![Mosquito outbreaks with climate change - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/8/doma.jpg.webp?itok=avqVqq_k)
సాక్షి, అమరావతి : ప్రపంచవ్యాప్తంగా మానవాళికి డెంగీ ముప్పు పొంచి ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా దోమలు, వైరస్‌ల వ్యాప్తి పెరగడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఇటీవల వెల్లడించింది.
దశాబ్దకాలంగా డెంగీ, జికా, చికున్ గున్యా వంటి ఆర్బోవైరస్‌ల వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లు భారీగా పెరిగాయని ప్రకటించింది. ఏడాదికి 100 మిలియన్ల నుంచి 400 మిలియన్‌ల వరకు ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయని ప్రకటించింది. ప్రస్తుతం జనాభాలో దాదాపు సగం మందికి డెంగీ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
డబ్ల్యూహెచ్‌వో వెల్లడించిన కొన్ని ముఖ్యమైన వివరాలు...
♦ అటవీ నిర్మూలన, పారిశుధ్యం, పట్టణీకరణ, నీటిపారుదలలో సమస్యలు దోమలవ్యాప్తికి ప్రధాన కారణం.
♦ ముఖ్యంగా అవపాతం(వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి ద్రవీకరించడం), ఉష్ణోగ్రత పెరుగుదల, అధిక తేమ వంటివి దోమల అవాసాలకు అనుకూలంగా ఉన్నాయి.
♦ ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరంలో డెంగీ కేసులు సుమారు 0.5 మిలియన్ నమోదవగా, 2019 నాటికి 5.2 మిలియన్లకు పెరిగాయి. 2023లోనూ ఇదే ఉధృతి కొనసాగుతోంది.
♦ ఈ ఏడాది దాదాపు 129 దేశాలు డెంగీ బారినపడే ప్రమాదం ఉంది. ఇప్పటికే 100కి పైగా దేశాల్లో డెంగీ వ్యాప్తి కనిపిస్తోంది.
♦ ఈ ఏడాది మార్చి చివరి వరకు ప్రపంచవ్యాప్తంగా 4,41,898 డెంగీ కేసులు నమోదవగా, 119 మంది మరణించారు.
♦ చికున్ గున్యా దాదాపు అన్ని ఖండాల్లో విస్తరించింది. ప్రస్తుతం సుమారు 115 దేశాల్లో దాని ప్రభావం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment