బోద వ్యాధిగ్రస్థులు
మెదక్‌జోన్ : రాష్ట్ర ప్రభుత్వం బోదకాలు బాధితులకూ పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. వీరికి నెలకు రూ. వెయ్యి చొప్పున పింఛన్ మంజూరు చేశారు. కానీ జిల్లాలో ఇది నామమాత్రపు బాధితులకు మాత్రమే అందనుంది. జిల్లా వ్యాప్తంగా బోదకాలు బాధితులు 2,494 మంది ఉన్నారు. కానీ అందులో కేవలం 303 మందికి మాత్రమే పింఛన్ మంజూరు చేశారు. ఎంపికలో వ్యాధి తీవ్రతను బట్టి మూడు కేటగిరిలుగా విభజించి పింఛన్ ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొదటి కేటగిరిలో ఇప్పుడిప్పుడే వ్యాధి ప్రారంభమైన వారిని గుర్తించారు. ఈ జాబితాలో 1,100 మంది ఉనట్లు గుర్తించారు.
వీళ్లు అన్ని రకాల పనులు చేసుకుంటున్నారు. క్రమం తప్పకుండా మందులు వాడితే వ్యాధి తగ్గుతుందని సంబంధిత ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. రెండో కేటగిరిలో కూడా వ్యాధి మందులతో కంట్రోల్ అవుతోంది. ఈ జాబితాలో 1,092 మందిని గుర్తించారు. మూడో కేటగిరి లో 303 మందిని గుర్తించారు. వీరి అవయవాలు బాగాలావెక్కి అందవికారంతో పాటు ఎప్పుడు జ్వరంతో ఇబ్బందులు పడుతుంటారు. వీరికి ఆదరణ తప్పనిసరిని గుర్తించిన అధికారులు వీరిని పింఛన్‌కు తీసుకునేందుకు అర్హులుగా గుర్తించారు. వీళ్లకు జూన్ ఒకటో తేదీ నుంచి పింఛన్ అందనుంది.
సమాజంలో చిన్నచూపునకు గురై..
బోద వ్యాధిగ్రస్థులకు శరీరక అవయవాలు లావెక్కి ఏ పనిచేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటారు. వారు నిరాదరణతో నిస్సాహాయ పరిస్థితుల్లో అవస్థలు పడుతున్నారు. సమాజంతో పాటు కుటుంబాల్లోనూ చిన్నచూపుకు గురై మనోవేదన పడుతున్నారు. వీరికి నెలలో 20 రోజుల పాటు జ్వరంతో బాధపడుతుంటారని వైద్యులు చెబుతున్నారు. ప్రతినెల రూ. 2 వేల నుంచి రూ. 4 వేల వరకు ఆస్పత్రుల్లో ఖర్చుచేస్తున్నారు. ఈ వ్యాధిగ్రస్థులో 95 శాతం మేర నిరుపేదలే కావటంతో ఆర్థిక భారం పైబడి ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం పింఛన్ ఇవ్వటం శుభపరిణామమే. అయినప్పటికి అతికొద్ది మందికి మాత్రమే ఇస్తూ మిగతావారికి ఇవ్వక పోవటంతో బాధితులు మరింత ఆవేదన చెందుతున్నారు.
దోమకాటుతోనే వ్యాప్తి..
టులెక్స్ అనే దోమకాటుతో ఫైలేరియా(బోదవ్యాధి) వస్తుంది. పరిసరాలు అపరిశుబ్రంగా ఉండటంతో దోమలు వ్యాప్తి చెంది అవి కుట్టడంతో ఈ వ్యాధి సోకుతుంది. ముఖ్యంగా స్లమ్‌ఏరియాలో నివశించే నిరుపేదలకు అధికంగా ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధిసోకిన బాధితులు ఎప్పుడూ జ్వరంతో బాధపడుతుంటారు. ఈ వ్యాధి ప్రభావం శరీరంలోని అనేక అవయవాలపై పడుతోంది. దీంతో అవయవాలు ఉబ్బుతాయి.
20 ఏళ్ల నుంచి బాధపడుతున్నా..
20 ఏళ్ల నుంచి బొదకాలతో బాధపడుతున్నాను. దీంతో నిత్యం జ్వరం వస్తోంది. నెలకు రూ. 3 వేలు మందు గోలీలకు ఖర్చు అవుతున్నాయి. ప్రభుత్వం కొంతమందికి మాత్రమే పింఛన్ ఇచ్చి, నాలాంటి వారిని మర్చిపోయింది. ప్రభుత్వం అంటే అందరికీ సహకారం చేయాలి. కానీ కొంతమందికి మాత్రమే ఇవ్వడం ఎంత వరకు సమంజసం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పింఛన్ ఇచ్చి ఆదుకోవాలి.
–మోసయ్య, జంగరాయి, చిన్నశంకరంపేట మండలం
నిబంధనల ప్రకారమే ఎంపిక..
ప్రభుత్వం తమకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పింఛన్ అర్హులుగా గుర్తించాం. జిల్లాలో 2,494 మంది వ్యాధిగ్రస్థులు ఉండగా వ్యాధి తీవ్రంగా ఉన్న 303 మందికి మాత్రమే పింఛ న్ వస్తోంది. మూడు కేటగిరీలుగా విభజించి ప్రభుత్వానికి నివేదించాం.
–కుమార్, జిల్లా మలేరియా అధికారి
Comments
Please login to add a commentAdd a comment