ప్రభుత్వ స్థలంలో టీడీపీ నేతలు నిర్మించిన హోటల్
గుంటూరు, నవులూరు(మంగళగిరి): మండలంలోని నవులూరు అంగనవాడీ పోస్టుల విక్రయాలలో అధికార పార్టీ నాయకుల మధ్య విభేధాలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీ అండతో ఓ మాజీ రౌడీషీటర్ రోడ్డు పక్కన ఉన్న స్థలాన్ని ఆక్రమించి హోటల్ నిర్మించడంతోపాటు, చెరువు భూమి కబ్జాకు యత్నించాడు. ఆయనకు పోటీగా పార్టీకి చెందిన మరో ఇద్దరు గ్రామ పార్టీ నాయకులు నేరుగా లైబ్రరీకి చెందిన స్థలాన్ని ఆక్రమించి షెడ్డు నిర్మించారు. ఇలా తెలుగు తమ్ముళ్లు గ్రామంలో ఇస్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామానికి చెందిన మర్రి ఏసుబాబుకు టీడీపీలో సభ్యత్వంతోపాటు పార్టీ సహాయ కార్యదర్శి పదవి ఉంది. దీంతోపాటు అతనిపై పోలీస్ కేసులు ఉన్నాయి. అతని సోదరుడిపై గతంలో రౌడీ షీట్ నమోదైంది. టీడీపీ అధికారంలోకి రావడంతో గ్రామ పార్టీ అధ్యక్షుడి శిష్యులుగా మారిన ఇద్దరు సోదరులు స్థానిక ట్యాంక్ సెంటర్‌లో రోడ్డు పక్కనే ఉన్న విలువైన స్థలాన్ని ఆక్రమించి హోటల్ నిర్మించారు.
హోటల్ నిర్వహణతోపాటు అర్ధరాత్రి వరకు ఇక్కడ మద్యం సేవిస్తున్నారు.వారం రోజుల క్రితం గ్రామంలోని కోట్ల రూపాయల విలువ చేసేగంగానమ్మ చెరువు స్థలాన్ని రాత్రికి రాత్రి ఆక్రమించేందుకు ప్రయత్నించారు. చెట్లను కొట్టి చెరువు మట్టినే మెరకగా పోసేందుకు సన్నద్ధమయ్యారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజీ రౌడీషీటర్, రేషన్ దుకాణ నిర్వాహకుడు, వారికి సహకరించిన వారిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించిన డీఎస్పీ కౌన్సిలింగ్ ఇచ్చారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంటనే వెళ్లి వారికి వత్తాసు పలికారు. కురగల్లు గ్రామానికి చెందిన మహిళపై రేషన్ డీలర్ దాడి చేయగా మహిళ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు నమోదు కాలేదు. దీని వెనుక టీడీపీ గ్రామ అధ్యక్షుడు ఉన్నాడని సమాచారం. రేషన్ దుకాణం కేటాయింపుపై సీఎస్ డీటీ కళ్యాణినివివరణ కోరగా విచారణ చేస్తామని తెలిపారు. స్థల ఆక్రమణపై పంచాయతీ కార్యదర్శి అరుణ్‌కుమార్ వివరణ కోరగా హోటల్ ఏర్పాటు చేసిన స్థలం పంచాయతీది కాదని, ఆర్‌అండ్‌బీ శాఖదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment