సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫైలేరియా సమస్య తీవ్రంగా ఉంది. వైద్య, ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 47,476 మంది ఫైలేరియా బాధితులు ఉన్నారు. వీరిలో బోదకాలు (లింపోడెమ ఫైలేరియా) సమస్యతో బాధపడేవారు 46,476 మంది, వరిబీజంతో సతమతమయ్యేవారు 1,042 మంది ఉన్నారు. పరిసరాల అపరిశుభ్రతతో వృద్ధి చెందే క్యూలెక్స్ దోమకాటు బోదకాలు వ్యాధికి కారణమవుతోంది. మనిషి శరీరంలోకి క్రిమి (పారాసైట్) నెమ్మదిగా వ్యాప్తి చెందుతూ మూడు రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బోదకాలు (లింపోడెమ ఫైలేరియా) సోకినవారి కాలు పెద్దగా మారుతుంది. పురుషుల్లో వరిబీజం (హైడ్రోసెల్), మహిళల్లో రొమ్ముల బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఫైలేరియాను నిర్లక్ష్యం చేస్తే రోజురోజుకూ కాలు పెద్దగా మారి నడవలేని స్థితికి చేరుతుంది. ఫైలేరియా సమస్య తీవ్రతను అంచనా వేసేందుకు ఆరోగ్యశాఖ ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తుంది. ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒకేసారి నాలుగు వేల మంది రక్త నమూనాలను సేకరిస్తారు. ఫైలేరియాకు కారణమయ్యే క్రిమి మనుషుల రక్తనాళాల్లోకి రాత్రిపూట మాత్రమే విస్తరిస్తుంది. దీంతో రాత్రి తొమ్మిది నుంచి 12 గంటలలోపు మాత్రమే రక్త నమూనాలను సేకరించాల్సి ఉంటుంది. కాలివేళ్ల నుంచి ఈ రక్త నమూనాలను తీసుకుంటారు. పరీక్షలో 40 కంటే ఎక్కువగా పాజిటివ్ అని వస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా భావిస్తారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఈ 5 జిల్లాల్లోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిని సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతం (హై రిస్క్ జోన్)గా వైద్య, ఆరోగ్య శాఖ నిర్ధారించింది.
ఐదేళ్లపాటు డీఈసీ మాత్రలు వాడాలి..
ఫైలేరియా సోకే ప్రాంతాల్లోని వారు వరుసగా ఐదేళ్లపాటు డీఈసీ మాత్రలను వాడితే సమస్య శాశ్వతంగా తీరిపోతుంది. బోదకాలు సోకిన శరీర భాగాలను నిత్యం నీటితో శుభ్రపర్చాలి. తప్పనిసరిగా ఆయింట్‌మెంట్ రాసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
– డాక్టర్ ఎస్.ప్రభావతి, ఫైలేరియా నిర్మూలన రాష్ట్ర అధికారి
Comments
Please login to add a commentAdd a comment