
కేంద్రంలోకి వచ్చిన తాచుపాము
గుంటూరు , కృష్ణాయపాలెం(మంగళగిరి): మండలంలోని కృష్ణాయపాలెం గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం తాచుపాము కలకలం రేపింది. పిల్లలతో పాటు ఆయా, అంగన్‌వాడీ కార్యకర్త భయంతో బయటకు పరుగులు తీశారు. ఉదయాన్నే కేంద్రం తెరవగా అప్పటికే పాము గదిలో ఉంది. అయితే, ముందుగా ఎవరూ గుర్తించలేదు. కొద్ది సమయం తర్వాత పాము బుసలు వినిపిస్తుండడంతో అనుమానం వచ్చిన అంగన్‌వాడీ కార్యకర్త, ఆయాలు గది లోపల వెతికారు.
తాచుపాము బుసలుకొడతూ ఒక్కసారిగా బయటకు రావడంతో భయంతో వారు పిల్లలతో కలసి బయటకు పరుగులు పెట్టారు. దగ్గరలో ఉన్న గ్రామస్తులు కర్రలతో దాన్ని కొట్టి చంపారు. కేంద్రాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతం శుభ్రంగా లేకపోగా ముళ్లతుప్పలు, కంపచెట్లతో నిండి ఉండటంతో పాములు తిరుగుతున్నాయని, పిల్లలకు ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కేంద్రం చుట్టూ ముళ్లకంపలను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.