rainy season problems
-
Hyderabad: వానలకే కాదు.. ఇక అధికారులు సైతం వణికే పరిస్థితులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో వానలంటేనే ప్రజలు వణికే పరిస్థితి. అది నిన్నటి వరకు. ఇప్పుడిక అధికారులు సైతం వణికే పరిస్థితులేర్పడ్డాయి. గత రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులతోపాటు ప్రాణాపాయాలు కూడా చోటు చేసుకోవడంతో సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే ఇంజినీర్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపునే అన్ని మ్యాన్‌హోళ్లకు మూతలు సక్రమంగా ఉండటం దగ్గరనుంచి నాలాల పనులు జరుగుతున్న ప్రాంతాల్లో తగిన హెచ్చరికలు, సైనేజీలు, రాత్రుళ్లు లైటింగ్ వంటివి ఉండాలని స్పష్టం చేసింది. పనుల పూర్తికి జూన్ 5 వరకు గడువునిచ్చింది. గడువులోగా పనులు చేయని వారికి షోకాజ్ నోటీసులు సైతం ఉంటాయని హెచ్చరించింది. అయినప్పటికీ ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో అవి అమలు కాలేదు. మరోవైపు రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాల సందర్భంగా నాలాలు ప్రమాదకరంగా ఉండకుండా తగిన చర్యల కోసం రూ. 298 కోట్లు మంజూరు చేసింది. ఏడాది క్రితం వరద సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఎస్ఎన్డీపీ వింగ్‌ను ఏర్పాటు చేయడంతోపాటు పనులు చేసేందుకు దాదాపు రూ. 985 కోట్లు మంజూరు చేసింది. వీటితో పాటు ఇతరత్రా పనుల కోసం మరికొన్ని నిధులు మంజూరు చేసింది. అయినప్పటికీ ఏవీ పూర్తికాలేదు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో తగిన రక్షణ ఏర్పాట్లు సైతం లేవు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 18 మంది ఇంజినీర్లకు మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. మెమోలు జారీ అయిన వారిలో మ్యాన్‌హోళ్లకు మూతలు వేయడం వంటి పనులు కూడా పూర్తిచేయని వారున్నారు. నాలాల వద్ద పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రక్షణ ఏర్పాట్లు పట్టించుకోని వారికి సైతం మెమోలు జారీ అయినట్లు తెలిసింది. పనుల్లో నిర్లక్ష్యం, అశ్రద్ధ కనిపిస్తే చర్యలు తప్పవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మరిన్ని తనిఖీలు చేసి నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఇక నిరంతర ప్రక్రియగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం వర్షాకాలం ప్రారంభమయ్యేలోపునే రెండు మీటర్ల వరకు వెడల్పున్న నాలాలకు పై కప్పులు, అంతకంటే ఎక్కువ వెడల్పున్నవాటికి కంచె తదితరమైన భద్రత ఏర్పాట్లు పూర్తి కావాల్సి ఉండగా నేటికీ పూర్తికాలేదు.ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఎస్ఈలతో సహా ఇంజినీర్లను గట్టిగా హెచ్చరించారు. పనులు పూర్తికాకపోవడానికి పలు కారణాలున్నప్పటికీ, ఎప్పుడు ఎవరికి ముప్పు ముంచుకొస్తుందోనని ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు. -
వానలొస్తున్నాయ్.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
తొలకరి చినుకులకు ప్రకతి పులకరింపు సహజం. ఇదే సమయంలో అణగారిఉన్న సూక్ష్మజీవులు జీవం పోసుకొని విజృంభించడం కూడా సహజమే!వర్షాలు పడడం స్టార్టయిందంటే చిన్నా పెద్దా అని తేడా లేకుండా జలుబు నుంచి టైఫాయిడ్ వరకుఏదో ఒక అనారోగ్యం కలగడం సర్వసాధారణం. వానాకాలం ఆరంభంతో అప్పటివరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కమారుగా చల్లబడటం, ఈ క్లైమేట్ ఛేంజ్‌తో ఇమ్యూనిటీ దెబ్బతినడం జరుగుతుంది. దీంతో పలు రకాల వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి రకరకాల రోగాలు... వర్షాకాలం సర్వసాధారణంగా దాదాపు ప్రతి ఒక్కరూ బాధపడేది జలుబుతోనే! ఇది వైరల్ ఇన్ఫెక్షన్లలో అత్యంత కామన్ ఇన్ఫెక్షన్. ఈ జలుబు కొంతమందిలో క్రమంగా ఫ్లూ, నిమోనియా తదితర వ్యాధుల్లోకి దిగుతుంటుంది. వర్షాలు పడడంతో దోమల ప్రత్యుత్పత్తి వేగం పుంజుకుంటుంది. దీంతో వీటి జనాభా తీవ్రంగా పెరుగుతుంది. వీటి కారణంగా మలేరియా, డెంగ్యూలాంటి వ్యాధులు ప్రబలుతాయి. ∙వానలతో గ్రౌండ్‌వాటర్‌లో, ఉపరితల నీటివనరుల్లో రసాయన మార్పులు జరుగుతాయి. ఇవి నీటిలో బాక్టీరియా ఉధృతికి దోహదం చేస్తాయి. ఇలాంటి కలుషిత జలాలతో కలరా, టైఫాయిడ్, హెపటైటిస్‌లాంటి రోగాలు విజృంభిస్తాయి. కొత్తనీరు, పాతనీరు కలయికతో పెరిగే ఫంగస్ కారణంగా కొన్నిరకాల చర్మరోగాలు కలుగుతాయి. చదవండి: బ్లాక్ ఫంగస్ పనిపట్టే ఔషధాలు ఇవే వర్షాకాలం కరోనా ఎలా మారుతుంది? వేడి వేడి వేసవిలోనే ప్రపంచంపై ప్రతాపం చూపిన కరోనా మహమ్మారి, వానలు పడ్డాక మరింత చెలరేగుతుందని సామాన్య ప్రజల్లో చాలా భయం నెలకొంది. కానీ ఇందుకు సరైన ఆధారాల్లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది సైతం వర్షాకాలంలో కరోనా విజృంభణ చాలావరకు తగ్గింది. నిజానికి వర్షాకాలంలో కరోనా కన్నా సీజనల్ వ్యాధులే ఎక్కువ డేంజరని చెబుతున్నారు. వీటికి కరోనా జతకలిస్తే మరింత ప్రమాదమని, అందువల్ల సీజనల్ వ్యాధులను అరికడితే కరోనా ఆట కూడా కొంతమేర కట్టించవచ్చని సూచిస్తున్నారు. వర్షాలతో ఉపరితలాలపై ఉన్న కరోనా వైరస్ డిపాజిట్లు కొట్టుకుపోతాయని కొందరు నిపుణుల అంచనా. అయితే ఇది పూర్తిగా నిజం కాదని, కరోనాను వర్షాలు కొంతమేర డైల్యూట్ చేయగలవు కానీ పూర్తి గా తొలగించలేవని డెలావర్ ఎపిడమాలజీ డిపార్ట్మెంట్ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. వైరస్ సంగతేమో కానీ వాననీటితో బాక్టీరియా పెరుగుతుందని, ఇది కొత్త రోగాలను తెస్తుందని చెప్పారు. వర్షాలతో కరోనా విజృంభిస్తుందని చెప్పలేమని, సీజనల్ వ్యాధులతో కలిసి కరోనా మరింత కలకలం సృష్టిస్తుందని, అందువల్ల తగు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో కలిగే చిన్నపాటి శారీరక ఇబ్బందులకు వంటింటి చిట్కావైద్యాలు బాగా పనిచేస్తాయి. ఉదాహరణకు మిరియాలు పాలు, పసుపు నీళ్ల ఆవిరి లాంటివి. సో... తగిన ముందు జాగ్రత్తలు తీసుకొంటే వానాకాలం రాగానే వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవడం ఈజీనే! ఏం చేయాలి... ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.. అంటే చికిత్స కన్నా నివారణే మేలు! వర్షాకాలంలో వచ్చే జబ్బులబారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరగడం కన్నా ముందే మేలుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఈ సీజన్లో సప్తసూత్రాలు పాటిస్తే చాలావరకు రైనీ సీజన్ రోగాలకు చెక్ పెట్టవచ్చు. ► ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం. బాగా ఉడికించిన ఆహారాన్ని, వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ►దాహం లేకున్నా వీలయినంత ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. అదికూడా ఫిల్టర్ చేసిన లేదా కాచి చల్లార్చిన నీళ్లను తీసుకోవాలి. ►వానలో తడిసేటప్పుడు మాత్రమే సరదాగా ఉంటుంది, తర్వాత వచ్చేరోగాలతో సరదా తీరిపోతుందని గ్రహించి సాధ్యమైనంత వరకు వానలో తడవకుండా జాగ్రత్త పడాలి. ►ఇంటిలోపల, చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు, ఈగలు ముసిరే వాతావరణం కల్పించకూడదు. ►ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు మస్క్యుటో రిపల్లెంట్స్ వాడాలి. లేదంటే కనీసం ఇంట్లో వేపాకు పొగ పెట్టైనా దోమలను తరిమేయాలి. ►చలిగా ఉందని బద్దకించకుండా రోజూ రెండుపూట్లా శుభ్రంగా స్నానం చేయాలి. లేదంటే చర్మరోగాలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుంది. ►చేతులతో ముక్కు, కళ్లు, నోరును సాధ్యమైనంతవరకు టచ్ చేయకుండా జాగ్రత్త పడాలి. -
వానాకాలం... బండి భద్రం!
బొల్లారం: అసలే ఇది వర్షాకాలం... మన ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో.. మన జీవనంలో భాగమై, కోరుకున్న గమ్యానికి మనల్ని చేర్చే వాహనాల విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వాహన రంగ నిపుణులు. బండే కదా పోనిద్దూ.. అనుకుని వర్షంలో తడిసేలా ఎక్కడబడితే అక్కడ నిలిపితే వ్యయప్రయాసలు తప్పవంటున్నారు. విడి భాగాలు దెబ్బతింటే.. వాహనాలను చాలామంది రోడ్లపై, వీధుల్లో, ఇళ్లమధ్య సందుల్లో, పార్కులు, చెట్ల కింద ఎక్కువగా నిలుపుతుంటారు. వర్షాల సమయంలో తగి న రక్షణ లేనందున కొద్దిరోజులకే అవి మొరాయిస్తుంటాయి. దాంతో మెకానిక్‌ల వద్దకు తీసుకెళ్తే వర్షంలో తడిసి, కొన్ని విడిభాగాలు దెబ్బతిన్నా యని, వాటిని వెంటనే మార్చాలని చెబుతారు. వాటి ధరలూ ఎక్కువగానే ఉంటున్నాయి. ఆదే విధంగా ద్విచక్ర వాహనం ఇంజిన్ వేడికి స్పార్క్ ప్లగ్పై ఉన్న ప్లాస్టిక్ భాగానికి చిన్నపాటి పగుళ్లు ఏర్పడినా, కరెంటు వైరింగ్ కిట్టులో అతుకులు ఎక్కువగా ఉన్నా వాహనాలు తడిసిన సమయంలో ఇబ్బందులు తప్పవు. అరిగిపోయిన తాళాలను వినియోగించడం సరికాదు. బండి సీటు కవరు సరిగా లేకపోతే వర్షపు నీరు ఫిల్టర్‌లోకి వెళ్తుంది. వర్షాకాలం వచ్చేసరికి స్పార్క్ ప్లగ్, వైరింగ్ కిట్టు, సీటు కవరు వంటివి పరిశీలించుకోవాలి. నాణ్యతతో కూడిన అసలు విడిభాగాలనే వాడాలి. తడిస్తే ఇలా చేయాలి.. వానలో బండి తడిస్తే దానిని బాగా తుడిచి కనీసం అరగంటసేపు ఎండలో ఆరబెట్టాలి. చాలా మంది బండి తడిసిందికదా.. అని అదే పనిగా కిక్ కొడుతూ కిందకూ పైకి కదిలిస్తుంటారు. దీనివల్ల వాహనంలోని సున్నిత భాగాలు, తీగలు, క్లిప్పులు ఊడిపోయి మరో సమస్య తలెత్తవచ్చు. స్పీడో మీటరు, డిజిటల్ మీటర్లోకి నీరు చేరకుండా ఎప్పటి కప్పుడు కవర్లు కప్పుతుండాలి. అసలు విడిభాగాలను వాడాలి. – వెంకటేశ్వర్లు, బైక్ మెకానిక్, తిరుమలగిరి తడిస్తే ఇలా చేయాలి.. వానలో బండి తడిస్తే దానిని బాగా తుడిచి కనీసం అరగంటసేపు ఎండలో ఆరబెట్టాలి. చాలా మంది బండి తడిసిందికదా.. అని అదే పనిగా కిక్ కొడుతూ కిందకూ పైకి కదిలిస్తుంటారు. దీనివల్ల వాహనంలోని సున్నిత భాగాలు, తీగలు, క్లిప్పులు ఊడిపోయి మరో సమస్య తలెత్తవచ్చు. స్పీడో మీటరు, డిజిటల్ మీటర్లోకి నీరు చేరకుండా ఎప్పటి కప్పుడు కవర్లు కప్పుతుండాలి. అసలు విడిభాగాలను వాడాలి. – వెంకటేశ్వర్లు, బైక్ మెకానిక్, తిరుమలగిరి లోపాలు గుర్తించండిలా... ♦ వాహనం వానలో తడిస్తే ముందుగా ఎక్సలేటర్ పైపుల ద్వారా కార్బేటర్లోకినీరు చేరుతుంది. దాంతో స్టార్టింగ్ సమస్యలు తలెత్తుతాయి. ♦ స్విచ్‌ల్లో నీరు చేరితే... హెడ్ లైట్లు, హారన్, స్టార్టింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతాయి. ♦ బ్రేక్ డ్రమ్‌లోకి నీరు వెళితే బ్రేకులు సరిగా పడవు. దాంతో బండి నియంత్రణ మన చేతిలో ఉండదు. ♦ బ్యాటరీలో నీరు చేరితే హారన్,స్టార్టింగ్ సమస్యలు అధికంగా ఉంటాయి. ♦ వర్షంలో ప్రయాణించేటప్పుడు టైర్ల అరుగుదలతో జారిపడే ప్రమాదం ఉంటుంది. ♦ స్టార్టింగ్ కాయిల్, స్పార్క్ ప్లగ్, కార్బేటర్లో నీరు చేరినా బండి మొరాయిస్తుంది. ♦ ఒక్కోసారి సైలెన్సర్లోకి నీరు వెళ్లినా బండి స్టార్ట్ కాదు. ♦ పెట్రోలు ట్యాంకుపై కవరు ఉంచడం మంచిది. లేకపోతే నీరు ట్యాంకులోకి చేరే అవకాశం ఉం ది. ఇది మరీ ప్రమాదమని గుర్తుంచుకోవాలి. ♦ నీరు చేరి ఎలక్ట్రిక్ వైర్లు తుప్పుపట్టి పాడవుతాయి. ♦ వెనక చక్రం డ్రమ్‌లోకి నీరు చేరితేబండి ఎంతకూ కదలకపోవచ్చు. -
బుసకొడుతున్నాయ్ జాగ్రత్త!
సాక్షి, గుంటూరు, విజయవాడ : వర్షా కాలం ఎక్కువగా సర్పాలు సంచరించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు తప్పనిసరిగా చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సర్పాలు వేడికి తల దాచుకోవటానికి అనేక ప్రాంతాలను నివాస స్థలాలుగా ఎంపిక చేసుకొంటాయి. పొలం గట్ల మీద, చెట్లు ఉన్న ప్రాంతాల కింద నక్కి ఉంటాయి. దీనికి తోడు అవి జనావాసాల్లోకి కూడా వస్తుంటాయి. పొలాల పక్కనే ఉన్న ఇళ్లతోపాటు ఇళ్లలో చిందరవందరగా సామాన్లు పడేసిన గదుల్లో తలదాచుకొంటాయి. కావున అప్రమత్తంగా ఉండి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవటంతోపాటు మదుగు లేకుండా చూసుకోవటం, రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు కర్ర చేతిలో ఉంచు కోవటం, వినికిడి శబ్దాలు చేసే పరికరాలు దగ్గర ఉంచుకోవటం చేయాలి. తల్లితండ్రులు తమ పిల్లల్ని కూడా గుట్టలు, పుట్టలు దగ్గర ఆటలాడనివ్వకుండా జాగ్రత్త వహించాలి. రైతులు పశువులను పాకల్లో కట్టేసి ఉంచినప్పుడు అక్కడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాముల్లో అన్నీ ప్రమాదకరమైనవి కావు విషపూరితమైన నాగుపాము, కట్లపాడు, రక్తపింజరి వంటి పాములతో జాగ్రత్తగా ఉండాలి. పాము కరిచిన వెంటనే స్నేక్ యాంటీ వీనమ్ తీసుకోవాలి. నాగు పాము మనకు కనిపించే పాముల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైనది నాగుపాము. దీని బారిన పడితే 15 నిమిషాల్లో విషం శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది మనిషి నాడీ వ్యవస్థ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. కరిచిన వెంటనే గాయాన్ని తొలగించి గట్టిగా వస్త్రాన్ని కరిచిన చోట కట్టాలి. వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలి. కట్ల పాము నాగుపాము విషం కంటే కట్లపాము విషం చాలా ప్రమాదకరమైనది. ఇది సామాన్యంగా కరవటం చాలా తక్కువ. ఇది కరిస్తే మాత్రం విషం వెంటనే శరీరంలోకి ప్రవేశిస్తుంది. రక్తం శరీరంలోకి ప్రవహించక మునుపే ఆసుపత్రికి వెళ్లి యాంటీ డోస్ ఇంజక్షన్ తీసుకోవాలి. తద్వారా వెంటనే తేరుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఎక్కువగా మదుగు ప్రాంతాల్లో ఉంటుంది. రక్తపింజరి ఇది కాటు వేయకుండా మనిషి శరీరాన్ని పట్టి రక్తం పీల్చేస్తుంది. ఇది మనుషులు ఉండే ప్రాంతాల కంటే పొలాల్లో, అటవీ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇది కరిచిన రెండు గంటలలోపు విషం శరీర భాగాల్లోకి చేరుతుంది. వెంటనే ప్రథమచికిత్స చేస్తే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. ఇది అత్యంత ప్రమాదకరమైన పాముల జాబితాలోకి వస్తుంది. ఉల్లిపాము, జెర్రిపోతు సహజంగా ఉల్లిపాము, జెర్రిపోతు, నీళ్లపాము పట్ల అంత కంగారు పడాల్సిన పని లేదు. ఉల్లిపాము కరిస్తే వంటి నిండా దద్దుర్లు వచ్చి కరచినచో చోట రెండింతలు వాపు వస్తుంది. ముందుగానే చికిత్స చేయిస్తే ఎటువంటి ప్రాణాపాయం ఉండదు. పాము కాటు లక్షణాలు సహజంగా కొన్ని పాములు అలా కుట్టి వదిలేస్తే మరి కొన్ని పాములు మాత్రం అలానే పట్టుకొని ఉంటాయి. అలా పట్టుకొని ఉన్నప్పుడు ఆ పాము శరీర భాగం కూడా కట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పాము కాటుకు గురైన వెంటనే మనిషి శరీరం చల్లగా మారిపోతుంది. చాతిలో విపరీతమైన నొప్పి రావటంతోపాటు ఆయాసం వస్తుంది. నోటి నుంచి నురగలు వస్తాయి. పాము కాటుకు గురైన వ్యక్తి భాగాన్ని పీల్చి కొంత మంది బయటకు వదులుతారు. కానీ అలా చేసేవారికి నోటిలో పంట్లు, పంటికి సంబంధించిన వ్యాధులు ఉంటే వారికి ప్రమాదమని గ్రహించాలి. చికిత్స అందుబాటులో ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో పాముకాటుకు గురైన వ్యక్తికి చికిత్స అందుబాటులో ఉంది. వారికి కావాల్సిన మందులు ఇంజెక్షన్లు లభ్యమవుతున్నాయి. కావున ప్రజలు భయపడాల్సిన పని లేదు. కరిచిన వెంటనే ముందుగా గాయంపై భాగాన్ని వస్త్రంతో గట్టిగా లాగి కట్టి ఉంచాలి. వెంటనే దగ్గరలోని ఆసుపత్రిలో ప్రథమచికిత్స చేసి యాంటీ స్నేక్ వీనమ్ తీసుకోవాలి. గాయాన్ని బట్టి రెండు సార్లు డోస్ తీసుకొంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. పాము కాటుకు గురైన వ్యక్తి భయపడకుండా నిబ్బరంగా ఉండాలి. – ఎన్ సూర్యనారాయణ, ప్రాథమిక ఆస్పత్రి వైద్యుడు, మేడికొండూరు. -
ఆపదొస్తే ఆగమే!
సాక్షి,సిటీబ్యూరో : భారీ వర్షాలు, వరదలు, అగ్నిప్రమాదాలు, భారీ భవంతులు కూలి పోవడం వంటి విపత్తులు సంభవిస్తే తక్షణమే స్పందించే ‘విపత్తు నివారణ వ్యవస్థ’ నగరంలో అధ్వానంగా మారింది. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి నగరంలోని పలు ప్రాంతాలు నీటమునుగుతూనే ఉన్నాయి. జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రెండేళ్ల క్రితం బండారీ లేఅవుట్.. గతేడాది రామంతాపూర్ ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా నీటమునిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వర్షాకాలంలో మళ్లీ ఏప్రాంతాలు నీటమునుగుతాయోనని నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవంగా నగరంలో వరదనీరు సాఫీగా వెళ్లేందుకు సరైన వ్యవస్థ లేదు. నాలాలు భారీగా ఆక్రమణలకు గురయ్యాయి. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారాయి. ఈ కారణాల వల్లే భారీ వర్షం కురిస్తే వరద నీరు వెళ్లే దారిలేక ఇళ్లను ముంచెత్తుతోంది. విశ్వనగరంలో గంటకో సెంటీమీటరు చొప్పున వర్షం కురిస్తే 24 గంటల్లో మహానగరం నీట మునగడం తథ్యమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో సుమారు 234 నీట మునిగే(వాటర్‌లాగింగ్) ప్రాంతాలు, సుమారు 300 బస్తీలు తరచూ నీటమునుగతున్నట్లు బల్దియా లెక్కలు వేసినా..నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ నివాసం ఉండే రాజ్‌భవన్, అసెంబ్లీ, అమీర్‌పేట్ మైత్రీవనం, ఖైరతాబాద్ తదితర ప్రధాన ప్రాంతాలు నీటమునిగే జాబితాలో ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. వరదనీరు సాఫీగా వెళ్లేందుకు తగిన ప్రణాళిక కానీ, చేసిన పనులు కానీ లేవంటే అతిశయోక్తి కాదు. 2016 సెప్టెంబర్ నెలలో మహానగరంలో ఒకే రోజు సుమారు 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నిజాంపేట్ పరిధిలోని బండారీ లేఅవుట్ సహా పదికిపైగా కాలనీలు నీటమునిగాయి. వందలాది బస్తీల్లో ఇళ్లలోకి నీరుచేరింది. వారం రోజులపాటు ప్రధాన రహదారులు మోకాళ్లలోతున వరదనీరు నిలిచి అధ్వాన్నంగా మారాయి. ఏడాది గడిచినా ఈ దుస్థితిలో ఎలాంటి మార్పురాకపోవడం గ్రేటర్ దుస్థితికి అద్దం పడుతోంది. కాగితాలపైనే కిర్లోస్కర్ నివేదిక.. నగరంలో వరదనీటి కాలువల అధ్యయనం..విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై గతంలోనే కిర్లోస్కర్ కన్సల్టెంట్స్‌కు బాధ్యత అప్పగించారు. 2003లో నివేదిక నందించిన కిర్లోస్కర్ కమిటీ వరదనీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను అభివృద్ధి చేయాలని సూచించింది. అందుకు దాదాపు రూ. 264 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. పాత ఎంసీహెచ్ పరిధిలోని 170 చ.కి.మీ. ఉన్న నగరంలో మేజర్ నాలాల అభివృద్ధికోసం కిర్లోస్కర్ కమిటీ ఈ నివేదిక రూపొందించగా, మైక్రోలెవల్ వరకు వరదనీటి నిర్వహణకు మాస్టర్‌ప్లాన్ రూపొందించాల్సిందిగా అధికారులు 2006లో కిర్లోస్కర్ కమిటీకి సూచించారు. 2007 ఏప్రిల్‌లో నగర శివార్లలోని 12 మున్సిపాలిటీల విలీనంతో గ్రేటర్ హైదరాబాద్‌గా ఏర్పటయ్యాక విస్తీర్ణం 625 చ.కి.మీలకు పెరిగింది. దీంతో గ్రేటర్ మొత్తానికీ ‘సమగ్ర మాస్టర్‌ప్లాన్.. సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల నెట్వర్క్ప్లాన్ ..మేజర్, మైనర్ వరదకాలువల ఆధునీకరణకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) బాధ్యతను ఓయంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. దాని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్లో వరదనీటి సమస్య పరిష్కారానికి రూ. 6247 కోట్లు అవసరమవుతాయి. ఈ నిధులతో మేజర్ నాలాలను ప్రక్షాళన చేయాలి. ఆక్రమణలు నిరోధించాలి. సుమారు 390 కి.మీ మేర విస్తరించిన ప్రధాన నాలాలకు ఆనుకొని ఉన్న సుమారు 9 వేల ఆక్రమ నిర్మాణాలను తొలగించాలి. కానీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగానే ఉంది. మెట్రో నగరాల్లో విపత్తు స్పందన భేష్.. ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా మెట్రో నగరాల్లో విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆయా ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాటు చేసిన విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) అందుబాటులో ఉంది. ఇందులో ఆయా నగరపాలక సంస్థలు, జలబోర్డులు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. విపత్తు నిర్వహణ విభాగానికి ప్రత్యేక కార్యాలయం, ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తారు. విపత్తు సంభవించిన ప్రతిసారీ సంస్థ సభ్యులు ఆయా విభాగాలను అప్రమత్తం చేయడంతోపాటు సుశిక్షితులైన సిబ్బంది సహకారంతో సహాయక చర్యలు చేపడతారు. వీరికి అవసరమైన సాధనాసంపత్తి అందుబాటులో ఉంది. ఏదేని భవంతి నేలమట్టమయిన వెంటనే విపత్తు స్పందనా దళం సభ్యులు నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడతారు. విపత్తును ఇలా ఎదుర్కొంటేనే మేలు.... నగరంలో జీహెచ్ఎంసీ, జలమండలి, రెవెన్యూ, పోలీసు, వాతావరణశాఖ, అగ్నిమాపక శాఖ, హెచ్ఎండీఏల సమన్వయంతో విపత్తు స్పందనా దళం ఏర్పాటు చేయాలి. నగర భౌగోళిక పరిస్థితిపై విపత్తు స్పందన దళానికి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇందుకు సంబంధించిన మ్యాప్‌లు వారి వద్ద సిద్ధంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు రాకముందే మాక్‌డ్రిల్ చేసిన అనుభవం బృందానికి ఉండాలి. విపత్తు స్పందన దళానికి ప్రత్యేక కార్యాలయం ఉండాలి. గ్యాస్‌కట్టర్లు, రెస్క్యూల్యాడర్లు, ప్రొక్లెయిన్లు, ఫైరింజన్లు, క్రేన్లు, అగ్నినిరోధక దుస్తులు, ఆక్సిజన్ సిలిండర్లు, ఫస్ట్ఎయిడ్కిట్లు, అంబులెన్స్ తదితరాలు సొంతంగా ఉండేలా చూడాలి. నగరంలోని పురాతన భవనాల్లో ఉన్న సూక్ష్మ పగుళ్లు, భవనాల నాణ్యత, మన్నికను గుర్తించేందుకు బార్క్(బాబా ఆటమిక్ రీసెర్చ్‌సెంటర్)సిద్ధంచేసిన రేడియోధార్మిక టెక్నాలజీని వినియోగించాలి. నగరంలోని అన్ని నాలాలు, లోతట్టు ప్రాంతాలకు జీఐఎస్ పరిజ్ఞానం ద్వారా గుర్తించి మ్యాపులు సిద్ధంచేయాలి. లోతట్టు ప్రాంతాల్లో ఆటోమేటిక్ రెయిన్‌గేజ్ యంత్రాలు ఏర్పాటుచేయాలి. వర్షాకాలానికి ముందే వరదనీటి కాల్వలు, నాలాలు, భూగర్భ డ్రైనేజి లైన్లను పూడిక తీయాలి. వరద ముప్పున్న ప్రాంతాల్లో అత్యవసర మోటార్లు ఏర్పాటుచేసి నీటిని తోడాలి. ఇళ్లలోకి నీరు ప్రవేశించకుండా చూడాలి. ప్రతి నాలాకు రక్షణ వలయం, నాలాకు ఆనుకొని ఉన్న బస్తీలకు రక్షణ గోడను, ఇసుకబస్తాలను ఏర్పాటుచేసి రక్షణ కల్పించాలి. నాలాలు, చెరువులు, కుంటల ఆక్రమణలను పూర్తిగా తొలగించాలి. -
ఆశాజనకంగా ఖరీఫ్
పాలమూరు, న్యూస్‌లైన్: నాలుగేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొని కరువులో కొట్టుమిట్టాడుతున్న పాలమూరు జిల్లాపై ఈ ఏడాది వరుణుడు కరుణ చూపాడు. జిల్లాలో ఈ ఖరీఫ్ ఆశాజనకంగా కనిపిస్తోంది. ఇటీవల విస్తారంగా వర్షాలు కురియడంతో 93.9 శాతం విస్తీర్ణంలో పంటసాగు పూర్తయినట్లు తెలుస్తోంది. 7,07,850 హెక్టార్ల మేర పంటసాగు చేపట్టనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనావేయగా.. ఇప్పటికే 6,64,690 హెక్టార్లలో వివిధ పంటల సాగు పూర్తయ్యింది. పత్తి, కంది, చెరకు, మొక్కజొన్న, ఉల్లి పంటలు అంచనాలకు మించి సాగు చేయగా, వరిపంట సాగు మాత్రం సగమే పూర్తయింది. జూన్ ప్రారంభం నుంచే నుంచే వర్షాలు పడుతుండటంతో పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో భూగర్భజలాలు కూడా గణనీయంగా పెరిగాయని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సాగుచేసిన పత్తి, మొక్క జొన్న, పప్పు దినుసులు, తదితర ఆరుతడి పంటలు పెరుగుతుండగా.. జిల్లాలోని అధిక మండలాల్లో వరినాట్లు మరింత వేగం పుంజుకుని ముమ్మరంగా సాగవుతున్నాయి. జిల్లాలో వరి 51,255లక్షల హెక్టార్ల మేర సాగయినట్లు సమాచారం. గత ఏడాది వర్షాలు సరిగా కురియకపోవడం, భూగర్భజలాలు అడుగంటిపోవడం, దీనికితోడు విద్యుత్‌కోతల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైతులు ఎక్కువగా మెట్ట పంటలపైనే ఆసక్తి చూపారు. అయితే ఇప్పటివరకు కురిసిన వర్షాల వల్ల ఎలాంటి నష్టం లేకపోయినా మున్ముందు ఇదేవిధంగా వానలు కొనసాగితే నల్లరేగడి ప్రాంతాల్లోని పత్తి, మొక్కజొన్న తదితర మెట్ట పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. తేమ అధికంగా ఉన్న నేపథ్యంలో యూరియా, కాంప్లెక్స్ ఎరువుల కోసం రైతులు ఎగబడుతున్నారు. వర్షపాతం ఇలా.. జిల్లాలో జూన్ సాధారణ వర్షపాతం 71.2 మిల్లీమీటర్లు కాగా, 12 శాతం అధికంగా 80 మి.మీ వర్షం కురిసింది. జులైలో సాధారణ వర్షపాతం 146.6 మి.మీ కాగా 139.4 మి.మీ వర్షం నమోదైంది. ఈ నెలలో ఇప్పటివరకు 34.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏదేమైనా నాలుగేళ్ల తర్వాత జూన్‌లో వర్షాలు కురవడం ప్రారంభమై కొనసాగుతూ వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
వానా కాలంలోనూ కన్నీటి కష్టాలు
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో తాగునీటికీ అవస్థలు పడాల్సి వస్తోంది. భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు, చేతిపంపులలో నీళ్లు రావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్య మరీ జఠిలంగా మారింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యి గ్రామా ల్లో నీటి ఎద్దడి నెలకొంది. అత్యంత సమస్యాత్మకంగా మారిన 330 గ్రామాలకు ఇప్పటికీ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలమైనా నీటి ఎద్దడి తప్పడం లేదని, ఇలాంటి పరిస్థితిని తొలిసారి చూస్తున్నామని గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు తెలిపారు. ఏటా ఫిబ్రవరి నుంచి మే నెలాఖరు వరకు మాత్రమే తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ట్యాంకర్లతో గానీ, వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకొని గానీ తాగునీటిని సరఫరా చేసేవారు. ఈ ఏడాది మాత్రం వర్షాకాలం ప్రారంభమై దాదాపు రెండున్నర నెలలు కావస్తున్నా తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి వరుణుడు మొహం చాటేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. భూగర్భజలాలు వేసవిలో కంటే అట్టడుగు స్థాయికి పడిపోయాయి. నెలాఖరులోగా వర్షం కురవకపోతే నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా జూన్ లో 63.9 మిల్లీమీటర్ల (మి.మీ) వర్షం కురవాలి. అయితే.. 47.1 మి.మీ మాత్రమే పడింది. అలాగే జూలైలో 67 మి.మీకి గాను 10 మి.మీలోపే కురిసింది. ఈ నెలలో ఇప్పటిదాకా వర్షం కురవలేదు. దీంతో నీటి వనరులపై దెబ్బ పడింది. భూగర్భజలాలు 20 మీటర్లకు పడిపోయినట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతేడాది కంటే మూడు నుంచి నాలుగు మీటర్ల లోతుకు పడిపోయాయి. తాగునీటికి సంబంధించిన దాదాపు 4,500 బోర్లు ఎండిపోయాయి. ఈ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు పీఏబీఆర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్) నుంచి కూడా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మొన్నటి వరకూ పీఏబీఆర్‌లో నీరు అడుగంటడంతో అధికారులు ఆందోళన చెందారు. అయితే పదిరోజుల నుంచి పీఏబీఆర్‌కు తుంగభద్ర జలాశయం నుంచి నీరు వస్తుండడంతో కాస్త ఊరట క లిగింది. సీబీఆర్‌కు కూడా ఈ నెలాఖరులో నీరు విడుదల చేసే అవకాశముంది. ఈ ఏడాది హెచ్చెల్సీ కోటాలో 8.5 టీఎంసీలు తాగునీటి కోసం కేటాయిస్తున్నారు. గతేడాది కంటే 0.5 టీఎంసీ అదనంగా కేటాయిస్తున్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు కొనసాగితే తాగునీటి కేటాయింపులు మరింత పెంచాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఉపశమనం ఏదీ? ఈ ఏడాది వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.31 కోట్లు, ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో ప్రత్యేకంగా నీటి సమస్యను పరిష్కరించడానికి సబ్‌ప్లాన్ కింద రూ.40 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అయితే.. ఇప్పటివరకూ రూ.4.80 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. 65 గ్రామాలకు నీటిని సరఫరా చేయడానికి స్థానికంగా ఉన్న రైతుల వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకోవడానికి, మరో 119 గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ బోర్లను కడిగేందుకు(ప్లషింగ్), ఎండిపోయిన 209 బోర్లను మరింత లోతుకు వేసేందుకు ఈ నిధులను ఖర్చు చేసినట్లు సమాచారం. కాగా... అధికారులు పంపిన నివేదికలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు చెప్పిన ప్రజాప్రతినిధులు... మిగులు నిధులు తీసుకురావడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పటికే ట్యాంకర్లతో నీటి సరఫరాకు సంబంధించి రూ.లక్షల్లో బకాయిలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. ప్రస్తుతం 330 గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నాం. ఒకసారైనా భారీ వర్షం కురిస్తే తప్పా నీటి సమస్య తీరదు. -ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రభాకర్‌రావు