పాలమూరు, న్యూస్‌లైన్: నాలుగేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొని కరువులో కొట్టుమిట్టాడుతున్న పాలమూరు జిల్లాపై ఈ ఏడాది వరుణుడు కరుణ చూపాడు. జిల్లాలో ఈ ఖరీఫ్ ఆశాజనకంగా కనిపిస్తోంది. ఇటీవల విస్తారంగా వర్షాలు కురియడంతో 93.9 శాతం విస్తీర్ణంలో పంటసాగు పూర్తయినట్లు తెలుస్తోంది.
7,07,850 హెక్టార్ల మేర పంటసాగు చేపట్టనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనావేయగా.. ఇప్పటికే 6,64,690 హెక్టార్లలో వివిధ పంటల సాగు పూర్తయ్యింది. పత్తి, కంది, చెరకు, మొక్కజొన్న, ఉల్లి పంటలు అంచనాలకు మించి సాగు చేయగా, వరిపంట సాగు మాత్రం సగమే పూర్తయింది. జూన్ ప్రారంభం నుంచే నుంచే వర్షాలు పడుతుండటంతో పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో భూగర్భజలాలు కూడా గణనీయంగా పెరిగాయని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సాగుచేసిన పత్తి, మొక్క జొన్న, పప్పు దినుసులు, తదితర ఆరుతడి పంటలు పెరుగుతుండగా.. జిల్లాలోని అధిక మండలాల్లో వరినాట్లు మరింత వేగం పుంజుకుని ముమ్మరంగా సాగవుతున్నాయి.
జిల్లాలో వరి 51,255లక్షల హెక్టార్ల మేర సాగయినట్లు సమాచారం. గత ఏడాది వర్షాలు సరిగా కురియకపోవడం, భూగర్భజలాలు అడుగంటిపోవడం, దీనికితోడు విద్యుత్‌కోతల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైతులు ఎక్కువగా మెట్ట పంటలపైనే ఆసక్తి చూపారు. అయితే ఇప్పటివరకు కురిసిన వర్షాల వల్ల ఎలాంటి నష్టం లేకపోయినా మున్ముందు ఇదేవిధంగా వానలు కొనసాగితే నల్లరేగడి ప్రాంతాల్లోని పత్తి, మొక్కజొన్న తదితర మెట్ట పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. తేమ అధికంగా ఉన్న నేపథ్యంలో యూరియా, కాంప్లెక్స్ ఎరువుల కోసం రైతులు ఎగబడుతున్నారు.
వర్షపాతం ఇలా..
జిల్లాలో జూన్ సాధారణ వర్షపాతం 71.2 మిల్లీమీటర్లు కాగా, 12 శాతం అధికంగా 80 మి.మీ వర్షం కురిసింది. జులైలో సాధారణ వర్షపాతం 146.6 మి.మీ కాగా 139.4 మి.మీ వర్షం నమోదైంది. ఈ నెలలో ఇప్పటివరకు 34.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏదేమైనా నాలుగేళ్ల తర్వాత జూన్‌లో వర్షాలు కురవడం ప్రారంభమై కొనసాగుతూ వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆశాజనకంగా ఖరీఫ్
Published Sun, Aug 11 2013 3:02 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
Advertisement
Advertisement