సాక్షి ప్రతినిధి, విజయవాడ/అవనిగడ్డ: తొణక్కుండా తాపీగా నడిచే తాబేలు గుడ్లు పెట్టేందుకు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుందంటే ఎంత ఆశ్చర్యం? అదే ఆలివ్ రిడ్లే తాబేళ్ల ప్రత్యేకత. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీటి లింగ నిర్థారణ జరిగేది ఉష్టోగ్రత ఆధారంగానే. మత్స్య సంపదను పెంచడంతోపాటు సముద్రంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచడంలో వీటి పాత్ర ఎంతో కీలకం. అలాంటి విశిష్ట తాబేలు జాతి ఇప్పుడు ప్రమాదంలో ఉన్న జీవుల జాబితాలో చేరింది. ఆలివ్ రిడ్లే తాబేళ్లకు మనుషుల నుంచే ప్రధానంగా ముప్పు వాటిల్లుతోంది. ఈ అరుదైన జాతిని రక్షించేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాల అటవీ శాఖాధికారులు చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అంతరించి పోతున్న జాబితాలో ఉన్న ఆలివ్ రిడ్లే తాబేళ్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...
నాగాయలంక వద్ద సముద్రంలోకి తాబేళ్లను వదులుతున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది
ఒడిశా తరువాత ఇక్కడే..
అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులున్నాయి. వీటిలో ఐదు రకాలు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఎక్కువగా ఉన్నాయి. రెండు అడుగుల వెడల్పు, 50 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఒడిశాలో ఈ జాతి తాబేళ్లు ఎక్కువగా ఉండగా మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. కాకినాడ తీరంలోని ఉప్పాడ, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణా జిల్లా కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకూ, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, బాపట్ల పరిధిలోని సూర్యలంక ప్రాంతంలో ఈ తాబేళ్లు ఎక్కువగా కనిపిస్తాయి.
ఉష్ణోగ్రతను బట్టి లింగ నిర్ధారణ..
ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లు పెట్టి పిల్లగా మారడానికి 28 నుంచి 32 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత అవసరం. 30 నుంచి 32 డిగ్రీల మధ్య జన్మిస్తే ఆడ తాబేలు అవుతుంది. తక్కువ ఉష్ణోగ్రతలో మగ తాబేళ్లు జన్మిస్తాయి. సృష్టిలో ఒక్క ఆలివ్ రిడ్లే తాబేలు జాతికి మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది. ఆలివ్ రిడ్లే తాబేళ్ల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. సముద్రంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు, చేపలు వృద్ధి చెందేందుకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి. చేప పిల్లలను తిని జీవించే జెల్లీ చేపలను తాబేళ్లు ఆహారంగా తీసుకోవడం వల్ల చేపల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ తాబేలు ఎంత లోతులో ఉన్నా ప్రతి 45 నిముషాలకు ఒకసారి నీటిపైకి వచ్చి ఆక్సిజన్ తీసుకుని లోపలకు వెళుతుంటాయి. నీటిలో పైకి, కిందకు వెళ్లి రావడం వల్ల ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇలా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది.
ప్రత్యేక హేచరీల ద్వారా రక్షణ
అరుదైన ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్లను రక్షించేందుకు అటవీ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అవనిగడ్డ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద ఒకటి, నాగాయలంక మండలం లైట్‌హౌస్ శివారు ఐలాండ్ దగ్గర మూడు, సంగమేశ్వరం వద్ద ఒక హేచరీలను ఏర్పాటు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లా పరిధిలో ఇప్పటి వరకూ 4.62 లక్షల తాబేళ్లను సముద్రంలోకి వదిలినట్లు అటవీ శాఖాధికారులు తెలిపారు.
వలలే ఉరితాళ్లు..
చేపల ఉత్పత్తిని పెంచి మత్స్యకారులకు ఆదాయాన్ని తెచ్చి పెట్టే తాబేళ్లకు వలలే ఉరితాళ్లు అవుతున్నాయి. మరబోట్ల ద్వారా వేసే వలల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఎక్కువగా చిక్కుకుని మరణిస్తుంటాయి. ఈ వలలను లాగేందుకు మూడు గంటల సమయం పడుతుంది. వలలో చిక్కుకున్న తాబేలు పైకి రాలేక, ఆక్సిజన్ అందక మరణిస్తున్నాయి. మత్స్యకారులు ఉపయోగించే టేకు వలల్లోనూ తాబేళ్లు చిక్కుకుని చనిపోతుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment