Filaria
-
‘బోద’పడని వ్యధ
మెదక్‌జోన్ : రాష్ట్ర ప్రభుత్వం బోదకాలు బాధితులకూ పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. వీరికి నెలకు రూ. వెయ్యి చొప్పున పింఛన్ మంజూరు చేశారు. కానీ జిల్లాలో ఇది నామమాత్రపు బాధితులకు మాత్రమే అందనుంది. జిల్లా వ్యాప్తంగా బోదకాలు బాధితులు 2,494 మంది ఉన్నారు. కానీ అందులో కేవలం 303 మందికి మాత్రమే పింఛన్ మంజూరు చేశారు. ఎంపికలో వ్యాధి తీవ్రతను బట్టి మూడు కేటగిరిలుగా విభజించి పింఛన్ ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొదటి కేటగిరిలో ఇప్పుడిప్పుడే వ్యాధి ప్రారంభమైన వారిని గుర్తించారు. ఈ జాబితాలో 1,100 మంది ఉనట్లు గుర్తించారు. వీళ్లు అన్ని రకాల పనులు చేసుకుంటున్నారు. క్రమం తప్పకుండా మందులు వాడితే వ్యాధి తగ్గుతుందని సంబంధిత ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. రెండో కేటగిరిలో కూడా వ్యాధి మందులతో కంట్రోల్ అవుతోంది. ఈ జాబితాలో 1,092 మందిని గుర్తించారు. మూడో కేటగిరి లో 303 మందిని గుర్తించారు. వీరి అవయవాలు బాగాలావెక్కి అందవికారంతో పాటు ఎప్పుడు జ్వరంతో ఇబ్బందులు పడుతుంటారు. వీరికి ఆదరణ తప్పనిసరిని గుర్తించిన అధికారులు వీరిని పింఛన్‌కు తీసుకునేందుకు అర్హులుగా గుర్తించారు. వీళ్లకు జూన్ ఒకటో తేదీ నుంచి పింఛన్ అందనుంది. సమాజంలో చిన్నచూపునకు గురై.. బోద వ్యాధిగ్రస్థులకు శరీరక అవయవాలు లావెక్కి ఏ పనిచేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటారు. వారు నిరాదరణతో నిస్సాహాయ పరిస్థితుల్లో అవస్థలు పడుతున్నారు. సమాజంతో పాటు కుటుంబాల్లోనూ చిన్నచూపుకు గురై మనోవేదన పడుతున్నారు. వీరికి నెలలో 20 రోజుల పాటు జ్వరంతో బాధపడుతుంటారని వైద్యులు చెబుతున్నారు. ప్రతినెల రూ. 2 వేల నుంచి రూ. 4 వేల వరకు ఆస్పత్రుల్లో ఖర్చుచేస్తున్నారు. ఈ వ్యాధిగ్రస్థులో 95 శాతం మేర నిరుపేదలే కావటంతో ఆర్థిక భారం పైబడి ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం పింఛన్ ఇవ్వటం శుభపరిణామమే. అయినప్పటికి అతికొద్ది మందికి మాత్రమే ఇస్తూ మిగతావారికి ఇవ్వక పోవటంతో బాధితులు మరింత ఆవేదన చెందుతున్నారు. దోమకాటుతోనే వ్యాప్తి.. టులెక్స్ అనే దోమకాటుతో ఫైలేరియా(బోదవ్యాధి) వస్తుంది. పరిసరాలు అపరిశుబ్రంగా ఉండటంతో దోమలు వ్యాప్తి చెంది అవి కుట్టడంతో ఈ వ్యాధి సోకుతుంది. ముఖ్యంగా స్లమ్ఏరియాలో నివశించే నిరుపేదలకు అధికంగా ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధిసోకిన బాధితులు ఎప్పుడూ జ్వరంతో బాధపడుతుంటారు. ఈ వ్యాధి ప్రభావం శరీరంలోని అనేక అవయవాలపై పడుతోంది. దీంతో అవయవాలు ఉబ్బుతాయి. 20 ఏళ్ల నుంచి బాధపడుతున్నా.. 20 ఏళ్ల నుంచి బొదకాలతో బాధపడుతున్నాను. దీంతో నిత్యం జ్వరం వస్తోంది. నెలకు రూ. 3 వేలు మందు గోలీలకు ఖర్చు అవుతున్నాయి. ప్రభుత్వం కొంతమందికి మాత్రమే పింఛన్ ఇచ్చి, నాలాంటి వారిని మర్చిపోయింది. ప్రభుత్వం అంటే అందరికీ సహకారం చేయాలి. కానీ కొంతమందికి మాత్రమే ఇవ్వడం ఎంత వరకు సమంజసం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పింఛన్ ఇచ్చి ఆదుకోవాలి. –మోసయ్య, జంగరాయి, చిన్నశంకరంపేట మండలం నిబంధనల ప్రకారమే ఎంపిక.. ప్రభుత్వం తమకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పింఛన్ అర్హులుగా గుర్తించాం. జిల్లాలో 2,494 మంది వ్యాధిగ్రస్థులు ఉండగా వ్యాధి తీవ్రంగా ఉన్న 303 మందికి మాత్రమే పింఛ న్ వస్తోంది. మూడు కేటగిరీలుగా విభజించి ప్రభుత్వానికి నివేదించాం. –కుమార్, జిల్లా మలేరియా అధికారి -
కొందరికే.. పింఛన్లు..?
భువనగిరి : బోధకాలు బాధితులందరికీ పింఛన్కాకుండా ఆ వ్యాధి గ్రేడ్–3 దశలో ఉన్న వారికి పింఛన్లు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం గ్రేడ్–3 దశలో ఉన్న వారిని గుర్తించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైద్య సిబ్బంది ఇటీవల జిల్లావ్యాప్తంగా బోధకాలు వ్యాధి లక్షాణాలు ఉన్న 1,818 మందికి తిరిగి పరీక్షలు నిర్వహించారు. ఇందులో గ్రేడ్–3 దశలో 520 మంది ఉన్నట్లు గుర్తించారు. దీంతో జిల్లాలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రస్తుతం 520 మందికి మాత్రమే పింఛన్లు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా ఉత్తర్వులు.. ఫిబ్రవరి 9, 10, 11వ తేదీల్లో నిర్వహించిన జాతీయ ఫైలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్య మంత్రి కేసీఆర్ బోధకాలు బాధితులకు ప్రతినెలా రూ. 1,000ల చొప్పున పింఛన్ అందజేస్తామని ప్రకటిం చా రు. దీంతో జిల్లాలో ఉన్న 1,818మంది బోధకాలు బా ధితులకు పింఛన్ అందుతుందని సంతోషపడ్డారు. కా నీ కొత్తగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గ్రేడ్–3 దశలో ఉన్నవారికే పింఛన్ అందజేయాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలో ఇటీవల గ్రేడ్–3 దశ బోధకాలు లక్షణాలు ఉన్న బాధితుల కోసం సర్వే చేశారు. ఇందులో భాగంగా గ్రేడ్–1 దశలో 531 మంది, గ్రేడ్–2 దశలో 703 మంది, గ్రేడ్–3 దశలో 520 మంది ఉన్నట్లుగా గుర్తించారు. మిగిలిన ఏడుగురి బాధితులు అం దుబాటులో లేరు. దీంతో ప్రస్తుతం జిల్లాలో బోధకాలు లక్షాణాలు ఉన్నవారు 1,761 మందిగా గుర్తించారు. 520 మందికే పింఛన్.. జిల్లాలో ఇటీవల బోధకాలు లక్షణాలు ఉన్న వారికి జరిపిన పరీక్షల్లో గ్రేడ్–3 దశ లక్షణాలు కలిగిన 520 మందికి పింఛన్ రానుంది. గ్రేడ్–1 దశలో బోధకాలు సాధారణ లక్షణాలు ఉంటాయి. గ్రేడ్–2 దశలో పనిచేసే విధంగా లక్షణాలు కలిగి ఉంటాయి. గ్రేడ్–3 దశలో ఏమాత్రం పనిచేయకుండా లక్షణాలు కలిగిన బోధకాల బాధితులుగా విభజించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కొంతమందికే పింఛన్ వచ్చే అవకాశం ఉండడంతో మిగిలిన వారు ఆందోళన చెందుతున్నారు. నివేదిక అందజేస్తాం.. ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ఇటీవల జిల్లాలోని బోధకాలు లక్షణాలు కలిగిన వారికి పరీక్షలు నిర్వహించాం. ఇందులో బోధకాలు లక్షణాలు ఉన్నవారిని మూడు విభాగాలుగా విభజించాం. పూర్తి చేసిన సర్వే నివేదికను త్వరలో ప్రభుత్వానికి అందజేస్తాం. – డాక్టర్ సాంబశివరావు, డీఎంహెచ్ఓ -
ప్రభుత్వానికి బోధ పడదేం
తణుకు అర్బన్ : బోధ వ్యాధి నివారణకు వ్యాధిగ్రస్తులు వాడే డీఈసీ (డై ఇథైల్ కార్బామాజైన్ నైట్రేట్) మందులు జిల్లాలోని నివారణ కేంద్రాల్లో నిండుకున్నాయి. క్యూలెక్స్ దోమకాటు ద్వారా వ్యాపించే ఫైలేరియా వ్యాధితో జిల్లా వ్యాప్తంగా వేలసంఖ్యలో వ్యాధిగ్రస్తులు బాధపడుతున్నారు. వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు, వైద్యసేవలు అందించే క్రమంలో జిల్లాలో తణుకు ఏరియా ఆస్పత్రి ఆవరణలోనూ, పాలకొల్లు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మాత్రమే రెండు ఫైలేరియా నివారణ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలోని ఏ ప్రాంతంలోనైనా బోధవ్యాధి లక్షణాలు కనిపించిన వారు ఈ కేంద్రాల ద్వారా వైద్య పరీక్షలు, వైద్యసేవలు పొందాల్సి ఉంది. కానీ ఫైలేరియా కేంద్రాల్లో డీఈసీ మాత్రలు జనవరి నెలతో ఎక్స్పైర్ అవ్వగా కొత్త స్టాక్ ఇంతవరకు పంపిణీ కాలేదు. ఫైలేరియా వ్యాధి లక్షణాలు జ్వరం, గజ్జలో బిళ్ల కట్టడం, చేతులు, కాళ్లు వాపు, వాచినచోట వేడిగా ఉండి ఎరుపు రంగులో ఉండడం ఫైలేరియా వ్యాధి లక్షణాలు ఉంటే సమీపంలోని వైద్యులను సంప్రదించాలి. వివాదాస్పదంగాడీఈసీ మాత్రల వాడకం జిల్లావ్యాప్తంగా బోధవ్యాధిగ్రస్తులు నీరసంగా ఉండి కాలు లాగుతుందంటే డీఈసీ మాత్రలు మింగుతున్నారు. కానీ ఈ డీఈసీ మందులు ఎక్కువగా వాడకూడదని దీనివల్ల సైడ్ ఎఫెక్టŠస్ అధికంగా ఉంటాయని ప్రస్తుత ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ గతం నుంచి నెలలో 12 రోజులు రోజుకు మూడు మాత్రలు చొప్పున వ్యాధిగ్రస్తులు మందులు వాడుతున్నారు. మళ్లీ ఒక నెల ఆగిన తరువాత ఈ కోర్సు వాడుతున్నారు. ప్రస్తుతం చాలా ఏళ్లుగా ఈ విధానం కొనసాగుతోంది. ఇప్పుడు మాత్రం అలా వాడకూడదని వైద్యాధికారులు చెబుతుండడంతో రోగులు అయోమయంలో పడుతున్నారు. ముందుగా లక్షణాలు చూసిన వెంటనే ఈ కేంద్రాల్లో పరీక్షలు చేయించుకుని 12 రోజుల పాటు డీఈసీ మాత్రల కోర్సు వాడి ఆపివేయాలని చెబుతున్నారు. జిల్లాలో గతేడాది 4 కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. కొత్తగా కేసు నమోదైతే వాడేందుకు మందులులేని దుస్థితి జిల్లాలో నెలకొంది. 3 లక్షల మందులు ఇండెంట్ పెట్టామని రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. గతంలో పాఠశాలల్లో పంపిణీ క్యూలెక్స్ దోమకుట్టిన తరువాత వ్యాధి బయటపడేందుకు 5 సంవత్సరాలు సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో గతంలో ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో పాఠశాలల్లోని విద్యార్థులతో పాటు ప్రజానీకానికి డీఈసీ మందులు మూడు మాత్రల చొప్పున మింగించేవారు. దీనివల్ల ఒకవేళ దోమ కుట్టినా కానీ వ్యాధి బయటపడక ముందే లోపలే వ్యాధి నిరోధించబడుతుందనేది వైద్యాధికారులు అభిప్రాయం. ఫైలేరియాని గుర్తించేదిలా.. ఫైలేరియా వ్యాధి నిర్ధారణకు ప్రతి బుధవారం కేంద్రంలో రాత్రి 8 నుంచి 10 గంటల వరకు ప్రత్యేక క్లినిక్ నిర్వహిస్తున్నారు. మైక్రో ఫైలేరియా క్రిమి చీకటి సమయంలో యాక్టివ్‌గా ఉంటుందనే ఉద్ధేశంతో సదరు వ్యక్తిని కదలకుండా పడుకోబెట్టి ఉంచి రక్తనమూనా తీసి పరీక్ష చేస్తారు. ఇలా చేస్తే మాత్రమే వ్యాధి నిర్ధారణ అవుతుంది. కానీ ఈ కేంద్రాల్లో పూర్తి అవగాహన లేకుండా రక్తనమూనాలు సేకరిస్తుండడంతో చాలామందికి వ్యాధి ముదిరిపోయే వరకు పాజిటివ్‌గా గుర్తించడంలేదనే విమర్శలు లేకపోలేదు. 3 లక్షల మాత్రలకు ఇండెంట్ పెట్టాం బోధవ్యాధి నివారణ కేంద్రాల్లో ఉన్న డీఈసీ మాత్రలు జనవరి నెలతో ఎక్స్పైర్ అయ్యాయి. 3 లక్షల మాత్రలు కావాలని ఇండెంట్ పెట్టాం. మందులు రావాల్సి ఉంది. కొత్త కేసు నమోదైతేనే మందులు వాడాల్సి ఉంది. వ్యాధి సోకి ఒకసారి మందుల కోర్సు వాడిన వారు ఇక మళ్లీ వాడాల్సిన అవసరం లేదు. – ఎంవీ రాథోడ్, జిల్లా మలేరియా ఆఫీసర్, ఏలూరు -
మరో మహమ్మారి!
ఉద్దానంపై మరో మహమ్మారి పంజా విసిరింది. ఏడు మండలాల్లో విస్తరించిన ఉద్దానం ప్రాంతం ఇప్పటికే కిడ్నీ వ్యాధులతో వణికిపోతుండగా..ఇప్పుడు బోధకాలు రూపంలో మరో భూతం చాపకిందనీరులా కబళిస్తోంది. దోమకాటు వల్ల సోకే బోదకాలు వ్యాధి (ఫైలేరియా) బాధితులు ఈ ప్రాంతంలో వందలాది మంది ఉన్నారు. కనీసం నడవడానికి కూడా వీల్లేనంతగా కాళ్లు ఉబ్బిపోయినా పేదరికం కారణంగా వైద్యానికి దూరమవుతూ మంచంపైనే మగ్గిపోతున్నారు. సర్కార్ స్పందించి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. శ్రీకాకుళం, కాశీబుగ్గ : ఉద్దాన ప్రాంతానికి చెందిన వందలాది మంది మూత్రపిండాల వ్యాధితో మంచం పట్టారు. వారిని చూసి కన్నవారు.. కుటుంబాలు కన్నీరుపెడుతున్నారు. బతికిం చుకోవడానికి అప్పులు చేసి.. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇలాంటి తరుణంలో బోదవ్యాధి అనే భూతం వారి జీవితాలను దహించడానికి చాపకింద నీరులా దూసుకొస్తోంది. ఈ ప్రాంతంలోని ఏ గ్రామంలో చూసినా పది మందికి తక్కువ కాకుండా ఫైలేరియా వ్యాధిగ్రస్తులు దర్శనమిస్తున్నారు. ఇప్పటికే ఉద్దానం, తీరప్రాంతం, మెట్ట ప్రాంతాల ప్రజలను కిడ్నీ వ్యాధి వణికిస్తోంది. వందలాది మంది మృత్యువతా పడ్డారు. తాజాగా బోదవ్యాధి వ్యాపిస్తుండడంతో ఈ ప్రాంతీయులు భయాందోళన చెందుతున్నారు. ఉద్దాన ప్రాంతంలోని ప్రధాన మండలాలైన పలాస, వజ్రపుకొత్తూరు, మందస, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, సొంపేట ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందిలో పది నుంచి 15 మంది వరకూ బోదవ్యాధితో బాధపడుతున్నారు. పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో 30 మంది, బ్రాహ్మాణతర్లాలో 20 మంది వ్యాధితో అల్లాడుతున్నారు. అలాగే లక్ష్మీపురం, బెండి, వజ్రపుకొత్తూరు, పూండి, పలాస, కాశీబుగ్గ, బైపల్లి, అక్కుపల్లితోపాటు గిరిజన ప్రాంతంలో కూడా ఈ వ్యాధి లక్షణాలతో వందలాది మంది మంచం పట్టారు. నడకయాతన.. బోదవ్యాధి బారిన పడిన వారు నడకకు కూడా నరక యాతన పడుతున్నారు. బరువెక్కిన శరీరంతో అవిటితనాన్ని అనుభవిస్తున్నారు. ఎటువంటి పనులు చేసుకోలేక కుటుంబాలకు భారంగా మారుతున్నారు. లేచి నిలబడి మంచినీరును సైతం తీసుకోలేక ఇతరులపై ఆధారపడుతున్నారు. ఇంజక్షన్లు నిలిపివేత.. గత ప్రభుత్వాలు ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను ఉచితంగా అందించేవి. సామాజిక ఆస్పతుల్లో ఇంజక్షన్లు అందుబాటులో ఉంచేవారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎడాదిలోపే బోదవ్యాధిగ్రస్తులకు ఇచ్చే ఇంజక్షన్ల సరఫరాను నిలిపివేసింది. దీంతో వ్యాధిగ్రస్తులు డబ్బులుపెట్టి చికిత్స చేయించుకోలేక, రోజురోజుకూ పెరుగుతున్న శరీర బరువురును భరించలేక మానసికంగా కుంగుపోతున్నారు. దినదిన గండంగా ఉంటున్న వీరి పరిస్థితిని చూసి ఆయా కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. తోడులేకుండా చిన్న పని కూడా చేసుకోలేక మంచానికే పరిమితిమవుతున్న వారిని చూసి కన్నీరు పెడుతున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడంలేదని బాధను వ్యక్తం చేస్తున్నారు. వయసు నిండకుండానే అవిటితనంగా మారుతున్న వారికి కనీసం పింఛన్ కూడా అందించడం లేదు. ప్రభుత్వం స్పందించి ఉచిత వైద్యంతోపాటు.. పింఛన్ అందేలా చూడాలని వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబాలు వేడుకుంటున్నాయి. శుభకార్యాలకు సైతం అందని ఆహ్వానాలు బోదవ్యాధి బారిన పడిన వారితో సహా.. వారి కుటుంబాలు వింతపరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తమను శుభకార్యాలు, ఉపాధి హామీ పథకం పనులకు కూడా పిలవడం లేదని చాలామంది బాధను వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మాతర్లా గ్రామంలో దాసరి బోగమ్మ, దాసరి వల్లయ్య, బడే జంగమయ్య, పైల నారాయణరావు, తలగాపు నర్సమ్మ, రోళ్ల బయ్యన్నతోపాటు 20 మందికిపైగా బోద మహమ్మారితో మంచానికే పరిమితమయ్యారు. నడవలేకపొతున్నాను నేను బిలాయ్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేసేవాడిని. గ్రామానికి వచ్చి వెళ్లేవాడిని ఆరుబయట పడుకున్నప్పుడు దోమలు కరిచాయి. అప్పటి నుంచి బోదవ్యాధి సోకింది. కాళ్లు వాపులతో అవిటివాడిలా ఇంటికే పరిమితమయ్యాను. ఎటువంటి వైద్య సేవలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. – గేదెల శ్రీరాములు, వ్యాధిగ్రస్తుడు, బొడ్డపాడు ఇంజక్షన్లు నిలిపివేశారు ఫైలేరియాసిస్ దోమకాటు కారణంగా బోదవ్యాధి సంక్రమిస్తుంది. మైక్రో ఫైలేరియా మనిషిశరీరంలోకి ప్రవేశించి తన పెరుగుదలను నెమ్మదిగా చూపుతుంది. శరీరంలో ఏ అవయవానికి సంక్రమించినా అది పెరుగుతుంది. మగవారిలో వృషనాలకు సైతం ఎఫెక్టు ఉంటుంది. మైక్రోరిలెన్ జ్వరంతో శరీరంలో లక్షణాలు చూపుతుంది. రక్తపరీక్ష ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. ప్రారంభంలోనే డయటిఇధైల్ కార్బన్జిన్ సిట్రస్‌ను 21 రోజులు శరీరంలోకి పంపించాలి. అంతకు మించిన స్టేజి దాటితే ఎవ్వరూ దానిని నయంచేయలేరు. ఇదివరకు సిప్రోల్ సర్జరీ చేసేవారు. లావుగా ఉన్న కాళ్లను సైజుతగ్గించే విధంగా వైద్యం అందించేవారు. ప్రభుత్వ ఆస్పపత్రిలో ఇంజక్షన్లు అందించేవారు. అయితే ఆ ఇంజక్షన్లు ఎముకలపై ప్రభావం చూపుతుండడంతో నిలిపివేశారు. పలాస ప్రభుత్వ ఆస్పత్రికి వారానికి పదిమందికిపైగా వ్యాధిగ్రస్తులు వచ్చి వెళ్తుంటారు. – డాక్టర్ ప్రకాశవర్మ, పలాస ప్రాంతీయ ఆస్పత్రి ఆస్పత్రి పర్యవేక్షులు -
బోద.. తీరని బాధ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫైలేరియా సమస్య తీవ్రంగా ఉంది. వైద్య, ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 47,476 మంది ఫైలేరియా బాధితులు ఉన్నారు. వీరిలో బోదకాలు (లింపోడెమ ఫైలేరియా) సమస్యతో బాధపడేవారు 46,476 మంది, వరిబీజంతో సతమతమయ్యేవారు 1,042 మంది ఉన్నారు. పరిసరాల అపరిశుభ్రతతో వృద్ధి చెందే క్యూలెక్స్ దోమకాటు బోదకాలు వ్యాధికి కారణమవుతోంది. మనిషి శరీరంలోకి క్రిమి (పారాసైట్) నెమ్మదిగా వ్యాప్తి చెందుతూ మూడు రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బోదకాలు (లింపోడెమ ఫైలేరియా) సోకినవారి కాలు పెద్దగా మారుతుంది. పురుషుల్లో వరిబీజం (హైడ్రోసెల్), మహిళల్లో రొమ్ముల బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఫైలేరియాను నిర్లక్ష్యం చేస్తే రోజురోజుకూ కాలు పెద్దగా మారి నడవలేని స్థితికి చేరుతుంది. ఫైలేరియా సమస్య తీవ్రతను అంచనా వేసేందుకు ఆరోగ్యశాఖ ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తుంది. ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒకేసారి నాలుగు వేల మంది రక్త నమూనాలను సేకరిస్తారు. ఫైలేరియాకు కారణమయ్యే క్రిమి మనుషుల రక్తనాళాల్లోకి రాత్రిపూట మాత్రమే విస్తరిస్తుంది. దీంతో రాత్రి తొమ్మిది నుంచి 12 గంటలలోపు మాత్రమే రక్త నమూనాలను సేకరించాల్సి ఉంటుంది. కాలివేళ్ల నుంచి ఈ రక్త నమూనాలను తీసుకుంటారు. పరీక్షలో 40 కంటే ఎక్కువగా పాజిటివ్ అని వస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా భావిస్తారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఈ 5 జిల్లాల్లోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిని సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతం (హై రిస్క్ జోన్)గా వైద్య, ఆరోగ్య శాఖ నిర్ధారించింది. ఐదేళ్లపాటు డీఈసీ మాత్రలు వాడాలి.. ఫైలేరియా సోకే ప్రాంతాల్లోని వారు వరుసగా ఐదేళ్లపాటు డీఈసీ మాత్రలను వాడితే సమస్య శాశ్వతంగా తీరిపోతుంది. బోదకాలు సోకిన శరీర భాగాలను నిత్యం నీటితో శుభ్రపర్చాలి. తప్పనిసరిగా ఆయింట్మెంట్ రాసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. – డాక్టర్ ఎస్.ప్రభావతి, ఫైలేరియా నిర్మూలన రాష్ట్ర అధికారి -
అందమైన దెయ్యం!
దెయ్యం అందంగా ఉంటుందా? ఉంటుందట. అచ్చంగా అనుష్కా శర్మ అంత అందంగా ఉంటుందట. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? మరేం లేదు... ఓ చిత్రంలో ఈ బ్యూటీ దెయ్యంలా నటించనున్నారు. మనిషి పాత్రలకన్నా దెయ్యం పాత్రలకు నటనకు స్కోప్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అందుకే అనుష్కా శర్మ ఈ పాత్ర చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని తన హోమ్ బేనర్లోనే నిర్మించనున్నారు. ‘ఎన్‌హెచ్10’ ద్వారా ఆమె నిర్మాతగా మారిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. దాంతో రెట్టింపు ఉత్సాహంతో రెండో సినిమా మొదలుపెట్టనున్నారు. ఇటీవలే కథ ఫైనలైజ్ చేశారు. ఈ చిత్రానికి ‘ఫిలౌరి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కామెడీ, హారర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆమె దెయ్యంగా భయపెడుతూ, నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. పంజాబీ పెళ్లి నేపథ్యంలో సాగే చిత్రం ఇది. దీనికి అన్షాయ్ లాలా అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. -
పంచుకున్నారు!
నిజామాబాద్ అర్బన్ : ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయి. కిం ది స్థాయిలో నిధుల దుర్వినియోగం జోరుగా సాగుతోంది. దీనికి ఈ వ్యవహారమే తార్కా ణం. ఫైలేరియా నివారణ కోసం వైద్య, ఆరోగ్య శాఖ ఏటా మాత్రలను పంపిణీ చేస్తుంది. మాత్రల కొనుగోలు కోసం ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. ఇందులో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వచ్చిన నిధులను సద్వినియోగం చేయకుండా తామే పంచేసుకుంటున్నారు. ఈ ఏడాది కూడా ఇదే తతంగం కొనసాగింది. సగం నిధులను తప్పుడు బిల్లులతో మిం గేశారు. ఈ వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇదీ సంగతి ఈనెల 14,15,16 తేదీలలో జిల్లావ్యాప్తంగా బోదకాలు వ్యాధి నివారణ కోసం వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా మాత్రలను పంపిణీ చేశారు. ఇం దుకోసం ప్రభుత్వం జిల్లాకు 23,75,500 రూ పాయలను మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లాలోని 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు ఏరియా ఆస్పత్రుల పరిధిలోని 23,04,500 మందికి మాత్రలు పంపిణీ చేయాలి. మూడు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో 9,500 మంది వైద్య సిబ్బంది, 940 మంది సూపర్వైజర్లు, 16 మంది ప్రత్యేక అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందులో విధులు నిర్వహించినందుకుగాను అంగన్వాడీ కార్యకర్తలకు రోజుకు 100 రూపాయల చొప్పున చెల్లించాలి. కానీ, ఇప్పటి వర కూ వారికి అందాల్సిన రూ. 5,42,400 అందలేదు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌కు రూ.23 వేలను ఖర్చు చేసినట్లు చూపారు. కానీ, ఈ టీమ్ అసలు ఏర్పాటే కాలేదు. వీరు రాత్రిపూట దోమల లార్వా నివారణ కోసం పని చేయాల్సి ఉంటుం ది. ఈ ప్రక్రియ మాత్రం అమలు కాలేదు. రూ.80 వేల ను ప్రచార కోసం కేటాయించగా, ఖర్చుచేసినట్లు నివేదికలో చూపారు. వాస్తవానికి బ్యానర్లు, పోస్లర్టు, బుక్లెట్లు హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నుంచే సరఫరా చేశారు. వీటిని మలేరియా శాఖ ఆయా కేంద్రాలకు పంపిణీ చేసింది. 75 బ్యానర్లు, ఐదు వేల ప్లకార్డులు ముద్రించామని, దీనికే రూ. 80 వేలు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. రవాణా పేరిట కూడా జిల్లా కేంద్రం నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బో దకాలు నివారణ మందులను చేరవేయడానికి రూ. 30 వేల రూపాయలను ఖర్చు చేశారు. వాస్తవానికి జిల్లాకేంద్రంలో సమావేశం నిర్వహించి, సమావేశానికి వచ్చి న మెడికల్ ఆఫీసర్లకు, సిబ్బందికి మందులను అందజేశారు. వీరే ఆరోగ్యకేంద్రాలకు మందులను తీసుకెళ్లారు. మాత్రలు వేసుకున్న తరువాత ఏదైనా ప్రమాదం జరిగితే, ఆస్పత్రికి తరలించడానికి ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సిబ్బందికి శిక్షణ ఇస్తారు. దీనికి రూ. 30 వేలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమాలను మాత్రం నిర్వహించలేదు. మెడికల్ ఆఫీసర్లు, పారామెడికల్ సిబ్బంది కి ఒక్కో రోజు శిక్షణ కోసం రూ. 85 వేలు ఖర్చు చేసిన ట్లు చూపారు. పలువురు గైర్హాజరైనా గౌరవ వేతనం అందించినట్లు నివేదికలో చేర్చినట్లు తెలిసింది. ఇంటింటికి తిరుగుతూ మాత్రల పంపిణీ చేపట్టవల్సి ఉండగా, జిల్లా కేంద్రంతోపాటు మరికొన్ని చోట్ల పాఠశాల, కళాశాల విద్యార్థులకే పంపిణీ చేసి, నివేదికలు రూపొందిం చినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఓ ఉన్నతాధికారి హస్తం ఉన్నట్లు సమాచారం. మలేరియా శాఖలోని ఇద్ద రు ఉద్యోగులు తప్పుడు బిల్లులు తీసుకరావడంలో సహకరించారని తెలిసింది. -
మాత్రలు వికటించి 10మంది విద్యార్థులకు అస్వస్థత
నల్గొండ: జిల్లాలోని చౌటుప్పల్ మండలం లక్కారంలో 10 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు తీసుకున్న పైలేరియా మాత్రలు వికటించడంతో తీవ్ర అస్వస్థతకు లోనైయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
ఈ సారైనా ‘బోద’పడేనా!
- ఫైలేరియా విభాగంలో డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ - సిబ్బంది పనితీరుపై ఆరా - హైరానా పడ్డ సిబ్బంది కాకినాడ క్రైం : అది కాకినాడలోని ఫైలేరియా రీసెర్చ అండ్ ట్రైనింగ్ సెంటర్ (ఎఫ్‌ఆర్‌టీసీ)... బుధవారం, సమయం : ఉదయం పదిగంటలు కావస్తోంది... ఎప్పుడూ లేనంత కంగారుగా.. కాస్త హడావుడిగా సిబ్బంది ఉన్నారు. అంతే కాదండోయ్ కొంతమంది సిబ్బంది ఖాకీ యూనిఫాం ధరించి, వీపులకు స్ప్రేయర్లు తగిలించుకుని సిద్ధంగా ఉన్నారు. ఇంతలో అక్కడికి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎం.పవన్‌కుమార్ ఆకస్మిక తనిఖీకి విచ్చేశారు.(పేరుకి ఆకస్మిక తనిఖీ అయినా, సిబ్బందికి ముందే లీకైంది). ఫైలేరియా విభాగ పనితీరును తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టీని పరిశీలించారు. దోమల నిర్మూలనకు ఫైలేరియా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. జిల్లాలో బోద వ్యాధి ఆనవాళ్లు అధికంగా ఉన్న ప్రాంతాలపై దృష్టిసారించాలని ఆ విభాగ అధికారులను ఆదేశించారు. సుమారు అరగంటపాటు డీఎంహెచ్ఓ పర్యటన సాగడం, సిబ్బంది పనితీరుపై ఆయన ఆరాతీయడంతో అక్కడి వారంతా హడలెత్తిపోయారు. మరోవైపు ఎప్పుడూ యూనిఫాం ధరించని కొంతమంది సిబ్బంది హఠాత్తుగా యూనిఫాంతో కనిపించేసరికి పలువురి సిబ్బంది వారిని చూసి ఆశ్చర్యపోయారు. షరా మామూలే... ఫైలేరియా విభాగంలో డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు నిర్వహించినంత సేపు హైరానా పడిన సిబ్బంది... ఆయన వెళ్లిపోయిన వెంటనే షరా మామూలే అన్నట్టు వారి వీపులకు ఉన్న స్ప్రేయర్లను పక్కన పెట్టేసి కార్యాలయానికే పరిమిత మయ్యారు. ఇది గ మనించిన కొందరు ‘‘అమ్మో... ఎంతగా నటించారో.. మీరు మారరు!’’ అన్నట్టు వారికేసి చూశారు. ఈ విభాగంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని, సిబ్బందికి చిత్తశుద్ధి కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ విభాగంలో కొందరు ఇంకా డిప్యుటేషన్లపై కొనసాగడం చర్చనీయాంశమైంది. విభాగ పరిస్థితిపై కలెక్టర్ నీతూప్రసాద్ కూడా దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు. -
దోమల రాజ్యం
నివారణలో పురపాలక నిర్లక్ష్యం వ్యాధులతో పట్టణవాసులకు అనారోగ్యం యలమంచిలి : దోమల విజృంభణతో యలమంచి లి పట్టణవాసులు భయపడిపోతున్నారు. వీటి నివారణకు రూ.లక్షలు ఖర్చవుతున్నా ఫలితం కనిపిం చడం లేదని మండిపడుతున్నారు. ఈ మున్సిపాలిటీ లో జ్వరపీడితుల సంఖ్య ఇటీవల ఎక్కువగా ఉంది. జ్వర బాధితులతో పట్టణంలో ఆస్పత్రులు కిటకిట లాడుతున్నాయి. దోమ కాటుతో మలేరియా, డెం గ్యూ, ఫైలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. చర్యలు అంతంత మాత్రమే.. దోమల నివారణకు పురపాలక సంఘం చిత్తశుద్ధితో కార్యాచరణ అమలు చేయటం లేదు. దోమల కారక మురికి కాల్వలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో వాటి లార్వాలు చనిపోయేందుకు ప్రతి వారం బెటైక్సు, మలాథియన్ రసాయనాలు పిచికారీ చేయాలి. లార్వాలు తినే గంబూషియా చేపలు మురికి కాల్వల్లో వదలాల్సి ఉండగా ఆ మాటే మరిచారు. మరుగు కాల్వల్లో ఎం.ఎల్ ఆయిల్ బాల్స్ వేయాల్సి ఉన్నా నామమాత్రంగా వేసి నిధులు ఖర్చయినట్టు చూపిస్తున్నారు. ఫాగింగ్ చేయాల్సి ఉన్నా ఆ ఊసే పక్కనపెట్టేశారు. కొద్ది నెలలుగా మున్సిపాలిటీ పరిధిలో ఫాగింగ్ యంత్రాలు మూలకు చేరినా పట్టించుకోకపోవడం దోమల నివారణపై చూపుతున్న శ్రద్ధ ఏపాటిదో అర్ధమైపోతోంది. మరుగుదొడ్ల ద్వారా దోమలు వ్యాప్తి చెందకుండా గొట్టాలకు వలలు కట్టారు. చెత్త నిల్వ ప్రాంతాల్లో తొలగించిన తరువాత బ్లీచింగ్ చల్లాలి. కేవలం చెత్త ఏరివేసి సరిపెట్టేస్తున్నారు. అస్తవ్యస్థ డ్రైనేజీ వ్యవస్థ.. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారి ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి దుర్వాసన వస్తోంది. దీంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. పట్టణంలో యానాద్రి కాలువ పూడికతో నిండి కాలువలన్నీ శిథి లమయ్యాయి. మూడేళ్ల క్రితం గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చే స్తామని ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. గత ఎమ్మెల్యే కన్నబా బు యానాద్రి కాలువ విస్తరణ పను లు చేయించాలని ప్రయత్నించినా మధ్యలోనే నిలిచిపోయింది. మలేరియా, ఫైలేరియా, మెదడువాపు వ్యాధి, డెంగ్యూ వంటి వ్యాధులు దోమలు కారణంగా వ్యాప్తి చెందుతున్నాయి. శివారుగ్రామాలు కట్టుపాలెం, గొల్లలపాలెం, మంత్రిపాలెం, కొక్కిరాపల్లి, వెంకటాపురం గ్రామాల్లో రోడ్లన్నీ బహిర్భూమిగా ఉపయోగించడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. దోమల నిర్మూలనకు చర్యలు.. పట్టణంలో దోమల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. తరచూ మలాథియాన్, బెటైక్స్ పిచికారీ చేస్తున్నాం. మురుగు కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా చూస్తున్నాం. రూ.10 లక్షలతో యానాద్రి కాలువ, మరికొన్ని ప్రధాన మురుగు కాలువల్లో పూడిక తీయిం చేందుకు త్వరలో టెండర్ ఖరారు చేస్తాం. -సత్తారు శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ -
అందరూ పని దొంగలే!
►ఇదీ ఎఫ్‌ఆర్‌టీసీ విభాగం పరిస్థితి ►కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి వరకు అందరిదీ ‘మామూళ్ల’ బాటే కాకినాడ క్రైం : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖను అవినీతి భూతం వెంటాడుతూనే ఉంది. తాజాగా ఫైలేరియా విభాగంలో అవినీతి వెలుగుచూసింది. జిల్లాలో బోద వ్యాధిగ్రస్తులు అధికంగా ఉండడంతో డీఎంహెచ్ఓ కార్యాలయ ఆవరణలో ఫైలేరియా రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (ఎఫ్‌ఆర్‌టీసీ) ఏర్పాటు చేశారు. కాకినాడలో మూడు యూనిట్లు, రాజమండ్రిలో రెండు, పిఠాపురంలో రెండు, మండపేట, పెద్దాపురం, అమలాపురం, రామచంద్రపురంలో ఒక్కో యూనిట్ ఎఫ్‌ఆర్‌టీసీ నేతృత్వంలో పనిచేస్తుంటాయి. ఇన్సెక్ట్ కలెక్టర్ ప్రతి రోజు ఉదయం దోమలను సేకరించి వాటి వల్ల వ్యాప్తిచెందే వ్యాధులపై రీసెర్చ్ చేయాలి. ఫీల్డ్ వర్కర్లు పంపులతో కాల్వల్లో బయోటెక్స్, ఎబేట్ మందులను పిచికారీ చేయాలి. అయితే ఆ పంపులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఎఫ్‌ఆర్‌టీసీలో నెలకొంది. ఈ విభాగంలో 11 మంది ఇన్స్పెక్టర్లు, తొమ్మిది మంది మహిళా, 14 మంది పురుష ఫీల్డ్ వర్కర్లు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ విధులు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. వీరి నుంచి ముడుపులు తీసుకుంటున్న కొందరు అధికారులు వీరికి వంతపాడుతున్నారనే విమర్శలున్నాయి. ఉద్యోగుల సరెండర్ లీవులకు సంబంధించి బిల్లులు పాస్ చేసేందుకు ఒక్కో ఉద్యోగి నుంచి రూ.వెయ్యి వసూలు చేసినట్టు కొంత మంది సిబ్బంది చెబుతున్నారు. విధులకు హాజరుకాకుండానే... రాజమండ్రికి చెందిన ఓ ఉద్యోగి కాకినాడలో విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ విధులకు ఎగనామం పెట్టి, ఆ విభాగ అధికారులకు ముడుపులు అందజేసి ఉద్యోగాన్ని కాపాడుకుంటున్నాడని కొందరు ఉద్యోగులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. రాజమండ్రిలో విధులు నిర్వహిస్తోన్న ఓ మహిళా ఉద్యోగి రెండేళ్ల క్రితం కాకినాడ సరెండర్ చేశారు. అయితే ఆమె కూడా పనిలేకుండా కాకినాడలోని ఎఫ్‌ఆర్‌టీసీలో ఉంటూ కాలం వెళ్లదీస్తోంది. పిఠాపురంలో ఇన్సెక్ట్ కలెక్టర్ ఒకరు భారీగా ముడుపులిచ్చి ప్రస్తుతం కాకినాడలో ఎస్ఆర్డబ్ల్యూగా విధులు నిర్వహిస్తున్నా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రిపోర్టులు సేకరించాల్సిన హెల్త్ ఇన్స్పెక్టర్ పరిస్థితి కూడా ఇలానే ఉందని ఆ విభాగ ఉద్యోగులే నిరసన వ్యక్తం చేస్తున్నారు. మండపేటలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగిని పనిష్మెంట్ పేరిట రామచంద్రపురానికి మార్చారని, అనధికారికంగా ఎఫ్‌ఆర్‌టీసీలో డిప్యుటేషన్లు కొనసాగిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ తీరుపై విమర్శలు ఎఫ్‌ఆర్‌టీసీ ప్రోగ్రాం ఆఫీసర్ తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బందితో పనిచేయించడంతో పాటు, పీఓగా విధులు నిర్వహించడంలోనూ ఆయన విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నారు. కాకినాడలోని ఎఫ్‌ఆర్‌టీసీలో అవుట్ పేషెంట్ విభాగాన్ని కూడా నిర్వహించడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పీఓ జిల్లాలోని అన్ని యూనిట్లను సందర్శించాల్సి ఉండగా వాహనాన్ని కూడా దుర్వినియోగపరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పేకేరు పీహెచ్సీలో వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తూ సస్పెన్షన్‌కు గురైన వైద్యురాలిని ఎఫ్‌ఆర్‌టీసీ పీఓగా నియమించారని, ఆమె పర్యవేక్షణ విభాగంపై పూర్తిగా కొరవడిందని వైద్య నిపుణులు విమర్శిస్తున్నారు. దృష్టి సారిస్తాం ఫైలేరియా విభాగంలో జరుగుతున్న అవినీతి, నిర్లక్ష్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. సరెండర్ లీవు ఉద్యోగుల హక్కు. వారి నుంచి సొమ్ములు తీసుకోవడం బాధాకరం. దీనిపై విచారణ నిర్వహిస్తాం. అవుట్ పేషెంట్ విభాగం, ఉద్యోగులు, సిబ్బంది విధులపై కూడా దృష్టి కేంద్రీకరిస్తాం. రిజిస్టర్లు పరిశీలించి పనితీరు తనిఖీ చేస్తాం. - ఎం. పవన్‌కుమార్, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ -
క్యూలెక్స్ దోమషికార్
విజృంభిస్తున్న ఫైలేరియా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడమే కారణం వర్షాకాలంలో పొంచి ఉన్న ప్రమాదం జాబితాలో కశింకోట, సత్యవరం, అనకాపల్లి అనకాపల్లి పట్టణంలో 364 మంది వ్యాధిగ్రస్తులు వర్షాకాలం మొదలైతే వైద్య, ఆరోగ్య శాఖకు దడ మొదలైనట్టే. ఈసారి ఈ దడకు కారణం ఫైలేరియా. వ్యాధి కారకాలు శరీరంలోకి ప్రవేశించినప్పటికీ ఐదేళ్ల వరకూ తెలుసుకోలేని వ్యాధి ఫైలేరియా. ఇపుడు అనకాపల్లిపై పడగ వేసింది. కొరుప్రోలు, కశింకోట, సత్యవరం, అనకాపల్లిలో ఎందరో ఫైలేరియా బారిన పడుతున్నారు. ఫైలేరియాను పూర్తి స్థాయిలో నివారించే మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌ను ప్రతి ఏడాది నవంబర్ నెలలో నిర్వహిస్తున్నా ఎక్కడో ఒక చోట ఈ వ్యాధి బయటపడుతోంది. అనకాపల్లి : పాలన పగ్గాలు చేపట్టేముందు వల్లమాలిన హామీలు గుప్పించే స్థానిక సంస్థల పాలకుల పారిశుద్ధ్య మెరుగుదలపై ప్రద ర్శిస్తున్న నిర్లక్ష్యం పలువురికి శాపంగా మారుతోంది. ఫైలేరియాపై అధికారుల లెక్కల ప్రకారం కొరుప్రోలులో కొత్త కేసులు బయటపడుతున్నాయి. గత ఏడాది నవంబర్ నెలలో చేపట్టిన సర్వేలో అక్కడ నాలుగు కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాది మార్చి నెలలో అనకాపల్లిలో ఒక ఫైలేరియా కేసు వెలుగులోకి వచ్చింది. తదుపరి స్థానాల్లో కశింకోట, సత్యవరం, యారాడ ఉన్నాయి. విఫలమౌతున్న డ్రైనేజీ వ్యవస్థ జిల్లాలో చాలా చోట్ల డ్రైనేజీ వ్యవస్థ విఫలమవుతోంది. కొన్ని చోట్ల పూడిక తీసి, కాస్తో కూస్తో బ్లీచింగ్, ఫినాయిల్ చల్లించి స్థానిక సంస్థల అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరపకపోవడానికి కారణం బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ల కొనుగోలుకు నిధుల కొరత అని చెప్పి తప్పించుకుంటున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సిబ్బంది కొరత అని ఆ విభాగం చెబుతుండగా, చాలా చోట్ల పూడికపోయిన కాలువలు, ఆక్రమణలతో కుచించుపోయి డ్రైనేజీ సిస్టం విఫలమయ్యింది. దీనికి గాను సంబంధిత ఇంజినీరింగ్ విభాగానిదే తప్పని పక్క శాఖ చెబుతోంది. నీటి నిల్వ ప్రమాదకరం... చాలా చోట్ల మురుగునీరు నిల్వ అత్యంత ప్రమాదకరంగా మారింది. మురుగు నీరు నిల్వ ఉండిపోవడంతో దోమలు, ఈగలకు ఆవాసాలుగా మారాయి. ఈ తరహా డ్రైనేజీ సిస్టం బాగా లేని ప్రాంతాలైన కొరుప్రోలు, అనకాపల్లి, కశింకోటలలో క్యూలెక్స్ దోమ విజృంభణ అధికంగా ఉంటుందని ఈ కారణంగానే ఫైలేరియా ఛాయాలు ఆయా ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తున్నాయని సంబంధిత శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. అనకాపల్లి పట్టణంలో 364 కేసులు.. : అనకాపల్లి డ్రైనేజీ సిస్టం పూర్తిగా విఫలమైంది. చాలా చోట్ల సాగు, మురుగు కాల్వల అనుసంధాన పనులను స్తంభించాయి. ప్లాస్టిక్,చెత్త వంటి వ్యర్థాలతో కాలువలు పూడికపోయి దోమలకు, ఈగలకు ఆవాసాలుగా మారాయి. ఈ కారణంగానే 364 ఫైలేరియా కేసులు ప్రస్తుతం ఉన్నాయి. వీరంతా ఫైలేరియా విజృంభించకుండా మందులు వేసుకుంటున్నారు. ఐదేళ్ల వరకూ తెలియని ఫైలేరియా... : క్యూలెక్స్ దోమ కాటుతో ఫైలేరియా వ్యాధి శరీరంలోకి చొచ్చుకుపోయినప్పటికీ ఐదేళ్ల వరకూ కనిపించదు. గగ్గ దిగడం, హైఫీవర్, కాళ్లు గట్టిగా అవ్వడం వంటి లక్షణాలు కలిగినట్టయితే ఫైలే రియా నివారణ విభాగాన్ని సంప్రదించాలని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి తాకిడి జరిగిన తొలినాళ్లలో వైద్యం తీసుకుంటే నయం అయ్యే అవకాశాలు ఉన్నాయని అనకాపల్లి యూనిట్ ఫైలేరియా నివారణ విభాగ సూపర్ వైజర్ ఎల్.ఎల్ ప్రసాద్ చెబుతున్నారు. -
నిర్లక్ష్య రోగం!
విజయనగరం ఆరోగ్యం:ప్రభుత్వం సరఫరా చేసిన దోమల నివారణ మందును ఇప్పటికే గ్రామాల్లో పిచికారీ చేయాలి. అయితే అలా జరగలేదు. ఆ మందు ఇంకా పీహెచ్‌సీల్లో మూలుగుతోంది. తాము ఎప్పుడో మందును సరఫరా చేశామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈనెలలోనే వచ్చినట్టు వైద్యాధికారులు అంటున్నారు. ఏది నిజయో తెలియని పరిస్థితి నెలకొంది. ఏప్రిల్‌లోనే మందు సరఫరా సీజనల్‌గా వచ్చే మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, ఫైలేరియా వంటి వ్యాధులును వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రభుత్వం ఈఏడాది ముందుస్తు చర్యలు చేపట్టింది. వ్యాధులను కలగజేసే దోమల ను సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశ్యంతో ప్రతీ పల్లె, పట్టణాల్లో పిచికారీ చేయడం కోసం దోమల నివారణకు ఉపయోగించే లార్విసెడ్, మలథీయాన్‌మందును ఏప్రిల్ నెలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సరఫరా చేసింది. వీటిని పీహెచ్‌సీలు ద్వారా గ్రామాలకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఆ మందులు ఇంకా పీహెచ్‌సీల్లోనే మూలుగుతున్నా యి. వైద్య ఆరోగ్యశాఖ సరఫరా చేసినమూటలను కూడా సబంధిత సిబ్బంది ఇంకా చాలా గ్రామాల్లో విప్పినట్టు లేదు. గంట్యాడ మండలంలోని పరిధిలోని పెదవేమలి, మురపాక, సిరిపురం, గ్రామాలను పరిశీలించగా ఇంకా ఆయా పంచాయతీలకు మందు చేరలేదు. అదేవిధంగా విజయనగరం మండలంలోని జొన్నవలస, పినవేమలి, రాకోడు గ్రామాలకు కూడా మందు చేరలేదు. జిల్లాకు సరఫరా అయిన మందు వివరాలు గ్రామాల్లో పిచికారీ చేయడానికి 1200 లీటర్లు లార్విసెడ్ కెమికల్, పట్టణాలకు 840 లీటర్లు మలాథి యాన్ , 330 లీటర్ల లార్విసెడ్ కెమికల్‌ను సరఫరా చేశారు. మందును జిల్లాలో ఉన్న 68 పీహెచ్‌సీలు ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలకు సరఫరాచేయాలి. మున్సిపాల్టీలకు మలేరియా సబ్ యూని ట్ సిబ్బంది అందజేయాలి. మందు సరఫరా అయి రెండు నెలలు అవుతున్న ఇంతవరకు మూటలు కూడా విప్పని పరిస్థితి. దీంతో గ్రామాల్లో మందును పిచకారీ చేయకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. జిల్లా వాసులకు మలేరియా, వైరల్,డెంగీ వంటి వ్యాధులు సోకుతున్నాయి. వారానికి ఒకసారి పిచికారీ చేయాలి గ్రామాలు, పట్టణాల్లో లార్విసెడ్, మలథీయా న్ మందును కాల్వల్లో వారానికి ఒకసారిపిచికారీ చేయాలి. ఇప్పటికే ఈకార్యక్రమాన్ని ప్రారంభిం చాల్సి ఉంది. కాని ఇంతవరకు ప్రారంభం కాలేదు. జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లో పారిశుధ్యం ఆధ్వాన్నంగా ఉంది. దీంతో దోమల వ్యాప్తి అధికంగా ఉంది. మందు పిచికారీ చేసి ఉంటే దోమల తగ్గేవి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు వల్ల దోమలు మరింత అధికమయ్యే ప్రమాదం ఉంది. ఏప్రిల్‌లోనే సరఫరా చేశాం... లార్విసెడ్, మలాథియాన్ మందులను ఏప్రిల్ నెలలోనే పీహెచ్‌సీలకు సరఫరా చేసేశాం. వాటిని గ్రామాలకు అందజేయమని ఆదేశాలు కూడా జారీ చేశాం. గ్రామాలకు సరఫరా కాని విషయం ఇంతవరకు నాకు తెలియదు. తక్షణమే గ్రామాలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. - యు.స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్. ఈ నెలలోనే మందు వచ్చింది మా పీహెచ్సీ పరిధిలో 19 పంచాయతీలున్నాయి. మాకు ఈనెల 5వతేదీన 5 లీటర్లు లార్విసెడ్ మందు ఇచ్చారు. మందు పూర్తి స్థాయిలో సరిపోతుందో లేదోనని తర్జన భర్జన పడ్డాం. ఒకటి రెండు రోజుల్లో పంచాయతీలకు పంపిస్తాం - డాక్టర్ రాజశేఖర్, గంట్యాడ పీహెచ్సీ వైద్యాధికారి -
బోదను మరిచారా?
రాయవరం, న్యూస్‌లైన్ : తాము చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ శాపగ్రస్థులుగా మారుతున్నారు ఫైలేరియా వ్యాధి గ్రస్థులు. దోమకాటుతో సోకే ఈ వ్యాధితో శరీరంలో భాగాలు బాగా వాచిపోతాయి. ఆభాగంలో బరువు అధికంగా ఉంటుంది. దాంతో కురూపులవుతుంటారు. ఈ వ్యాధి నివారణకు ప్రభుత్వం ప్రతీ ఏటా నవంబర్ 11న ఫైలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఆ సందర్భంగా డీఈసీ మాత్రల పంపిణీని నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటి వరకు 13 విడతలుగా ఫైలేరియా దినోత్సవాన్ని నిర్వహించిన జిల్లా యంత్రాంగం గతేడాది 14వ విడత ఫైలేరియా దినోత్సవాన్ని నిర్వహించలేదు. బోదవ్యాధిని నిర్లక్ష్యం చేస్తున్నారనడానికి ఇదే ప్రత్యక్ష తార్కాణం. ఫైలేరియా వస్తుందిలా... ప్రపంచ వ్యాప్తంగా దీన్ని లింఫాటిక్, సబ్ క్యూటినస్, సీరస్ క్యావిటీ ఫైలేరియాలుగా విభజించగా మన దేశంలో లింఫాటిక్ ఫైలేరియా వ్యాధిగ్రస్థులు మాత్రమే ఉన్నారు. దీనినే బ్రాంకఫ్టిన్ ఫైలేరియగా కూడా పిలుస్తారు. క్యూలెక్స్ ఆడదోమ కుట్టడం వలన ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. దోమల నియంత్రణ ఏదీ.. దోమల నిర్మూలన కేంద్రాలు రామచంద్రపురం, మండపేట, అమలాపురం, పెద్దాపురం, పిఠాపురం మున్సిపాల్టీల్లో ఒక్కొక్కటి, రాజమండ్రిలో రెండు, కాకినాడలో మూడు ఉన్నాయి. పల్లెల్లో దోమల నిర్మూలన కేంద్రాలు లేకపోవడంతో దోమలు దారుణంగా ప్రబలుతున్నాయి. ఫైలేరియా శాఖకు సిబ్బంది కొరత ఫైలేరియా శాఖ సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. పట్టణాల్లో దోమల నియంత్రణకు ఎబేట్ అనే దోమల మందును స్ప్రేచేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఫీల్డ్ స్టాఫ్ 96మంది ఉండాల్సి ఉండగా కేవలం 36మంది మాత్రమే ఉన్నారు. రామచంద్రపురం, అమలాపురం యూనిట్లలో రెండేళ్లుగా ఫీల్డ్ వర్కర్లు ఒక్కరూ లేరు. హెల్త్ ఇనస్పెక్టర్లు పూర్తిస్థాయిలో ఉన్నా సుపీరియర్ ఫీల్డ్ వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇన్సెక్ట్ కలెక్టర్లు తగినంతమంది లేరు. 28 నుంచి 30 వరకు డీఈసీ మాత్రల పంపిణీ బోధ వ్యాధి నియంత్రణలో భాగంగా జిల్లాలో ఈనెల 28 నుంచి 30వ తేదీవరకు మూడురోజులపాటు 1.20 కోట్ల డీఈసీ మాత్రల పంపిణీకి చర్యలు చేపట్టినట్టు జిల్లా ఫైలేరియా అధికారిణి డాక్టర్ జక్కంశెట్టి శశికళ తెలిపారు. రెండేళ్లు పైబడి, 65 సంవత్సరాల లోపు ఉన్న 50 లక్షల జనాభాకు ఈ మాత్రలు అందజేస్తామన్నారు. అదేవిధంగా 54 లక్షల ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నామన్నారు. ఆ మూడురోజుల్లో ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు, ఆశ కార్యకర్తలు, పారామెడికల్ సిబ్బంది డీఈసీ మాత్రల పంణీలో పాల్గొంటారన్నారు. ఫైలేరియా శాఖలో సిబ్బంది కొరత ఉన్న విషయం వాస్తవమేనన్నారు. జిల్లాలో ఫైలేరియా తీరు 1972లో మన జిల్లాలో 11 శాతం మంది ఫైలేరియా వ్యాధి క్రిమి కలిగిన వారు ఉండేవారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ బోధ వ్యాధి నివారణను పైలట్ ప్రాజెక్టుగా మన జిల్లాలో 1999 నవంబర్ 11న ప్రారంభించింది. 1999లో వ్యాధికారక క్రిమి రేటు జిల్లాలో 4 శాతం ఉండేది. 2010 నాటికి 0.14 శాతానికి తగ్గినట్టు జిల్లా ఫైలేరియా అధికారిణి డాక్టర్ శశికళ తెలిపారు. {పస్తుతం జిల్లాలో 15,533మంది బోధ వ్యాధిగ్రస్థులు ఉన్నట్టు సీనియర్ ఎంటమాలజిస్ట్ ప్రసాద్ తెలిపారు. రాయవరం, మాచవరం, రామచంద్రపురం, మండపేట, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, నేలటూరు, అంగర, పిఠాపురం ప్రాంతాలలో ఈ వ్యాధిగ్రస్థులు ఎక్కువగా ఉన్నారు. 1999 నుంచి 2012 వరకు ప్రతీ ఏటా ఫైలేరియా దినోత్సవం జరిగింది.