అందరూ పని దొంగలే! | district hospitals in Corruption | Sakshi
Sakshi News home page

అందరూ పని దొంగలే!

Published Fri, Sep 5 2014 12:39 AM | Last Updated on Tue, Oct 2 2018 3:46 PM

district hospitals in Corruption

ఇదీ ఎఫ్‌ఆర్‌టీసీ విభాగం పరిస్థితి
కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి వరకు అందరిదీ ‘మామూళ్ల’ బాటే
కాకినాడ క్రైం : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖను అవినీతి భూతం వెంటాడుతూనే ఉంది. తాజాగా ఫైలేరియా విభాగంలో అవినీతి వెలుగుచూసింది. జిల్లాలో బోద వ్యాధిగ్రస్తులు అధికంగా ఉండడంతో డీఎంహెచ్‌ఓ కార్యాలయ ఆవరణలో ఫైలేరియా రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (ఎఫ్‌ఆర్‌టీసీ) ఏర్పాటు చేశారు. కాకినాడలో మూడు యూనిట్లు, రాజమండ్రిలో రెండు, పిఠాపురంలో రెండు, మండపేట, పెద్దాపురం, అమలాపురం, రామచంద్రపురంలో ఒక్కో యూనిట్ ఎఫ్‌ఆర్‌టీసీ నేతృత్వంలో పనిచేస్తుంటాయి. ఇన్సెక్ట్ కలెక్టర్ ప్రతి రోజు ఉదయం దోమలను సేకరించి వాటి వల్ల వ్యాప్తిచెందే వ్యాధులపై రీసెర్చ్ చేయాలి. ఫీల్డ్ వర్కర్లు పంపులతో కాల్వల్లో బయోటెక్స్, ఎబేట్ మందులను పిచికారీ చేయాలి. అయితే ఆ పంపులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఎఫ్‌ఆర్‌టీసీలో నెలకొంది.
 
ఈ విభాగంలో 11 మంది ఇన్‌స్పెక్టర్లు, తొమ్మిది మంది మహిళా, 14 మంది పురుష ఫీల్డ్ వర్కర్లు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ విధులు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. వీరి నుంచి ముడుపులు తీసుకుంటున్న కొందరు అధికారులు వీరికి వంతపాడుతున్నారనే విమర్శలున్నాయి. ఉద్యోగుల సరెండర్ లీవులకు సంబంధించి బిల్లులు పాస్ చేసేందుకు ఒక్కో ఉద్యోగి నుంచి రూ.వెయ్యి వసూలు చేసినట్టు కొంత మంది సిబ్బంది చెబుతున్నారు.
 
విధులకు హాజరుకాకుండానే...
రాజమండ్రికి చెందిన ఓ ఉద్యోగి కాకినాడలో విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ విధులకు ఎగనామం పెట్టి, ఆ విభాగ అధికారులకు ముడుపులు అందజేసి ఉద్యోగాన్ని కాపాడుకుంటున్నాడని కొందరు ఉద్యోగులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. రాజమండ్రిలో విధులు నిర్వహిస్తోన్న ఓ మహిళా ఉద్యోగి రెండేళ్ల క్రితం కాకినాడ సరెండర్ చేశారు. అయితే ఆమె కూడా పనిలేకుండా కాకినాడలోని ఎఫ్‌ఆర్‌టీసీలో ఉంటూ కాలం వెళ్లదీస్తోంది.

పిఠాపురంలో ఇన్సెక్ట్ కలెక్టర్ ఒకరు భారీగా ముడుపులిచ్చి ప్రస్తుతం కాకినాడలో ఎస్‌ఆర్‌డబ్ల్యూగా విధులు నిర్వహిస్తున్నా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రిపోర్టులు సేకరించాల్సిన హెల్త్ ఇన్‌స్పెక్టర్ పరిస్థితి కూడా ఇలానే ఉందని ఆ విభాగ ఉద్యోగులే నిరసన వ్యక్తం చేస్తున్నారు. మండపేటలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగిని పనిష్మెంట్ పేరిట రామచంద్రపురానికి మార్చారని, అనధికారికంగా ఎఫ్‌ఆర్‌టీసీలో డిప్యుటేషన్లు కొనసాగిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు.
 
ప్రోగ్రాం ఆఫీసర్ తీరుపై విమర్శలు
ఎఫ్‌ఆర్‌టీసీ ప్రోగ్రాం ఆఫీసర్ తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బందితో పనిచేయించడంతో పాటు, పీఓగా విధులు నిర్వహించడంలోనూ ఆయన విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నారు. కాకినాడలోని ఎఫ్‌ఆర్‌టీసీలో అవుట్ పేషెంట్ విభాగాన్ని కూడా నిర్వహించడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పీఓ జిల్లాలోని అన్ని యూనిట్లను సందర్శించాల్సి ఉండగా వాహనాన్ని కూడా దుర్వినియోగపరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పేకేరు పీహెచ్‌సీలో వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తూ సస్పెన్షన్‌కు గురైన వైద్యురాలిని ఎఫ్‌ఆర్‌టీసీ పీఓగా నియమించారని, ఆమె పర్యవేక్షణ విభాగంపై పూర్తిగా కొరవడిందని వైద్య నిపుణులు విమర్శిస్తున్నారు.
 
దృష్టి సారిస్తాం
ఫైలేరియా విభాగంలో జరుగుతున్న అవినీతి, నిర్లక్ష్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. సరెండర్ లీవు ఉద్యోగుల హక్కు. వారి నుంచి సొమ్ములు తీసుకోవడం బాధాకరం. దీనిపై విచారణ నిర్వహిస్తాం. అవుట్ పేషెంట్ విభాగం, ఉద్యోగులు, సిబ్బంది విధులపై కూడా దృష్టి కేంద్రీకరిస్తాం. రిజిస్టర్లు పరిశీలించి పనితీరు తనిఖీ చేస్తాం.
 - ఎం. పవన్‌కుమార్, ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement