- ఫైలేరియా విభాగంలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ
- సిబ్బంది పనితీరుపై ఆరా
- హైరానా పడ్డ సిబ్బంది
కాకినాడ క్రైం : అది కాకినాడలోని ఫైలేరియా రీసెర్‌చ అండ్ ట్రైనింగ్ సెంటర్ (ఎఫ్‌ఆర్‌టీసీ)... బుధవారం, సమయం : ఉదయం పదిగంటలు కావస్తోంది... ఎప్పుడూ లేనంత కంగారుగా.. కాస్త హడావుడిగా సిబ్బంది ఉన్నారు. అంతే కాదండోయ్ కొంతమంది సిబ్బంది ఖాకీ యూనిఫాం ధరించి, వీపులకు స్ప్రేయర్లు తగిలించుకుని సిద్ధంగా ఉన్నారు. ఇంతలో అక్కడికి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎం.పవన్‌కుమార్ ఆకస్మిక తనిఖీకి విచ్చేశారు.(పేరుకి ఆకస్మిక తనిఖీ అయినా, సిబ్బందికి ముందే లీకైంది). ఫైలేరియా విభాగ పనితీరును తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టీని పరిశీలించారు. దోమల నిర్మూలనకు ఫైలేరియా సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
జిల్లాలో బోద వ్యాధి ఆనవాళ్లు అధికంగా ఉన్న ప్రాంతాలపై దృష్టిసారించాలని ఆ విభాగ అధికారులను ఆదేశించారు. సుమారు అరగంటపాటు డీఎంహెచ్‌ఓ పర్యటన సాగడం, సిబ్బంది పనితీరుపై ఆయన ఆరాతీయడంతో అక్కడి వారంతా హడలెత్తిపోయారు. మరోవైపు ఎప్పుడూ యూనిఫాం ధరించని కొంతమంది సిబ్బంది హఠాత్తుగా యూనిఫాంతో కనిపించేసరికి పలువురి సిబ్బంది వారిని చూసి ఆశ్చర్యపోయారు.
షరా మామూలే...
ఫైలేరియా విభాగంలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు నిర్వహించినంత సేపు హైరానా పడిన సిబ్బంది... ఆయన వెళ్లిపోయిన వెంటనే షరా మామూలే అన్నట్టు వారి వీపులకు ఉన్న స్ప్రేయర్లను పక్కన పెట్టేసి కార్యాలయానికే పరిమిత మయ్యారు. ఇది గ మనించిన కొందరు ‘‘అమ్మో... ఎంతగా నటించారో.. మీరు మారరు!’’ అన్నట్టు వారికేసి చూశారు. ఈ విభాగంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని, సిబ్బందికి చిత్తశుద్ధి కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ విభాగంలో కొందరు ఇంకా డిప్యుటేషన్లపై కొనసాగడం చర్చనీయాంశమైంది. విభాగ పరిస్థితిపై కలెక్టర్ నీతూప్రసాద్ కూడా దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
ఈ సారైనా ‘బోద’పడేనా!
Published Thu, Sep 11 2014 2:04 AM | Last Updated on Tue, Oct 2 2018 3:46 PM
Advertisement