తణుకు అర్బన్ : బోధ వ్యాధి నివారణకు వ్యాధిగ్రస్తులు వాడే డీఈసీ (డై ఇథైల్ కార్బామాజైన్ నైట్రేట్) మందులు జిల్లాలోని నివారణ కేంద్రాల్లో నిండుకున్నాయి. క్యూలెక్స్ దోమకాటు ద్వారా వ్యాపించే ఫైలేరియా వ్యాధితో జిల్లా వ్యాప్తంగా వేలసంఖ్యలో వ్యాధిగ్రస్తులు బాధపడుతున్నారు. వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు, వైద్యసేవలు అందించే క్రమంలో జిల్లాలో తణుకు ఏరియా ఆస్పత్రి ఆవరణలోనూ, పాలకొల్లు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మాత్రమే రెండు ఫైలేరియా నివారణ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలోని ఏ ప్రాంతంలోనైనా బోధవ్యాధి లక్షణాలు కనిపించిన వారు ఈ కేంద్రాల ద్వారా వైద్య పరీక్షలు, వైద్యసేవలు పొందాల్సి ఉంది. కానీ ఫైలేరియా కేంద్రాల్లో డీఈసీ మాత్రలు జనవరి నెలతో ఎక్స్‌పైర్ అవ్వగా కొత్త స్టాక్ ఇంతవరకు పంపిణీ కాలేదు.
ఫైలేరియా వ్యాధి లక్షణాలు
జ్వరం, గజ్జలో బిళ్ల కట్టడం, చేతులు, కాళ్లు వాపు, వాచినచోట వేడిగా ఉండి ఎరుపు రంగులో ఉండడం ఫైలేరియా వ్యాధి లక్షణాలు ఉంటే సమీపంలోని వైద్యులను సంప్రదించాలి.
వివాదాస్పదంగాడీఈసీ మాత్రల వాడకం
జిల్లావ్యాప్తంగా బోధవ్యాధిగ్రస్తులు నీరసంగా ఉండి కాలు లాగుతుందంటే డీఈసీ మాత్రలు మింగుతున్నారు. కానీ ఈ డీఈసీ మందులు ఎక్కువగా వాడకూడదని దీనివల్ల సైడ్ ఎఫెక్టŠస్ అధికంగా ఉంటాయని ప్రస్తుత ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ గతం నుంచి నెలలో 12 రోజులు రోజుకు మూడు మాత్రలు చొప్పున వ్యాధిగ్రస్తులు మందులు వాడుతున్నారు. మళ్లీ ఒక నెల ఆగిన తరువాత ఈ కోర్సు వాడుతున్నారు. ప్రస్తుతం చాలా ఏళ్లుగా ఈ విధానం కొనసాగుతోంది. ఇప్పుడు మాత్రం అలా వాడకూడదని వైద్యాధికారులు చెబుతుండడంతో రోగులు అయోమయంలో పడుతున్నారు. ముందుగా లక్షణాలు చూసిన వెంటనే ఈ కేంద్రాల్లో పరీక్షలు చేయించుకుని 12 రోజుల పాటు డీఈసీ మాత్రల కోర్సు వాడి ఆపివేయాలని చెబుతున్నారు. జిల్లాలో గతేడాది 4 కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. కొత్తగా కేసు నమోదైతే వాడేందుకు మందులులేని దుస్థితి జిల్లాలో నెలకొంది. 3 లక్షల మందులు ఇండెంట్ పెట్టామని రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
గతంలో పాఠశాలల్లో పంపిణీ
క్యూలెక్స్ దోమకుట్టిన తరువాత వ్యాధి బయటపడేందుకు 5 సంవత్సరాలు సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో గతంలో ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో పాఠశాలల్లోని విద్యార్థులతో పాటు ప్రజానీకానికి డీఈసీ మందులు మూడు మాత్రల చొప్పున మింగించేవారు. దీనివల్ల ఒకవేళ దోమ కుట్టినా కానీ వ్యాధి బయటపడక ముందే లోపలే వ్యాధి నిరోధించబడుతుందనేది వైద్యాధికారులు అభిప్రాయం.
ఫైలేరియాని గుర్తించేదిలా..
ఫైలేరియా వ్యాధి నిర్ధారణకు ప్రతి బుధవారం కేంద్రంలో రాత్రి 8 నుంచి 10 గంటల వరకు ప్రత్యేక క్లినిక్ నిర్వహిస్తున్నారు. మైక్రో ఫైలేరియా క్రిమి చీకటి సమయంలో యాక్టివ్‌గా ఉంటుందనే ఉద్ధేశంతో సదరు వ్యక్తిని కదలకుండా పడుకోబెట్టి ఉంచి రక్తనమూనా తీసి పరీక్ష చేస్తారు. ఇలా చేస్తే మాత్రమే వ్యాధి నిర్ధారణ అవుతుంది. కానీ ఈ కేంద్రాల్లో పూర్తి అవగాహన లేకుండా రక్తనమూనాలు సేకరిస్తుండడంతో చాలామందికి వ్యాధి ముదిరిపోయే వరకు పాజిటివ్‌గా గుర్తించడంలేదనే విమర్శలు లేకపోలేదు.
3 లక్షల మాత్రలకు ఇండెంట్ పెట్టాం
బోధవ్యాధి నివారణ కేంద్రాల్లో ఉన్న డీఈసీ మాత్రలు జనవరి నెలతో ఎక్స్‌పైర్ అయ్యాయి. 3 లక్షల మాత్రలు కావాలని ఇండెంట్ పెట్టాం. మందులు రావాల్సి ఉంది. కొత్త కేసు నమోదైతేనే మందులు వాడాల్సి ఉంది. వ్యాధి సోకి ఒకసారి మందుల కోర్సు వాడిన వారు ఇక మళ్లీ వాడాల్సిన అవసరం లేదు. – ఎంవీ రాథోడ్, జిల్లా మలేరియా ఆఫీసర్, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment