add a commentAdd a comment