దాసరి బోగమ్మ
ఉద్దానంపై మరో మహమ్మారి పంజా విసిరింది. ఏడు మండలాల్లో విస్తరించిన ఉద్దానం ప్రాంతం ఇప్పటికే కిడ్నీ వ్యాధులతో వణికిపోతుండగా..ఇప్పుడు బోధకాలు రూపంలో మరో భూతం చాపకిందనీరులా కబళిస్తోంది. దోమకాటు వల్ల సోకే బోదకాలు వ్యాధి (ఫైలేరియా) బాధితులు ఈ ప్రాంతంలో వందలాది మంది ఉన్నారు. కనీసం నడవడానికి కూడా వీల్లేనంతగా కాళ్లు ఉబ్బిపోయినా పేదరికం కారణంగా వైద్యానికి దూరమవుతూ మంచంపైనే మగ్గిపోతున్నారు. సర్కార్ స్పందించి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.
శ్రీకాకుళం, కాశీబుగ్గ : ఉద్దాన ప్రాంతానికి చెందిన వందలాది మంది మూత్రపిండాల వ్యాధితో మంచం పట్టారు. వారిని చూసి కన్నవారు.. కుటుంబాలు కన్నీరుపెడుతున్నారు. బతికిం చుకోవడానికి అప్పులు చేసి.. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇలాంటి తరుణంలో బోదవ్యాధి అనే భూతం వారి జీవితాలను దహించడానికి చాపకింద నీరులా దూసుకొస్తోంది. ఈ ప్రాంతంలోని ఏ గ్రామంలో చూసినా పది మందికి తక్కువ కాకుండా ఫైలేరియా వ్యాధిగ్రస్తులు దర్శనమిస్తున్నారు. ఇప్పటికే ఉద్దానం, తీరప్రాంతం, మెట్ట ప్రాంతాల ప్రజలను కిడ్నీ వ్యాధి వణికిస్తోంది. వందలాది మంది మృత్యువతా పడ్డారు. తాజాగా బోదవ్యాధి వ్యాపిస్తుండడంతో ఈ ప్రాంతీయులు భయాందోళన చెందుతున్నారు. ఉద్దాన ప్రాంతంలోని ప్రధాన మండలాలైన పలాస, వజ్రపుకొత్తూరు, మందస, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, సొంపేట ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందిలో పది నుంచి 15 మంది వరకూ బోదవ్యాధితో బాధపడుతున్నారు. పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో 30 మంది, బ్రాహ్మాణతర్లాలో 20 మంది వ్యాధితో అల్లాడుతున్నారు. అలాగే లక్ష్మీపురం, బెండి, వజ్రపుకొత్తూరు, పూండి, పలాస, కాశీబుగ్గ, బైపల్లి, అక్కుపల్లితోపాటు గిరిజన ప్రాంతంలో కూడా ఈ వ్యాధి లక్షణాలతో వందలాది మంది మంచం పట్టారు.
నడకయాతన..
బోదవ్యాధి బారిన పడిన వారు నడకకు కూడా నరక యాతన పడుతున్నారు. బరువెక్కిన శరీరంతో అవిటితనాన్ని అనుభవిస్తున్నారు. ఎటువంటి పనులు చేసుకోలేక కుటుంబాలకు భారంగా మారుతున్నారు. లేచి నిలబడి మంచినీరును సైతం తీసుకోలేక ఇతరులపై ఆధారపడుతున్నారు.
ఇంజక్షన్లు నిలిపివేత..
గత ప్రభుత్వాలు ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను ఉచితంగా అందించేవి. సామాజిక ఆస్పతుల్లో ఇంజక్షన్‌లు అందుబాటులో ఉంచేవారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎడాదిలోపే బోదవ్యాధిగ్రస్తులకు ఇచ్చే ఇంజక్షన్ల సరఫరాను నిలిపివేసింది. దీంతో వ్యాధిగ్రస్తులు డబ్బులుపెట్టి చికిత్స చేయించుకోలేక, రోజురోజుకూ పెరుగుతున్న శరీర బరువురును భరించలేక మానసికంగా కుంగుపోతున్నారు. దినదిన గండంగా ఉంటున్న వీరి పరిస్థితిని చూసి ఆయా కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. తోడులేకుండా చిన్న పని కూడా చేసుకోలేక మంచానికే పరిమితిమవుతున్న వారిని చూసి కన్నీరు పెడుతున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడంలేదని బాధను వ్యక్తం చేస్తున్నారు. వయసు నిండకుండానే అవిటితనంగా మారుతున్న వారికి కనీసం పింఛన్ కూడా అందించడం లేదు. ప్రభుత్వం స్పందించి ఉచిత వైద్యంతోపాటు.. పింఛన్ అందేలా చూడాలని వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబాలు వేడుకుంటున్నాయి.
శుభకార్యాలకు సైతం అందని ఆహ్వానాలు
బోదవ్యాధి బారిన పడిన వారితో సహా.. వారి కుటుంబాలు వింతపరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తమను శుభకార్యాలు, ఉపాధి హామీ పథకం పనులకు కూడా పిలవడం లేదని చాలామంది బాధను వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మాతర్లా గ్రామంలో దాసరి బోగమ్మ, దాసరి వల్లయ్య, బడే జంగమయ్య, పైల నారాయణరావు, తలగాపు నర్సమ్మ, రోళ్ల బయ్యన్నతోపాటు 20 మందికిపైగా బోద మహమ్మారితో మంచానికే పరిమితమయ్యారు.
నడవలేకపొతున్నాను
నేను బిలాయ్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేసేవాడిని. గ్రామానికి వచ్చి వెళ్లేవాడిని ఆరుబయట పడుకున్నప్పుడు దోమలు కరిచాయి. అప్పటి నుంచి బోదవ్యాధి సోకింది. కాళ్లు వాపులతో అవిటివాడిలా ఇంటికే పరిమితమయ్యాను. ఎటువంటి వైద్య సేవలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. – గేదెల శ్రీరాములు, వ్యాధిగ్రస్తుడు, బొడ్డపాడు
ఇంజక్షన్లు నిలిపివేశారు
ఫైలేరియాసిస్ దోమకాటు కారణంగా బోదవ్యాధి సంక్రమిస్తుంది. మైక్రో ఫైలేరియా మనిషిశరీరంలోకి ప్రవేశించి తన పెరుగుదలను నెమ్మదిగా చూపుతుంది. శరీరంలో ఏ అవయవానికి సంక్రమించినా అది పెరుగుతుంది. మగవారిలో వృషనాలకు సైతం ఎఫెక్టు ఉంటుంది. మైక్రోరిలెన్ జ్వరంతో శరీరంలో లక్షణాలు చూపుతుంది. రక్తపరీక్ష ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. ప్రారంభంలోనే డయటిఇధైల్ కార్బన్‌జిన్ సిట్రస్‌ను 21 రోజులు శరీరంలోకి పంపించాలి. అంతకు మించిన స్టేజి దాటితే ఎవ్వరూ దానిని నయంచేయలేరు. ఇదివరకు సిప్రోల్ సర్జరీ చేసేవారు. లావుగా ఉన్న కాళ్లను సైజుతగ్గించే విధంగా వైద్యం అందించేవారు. ప్రభుత్వ ఆస్పపత్రిలో ఇంజక్షన్లు అందించేవారు. అయితే ఆ ఇంజక్షన్లు ఎముకలపై ప్రభావం చూపుతుండడంతో నిలిపివేశారు. పలాస ప్రభుత్వ ఆస్పత్రికి వారానికి పదిమందికిపైగా వ్యాధిగ్రస్తులు వచ్చి వెళ్తుంటారు. – డాక్టర్ ప్రకాశవర్మ, పలాస ప్రాంతీయ ఆస్పత్రి ఆస్పత్రి పర్యవేక్షులు
Comments
Please login to add a commentAdd a comment