- త్వరలోనే సరఫరా
- తీరనున్న నీటి కష్టాలు
- రోజుకు 15లక్షల లీటర్లు
నూజివీడు : ట్రిపుల్ ఐటీ ఎదుర్కొంటున్న నీటి కష్టాలకు తెరపడనుంది. 7వేల మంది విద్యార్థులతో పాటు మరో వెయ్యి మంది సిబ్బంది పనిచేస్తున్న నూజివీడు ట్రిపుల్‌ఐటీకి త్వరలోనే కృష్ణా జలాలు రానున్నాయి. నూజివీడు పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి ఉద్దేశించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంజూరు చేసిన రూ.66కోట్లతో నిర్మించిన కృష్ణా జలాల పథకం పనులు పూర్తయ్యాయి.
ఈ పథకం నుంచి ట్రిపుల్‌ఐటీకి మంచినీళ్లు కావాలని ఆర్జీయూకేటీ అధికారులు అడిగిన నేపథ్యంలో రోజుకు 15లక్షల లీటర్ల నీటిని ఇవ్వడానికి మున్సిపల్ పాలకవర్గం అంగీకరించింది. రోజుకు 1.30కోట్ల లీటర్ల నీటిని అందజేసే సామర్థ్యం ఉన్న కృష్ణాజలాల పథకం నుంచి నూజివీడు పట్టణానికి రోజుకు 70లక్షల లీటర్ల నీరు సరిపోతుంది.
రాబోయే 30ఏళ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మంజూరు చేసిన పథకం కావడంతో ప్రస్తుతం దాదాపు 50లక్షల లీటర్ల కృష్ణా జలాలు అదనంగా వస్తున్న నేపథ్యంలో ట్రిపుల్‌ఐటీ వద్ద నుంచి కొంతమేరకు నిర్వహణ ఖర్చులు తీసుకుని కృష్ణాజలాలను అందించాలని పాలకవర్గం నిర్ణయించింది. దీనిలో భాగంగా వెయ్యి లీటర్లకు రూ.36 చొప్పున 183రోజులకు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 98.82లక్షలు చెల్లించడానికి ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు అంగీకరించారు. అలాగే మున్సిపాలిటీ విధించనున్న నెలవారీ నీటి పన్ను ఇవ్వడానికి సైతం ఆమోదం లభించింది. కృష్ణాజలాల ఫిల్టర్ ఫ్లాంట్ నుంచి ట్రిపుల్‌ఐటీలోకి పైప్‌లైన్ నిర్మాణం పూర్తి కావడంతో ఇటీవల ట్రయల్ రన్ పూర్తిచేశారు.
3బోర్లున్నా నీటి కొరతే....
నూజివీడు ట్రిపుల్‌ఐటీలో 13బోర్లద్వారా మోటర్లతో నీటిని తోడుతున్నప్పటికీ రోజుకు నాలుగు గంటల కంటే ఎక్కువ సేపు నీటిని ఇచ్చే పరిస్థితి లేదు. ఏడాది పొడవునా మోటర్లతో నీటిని తోడడం వల్ల బోర్లలో నీటిమట్టం సైతం ఏడాదికేడాదికి పడిపోతోంది. వేసవికాలం వస్తే నీటి ఎద్దడి మరింత పెరుగుతోంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఒక్కొక్కసారి విద్యుత్‌కోత సమయంలో బయటి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వస్తోంది.
ఒకవైపు కరెంటు బిల్లులకు లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నా బోర్లలో నీరులేక నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తున్నందున కృష్ణాజలాలను సరఫరా చేయాల్సిందిగా పూర్వడెరైక్టర్ ఇబ్రహీంఖాన్ మున్సిపల్ అధికారులను కలసి అడగడంతో వారు వెంటనే అంగీకరించారు. అన్ని పనులు పూర్తయిన నేపథ్యంలో అక్టోబర్ ఒకటి తరువాత ఎప్పుడైనా ట్రిపుల్‌ఐటీకి కృష్ణాజలాల సరఫరా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు శాశ్వతంగా తెరపడనుంది.