Hyderabad: వానలకే కాదు.. ఇక అధికారులు సైతం వణికే పరిస్థితులు | Hyderabad: Ts Government Serious On Engineers Rainy Season Problems | Sakshi
Sakshi News home page

Hyderabad: వానలకే కాదు.. ఇక అధికారులు సైతం వణికే పరిస్థితులు

Published Wed, Jun 15 2022 8:48 AM | Last Updated on Wed, Jun 15 2022 8:51 AM

Hyderabad: Ts Government Serious On Engineers Rainy Season Problems - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో వానలంటేనే ప్రజలు వణికే పరిస్థితి. అది నిన్నటి వరకు. ఇప్పుడిక అధికారులు సైతం వణికే పరిస్థితులేర్పడ్డాయి. గత రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలతో  ప్రజలకు తీవ్ర ఇబ్బందులతోపాటు ప్రాణాపాయాలు కూడా చోటు చేసుకోవడంతో సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే ఇంజినీర్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపునే అన్ని మ్యాన్‌హోళ్లకు మూతలు సక్రమంగా ఉండటం దగ్గరనుంచి నాలాల పనులు జరుగుతున్న ప్రాంతాల్లో తగిన హెచ్చరికలు, సైనేజీలు, రాత్రుళ్లు లైటింగ్‌ వంటివి ఉండాలని స్పష్టం చేసింది. పనుల పూర్తికి జూన్‌ 5 వరకు గడువునిచ్చింది.  

గడువులోగా పనులు చేయని వారికి షోకాజ్‌ నోటీసులు సైతం ఉంటాయని హెచ్చరించింది. అయినప్పటికీ ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో అవి అమలు కాలేదు. మరోవైపు రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాల సందర్భంగా నాలాలు ప్రమాదకరంగా ఉండకుండా తగిన చర్యల కోసం రూ. 298 కోట్లు మంజూరు చేసింది. ఏడాది క్రితం వరద సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఎస్‌ఎన్‌డీపీ వింగ్‌ను ఏర్పాటు చేయడంతోపాటు పనులు చేసేందుకు దాదాపు రూ. 985 కోట్లు మంజూరు చేసింది. వీటితో పాటు  ఇతరత్రా పనుల కోసం మరికొన్ని నిధులు మంజూరు చేసింది.  అయినప్పటికీ  ఏవీ పూర్తికాలేదు.  

పనులు జరుగుతున్న ప్రాంతాల్లో  తగిన రక్షణ ఏర్పాట్లు సైతం లేవు. ఈ నేపథ్యంలో  ఇప్పటి వరకు 18 మంది ఇంజినీర్లకు మెమోలు  జారీ చేసినట్లు తెలిసింది. మెమోలు జారీ అయిన వారిలో  మ్యాన్‌హోళ్లకు మూతలు వేయడం వంటి పనులు కూడా పూర్తిచేయని వారున్నారు. నాలాల వద్ద పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రక్షణ ఏర్పాట్లు పట్టించుకోని వారికి సైతం మెమోలు జారీ అయినట్లు తెలిసింది. పనుల్లో  నిర్లక్ష్యం, అశ్రద్ధ కనిపిస్తే చర్యలు తప్పవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మరిన్ని తనిఖీలు చేసి నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఇక నిరంతర ప్రక్రియగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.  

 గత సంవత్సరం వర్షాకాలం ప్రారంభమయ్యేలోపునే రెండు మీటర్ల వరకు వెడల్పున్న నాలాలకు పై కప్పులు, అంతకంటే ఎక్కువ వెడల్పున్నవాటికి కంచె తదితరమైన భద్రత ఏర్పాట్లు పూర్తి కావాల్సి ఉండగా నేటికీ పూర్తికాలేదు.ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు  ఎస్‌ఈలతో సహా ఇంజినీర్లను గట్టిగా హెచ్చరించారు. పనులు పూర్తికాకపోవడానికి పలు కారణాలున్నప్పటికీ, ఎప్పుడు ఎవరికి ముప్పు ముంచుకొస్తుందోనని ఇంజినీర్లు ఆందోళన  చెందుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement