water difficulties
-
ది అడ్వాన్స్డ్ ఆక్సిడేషన్ టెక్నాలజీ.. తక్కువ ఖర్చుతో నీరు పునర్వినియోగం
నీటి కొరత పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా నీటి పునర్వినియోగం అవసరం అంతకంతకు పెరుగుతూ వస్తోంది. వ్యర్థజలాలను శుద్ధిచేసి, పునర్వినియోగానికి అనువుగా మార్చే పద్ధతులు కొన్ని అందుబాటులోకి వచ్చినా, అవి ఖర్చుతో కూడుకున్నవి కావడంతో పెద్దపెద్ద పరిశ్రమలు మాత్రమే వాటిని భరించగలుగుతున్నాయి. ఇప్పుడు ఎంత చిన్న పరిశ్రమ అయినా సులువుగా భరించగలిగేలా, తక్కువ ఖర్చుతో వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని అందిస్తోంది ‘టడాక్స్’ (ది అడ్వాన్స్డ్ ఆక్సిడేషన్ టెక్నాలజీ). ఈ పద్ధతిని న్యూఢిల్లీకి చెందిన ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. కేవలం యూవీ–ఫొటో కాటాలిసిస్ సాంకేతికత ఉపయోగించి మునిసిపల్, మురుగునీరు, కలుషిత పారిశ్రామిక నీటి ప్రవాహాలను శుద్ధి చేసి, పునర్వినియోగానికి తగిన విధంగా మంచినీటిని అందిస్తుంది. అంతేకాదు, ఈ అధునాతన సాంకేతికత పారిశ్రామిక మురుగునీటి శుద్ధికి జరిగే మూలధన వ్యయాన్ని 25 నుంచి 30 శాతం, నిర్వాహణ వ్యయాన్ని 30 నుంచి 40 శాతం వరకు తగ్గిస్తుంది. ఎలా పనిచేస్తుంది? టడాక్స్ మూడు దశల్లో పనిచేస్తుంది. మొదటి దశలో యూవీ ఫొటో క్యాటాలిసిన్ పద్ధతి ఉపయోగించి కాంతిని రసాయనికశక్తిగా మారుస్తుంది. రెండో దశలో అధునాతన ఆక్సీకరణ ప్రక్రియ ఉంటుంది. ఇది ఆక్సీకరణ క్షీణత, కాలుష్య కారకాల ఖనిజీకరణ చేసి, బయో–డీగ్రేడబిలిటీని మెరుగుపరుస్తుంది, పొరల బయో ఫౌలింగ్ను నివారిస్తుంది. దీంతో నీటిలోని ఘన మలినాలను పీల్చుకుని వడగొట్టే ఆర్ఓ (రివర్స్ అస్మాసిస్)ల జీవితకాలం, సామర్థ్యం పెరుగుతుంది. అలాగే మల్టిఫుల్ ఎఫెక్ట్ ఎవాపరేటర్లు, మెకానికల్ ఆవిరి రీకంప్రెషన్లపై భారాన్ని పెంచి, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ), బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ), వ్యాధికారకాలు, నిరంతర జీవ కాలుష్య కారకాలు, సూక్ష్మ కాలుష్య కారకాలను తగ్గిస్తుంది. తృతీయ దశలో నాణ్యత స్థాయిని గుర్తించి, పునర్వినియోగానికి అనువైన పరిశుభ్రమైన నీటిని అందిస్తుంది. త్వరలోనే అమలు.. టడాక్స్ను ప్రభుత్వ జలవనరుల మంత్రిత్వ శాఖ ‘నమామి గంగే’ కార్యక్రమం కింద కొన్ని ఎంపిక చేసిన పరిశ్రమల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ఇది 2021 ఏప్రిల్‌లోనే ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్లు, టెక్నాలజీ అండ్ ట్రేడ్ మార్క్ లైసెన్స్ ఒప్పందం ద్వారా వాణిజ్యీకరణకు సిద్ధమైంది. త్వరలోనే ఇది పూర్తి స్థాయి కార్యాచరణలోకి రావచ్చు. ∙దీపిక కొండి -
సాగు కాదు.. తాగు అవసరాలకే!
సాక్షి, హైదరాబాద్: తీవ్ర నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతున్న తమిళనాడు తాగునీటి అవసరాలను తీర్చే దిశగా లోతైన అధ్యయనం చేసి సమస్యకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గోదావరి బేసిన్లో రాష్ట్ర తాగు, సాగు అవసరాలు తీరాక, వృథాగా సముద్రంలోకి వెళ్తున్న నీటిలో నుంచే కొంత నీటిని తమిళనాడు తాగునీటి అవసరాలకు ఇవ్వాలని తెలంగాణ సూత్రప్రాయంగా నిర్ణయించింది. కేంద్రం ప్రతిపాదించిన గోదావరి–కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియతో సంబంధం లేకుండా తాగునీటి అవసరాలకే పరిమితమవుతూ సహకార ధోరణితో తమిళనాడుకు చేయూతనిచ్చే దిశగా బాటలు వేసింది. సాగుకైతే నో.. తాగుకైతే ఓకే.. ఏటా వేసవిలో చెన్నై నగర తాగునీటి కష్టాలు తీర్చేందుకు రైల్వే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. ఈ కష్టాల నుంచి గట్టెక్కించే క్రమంలో ఏప్రిల్ 18, 1983లో తమిళనాడుతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ మేరకు.. చెన్నైకి తాగునీటి అవసరాల కోసం కృష్ణా బేసిన్‌లోని కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు చెరో 5 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ వాటా కింద 3.3, తెలంగాణ వాటా కింద 1.7 టీఎంసీలు విడుదల చేయాలి. ఏటా చెన్నై తాగునీటి అవసరాలకు 3 నుంచి 8 టీఎంసీలకు మించి విడుదల కావట్లేదు. దీంతో తాగునీటి కష్టాలు తీరడం కష్ట సాధ్యమవుతోంది. దీన్ని దృష్ట్యా కేంద్రం, గోదావరి–కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియను తెరపైకి తెచ్చింది. ఈ అనుసంధానం ద్వారా కనీసం 200 టీఎంసీల నీటిని తమిళనాడు తాగు, సాగు అవసరాలను తీర్చాలని నిర్ణయించింది. దీనికి రూ.60 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.ఈ ప్రతిపాదనకు ఓవైపు చత్తీస్‌గఢ్ అభ్యంతరం చెబుతుండగా, తెలంగాణ, ఏపీలు సైతం తమ అవసరాలు పోయాకే మిగిలిన నీటిని తరలించాలని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు మంత్రుల బృందం కేంద్ర ప్రతిపాదనను ఆమోదించి, తమ కష్టాలు తీర్చాలని సీఎం కేసీఆర్‌ను కలిసింది. సాగు అవసరాలను తెరపైకి తెస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవని, అదీకాక సాగు అవసరాలంటే కేంద్ర సంస్థల నుంచి అనుమతులు అనివార్యం అవుతాయని సీఎం చెప్పినట్లు సమాచారం. అదే తాగు అవసరాలకైతే పొరుగు రాష్ట్రాలు సహా, కేంద్రం సహకారం అందిస్తాయని సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. కృష్ణాలో తగినంత నీటి లభ్యత లేనం దున గోదావరి నీటిని, అదీ వరద ఎక్కువగా ఉండి వృథాగా సముద్రంలోకి వెళ్తున్న సమయంలోనే 50–60 టీఎంసీల నీటిని తమిళనాడుకు తరలిస్తే తమకు అభ్యంతరం ఉండదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గోదావరి నుంచి నీటిని ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపై అధ్యయనం జరగాలని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. ఇప్పటికే చెన్నై తాగునీటి అవసరాలకు శ్రీశైలం నుంచి తెలుగుగంగ ద్వారా నీటిని విడుదల చేస్తున్నా, అవి చెన్నై వరకు చేరట్లేదు. తెలుగుగంగ కాల్వల పరిధిలో భారీగా వ్యవసాయ మోటార్లు ఉండటంతో 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే అవి తమిళనాడులోని పూండీ రిజర్వాయర్‌కు చేరే వరకు 900 క్యూసెక్కులే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించే అంశంపై అధికారుల స్థాయిలో చర్చలు జరగాలని, వారు అంగీకారానికి వచ్చాక ఏపీతో కలసి 3 రాష్ట్రాల సీఎంల సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం చేద్దామని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. -
తాగునీటి కష్టాలకు సోలార్‌తో చెక్
సత్ఫలితాలిస్తున్న డ్యూయల్ పంప్ పైప్‌లైన్ పథకం ఆదిలాబాద్ : జిల్లాలోని గిరిజన తండాల్లో నెలకొన్న తాగునీటి కష్టాలకు సోలార్‌తో చెక్ పడింది. మారుమూల ప్రాంతాల్లో నిర్మించిన సోలార్ ఆధారిత తాగునీటి పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయి. గిరిజనుల దాహర్తిని తీరుస్తున్నారుు. ఎన్సీఈఎఫ్, ఆర్ఆర్ఈడబ్ల్యూపీ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్యూయల్ పంప్ పైప్‌లైన్ పథకాల నిర్మాణం చేపట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 18 మారుమూల ప్రాంతాల్లో వీటిని నెలకొల్పారు. ఆదిలాబాద్ మండల పరిధిలోని తిప్ప, మలేబోర్గాం, దార్లొద్ది, జైత్రాం తండా (ఇంద్రవెల్లి మండలం), నాయకపుగూడ (జన్నారం), దోస్త్‌నగర్ (కడెం), కొలాంగూడ (బజార్హత్నూర్), ధోబీగూడ (ఇచ్చోడ), కొలాంగూడ (బజార్హత్నూర్), గంగాపూర్తండా (సారంగాపూర్), పార్పల్లితండా (లక్ష్మణచాంద), రాయదురితాండ, పులిమడుగు, దోడర్నతండా, పల్సితండా, బాలాజీతండా, రాజుతండా గ్రామాల్లో వీటిని నిర్మించారు. ఒక్కో పథకం ద్వారా సుమారు 20 కుటుంబాలకు (సుమారు వంద జనాభా) తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఐదువేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకు నిర్మిస్తారు. బోరుకు సోలార్ ఆధారిత పంపుసెట్‌ను బిగించి ఆ నీటి నిట్యాంకులో నింపుతారు. అక్కడి నుంచి సమీపంలో మూడు చోట్ల నల్లాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా తాగునీటిని సరఫరా చేస్తారు. ఈ పథకం సమీపంలోనే ఇంకుడు గుంత కూడా ఏర్పాటు చేసి, వృథా నీరు తిరిగి భూగర్భజలాల పెంపునకు ఉపయోగపడేలా ఏర్పాటు చేశారు. ఎండాకాలంలో కేవలం రెండు నుంచి మూడు గంటలలోపు ఈ ట్యాంకులు నిండుతారుు. వర్షాకాలంలోనైతే ఆరు గంటల్లో నిండుతాయని ఈ ప్రాజెక్టు చేపట్టిన జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ సంస్థ అధికారులు తెలిపారు. ఒక్కో యూనిట్‌కు ప్రభుత్వం రూ.4.68 లక్షల చొప్పున వెచ్చిస్తోంది. ఇబ్బందులు దూరమయ్యాయి గతంలో తాగునీటికి చాలా ఇబ్బందులు పడ్డాం. కరెంటు ఉంటేనే తాగడానికి నీరందేది. లేదంటే చాలాదూరం నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకునేవాళ్లం. కా నీ వారం రోజుల క్రితం గ్రామంలో సోలార్ వాట ర్ ప్లాంటు ఏర్పాటు చేశారు. ఇప్పుడు తండాలో తాగునీటి ఇబ్బందులు దూరమయ్యూయి. - రాథోడ్ అరుణ, గంగాపూర్ కరెంట్ పోతే నీళ్లచ్చేవి కావు గ్రామంలో తరచూ కరెంటు కష్టాలు ఉండేవి. తాగేందుకు నీళ్లు వచ్చేవి కావు. దీంతో అష్టకష్టాలు పడ్డాం. ప్రభుత్వం మా సమస్యలను గుర్తించి గ్రామంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసింది. గ్రామంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు బాగుంది. - జాదవ్ విఠల్, గంగాపూర్ ఐదేళ్లు నిర్వహణ బాధ్యత మాదే .. ఐదు సంవత్సరాల వరకు ఈ తాగునీటి పథకాల నిర్వహణ బాధ్యతలను మా సంస్థే చూస్తుంది. ఒక్కసారి ఈ పథకాన్ని నిర్మిస్తే నిర్వహణ వ్యయం ఏ మాత్రం ఉండదు. సరైన రోడ్డు మార్గం లేని గ్రామాలు, మారుమూల నివాసిత ప్రాంతాల వాసులకు ఈ పథకాలు ఎంతో సౌకర్యంగా ఉంటాయి. వీటిని నెలకొల్పిన ప్రాంతాల్లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. - ప్రదీప్‌కుమార్, ప్రాజెక్టు మేనేజర్, జైన్ ఇరిగేషన్ -
ట్రిపుల్ ఐటీకి కృష్ణా జలాలు
త్వరలోనే సరఫరా తీరనున్న నీటి కష్టాలు రోజుకు 15లక్షల లీటర్లు నూజివీడు : ట్రిపుల్ ఐటీ ఎదుర్కొంటున్న నీటి కష్టాలకు తెరపడనుంది. 7వేల మంది విద్యార్థులతో పాటు మరో వెయ్యి మంది సిబ్బంది పనిచేస్తున్న నూజివీడు ట్రిపుల్ఐటీకి త్వరలోనే కృష్ణా జలాలు రానున్నాయి. నూజివీడు పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి ఉద్దేశించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంజూరు చేసిన రూ.66కోట్లతో నిర్మించిన కృష్ణా జలాల పథకం పనులు పూర్తయ్యాయి. ఈ పథకం నుంచి ట్రిపుల్ఐటీకి మంచినీళ్లు కావాలని ఆర్జీయూకేటీ అధికారులు అడిగిన నేపథ్యంలో రోజుకు 15లక్షల లీటర్ల నీటిని ఇవ్వడానికి మున్సిపల్ పాలకవర్గం అంగీకరించింది. రోజుకు 1.30కోట్ల లీటర్ల నీటిని అందజేసే సామర్థ్యం ఉన్న కృష్ణాజలాల పథకం నుంచి నూజివీడు పట్టణానికి రోజుకు 70లక్షల లీటర్ల నీరు సరిపోతుంది. రాబోయే 30ఏళ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మంజూరు చేసిన పథకం కావడంతో ప్రస్తుతం దాదాపు 50లక్షల లీటర్ల కృష్ణా జలాలు అదనంగా వస్తున్న నేపథ్యంలో ట్రిపుల్ఐటీ వద్ద నుంచి కొంతమేరకు నిర్వహణ ఖర్చులు తీసుకుని కృష్ణాజలాలను అందించాలని పాలకవర్గం నిర్ణయించింది. దీనిలో భాగంగా వెయ్యి లీటర్లకు రూ.36 చొప్పున 183రోజులకు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 98.82లక్షలు చెల్లించడానికి ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు అంగీకరించారు. అలాగే మున్సిపాలిటీ విధించనున్న నెలవారీ నీటి పన్ను ఇవ్వడానికి సైతం ఆమోదం లభించింది. కృష్ణాజలాల ఫిల్టర్ ఫ్లాంట్ నుంచి ట్రిపుల్‌ఐటీలోకి పైప్‌లైన్ నిర్మాణం పూర్తి కావడంతో ఇటీవల ట్రయల్ రన్ పూర్తిచేశారు. 3బోర్లున్నా నీటి కొరతే.... నూజివీడు ట్రిపుల్‌ఐటీలో 13బోర్లద్వారా మోటర్లతో నీటిని తోడుతున్నప్పటికీ రోజుకు నాలుగు గంటల కంటే ఎక్కువ సేపు నీటిని ఇచ్చే పరిస్థితి లేదు. ఏడాది పొడవునా మోటర్లతో నీటిని తోడడం వల్ల బోర్లలో నీటిమట్టం సైతం ఏడాదికేడాదికి పడిపోతోంది. వేసవికాలం వస్తే నీటి ఎద్దడి మరింత పెరుగుతోంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఒక్కొక్కసారి విద్యుత్‌కోత సమయంలో బయటి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. ఒకవైపు కరెంటు బిల్లులకు లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నా బోర్లలో నీరులేక నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తున్నందున కృష్ణాజలాలను సరఫరా చేయాల్సిందిగా పూర్వడెరైక్టర్ ఇబ్రహీంఖాన్ మున్సిపల్ అధికారులను కలసి అడగడంతో వారు వెంటనే అంగీకరించారు. అన్ని పనులు పూర్తయిన నేపథ్యంలో అక్టోబర్ ఒకటి తరువాత ఎప్పుడైనా ట్రిపుల్ఐటీకి కృష్ణాజలాల సరఫరా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు శాశ్వతంగా తెరపడనుంది. -
వానా కాలంలోనూ కన్నీటి కష్టాలు
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో తాగునీటికీ అవస్థలు పడాల్సి వస్తోంది. భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు, చేతిపంపులలో నీళ్లు రావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్య మరీ జఠిలంగా మారింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యి గ్రామా ల్లో నీటి ఎద్దడి నెలకొంది. అత్యంత సమస్యాత్మకంగా మారిన 330 గ్రామాలకు ఇప్పటికీ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలమైనా నీటి ఎద్దడి తప్పడం లేదని, ఇలాంటి పరిస్థితిని తొలిసారి చూస్తున్నామని గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు తెలిపారు. ఏటా ఫిబ్రవరి నుంచి మే నెలాఖరు వరకు మాత్రమే తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ట్యాంకర్లతో గానీ, వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకొని గానీ తాగునీటిని సరఫరా చేసేవారు. ఈ ఏడాది మాత్రం వర్షాకాలం ప్రారంభమై దాదాపు రెండున్నర నెలలు కావస్తున్నా తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి వరుణుడు మొహం చాటేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. భూగర్భజలాలు వేసవిలో కంటే అట్టడుగు స్థాయికి పడిపోయాయి. నెలాఖరులోగా వర్షం కురవకపోతే నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా జూన్ లో 63.9 మిల్లీమీటర్ల (మి.మీ) వర్షం కురవాలి. అయితే.. 47.1 మి.మీ మాత్రమే పడింది. అలాగే జూలైలో 67 మి.మీకి గాను 10 మి.మీలోపే కురిసింది. ఈ నెలలో ఇప్పటిదాకా వర్షం కురవలేదు. దీంతో నీటి వనరులపై దెబ్బ పడింది. భూగర్భజలాలు 20 మీటర్లకు పడిపోయినట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతేడాది కంటే మూడు నుంచి నాలుగు మీటర్ల లోతుకు పడిపోయాయి. తాగునీటికి సంబంధించిన దాదాపు 4,500 బోర్లు ఎండిపోయాయి. ఈ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు పీఏబీఆర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్) నుంచి కూడా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మొన్నటి వరకూ పీఏబీఆర్‌లో నీరు అడుగంటడంతో అధికారులు ఆందోళన చెందారు. అయితే పదిరోజుల నుంచి పీఏబీఆర్‌కు తుంగభద్ర జలాశయం నుంచి నీరు వస్తుండడంతో కాస్త ఊరట క లిగింది. సీబీఆర్‌కు కూడా ఈ నెలాఖరులో నీరు విడుదల చేసే అవకాశముంది. ఈ ఏడాది హెచ్చెల్సీ కోటాలో 8.5 టీఎంసీలు తాగునీటి కోసం కేటాయిస్తున్నారు. గతేడాది కంటే 0.5 టీఎంసీ అదనంగా కేటాయిస్తున్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు కొనసాగితే తాగునీటి కేటాయింపులు మరింత పెంచాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఉపశమనం ఏదీ? ఈ ఏడాది వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.31 కోట్లు, ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో ప్రత్యేకంగా నీటి సమస్యను పరిష్కరించడానికి సబ్‌ప్లాన్ కింద రూ.40 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అయితే.. ఇప్పటివరకూ రూ.4.80 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. 65 గ్రామాలకు నీటిని సరఫరా చేయడానికి స్థానికంగా ఉన్న రైతుల వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకోవడానికి, మరో 119 గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ బోర్లను కడిగేందుకు(ప్లషింగ్), ఎండిపోయిన 209 బోర్లను మరింత లోతుకు వేసేందుకు ఈ నిధులను ఖర్చు చేసినట్లు సమాచారం. కాగా... అధికారులు పంపిన నివేదికలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు చెప్పిన ప్రజాప్రతినిధులు... మిగులు నిధులు తీసుకురావడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పటికే ట్యాంకర్లతో నీటి సరఫరాకు సంబంధించి రూ.లక్షల్లో బకాయిలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. ప్రస్తుతం 330 గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నాం. ఒకసారైనా భారీ వర్షం కురిస్తే తప్పా నీటి సమస్య తీరదు. -ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రభాకర్‌రావు