పశ్చిమబెంగాల్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తనను కుట్టిన దోమలను బ్యాగ్‌లో నింపి వాటిని ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఈ విచిత్ర సంఘటన పుర్బా బర్దామన్ జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది.
పశ్చిమ బెంగాల్‌లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళకోట్‌లోని కుర్తుబా గ్రామానికి చెందిన మన్సూర్ అలీ షేక్.. తనను కుట్టిన దోమలను సేకరించి ఆసుపత్రికి తీసుకొచ్చాడు. డెంగీ కేసులతో ఆందోళన చెందిన మన్సూర్.. భయంతో తనను కుట్టిన 25, 30 దోమలను చంపి వాటన్నింటిని ఓ పాలిథిన్ బ్యాగ్‌లో వేసి ఆసుపత్రికి తీసుకొచ్చాడు.
ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ జుల్‌ఫికర్ అలీ మన్సూర్‌ను చూసి ఎమర్జెన్సీ కేసు అనుకున్నాడు. కానీ అతని బ్యాగులో దోమలను చూసి వైద్యుడితోపాటు ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
తన పరిస్థితిపై మన్సూర్ మాట్లాడుతూ.. ‘నా దుకాణం పక్కనలో నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. దీంతో ఆ చుట్టుపక్కల దోమల బెడద ఎక్కువగా ఉంది. దీంతో వాటి బారి నుంచి రక్షించుకునేందుకు నన్ను కుట్టిన దోమలను చంపి కవర్‌లో వేసి ఆసుపత్రికి తీసుకొచ్చాను. డాక్టర్లు ఆ దోమలను పరీక్షించి సరైన వైద్యం అందిస్తారని ఇలా చేశాను’ అంటూ పేర్కొన్నాడు. అలాగే తమ ప్రాంతంలోని డ్రెయిన్‌ను వెంటనే శుభ్రం చేయాలని కోరాడు.
ఈ ఘటనపై మంగళకోట్ అధికారి సయ్యద్ బసీర్ స్పందిస్తూ.. తక్షణమే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్, బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆ ప్రాంతంలో దోమల సమస్యను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, అలాగే నిలిచిపోయిన నీటి నివారణకు, దోమల నివారణ మందులను, బ్లీచింగ్ పౌడర్‌ను పంపిణీ చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment