రాష్ట్రంపై డెంగీ కాటు! | Dengue attack on the state! | Sakshi
Sakshi News home page

రాష్ట్రంపై డెంగీ కాటు!

Published Sun, Oct 15 2017 12:54 AM | Last Updated on Sun, Oct 15 2017 6:50 AM

Dengue attack on the state!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంపై డెంగీ, మలేరియా, విష జ్వరాలు మళ్లీ పంజా విసురుతున్నాయి. విభిన్న వాతావరణ పరిస్థితులతో రోజు రోజుకూ విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలోని 173 గ్రామాలు డెంగీ ప్రభావానికి గురయ్యాయని, ఈ ఏడాది ఇప్పటివరకు 1,799 మందికి సోకిందని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ధారించింది. అనధికారికంగా ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాలు, పారిశుధ్య లోపం, దోమల బెడదతో డెంగీ వ్యాప్తి చెందుతోంది. మరోవైపు డెంగీ బాధితులకు చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీకి తెరలేపాయి. లక్షల రూపాయలు వసూలు చేస్తూ పీల్చి పిప్పిచేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక డెంగీ సోకినవారు వేల సంఖ్యలో ఉన్నా దానితో మృతి చెందిన ఘటనలేమీ నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ చెబుతుండగా.. ఇతర వ్యాధులు కూడా ఉండి డెంగీతో మృతి చెందినవారిని వైద్య శాఖ డెంగీ బాధితులుగా గుర్తించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో డెంగీ మరణాలు లేవని నివేదికలో పేర్కొంటోందని అంటున్నారు. 

ఖమ్మం, హైదరాబాద్‌లలో అధికంగా.. 
ఖమ్మం, హైదరాబాద్, మహ బూబ్‌నగర్‌ జిల్లాల్లో డెంగీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఖమ్మం జిల్లా లో అత్యధికంగా 572, హైదరాబాద్‌లో 426, మహబూబ్‌నగర్‌లో 134 మంది డెంగీతో బాధపడుతున్నారు. మలేరియా జ్వరాలు కూడా విజృంభిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1,940 మంది మలేరియా బారినపడ్డారు. కొత్త గూడెం, భూపాలపల్లి, హైదరాబాద్‌ జిల్లా ల్లో మలేరియా బాధితులు ఎక్కువగా ఉన్నారు. 

ప్లేట్‌లెట్ల పేరుతో దోపిడీ 
డెంగీ బాధితులకు చికిత్స విషయంలో ప్రభుత్వ ఆస్పత్రులు చేతులెత్తేస్తుండడంతో.. బాధితులను ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు నిలు వునా దోచుకుంటున్నాయి. రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిందంటూ ప్లేట్‌లెట్‌ ప్యాకెట్లు ఎక్కిస్తున్నాయి. ఒక్కో ప్లేట్‌లెట్‌ ప్యాకెట్‌ ధర ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటోంది. కార్పొరేట్‌ ఆస్పత్రులైతే ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. అవసరం లేకున్నా కూడా ఒక్కో డెంగీ బాధితులకు ఐదు నుంచి 20 వరకు ప్లేట్‌లెట్‌ ప్యాకెట్లు ఎక్కిస్తున్నారు. ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉంచుకుని లక్షల రూపాయలు బిల్లు వసూలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వాస్పత్రులు డెంగీ పరీక్షలు, చికిత్స చేసే వసతులు లేవంటూ రోగులను పంపేస్తున్నాయి. మరోవైపు డెంగీ ఆరోగ్యశ్రీలో లేకపోవడంతో దాని బారిన పడే పేదల జీవితాలు ఆగమైపోతున్నాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కోలుకోలేని దుస్థితిలోకి వెళ్లిపోతున్నాయి. 

పరిసరాల పరిశుభ్రతే అసలు మందు.. 
వర్షాలతో నీరు నిలవడం, పారిశుధ్య లోపాలే డెంగీ, మలేరియాల వ్యాప్తికి ప్రధాన కారణం. డెంగీ కారక దోమలు మంచినీటిలోనే వృద్ధి చెందుతాయి. నిల్వ ఉండే నీటిలో, డ్రమ్ములలో నిల్వ చేసే నీటిలో ఈ దోమలు పెరుగుతాయి. ఇక డెంగీ కారక దోమలు పగటిపూటే కుడతాయి. దీంతో పగటిపూట ఇళ్లలో ఉండే మహిళలు, పిల్లలే ఎక్కువగా బాధితులు అవుతున్నారు. ఇక దోమల నివారణ మందులు, దోమ తెరలు వినియోగిస్తూ.. డెంగీ రాకుండా నివా రించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాం 
‘‘డెంగీ, మలేరియాల నివారణ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. డెంగీ ప్రభావం ఉన్న 117 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 123 వైద్య శిబిరాలు నిర్వహించాం. గ్రామాల్లో ఇళ్ల వారీగా నీటినిల్వలను పరిశీలించి దోమల నివారణకు చర్యలు చేపట్టాం. అవసరమైన వారికి వెంటనే చికిత్స అందిస్తున్నాం..’’    
– డాక్టర్‌ ఎస్‌.ప్రభావతి,  వైద్యశాఖ అదనపు డైరెక్టర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement