సాక్షి, గుంటూరు, విజయవాడ : వర్షా కాలం ఎక్కువగా సర్పాలు సంచరించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు తప్పనిసరిగా చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సర్పాలు వేడికి తల దాచుకోవటానికి అనేక ప్రాంతాలను నివాస స్థలాలుగా ఎంపిక చేసుకొంటాయి. పొలం గట్ల మీద, చెట్లు ఉన్న ప్రాంతాల కింద నక్కి ఉంటాయి. దీనికి తోడు అవి జనావాసాల్లోకి కూడా వస్తుంటాయి. పొలాల పక్కనే ఉన్న ఇళ్లతోపాటు ఇళ్లలో చిందరవందరగా సామాన్లు పడేసిన గదుల్లో తలదాచుకొంటాయి. కావున అప్రమత్తంగా ఉండి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవటంతోపాటు మదుగు లేకుండా చూసుకోవటం, రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు కర్ర చేతిలో ఉంచు కోవటం, వినికిడి శబ్దాలు చేసే పరికరాలు దగ్గర ఉంచుకోవటం చేయాలి. తల్లితండ్రులు తమ పిల్లల్ని కూడా గుట్టలు, పుట్టలు దగ్గర ఆటలాడనివ్వకుండా జాగ్రత్త వహించాలి. రైతులు పశువులను పాకల్లో కట్టేసి ఉంచినప్పుడు అక్కడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాముల్లో అన్నీ ప్రమాదకరమైనవి కావు విషపూరితమైన నాగుపాము, కట్లపాడు, రక్తపింజరి వంటి పాములతో జాగ్రత్తగా ఉండాలి. పాము కరిచిన వెంటనే స్నేక్ యాంటీ వీనమ్ తీసుకోవాలి.
నాగు పాము
మనకు కనిపించే పాముల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైనది నాగుపాము. దీని బారిన పడితే 15 నిమిషాల్లో విషం శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది మనిషి నాడీ వ్యవస్థ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. కరిచిన వెంటనే గాయాన్ని తొలగించి గట్టిగా వస్త్రాన్ని కరిచిన చోట కట్టాలి. వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలి.
కట్ల పాము
నాగుపాము విషం కంటే కట్లపాము విషం చాలా ప్రమాదకరమైనది. ఇది సామాన్యంగా కరవటం చాలా తక్కువ. ఇది కరిస్తే మాత్రం విషం వెంటనే శరీరంలోకి ప్రవేశిస్తుంది. రక్తం శరీరంలోకి ప్రవహించక మునుపే ఆసుపత్రికి వెళ్లి యాంటీ డోస్ ఇంజక్షన్ తీసుకోవాలి. తద్వారా వెంటనే తేరుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఎక్కువగా మదుగు ప్రాంతాల్లో ఉంటుంది.
రక్తపింజరి
ఇది కాటు వేయకుండా మనిషి శరీరాన్ని పట్టి రక్తం పీల్చేస్తుంది. ఇది మనుషులు ఉండే ప్రాంతాల కంటే పొలాల్లో, అటవీ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇది కరిచిన రెండు గంటలలోపు విషం శరీర భాగాల్లోకి చేరుతుంది. వెంటనే ప్రథమచికిత్స చేస్తే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. ఇది అత్యంత ప్రమాదకరమైన పాముల జాబితాలోకి వస్తుంది.
ఉల్లిపాము, జెర్రిపోతు
సహజంగా ఉల్లిపాము, జెర్రిపోతు, నీళ్లపాము పట్ల అంత కంగారు పడాల్సిన పని లేదు. ఉల్లిపాము కరిస్తే వంటి నిండా దద్దుర్లు వచ్చి కరచినచో చోట రెండింతలు వాపు వస్తుంది. ముందుగానే చికిత్స చేయిస్తే ఎటువంటి ప్రాణాపాయం ఉండదు.
పాము కాటు లక్షణాలు
సహజంగా కొన్ని పాములు అలా కుట్టి వదిలేస్తే మరి కొన్ని పాములు మాత్రం అలానే పట్టుకొని ఉంటాయి. అలా పట్టుకొని ఉన్నప్పుడు ఆ పాము శరీర భాగం కూడా కట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పాము కాటుకు గురైన వెంటనే మనిషి శరీరం చల్లగా మారిపోతుంది. చాతిలో విపరీతమైన నొప్పి రావటంతోపాటు ఆయాసం వస్తుంది. నోటి నుంచి నురగలు వస్తాయి. పాము కాటుకు గురైన వ్యక్తి భాగాన్ని పీల్చి కొంత మంది బయటకు వదులుతారు. కానీ అలా చేసేవారికి నోటిలో పంట్లు, పంటికి సంబంధించిన వ్యాధులు ఉంటే వారికి ప్రమాదమని గ్రహించాలి.
చికిత్స అందుబాటులో ఉంది
ప్రస్తుత పరిస్థితుల్లో పాముకాటుకు గురైన వ్యక్తికి చికిత్స అందుబాటులో ఉంది. వారికి కావాల్సిన మందులు ఇంజెక్షన్లు లభ్యమవుతున్నాయి. కావున ప్రజలు భయపడాల్సిన పని లేదు. కరిచిన వెంటనే ముందుగా గాయంపై భాగాన్ని వస్త్రంతో గట్టిగా లాగి కట్టి ఉంచాలి. వెంటనే దగ్గరలోని ఆసుపత్రిలో ప్రథమచికిత్స చేసి యాంటీ స్నేక్ వీనమ్ తీసుకోవాలి. గాయాన్ని బట్టి రెండు సార్లు డోస్ తీసుకొంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. పాము కాటుకు గురైన వ్యక్తి భయపడకుండా నిబ్బరంగా ఉండాలి.
– ఎన్ సూర్యనారాయణ, ప్రాథమిక ఆస్పత్రి వైద్యుడు, మేడికొండూరు.
Comments
Please login to add a commentAdd a comment