పిఠాపురం(తూర్పుగోదావరి): అలసట లేని వలస జీవులవి. అలుపెరుగని ప్రయాణం వాటి జీవన శైలి. సైబీరియా పక్షుల మాదిరిగా కేవలం సంతానోత్పత్తి కోసమే వేల కిలోమీటర్లు ప్రయాణించి పుట్టింటికి వచ్చినట్టుగా ‘తూర్పు’ తీరానికి చేరుకుంటాయి. ఎన్నో విశేషాలకు నిలయమైన ఆ జీవులు ఆలివ్ రిడ్లే తాబేళ్లు. ప్రస్తుతం సంతానోత్పత్తి కాలం కావడంతో జిల్లాలోని సముద్ర తీరంలో సందడి చేస్తున్న ఈ తాబేళ్ల రక్షణకు అటవీ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
చదవండి: రూపాయికే దోసె.. ఎర్రకారం, బొంబాయి చట్నీ.. ఎక్కడో తెలుసా..?
అరుదైన ఉభయచర జీవుల్లో అనేక జాతుల తాబేళ్లున్నప్పటికీ ఆలివ్ రిడ్లే తాబేళ్లకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వీటికి స్థిర నివాసం అంటూ ఏదీ ఉండదు. రెండడుగుల పొడవు, సుమారు 500 కేజీల బరువు ఉండే ఈ తాబేళ్లు ఆహారాన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. వీటిల్లో 7 జాతులుండగా 5 జాతుల తాబేళ్లు జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుంచి లక్షలాదిగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తీరాలకు సముద్ర మార్గంలో వలస వస్తూంటాయి.
నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. అందుకే కాకినాడ సమీపంలోని ఉప్పాడ, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్య తీర ప్రాంతానికి ఈ తాబేళ్లు ఎక్కువగా వస్తూంటాయి. జీవనం అంతా సముద్రంలోనే అయినప్పటికీ కేవలం గుడ్లు పెట్టడానికి భూమి మీదకు వచ్చేవి ఆలివ్ రిడ్లే తాబేళ్లు మాత్రమే. వేల కిలోమీటర్లు వలస వచ్చి గుడ్లు పెట్టిన చోటనే తయారైన పిల్లలు.. తిరిగి పదేళ్ల తరువాత సంతానోత్పత్తి సమయంలో తిరిగి అదే చోటుకు వచ్చి గుడ్లు పెట్టడం విశేషం. ఈ విధంగా పుట్టిన చోటుకే వచ్చి, మళ్లీ అక్కడే గుడ్లు పెట్టేది ఒక్క సముద్ర తాబేలు మాత్రమే.
సాధారణంగా ఇవి జనవరి, ఫిబ్రవరి నెలల్లో గుడ్లు పెట్టేందుకు సుదూర ప్రాంతాల నుంచి ‘తూర్పు’ తీరానికి వేలాదిగా వస్తాయి. అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఆయా తీరాలకు చేరి, ఇసుకలో గోతులు తవ్విన, వాటిల్లో గుడ్లు పెట్టి, తిరిగి వాటిపై ఇసుక కప్పి, తల్లి తాబేళ్లు సముద్రంలోకి తిరిగి వెళ్లిపోతాయి. సుమారు నెల రోజుల అనంతరం ఈ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి.
ఒక్కో తాబేలు 50 నుంచి 150 వరకూ గుడ్లు పెడతాయి. 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు మగ తాబేళ్లుగాను, 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు ఆడ తాబేళ్లుగాను తయారవుతాయి. వెన్నెల రాత్రుల వేళ ఆ పిల్లలు కూడా వాటంతట అవే సముద్రంలోకి వెళ్లిపోవడం మరో విశేషం.
అన్నీ గండాలే
భారీ సైజులో ఉండే సముద్ర తాబేళ్లకు తీరంలో రక్షణ కరువవుతోంది. కుక్కలు, నక్కలు, ఇతర జంతువులు వీటి గుడ్లను తినేస్తుంటాయి. చివరకు కొన్ని మాత్రమే పిల్లలుగా తయారై వాటంతటవే సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. కొన్నిసార్లు ఆ పిల్లలను కూడా కొన్ని జంతువులు వేటాడి తినేస్తుంటాయి. ఇలా పుట్టినప్పటి నుంచీ సముద్ర తాబేళ్లకు ప్రాణసంకటంగానే ఉంటుంది. గుడ్లు పెట్టడానికి తీరానికి వచ్చిన తాబేళ్లు ఒక్కోసారి మత్స్యకారుల వలలకు చిక్కుతాయి. వాటిని జాగ్రత్తగా సముద్రంలో వదిలేయాల్సిన కొంతమంది విచక్షణారహితంగా వ్యవహరించడంతో అవి మృత్యువాత పడుతుంటాయి. రాత్రి సమయాల్లో గుడ్లు పొదిగేందుకు వచ్చిన తాబేళ్లను కూడా వివిధ జంతువులు వేటాడి చంపుతుంటాయి. ఈవిధంగా ఏటా ఉప్పాడ తీరంలో అనేక తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి.
ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాం
జనవరి, ఫిబ్రవరి నెలలు సముద్ర తాబేళ్లకు సంతానోత్పత్తి సమయం. దీంతో ఇక్కడకు వస్తున్న తాబేళ్లకు రక్షణ కల్పిస్తున్నాం. అవి సంచరించే ప్రాంతాన్ని సంరక్షణ ప్రాంతంగా నిర్ణయించి, బోర్డులు ఏర్పాటు చేసి, ప్రత్యేక కంచెలు ఏర్పాటు చేస్తున్నాం. అవి గుడ్లు పెట్టే ప్రాంతాల్లో జనసంచారం లేకుండా చూస్తున్నాం. గుడ్లు పొదిగి పిల్లలయ్యేంత వరకూ సుమారు 40 రోజుల పాటు రక్షణ వలయం ఏర్పాటు చేస్తున్నాం. తాబేళ్లను, వాటి గుడ్లను ఏ జంతువులూ తినకుండా రక్షణ కలి్పస్తున్నాం. తయారైన పిల్లలు సురక్షితంగా సముద్రంలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. తాళ్లరేవు సమీపంలోని కోరింగ అభయారణ్యం ప్రాంతానికి సుమారు లక్ష వరకూ తాబేళ్లు వచ్చే అవకాశాలున్నాయి. ఉప్పాడ, కాకినాడ తదితర ప్రాంతాల్లో కొన్ని పరిస్థితుల వల్ల బోట్లలో పడి కొన్ని తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. వాటి రక్షణకు చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.
– ఎస్.అశ్వనీకుమార్, అటవీ శాఖ సెక్షన్ అధికారి, కోరంగి
Comments
Please login to add a commentAdd a comment