అఖిలాంధ్ర ప్రేక్షకుల ‘తేనె మనసులు’ను రంజింపజేసిన బుర్రిపాలెం బుల్లోడు ఇక లేరు. ‘కన్నెమనసులు’ దోచిన ఉమ్మడి గుంటూరు జిల్లా అందగాడు తెరమరుగయ్యారు. తెలుగు సినీ జగత్తులో ‘ఏకలవ్యు’డై అంచెలంచెలుగా ఎదిగి ‘నంబర్‌వన్’ స్థాయికి చేరిన ఘట్టమనేని ఘట్టం పరిసమాప్తమైంది. ప్రేక్షకుల హృదయ ‘సింహాసనం’పై చెరగని ముద్రవేసిన ‘మహామనిషి’ అమరుడై కళామ తల్లికి కడుపుకోత మిగిల్చారు. చరిత్రను తిరగరాసే సాహసాలకు ఎప్పుడూ ‘ముందడుగు’ వేసే ‘అసాధ్యుడు’ ‘ఈనాడు’ కానరాని లోకాలకు చేరారనే వార్త సగటు ప్రేక్షకుడి గుండెలను పిండేసింది. అఖిలాంధ్రలో ‘ప్రజారాజ్యం’ కోసం ‘అగ్నిపర్వతమై’ జ్వలించి ‘శంఖారావం’ పూరించిన అభినవ ‘అల్లూరి సీతారామ రాజు’ నటశేఖర సూపర్‌స్టార్ కృష్ణ రగిలించిన విషాదాగి్నతో స్వగ్రామం బుర్రిపాలెంతోపాటు ఉమ్మడి జిల్లా శోకసముద్రంలో మునిగింది. మహానటునితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమవుతోంది.
ఊరికి మొనగాడు
కృష్ణ సొంతూరు బుర్రిపాలెం వాసులకు కొండంత అండగా ఉండేవారు. ఊరికోసం ఆయన చాలా చేశారు. అందరికీ ఆప్తుడిగా నిలిచారు. అవకాశం ఉన్నపుడల్లా ఇక్కడకు వచ్చారు. హైదరాబాద్‌లోని ఇంటికి ఎవరు ఎప్పుడెళ్లినా చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించారు. భోజనం పెట్టి మరీ పంపేవారు. తమవాడు... ఆతీ్మయుడు అనుకున్న గొప్ప మనిషి.. ఇక లేడు.. అనుకుంటేనే
కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.
– ఇదీ బుర్రిపాలెం వాసుల అంతరంగం
కఠోర శ్రమ..
సినీ రంగంలో నిలదొక్కుకునేందుకు కఠోరంగా శ్రమించారు కృష్ణ. రోజుకు రెండు, మూడు షిఫ్టులు పనిచేశారు. ఏడాదికి డజను సినిమాల్లో నటించారు. 1972లో ఏకంగా 18 సినిమాలు రిలీజయ్యాయి. రకరకాల జోనర్లలో సినిమాలు తీశారు. మొత్తం 350 సినిమాల్లో నటించిన కృష్ణ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. భారతప్రభుత్వం ఆయన్ను ‘పద్మ భూషణ్’తో గౌరవించింది.
తెనాలి: సూపర్ స్టార్ కృష్ణ అస్తమయంతో ఉమ్మడి గుంటూరు జిల్లా దిగ్భ్రమకు గురైంది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని మననం చేసుకుంది. ఆయన ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలిసింది మొదలు కలత చెందింది. మరణ వార్త తెలిశాక కన్నీరుమున్నీరైంది. కడసారి చూపుకోసం ఇప్పటికే అధిక సంఖ్యలో అభిమానులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు.
ఇదీ కుటుంబ ప్రస్థానం
సూపర్‌స్టార్ కృష్ణ పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. ఆయన తల్లిండ్రులు నాగరత్నమ్మ, వీరరాఘవయ్య చౌదరి. రైతు కుటుంబం. వీరరాఘవయ్య చౌదరికి వ్యక్తిగతంగా నెమ్మదస్తుడని పేరు. ఆయన భార్య నాగరత్నమ్మ ధైర్యశాలి. అనుకున్నది సాధించాలన్న వ్యక్తిత్వం ఆమెది. అదే లక్షణం కృష్ణకూ వచ్చిందని బంధువులు చెబుతుంటారు. 1943 మే 5న జన్మించారు కృష్ణ. ఆయనకు ఇద్దరు సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు. ఇద్దరు సోదరీమణులు. బిడ్డల చదువు కోసమని కృష్ణ తల్లిదండ్రులు తెనాలికి మకాం మార్చారు. ఇక్కడి తాలూకా హైసూ్కలులో చదువుకున్న కృష్ణ అనంతరం కాలేజి చదువుల కోసం ఏలూరు వెళ్లారు. మకాం తెనాలికి మార్చకముందు స్నేహితులు కృష్ణబాబు, వెంకటప్పయ్యతో కలిసి రోజూ సైకిల్‌పై తెనాలి వచ్చి తాలూకా హైసూ్కలులో కృష్ణ చదువుకున్నారు. ప్రస్తుతం కడియాల వెంకటరమణ హాస్పిటల్ ఉన్న వీధిలో ఉండే ములుకుట్ల లక్ష్మీనారాయణ మాస్టారు ఇంటికి వచ్చి కృష్ణ ట్యూషన్ చెప్పించుకున్నారట. బీఎస్సీ పూర్తి చేసిన అనంతరం కృష్ణ సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
సినీరంగం వైపు తొలి అడుగులిలా..
మద్రాస్ వెళ్లి తెనాలికి చెందిన నటులు జగ్గయ్య, గుమ్మడి, సినీ నిర్మాత చక్రపాణిని కృష్ణ కలిశారు. వారి సూచనపై తిరిగొచ్చారు. గరికపాటి రాజారావు సహకారంతో ప్రజానాట్యమండలి నాటకాల్లో నటించారు. అందం, ఆకర్షణ కలిగిన కృష్ణను అచిరకాలంలోనే సినిమా అవకాశం వరించింది. దిగ్గజ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తీసిన ‘తేనె మనసులు’ సినిమాతో హీరో అయ్యారు. ఆ సినిమా కోసమని కృష్ణకు కొద్దిరోజులు శిక్షణనిచ్చారు ప్రసిద్ధ దర్శకుడు కె.విశ్వనాథ్.ఆ చిత్రానికి ఆయన సహాయ దర్శకుడు.
బుర్రిపాలెంను మరవని సూపర్‌స్టార్
జన్మస్థలి బుర్రిపాలెంను కృష్ణ మరువలేదు. తొలి చిత్రం తేనెమనసులు విడుదల రోజున సినిమాను స్థానిక రాజ్యం థియేటరులో బంధుమిత్రులతో కలిసి వీక్షించారు. చిన్ననాటి స్నేహితులనూ విస్మరించేవారు కాదు. తన సినిమాలు రిలీజైన మరుసటిరోజు బుర్రిపాలెం వచ్చి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునేవారు. ఎప్పుడు వచ్చినా విజయనిర్మలతో సహా వచ్చేవారు. నాగరత్నమ్మ నిర్మించిన గీతామందిరంలో స్వామి దర్శనం చేసుకునేవారు. గ్రామంలో బీఈడీ కాలేజీ శంకుస్థాపనకు, ఇంటర్నేషనల్ స్కూలు ప్రారంభానికి వచ్చారు. నాగరత్నమ్మ గ్రామ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. హైసూ్కలు అభివృద్ధికి కృషిచేశారు. దీనికి ఘట్టమనేని నాగరత్నమ్మ వీరరాఘవయ్య స్కూలు అని నామకరణం చేశారు.
స్వగ్రామంలో షూటింగులు
కృష్ణ స్వగ్రామంలో విజయనిర్మల దర్శకత్వం వహించిన ‘మీనా’ సినిమా షూటింగ్ జరిపారు. తన మేనమామ నర్రావుల సుబ్బయ్య∙మండువా ఇంటిలో చిత్రీకరించారు. పాడిపంటలు సినిమాలో ఎడ్ల జత కూడా బుర్రిపాలెంకు చెందిన పెమ్మసాని ధర్మయ్య, శివరామయ్యలవే. చిడతలు, పట్టీలు లేకుండా కాడిని వాటికవే వేసుకునే ఆ ఎడ్ల జతకు అప్పట్లో యమా క్రేజ్. ప్రజారాజ్యం, బుర్రిపాలెం బుల్లోడు, పచ్చని సంసారం సినిమాల్లో కొన్ని భాగాలను, ‘ఈనాడు’ సినిమాలో ఒక పాటలో కొంత ఇక్కడ తీశారు.
వివాహ జీవితం
కృష్ణ సతీమణి ఇందిరాదేవి. 1965లో వీరికి వివాహమైంది. భార్య స్వగ్రామం తెనాలి దగ్గర్లోని కంచర్లపాలెం. వీరికి రమేష్‌బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల సంతానం. సహచరి విజయనిర్మలతో కలిసి 40 సినిమాల్లో నటించారు కృష్ణ. పద్మాలయా బ్యానర్‌పై 16 సినిమాలు తీశారు. రాజీవ్‌గాంధీ ఆహ్వానంతో కాంగ్రెస్‌లో చేరిన కృష్ణ 1989లో ఏలూరు ఎంపీగా గెలుపొందారు. 2010 తర్వాత క్రమంగా సినిమాల నుంచి విశ్రాంతి తీసుకున్నారు. చివరిసారిగా 2016లో శ్రీశ్రీ సినిమాలో మరోసారి నటించారు. ఆయన కుమారుడు రమేష్ బాబు, భార్య ఇందిరాదేవి ఆరునెలల వ్యవధిలో మరణించటంతో కృష్ణ కుంగిపోయారు. అనారోగ్యానికి తోడు.. ఆప్తులను కోల్పోయిన దిగులు.. ఆయన్ను మరణానికి చేరువచేసిందనే భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది.
తెనాలి ప్రేక్షకుల అభిరుచిపై మంచి గురి
హీరో కృష్ణకు తెనాలి ప్రేక్షకుల అభిరుచిపై మంచి గురి ఉండేది. సినిమా విజయంపై ముందుగా తెనాలి ప్రేక్షకుల అభిప్రాయాన్నే ఆయన పరిగణనలోకి తీసుకునేవారు. 1991–92లో ‘పచ్చని సంసారం’ సినిమా షూటింగ్ బుర్రిపాలెంలో తీస్తున్నారు. ఒకరోజు కృష్ణ విలేకరుల సమావేశం పెట్టారు. ఆయన వేసిన తొలి ప్రశ్న ‘బృందావనం’ సినిమా ఎలా ఉంది? అని.. ఆ సినిమా అప్పటికి కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. తెనాలి పల్స్ తెలుసుకోవటానికి ఆయన అలా అడిగారు.
క్రేజీ స్టార్‌డమ్
∙జ్యోతిచిత్ర సినీ పత్రిక నిర్వహించిన బ్యాలెట్‌లో వరుసగా అయిదేళ్లు కృష్ణ సూపర్‌స్టార్‌గా ఎంపికయ్యారంటే ఆయన స్టారడమ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
అమ్మంటే ఎనలేని అనురాగం
సూపర్ స్టార్ కృష్ణకు తల్లి నాగరత్నమ్మ అంటే ఎంతో అపేక్ష. హెసూ్కలు విద్యను తెనాలిలో పూర్తిచేశాక కాలేజి చదువుల కోసం బుర్రిపాలెంలోని పొలాన్ని అమ్మి కృష్ణను ఏలూరుకు పంపారామె. కొడుకు ఇంజినీరు కావాలని ఆమె కలలు కనేది. కృష్ణకేమో సినిమాల్లో నటించాలని ఉండేది. బీఎస్సీ పూర్తయ్యాక ‘నేను ఇంజినీరు అవను.. సినిమాల్లోకి వెళతాను’ అనగానే ‘అలాగే నువ్వు తప్పకుండా హీరో అవుతావు’ అని ఆశీర్వదించి పంపారట ఆమె. అనుకున్నట్టే కొడుకు హీరో కావటంతో ఎంతో పొంగిపోయారు ఆమె. ‘ఉన్న ఊళ్లో పొలం అమ్ముకున్నాం.. ఎప్పుడైనా బుర్రిపాలెంలో పొలం కొనాలి’ అన్న అమ్మ కోరిక ప్రకారం కృష్ణ ఊళ్లో పొలం కొన్నారు.
బుర్రిపాలెం వచ్చినపుడు ఇక్కడ ఉండేందుకని పాత ఇంటిని రీమోడల్ చేయించారామే. అంతేకాదు. తన పేరుమీద ఏదైనా సినిమా తీయమని అమ్మ కోరిన ప్రకారం ఆమె పేరిట ‘రత్నా మూవీస్’ పతాకంతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. సోదరుల సహకారంతో ‘ప్రజారాజ్యం’ తీశారు కృష్ణ. తన ముగ్గురు కొడుకుల పేరు మీద ఒక సినిమా తీయాలనీ సంకలి్పంచారామె. ఆమె కోరిక తీర్చాలనే తపనతో కృష్ణ, తన ఇద్దరు కొడుకులు రమేష్, మహేశ్‌బాబుతో కలిసి అన్నదమ్ములుగా నటిస్తూ ‘ముగ్గురు కొడుకులు’ సినిమా తీసి అమ్మ కోరిక నెరవేర్చారు. ఆ సినిమా కూడా విజయం సాధించటం తనకెంతో సంతోషమని కృష్ణ చెప్పేవారు.
Comments
Please login to add a commentAdd a comment