అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో తాగునీటికీ అవస్థలు పడాల్సి వస్తోంది. భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు, చేతిపంపులలో నీళ్లు రావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్య మరీ జఠిలంగా మారింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యి గ్రామా ల్లో నీటి ఎద్దడి నెలకొంది. అత్యంత సమస్యాత్మకంగా మారిన 330 గ్రామాలకు ఇప్పటికీ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలమైనా నీటి ఎద్దడి తప్పడం లేదని, ఇలాంటి పరిస్థితిని తొలిసారి చూస్తున్నామని గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులు తెలిపారు.
ఏటా ఫిబ్రవరి నుంచి మే నెలాఖరు వరకు మాత్రమే తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమయంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ట్యాంకర్లతో గానీ, వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకొని గానీ తాగునీటిని సరఫరా చేసేవారు.
ఈ ఏడాది మాత్రం వర్షాకాలం ప్రారంభమై దాదాపు రెండున్నర నెలలు కావస్తున్నా తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి వరుణుడు మొహం చాటేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. భూగర్భజలాలు వేసవిలో కంటే అట్టడుగు స్థాయికి పడిపోయాయి. నెలాఖరులోగా వర్షం కురవకపోతే నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా జూన్ లో 63.9 మిల్లీమీటర్ల (మి.మీ) వర్షం కురవాలి. అయితే.. 47.1 మి.మీ మాత్రమే పడింది. అలాగే జూలైలో 67 మి.మీకి గాను 10 మి.మీలోపే కురిసింది. ఈ నెలలో ఇప్పటిదాకా వర్షం కురవలేదు. దీంతో నీటి వనరులపై దెబ్బ పడింది. భూగర్భజలాలు 20 మీటర్లకు పడిపోయినట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతేడాది కంటే మూడు నుంచి నాలుగు మీటర్ల లోతుకు పడిపోయాయి. తాగునీటికి సంబంధించిన దాదాపు 4,500 బోర్లు ఎండిపోయాయి. ఈ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు పీఏబీఆర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్) నుంచి కూడా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
మొన్నటి వరకూ పీఏబీఆర్‌లో నీరు అడుగంటడంతో అధికారులు ఆందోళన చెందారు. అయితే పదిరోజుల నుంచి పీఏబీఆర్‌కు తుంగభద్ర జలాశయం నుంచి నీరు వస్తుండడంతో కాస్త ఊరట క లిగింది. సీబీఆర్‌కు కూడా ఈ నెలాఖరులో నీరు విడుదల చేసే అవకాశముంది. ఈ ఏడాది హెచ్చెల్సీ కోటాలో 8.5 టీఎంసీలు తాగునీటి కోసం కేటాయిస్తున్నారు. గతేడాది కంటే 0.5 టీఎంసీ అదనంగా కేటాయిస్తున్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు కొనసాగితే తాగునీటి కేటాయింపులు మరింత పెంచాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఉపశమనం ఏదీ?
ఈ ఏడాది వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.31 కోట్లు, ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో ప్రత్యేకంగా నీటి సమస్యను పరిష్కరించడానికి సబ్‌ప్లాన్ కింద రూ.40 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అయితే.. ఇప్పటివరకూ రూ.4.80 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. 65 గ్రామాలకు నీటిని సరఫరా చేయడానికి స్థానికంగా ఉన్న రైతుల వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకోవడానికి, మరో 119 గ్రామాల్లో ఆర్‌డబ్ల్యూఎస్ బోర్లను కడిగేందుకు(ప్లషింగ్), ఎండిపోయిన 209 బోర్లను మరింత లోతుకు వేసేందుకు ఈ నిధులను ఖర్చు చేసినట్లు సమాచారం.
కాగా... అధికారులు పంపిన నివేదికలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు చెప్పిన ప్రజాప్రతినిధులు... మిగులు నిధులు తీసుకురావడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పటికే ట్యాంకర్లతో నీటి సరఫరాకు సంబంధించి రూ.లక్షల్లో బకాయిలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది.
ఎన్నడూ ఇలాంటి పరిస్థితి
ఎదురుకాలేదు
గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. ప్రస్తుతం 330 గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నాం. ఒకసారైనా భారీ వర్షం కురిస్తే తప్పా నీటి సమస్య తీరదు.
-ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ప్రభాకర్‌రావు
వానా కాలంలోనూ కన్నీటి కష్టాలు
Published Sun, Aug 11 2013 2:31 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
Advertisement