masquitos
-
వామ్మో..! మనిషిపై మశక సైన్యం!!
దోమలు చూడటానికి చిన్నగా ఉంటాయి గాని, ఇవి అత్యంత ప్రమాదకరమైన జీవులు. ప్రపంచంలో ఏటా పాముకాటుతో మరణిస్తున్న వారి కంటే దోమకాటుతో మరణిస్తున్న వారే ఎక్కువ. పాముకాటు వల్ల ఏటా దాదాపు 1.37 లక్షల మంది మరణిస్తుంటే, దోమకాటు వల్ల వ్యాధులకు లోనై మరణించే వారి సంఖ్య 10 లక్షలకు పైగానే ఉంటోంది. దోమలు ఎంత ప్రమాదకరమైనవో అర్థమవడానికి ఈ లెక్క చాలు. ఈ భూమ్మీద 3,600 జాతులకు పైగా దోమలు ఉన్నాయి. అత్యంత శీతల ప్రాంతమైన అంటార్కిటికాలో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ దోమల బెడద ఉండనే ఉంది. దోమలు మనుషుల కంటే చాలా ముందు నుంచే భూమ్మీద మనుగడ సాగిస్తున్నాయి. ఇవి దాదాపు డైనోసార్ల కాలం నుంచే అంటే, 25.1 కోట్ల సంవత్సరాల నుంచి భూమ్మీద ఉన్నాయి.భూమ్మీద మిగిలిన ప్రదేశాలతో పోల్చుకుంటే, ఉష్ణమండల ప్రదేశాల్లో, నీరు ఎక్కువగా నిల్వ ఉండే చోట దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అసలు నీరులేని చోట, నీరు ప్రవహించే చోట దోమలు మనుగడ సాగించలేవు. నిల్వ నీరు ఉన్న ప్రదేశాలే దోమలకు సురక్షిత స్థావరాలు. మన దేశంలో ఎక్కువ రాష్ట్రాలు ఉష్ణమండల ప్రదేశాలే! ఇక్కడి వాతావరణం దోమల విజృంభణకు చాలా అనుకూలంగా ఉంటుంది. దోమలు భూమ్మీద కోట్లాది ఏళ్లుగా మనుగడ సాగిస్తున్నా, దోమల సగటు ఆయుఃప్రమాణం మాత్రం తక్కువే! ఒక దోమ బతికేది 10 నుంచి 56 రోజుల లోపే! ఇంత అల్పాయుర్దాయంలోనే దోమలు సృష్టించాల్సిన విధ్వంసమంతా సృష్టిస్తాయి.దోమల్లో ఆడదోమలు మాత్రమే మనుషుల రక్తాన్ని పీలుస్తాయి. ఒక ఆడ దోమ రోజు విడిచి రోజు 150–200 వరకు గుడ్లు పెడుతుంది. దోమ గుడ్లు పెట్టడానికి 50 మిల్లీలీటర్ల నిల్వనీరు చాలు. దారి పక్కన పడి ఉండే చిన్న చిన్న కొబ్బరిచిప్పలు, పాత టైర్లు, వాడటం మానేసి మూలపడేసిన ఎయిర్ కూలర్లు వంటివి దోమలకు ప్రశస్థమైన ఆవాసాలు. ఇలాంటి చోట్ల దోమలు గుడ్లు పెట్టి, వంశాభివృద్ధి చేసుకుంటాయి. దోమలను నిర్మూలించడానికి మనం ఎన్ని రకాల మందులను వాడుతున్నా, దోమలు వాటిని తట్టుకునేలా తమ నిరోధకతను నిరంతరం పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. దోమలు మందులను తట్టుకునే శక్తి పెంచుకునే కొద్ది వాటి వల్ల మనుషులకు ముప్పు మరింతగా పెరుగుతుంది. ఆడదోమలు మనుషుల రక్తాన్ని పీల్చే క్రమంలో వాటి నుంచి ప్రమాదకరమైన సూక్ష్మజీవులు మనుషుల రక్తంలోకి చేరి, వ్యాధులను కలిగిస్తాయి.దోమలు కలిగించే వ్యాధులు..దోమల వల్ల మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, లింఫాటిక్ ఫైలేరియాసిస్, రిఫ్ట్వ్యాలీ ఫీవర్, యెల్లో ఫీవర్, జికా, జపానీస్ ఎన్సెఫలిటిస్, వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాధులు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్లను కలిగించే వ్యాధుల్లో 17 శాతం వ్యాధులు దోమల వల్లనే వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 9.6 కోట్ల మంది దోమకాటు వ్యాధులకు లోనవుతున్నారు. వారిలో అత్యధికంగా దాదాపు 4 లక్షల మంది మలేరియా వల్ల, 40 వేల మంది డెంగీ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి వల్ల మరణాల బారిన పడిన వారిలో ఐదేళ్ల లోపు చిన్నారులే ఎక్కువగా ఉంటుండటం విచారకరం. దోమల కారణంగా తలెత్తే తీవ్ర వ్యాధులు, వాటి లక్షణాలను తెలుసుకుందాం.మలేరియా..ఈ వ్యాధి అనాఫలిస్ దోమ వల్ల వ్యాపిస్తుంది. ఈ దోమ రాత్రివేళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ దోమలో వృద్ధి చెందే ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా రకానికి చెందిన సూక్ష్మజీవి కారణంగా మలేరియా వస్తుంది. వీటిలో ఒకరకం జాతికి చెందిన సూక్ష్మజీవి కారణంగా సెరిబ్రల్ మలేరియా వస్తుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం, అపస్మారక స్థితికి చేరడం, మూత్రపిండాలు విఫలం కావడం వంటి లక్షణాలు ఉంటాయి.చికెన్ గున్యా..ఎడిస్ ఈజిపై్ట అనే దోమ వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ దోమ ద్వారా వ్యాపించే ఒకరకం వైరస్ కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఎడిస్ ఈజిపై్ట దోమ ఎక్కువగా పగటివేళ కనిపిస్తుంది. చికున్ గున్యా సోకిన వారికి జ్వరం, విపరీతమైన తలనొప్పి, తీవ్రమైన కీళ్లనొప్పులు వస్తాయి.డెంగీ..డెంగీకి కూడా ఎడిస్ ఈజిపై్ట దోమలే కారణం. జ్వరం, తలనొప్పితో పాటు ఎముకలు విరిచేసినంతగా తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకే దీన్ని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. వ్యాధి ముదిరినప్పుడు అంతర్గత అవయవాల్లో రక్తస్రావమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.డెంగీని నిరోధించే వొబాకియా..వొబాకియా అనే బ్యాక్టీరియా డెంగీ వ్యాప్తిని అరికట్టగలదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మలేసియా, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లోని పరిశోధక సంస్థల్లో పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తలు వొబాకియా బ్యాక్టీరియాను ప్రయోగించి, డెంగీ వ్యాప్తిని నిరోధించడంలో సఫలీకృతులయ్యారు. డెంగీ వ్యాప్తికి కారణమయ్యే ఏడిస్ ఈజిపై్ట దోమల శరీరంలోకి వొబాకియా బ్యాక్టీరియాను ఇంజెక్ట్ చేసి, వాటిని బయటి వాతావరణంలోకి విడిచిపెట్టాక, వాటి ద్వారా డెంగీ వ్యాప్తి పెద్దగా జరగలేదు. వొబాకియా బ్యాక్టీరియా ఎక్కించిన తర్వాత దోమలకు పుట్టిన తర్వాతి తరాల దోమల్లో కూడా డెంగీని వ్యాప్తి చేసే శక్తి గణనీయంగా తగ్గిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.దోమల నివారణ మార్గాలు..దోమలను సమర్థంగా నివారించుకోవడం ద్వారా మాత్రమే దోమకాటు వ్యాధుల బారి నుంచి మనం తప్పించుకోగలం.– మనం ఉండే ఇళ్లలోకి, గదుల్లోకి దోమలు రాకుండా దోమతెరలు, మస్కిటో రిపెల్లెంట్లు వాడాలి.– దోమలు కుట్టకుండా ఉండటానికి శరీరంపై పూత మందులు వాడటం కూడా ఒక మార్గం.– దోమలు కుట్టకుండా ఉండాలంటే, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా నిండుగా దుస్తులు ధరించాలి.– దోమలు మురికి దుస్తులపై ఆకర్షితమవుతాయి. అందువల్ల శుభ్రమైన దుస్తులు ధరించాలి.– ఇళ్ల పరిసరాల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నీరు నిత్యం ప్రవహించేలా కాల్వలను శుభ్రం చేసుకోవాలి.అపోహలు, వాస్తవాలు..అపోహ: దోమలన్నీ మనుషులను కుడతాయి.వాస్తవం: ఆడ దోమలు మాత్రమే మనుషులను, జంతువులను కుడతాయి. ఆడ దోమల్లో పునరుత్పత్తి శక్తి కోసం మనుషులు, జంతువుల రక్తం అవసరం.అపోహ: కొన్ని రకాల రక్తమంటేనే దోమలకు ఇష్టంవాస్తవం: ముఖ్యంగా ‘ఓ–పాజిటివ్’ రక్తమంటే దోమలకు ఇష్టమని, అందుకే ఆ రక్తం ఉన్నవారిని ఎక్కువగా కుడతాయనే ప్రచారం ఉంది. నిజానికి దోమలను ఆకర్షించేది రక్తం కాదు, చర్మంపై ఉండే బ్యాక్టీరియా. చర్మంపై కొన్నిరకాల బ్యాక్టీరియా ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుడతాయి.అపోహ: తెల్లచర్మం ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుడతాయి.వాస్తవం: దోమలు కుట్టినప్పుడు తెల్లచర్మం ఉండేవారి శరీరంపై దద్దుర్లు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. దోమల లాలాజలంలో ఉండే ఎంజైమ్ వల్ల దురద పుట్టి దద్దుర్లు ఏర్పడతాయి. దోమలు కుట్టడానికి మనుషుల రంగుతో సంబంధం లేదు.అపోహ: దోమలన్నీ వ్యాధులను కలిగిస్తాయి.వాస్తవం: ప్రపంచంలో 3,600 జాతులకు పైగా దోమలు ఉన్నా, వీటిలో చాలా జాతులకు చెందిన దోమలు అసలు మనుషుల జోలికి రావు. అయితే, మనుషులను కుట్టే జాతులకు చెందిన దోమల్లో ఎక్కువ జాతులు వ్యాధులను మోసుకొస్తాయి.అపోహ: గబ్బిలాలను ఆకట్టుకుంటే దోమలు పరారవుతాయి.వాస్తవం: దోమలను పారదోలాలంటే, పెరట్లోకి గబ్బిలాలను రప్పించాలనే ప్రచారం ఉంది. దోమలు, ఈగల వంటి కీటకాలను గబ్బిలాలు తినడం నిజమే గాని, అవి దోమలను పూర్తిగా నిర్మూలించలేవు.అపోహ: మనుషుల పరిమాణంతో సంబంధం లేకుండా దోమలు వారిని కుడతాయి.వాస్తవం: చిన్నగా కనిపించే వారి కంటే పెద్దగా కనిపించే మనుషులనే దోమలు ఎక్కువగా కుడతాయి. చిన్న పిల్లల కంటే దోమలు పెద్దలనే ఎక్కువగా కుడతాయి. పిల్లల కంటే పెద్దలు తమ ఊపిరిలో కార్బన్ డయాక్సైడ్ను ఎక్కువగా విడిచిపెడతారు. చాలా దూరం నుంచి కార్బన్ డయాక్సైడ్ను పసిగట్టగల దోమలు త్వరగా పెద్దల వైపు ఆకర్షితమవుతాయి.మరిన్ని మశక విశేషాలు..గుడ్డు దశ నుంచి పూర్తిగా ఎదిగిన దశకు చేరుకోవడానికి దోమకు వారం నుంచి పదిరోజులు పడుతుంది.చెమట కారణంగా చర్మంపై పెరిగే బ్యాక్టీరియా విడుదల చేసే వాసనలు దోమలను ఇట్టే ఆకట్టుకుంటాయి. చెమట చిందిన పాదాలను శుభ్రం చేసుకోకుండా కాసేపు అలాగే వదిలేస్తే, వాటిపై దోమలు దాడి చేస్తాయి.కొన్ని రకాల వాసనలు దోమలను గందరగోళానికి గురిచేస్తాయి. ఉల్లి, వెల్లుల్లి వాసనల వైపు దోమలు రావు. వెల్లుల్లి తిన్నట్లయితే, చెమట వాసనలో మార్పు వస్తుంది. వెనిగర్‌లో ముంచిన ఉల్లిపాయ ముక్కలను ఒంటికి రుద్దుకున్నట్లయితే, దోమలు దరిదాపులకు రావు.దోమలు అతి నెమ్మదిగా ఎగురుతాయి. దోమల వేగం గంటకు ఒకటి నుంచి ఒకటిన్నర మైళ్లు. తేనెటీగలు ఎగిరే వేగంతో పోల్చుకుంటే, ఇది పదోవంతు మాత్రమే!దోమలు ఎగురుతున్నప్పుడు బాగా రొదగా ఉంటుంది. దోమలు ఎగిరేటప్పుడు వాటి రెక్కలు సెకనుకు 300–600 సార్లు రెపరెపలాడతాయి. వాటి కారణంగానే ఈ మశక సంగీతం వినిపిస్తుంది.దోమ బరువు 2 మిల్లీగ్రాములు. ఆడదోమ చిన్నిపొట్ట నిండటానికి లీటరులో 50 లక్షలవంతు రక్తం సరిపోతుంది. ఒక్కోసారి ఆడదోమలు తమ శరీరం బరువుకు సమానమైన నెత్తురు తాగేస్తాయి. వెన్నెల రాత్రులలో దోమలు మరింతగా విజృంభిస్తాయి. వెన్నెలలో దోమలకు తమ లక్ష్యం మరింత స్పష్టంగా కనిపించడమే దీనికి కారణం. చీకటి రాత్రుల కంటే వెన్నెల రాత్రులలో దోమలు ఐదురెట్లు ఎక్కువగా మనుషులను కుడతాయి.దోమలను ముదురు రంగులు ఇట్టే ఆకట్టుకుంటాయి. రక్తం తాగే ఆడ దోమలు ఎక్కువగా చీకటి ప్రదేశాలను స్థావరంగా చేసుకుంటాయి. అందుకే అవి ముదురు రంగు దుస్తులు వేసుకునే వారి వైపు ఆకర్షితమవుతాయి. -
వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
ఇటీవల కేరళలోని వివిధ జిల్లాల్లో వెస్ట్ నైల్ ఫీవర్ కేసులు విజృంభిస్తున్నాయి. దాదాపు పదిమందికి పైగా ఈ వైరస్ సోకింది. ఈ వైరస్ దోమ కాటు వల్ల వ్యాపిస్తుందట. అందువల్ల సురక్షితంగా ఉండేలా జాగ్రలు తీసుకోవటం ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్కడ పలు చోట్ల ఇలాంటి కేసులు నమోదవ్వడంతో కేరళ హైఅలర్ట్‌లో ఉంది. అసలేంటీ వెస్ట్ నైలు జ్వరం..? ఎందువల్ల వస్తుందంటే..?వెస్ట్ నైలు జ్వరం అంటే..వెస్ట్ నైలు జ్వరం అనేది వెస్ట్ నైల్ వైరస్ (WNV) వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న దోమల కాటు వల్ల వస్తుంది. ముఖ్యంగా క్యూలెక్స్ జాతికి చెందిన జాతులు. ఈ వైరస్ మొట్టమొదట 1937లో ఉగాండాలో గుర్తించారు. ఆ తర్వాత భారతదేశంలో అలప్పుజా జిల్లాలో ఇలాంటి తొలికేసు నమోయ్యింది.లక్షణాలు..కడుపు నొప్పి జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పిఆకలి లేకపోవడంకండరాల నొప్పులువికారం, వాంతులు, అతిసారం, దద్దుర్లువాచిన శోషరస గ్రంథులుఈ లక్షణాలు సాధారణంగా 3 నుంచి 6 రోజుల వరకు లేదా ఒక నెల పాటు ఉండవచ్చు. వ్యాధి తీవ్రమైతే వెస్ట్ నైల్ ఎన్సెఫాలిటిస్ లేదా వెస్ట్ నైల్ మెనింజైటిస్ లక్షణాలు కనిపిస్తాయి. అవి ఎలా ఉంటాయంటే..స్పష్టంగా ఆలోచించే సామర్థ్యంలో గందరగోళం లేదా మార్పుస్పృహ కోల్పోవడం లేదా కోమాకండరాల బలహీనతగట్టి మెడఒక చేయి లేదా కాలు బలహీనతఎవరికి ప్రమాదమంటే..60 ఏళ్లు పైబడిన వ్యక్తులు: వెస్ట్ నైల్ వైరస్ సోకితే 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు తీవ్రమైన లక్షణాలు, సమస్యలు అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ: బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్నవారు లేదా క్యాన్సర్, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు లేదా అవయవ మార్పిడి వంటి ఏదైనా వ్యాధితో బాధపడుతున్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నివారణ చర్యలుదోమల నియంత్రణ: దోమల వృద్ధి అరికట్టేలా నిలబడి ఉన్న నీటిని తొలగించడం. క్రిమిసంహారక మందులను ఉపయోగించడం వంటి చర్యలను అమలు చేయడం ద్వారా దోమల జనాభాను తగ్గుతుంది ఫలితంగా ఈ సమస్య తీవ్రత తగ్గుముఖం పడుతుంది.వ్యక్తిగత రక్షణ: పొడవాటి చేతుల చొక్కాలు, పొడవాటి ప్యాంటు ధరించడం. DEET లేదా నిమ్మకాయ యూకలిప్టస్ నూనెను కలిగి ఉన్న క్రిమి వికర్షకాలను పూయడం వల్ల దోమలు కుట్టకుండా నిరోధించవచ్చు.బహిరంగ కార్యకలాపాలను నివారించండి: దోమలు ఎక్కువగా ఉండే తెల్లవారుజాము, సంధ్యా సమయంలో బహిరంగ కార్యకలాపాలను తగ్గించడం ద్వారా దోమల కాటు ప్రమాదాన్ని తగ్గించొచ్చు.దోమల నివారిణిని పిచికారీ చేయండి: బయటకు వెళ్లే ముందు దోమల నివారణను పిచికారీ చేయండి లేదా ఓడోమోస్ను పూయండి.తలుపులు, కిటికీలు మూసి ఉంచండి: మీ ఇళ్లలోకి దోమలు రాకుండా తలుపులు, కిటికీలు మూసి ఉంచండి. రాత్రిపూట కుట్టకుండా ఉండటానికి దోమతెరలను ఉపయోగించండి.(చదవండి: మహిళ ముక్కులో వందలకొద్ది పురుగులు!కంగుతిన్న వైద్యులు) -
ఆ శబ్దం వారికే వినిపిస్తుంది, వెంటాడుతుంది! వేలల్లో కేసులు నమోదు!
మీరెప్పుడైనా రాత్రి పూట చెవి చుట్టూ దోమ తిరగడం గమనించారా? అది తిరిగిన కాసేపు చిర్రెత్తుకొస్తుంది. లైటు వేసి దాన్ని చంపేదాకా నిద్రపట్టదు. కానీ ప్రపంచంలో చాలామందికి ఓ విచిత్రమైన కొత్తశబ్దాన్ని.. అసంబద్ధంగా వింటూ.. నిద్రకు దూరమవుతున్నారట. లైట్ తీసినా, వేసినా.. మెలకువగా ఉన్నా.. నిద్రపోయినా.. పోనీ ఆ చోటుని వదిలి ఎంత దూరం వెళ్లినా.. ఆ శబ్దం వెంటాడుతూనే ఉంటుందట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వారు వినే ఆ శబ్దం.. తమ వెంట ఉన్నవారికి కూడా వినిపించకపోవచ్చు. అదే ‘ది హమ్’ మిస్టరీ. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఈ కేసులు వేలల్లో నమోదయ్యాయి. శబ్దానికి, నిశ్శబ్దానికి మధ్య అస్పష్టమైన ఓ అలికిడి ఉంటుందని.. రాత్రివేళ దాన్ని స్పష్టంగా వింటున్నామని చెప్పే వాళ్లే ఈ మిస్టరీకి సృష్టికర్తలు. వీరిని ‘ది హియర్స్’ అంటారు. సాధారణంగా మనిషి చెవులు.. 20 ఏ్డ (తక్కువ పిచ్) నుంచి 20 జుఏ్డ (అత్యధిక పిచ్) మధ్య ఫ్రీక్వెన్సీలను గ్రహిస్తాయి. కానీ ‘ది హియర్స్’ మాత్రం తమకు ఇంకాస్త తక్కువ ఫ్రీక్వెన్సీలో అస్పష్టమైన నాయిస్ వినిపిస్తోందని వాదిస్తారు. వారు వినే శబ్దాన్ని.. అతి తక్కువ–ఫ్రీక్వెన్సీ హమ్మింగ్లా, రంబ్లింగ్ (దూరంగా ఉన్న పెద్దపెద్ద వాహనాల నుంచి వచ్చే ప్రతిధ్వని) నాయిస్‌గా భావించారు నిపుణులు. ప్రశాంతమైన నగరాల్లో, పల్లెటూళ్లలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. ఈ హమ్మింగ్‌కి బ్రిస్టల్ హమ్, టావోస్ హమ్, విండ్సర్ హమ్ వంటి పలు పేర్లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. బ్రిస్టల్ హమ్.. ఇంగ్లాడ్‌లోని బ్రిస్టల్‌లో 1970లో తొలి కేసు నమోదైంది. అక్కడి నివాసితులు కొందరు.. రాత్రి పూట ఏదో శబ్దం నిద్రకు భంగం కలిగిస్తోందని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. మొదట్లో ఈ హమ్ సమీపంలోని ఫ్యాక్టరీలు, ఎలక్ట్రిక్ పైలాన్లు కారణం అయ్యి ఉండొచ్చని భావించారట. అయితే మరికొందరు నివాసితులు.. ఆ శబ్దాలన్నీ గ్రహాంతర అంతరిక్ష నౌకల నుంచి వస్తున్నాయని భావించారు. ఇంకొందరైతే.. రహస్య సైనిక చర్యల్లో భాగం కావచ్చని నమ్మారు. అయితే చాలామంది ఈ హమ్ ఈ లోకానికి చెందినది కాదని, మరో లోకానికి సంబంధించిందని ప్రచారం చేశారు. కొన్ని నెలలకు ఆ హమ్ హఠాత్తుగా ఆగినట్లే ఆగి.. బ్రిట¯Œ లోని ఇతర ప్రదేశాలకు వినిపించడం మొదలైంది. అదే హమ్ని ఇప్పటికీ చాలామంది వింటూనే ఉన్నారట. టావోస్ హమ్.. ఇక అమెరికాలోని న్యూ మెక్సికోలో 1990లో ఈ హమ్ ఫిర్యాదులు మొదలయ్యాయి. అయితే ఈ హియర్స్ ఒకే రకమైన శబ్దాన్ని వినడం లేదని అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరూ ఒక్కో ప్రత్యేకమైన శబ్దాన్ని వింటున్నట్లు వివరించడం మొదలు పెట్టారు. దాంతో శాస్త్రవేత్తలు వారు నివేదించిన శబ్దాలను వినేందుకు.. వారి వారి ఇళ్లల్లో.. ప్రత్యేకమైన పరికరాలను కూడా అమర్చారు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. శాస్త్రవేత్తలకు ఎలాంటి అసాధారణ కంపనాలు చిక్కలేదు. విండ్సర్ హమ్.. ఇంగ్లాడ్‌లోని విండ్సర్‌లో వినిపించే ఈ హమ్.. మొదటిగా ఎప్పుడు గుర్తించారో తెలియదు కానీ.. 2012 నుంచి ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. విన్నవారంతా ఇది ఎక్కువ సేపు వినిపిస్తోందని.. బిగ్గరగా వినిపిస్తోందని వాపోతుంటారు. ఈ శబ్దం కిటికీలను కదిలిస్తోందని.. పెంపుడు జంతువుల్ని భయపెడుతోందని ఆరోపించారు. ఇది మానసికస్థైర్యాన్ని దెబ్బతీస్తోందని మొరపెట్టుకు న్నారు. ఈ శబ్దాన్ని దూరం చేసుకోవడానికి చాలామంది ఇతర ప్రదేశాలకు ప్రయాణాలు చేసినా.. ఆ శబ్దం వారిని వెంటాడుతూనే ఉందట. ఈ హమ్ కేసులో స్త్రీ పురుషులు సమానంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు.. తాము హమ్ కేసును పరిష్కరించామని.. అది ఎక్కడ నుంచి వస్తుందో తెలుసునని చెప్పారు. పెద్ద పెద్ద అలల కారణంగా సముద్రపు అడుగుభాగం కంపించడమే ఈ హమ్మింగ్‌కు మూలమని ప్రకటించారు. అయితే ఆ వాదనను మరికొందరు శాస్త్రవేత్తలు ఖండించారు. సముద్రం లేని చోట కూడా ఇలాంటి ధ్వనులు వినిపిస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయంటూ కొట్టిపారేశారు. ఇది ఒక మానసికమైన సమస్య అని కొందరు వైద్యులు చెబితే.. ఇది దూరంగా నడిచే ట్రాఫిక్ నుంచి కానీ, విమానాశ్రయాల నుంచి కానీ, నౌకాయానాల నుంచి కానీ, గాలి మరల నుంచి కానీ కావచ్చు అని కొందరు నిపుణులు అంచనా వేశారు. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం.. ఈ శబ్దానికి మిడ్‌షిప్‌మ్యాన్ ఫిష్ లేదా టోడ్ ఫిష్‌లు కారణం కావచ్చని భావించారు. ఈ చేపలు తన సహచరిని సంభోగానికి పిలుపునిచ్చినప్పుడు కొన్నిసార్లు చిన్నగానే హమ్మింగ్ చేస్తాయి కానీ.. కొన్నిసార్లు చాలా పెద్దగా ఎక్కువ సేపు హమ్మింగ్ చేస్తుంటాయట. అది సుమారు గంట ప్రక్రియ అని.. ఆ శబ్దాలే.. ఈ హియర్స్ చెవిన పడుతున్నాయని వాదించారు. మరోవైపు ఈ హమ్మింగ్ బాధితులకు కేవలం ఒత్తిడి, ఆందోళనల వల్లే అలాంటి శబ్దాలు వినిపిస్తున్నాయని ఇంకొందరు శాస్త్రవేత్తలు సిద్ధాంతీకరించారు. ఏది ఏమైనా ఈ హమ్(శబ్దం) ఎక్కడి నుంచి వస్తోంది? ఎలా వినిపిస్తోంది? అనేది వినేవాళ్లకు కూడా తెలియకపోవడంతో మిస్టరీగానే మిగిలిపోయింది. — సంహిత నిమ్మన ఇవి చదవండి: ఈ పండుగ కొందరికి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’.. -
ప్రపంచంలోని దోమలన్నింటినీ అంతం చేస్తే ఏమవుతుంది?... శాస్త్రవేత్తల సమాధానం ఇదే..
దోమలు అన్ని ప్రాంతాలలోనూ కనిపిస్తాయి.దోమలు కుట్టడం వలన సాధారణ జ్వరం మొదలుకొని ప్రాణాంతక వ్యాధులు సైతం సోకుతాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,500 దోమల ప్రజాతులు ఉన్నాయి. వీటిలో చాలా ప్రజాతులు దోమలు మనిషిని కుట్టవు. ఈ తరహా దోమలు పండ్లు, మొక్కల రసాలను తాగి జీవిస్తుంటాయి. కేవలం ఆరు ప్రజాతుల దోమలే మనుషుల రక్తాన్ని తాగుతాయి. ఇవి పలు వ్యాధులను కూడా వ్యాపింపజేస్తాయి. మన దేశంలో దోమల కారణంగా ఏటా 10 లక్షల మంది మరణిస్తున్నారు. Mosquitoes are the deadliest animal in the world: They kill more people than any other creature, due to the diseases they carry. pic.twitter.com/3v2CxAg8gc — TheFacts (@TheWorldFactsjj) May 27, 2023 దోమలు కుట్టడం వలన వచ్చే వ్యాధులలో మలేరియా, డెంగ్యూ,ఎల్లో ఫీవర్ మొదలైనవి ఉన్నాయి. వీటి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది మరణిస్తున్నారు. ఒకవేళ ప్రపంచంలోని దోమలన్నింటినీ మట్టుబెడితే ఏం జరుగుతుందో తెలుసా? దీని పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా దోమలను చంపేందుకు కెమికల్స్ వాడుతుంటారు. అయితే ఈ కెమికల్స్ వలన దోమలకన్నా అధికంగా మనుషులకే ముప్పు ఏర్పడుతోంది. దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు ఎటువంటి కెమికల్స్ సాయంలేకుండా దోమలను తరిమికొట్టే ఉపాయాలను కనుగొనే పనిలో పడ్డారు. దీనిలో చాలా దేశాలు విజయం సాధించాయి. మనిషిని కుట్టే ఆడ దోమల జీన్‌లో మార్పులు తీసుకువచ్చి జెనెటికల్లీ మోడిఫైడ్ దోమలను సిద్ధం చేశారు. దోమలు గుడ్లను పెడతాయి. అయితే వాటినుంచి పిల్లలు బయటకు వచ్చేలోగానే తల్లిదోమలు మృతిచెందుతాయి. సుమారు మూడు లక్షల దోమలను కెమన్ ద్వీపంలో 2009-2010 కాలాల మధ్య వదిలివేశారు. ఈ ప్రయోగం వలన దోమల జనాభాలో 96 శాతం వరకూ తగ్గింది. ఇటువంటి ప్రయోగం బ్రెజిల్ లోనూ మంచి ఫలితాలను ఇచ్చింది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం మూడు రకాల దోమలను నాశనం చేయగలిగితే పది లక్షలమంది మనుషులను కాపాడవచ్చు. అలాగే జెనిటికల్లీ మాడిఫైడ్ మస్కిటో ప్రయోగం కూడా ఇప్పటివరకూ ఎటువంటి దుష్పరిమాణాలను చూపలేదు. అయితే దోమలను పూర్తిస్థాయిలో నాశనం చేస్తే ప్రకృతి అందించిన ఫుడ్ చైన్‌కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దోమలు పూలలో పరపరాగ సంపర్కం ఏర్పడేందుకు సహకారం అందిస్తాయి. ఫలితంగానే పూలు పండ్లుగా మారుతాయి. దోమలు కొన్ని ప్రాణులకు ఆహారం వంటివి. కప్పలు, బల్లులు, తొండలు మొదలైనవి దోమలను తిని బతుకుతాయి. ఇవి ఉండటం వలన ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అందుకే దోమలను మొత్తంగా అంతం చేసేబదులు వాటిలో ప్రమాదకరమనవాటిని మాత్రం అంతం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
చెరువుల నిండా.. ఈ.కోలి!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలవాల్సిన పలు చెరువులు కాలుష్య కాసారమౌతుండటంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి చేరుతున్న వ్యర్థజలాలతో చెరువులు దుర్గందభరితంగా మారుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తాజా పరిశీలనలో వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే ఆయా చెరువుల్లో ఈ. కోలిఫాం, హానికారక బ్యాక్టీరియా ఉనికి అనూహ్యంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దోమల లార్వా భారీగా వృద్ధి చెందేందుకు అనుకూలంగా ఉండటంతో మహానగరంలో దోమలు విజృంభిస్తున్నాయి. ఈ దుస్థితి కారణంగా సిటీజన్లకు మలేరియా, డెంగీ వ్యాధుల ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిలువెల్లా కాలుష్యమే.. నగరానికి మణిహారంలా ఉన్న పలు చెరువులు రోజురోజుకూ కాలుష్యకాసారంగా మారుతున్నాయి. వీటి ప్రక్షాళనకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం విఫలం కావడం శాపంగా పరిణమిస్తోంది. సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాలు మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేయకుండానే ఈ చెరువుల్లోకి చేరుతుండటంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గందభరితంగా మార్చేస్తున్నాయి. ప్రధానంగా మలమూత్రాదులు, వ్యర్థ జలాల్లో ఉండే ఫేకల్ కోలిఫాం, టోటల్ కోలిఫాం మోతాదు అధికంగా పెరిగినట్లు పీసీబీ తాజా పరిశీలనలో తేలింది. దీంతో ఆయా చెరువుల్లో హానికారక షిగెల్లా, స్టెఫైలోకోకస్, ఈ.కోలి వంటి బ్యాక్టీరియా ఉనికి పెరిగినట్లు స్పష్టమైంది. దీనికి తోడు ప్రస్తుతం కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదవుతుండటంతో పలు చెరువుల్లో దోమల లార్వా అధికంగా వృద్ధి చెందుతోంది. దీంతో దోమలు ఆయా ప్రాంతాల్లో స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ దుస్థితికి కారణాలివే.. ♦ కూకట్పల్లి ప్రగతి నగర్ చెరువులో 2019తో పోలిస్తే 2020 సంవత్సరంలో ప్రతి వంద మి.లీ లీటరు నీటిలో 406 మైక్రో గ్రాముల మేర కోలిఫాం ఉనికి పెరిగింది. ♦ సమీప ప్రాంతాల మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరకుండా మినీ మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించడంలో జీహెచ్ఎంసీ విఫలం కావడంతో పరిస్థితి రోజురోజుకూ విషమిస్తోంది. ♦ గత 20 ఏళ్లుగా పలు చెరువులు కబ్జాలకు గురవడం.. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడటంతో మురుగు కూపమౌతున్నాయి. ♦ పలు చెరువులు వాటి ఎఫ్టీఎల్ పరిధిలో సగం భూములను కోల్పోయి కుంచించుకుపోతున్నాయి. ♦ చెరువుల ప్రక్షాళనకు జీహెచ్ఎంసీ పైపై మెరుగులకే ప్రాధాన్యతనిస్తోంది. ఉదాహరణకు కూకట్పల్లి అంబర్ చెరువులోకి సమీప ప్రాంతాల నుంచి భారీగా మురుగు నీరు నేరుగా వచ్చి చేరుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఈ ప్రాంతాల్లో దోమల దండయాత్ర... నగరంలోని అంబర్ చెర్వు, ప్రగతినగర్, కాప్రా, పెద్ద చెర్వు, సాయిచెర్వు, దుర్గంచెర్వు, నల్లచెర్వు, లక్ష్మీనారాయణ చెర్వులకు సమీపంలో ఉన్న కట్పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్, బాలానగర్ ప్రాంతాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలోని మెహిదీపట్నం, మసాబ్‌ట్యాంక్, చాదర్‌ఘాట్, కోఠి, మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, అంబర్పేట్, ముషీరాబాద్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. మూసీలోకి శుద్ధి చేయని వ్యర్థజాలాలు... మరోవైపు రోజువారీగా గ్రేటర్‌వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. మూసీ ప్రక్షాళన రెండోదశ పథకం కింద 10 చోట్ల ఎస్టీపీలు, మరో రెండు చోట్ల రీసైక్లింగ్ యూనిట్ల నిర్మాణానికి అవసరమైన రూ.1200 కోట్లు నిధులు విడుదల చేయడంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం శాపంగా పరిణమిస్తోంది. మలేరియా, డెంగీలతో తస్మాత్ జాగ్రత్త... ♦ప్రస్తుత సీజన్లో దోమలు స్వైరవిహారం చేస్తుండడంతో డెంగీ, మలేరియా వ్యాధుల ముప్పు పొంచి ఉంది. ♦గర్భిణులు, చిన్నారులు దోమలబారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గాలిలో వైరస్, బ్యాక్టిరియా వృద్ధికి దోహదం చేస్తున్నాయి. ♦ప్రభుత్వ యంత్రాంగం యాంటీ లార్వా ఆపరేషన్స్‌ను మరింత పెంచాలి. -
దోమల వేటలో..
సాక్షి, సిటీబ్యూరో: గత సంవత్సరం విజృంభించిన దోమలు..పెరిగిన డెంగీ కేసులను దృష్టిలో ఉంచుకున్న జీహెచ్ఎంసీ..ఈ సంవత్సరం మే మాసం నుంచే దోమల నివారణ చర్యలు చేపట్టేందుకు సమాయత్తమైంది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం లాగా వర్షాలొచ్చే జూన్‌లో కాకుండా అంతకంటే ముందే.. మే నెల్లోనే దోమల నివారణ చర్యలు విస్తృతంగా చేపట్టనున్నారు. గ్రేటర్ పరిధిలో 160కి పైగా చెరువులుండగా, వీటిల్లో దోమల పెరుగుదలకు కారణమైన గుర్రపుడెక్క ఎక్కువగా ఉన్న 40 చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపుతో పాటు చెరువు మొత్తండ్రోన్ల ద్వారా దోమల నివారణ మందుల్ని స్ప్రే చేయనున్నారు. మెషిన్లతో తొలుత చెరువుల్లోని గుర్రపు డెక్కను మొత్తం పూర్తిగా తొలగిస్తారు. తర్వాత జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం కార్మికులు ఎప్పటికప్పుడు చెరువుల ఒడ్డున పెరిగే గుర్రపు డెక్కను తొలగిస్తారు. చెరువుల్లోని దోమల లార్వాలను అంతం చేయడంతోపాటు, తిరిగి కొత్తవి రాకుండా డ్రోన్ల ద్వారా క్రిమిసంహారక మందుల్ని స్ప్రే చేస్తారు. ఇవి చెరువుల్లో దోమలు పెరగకుండా తీసుకునే నివారణ చర్యలు కాగా.. నగరంలో దోమలు పెరగకుండా ప్రతి రోజూ ప్రతి సర్కిల్, ప్రతివార్డులో ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకుగాను ప్రతి వార్డుకు రెండు పోర్టబుల్ ఫాగింగ్ మెషిన్లు, ప్రతి సర్కిల్‌కు రెండు వెహికల్ మౌంటెడ్ ఫాగింగ్ మెషిన్లను వినియోగించనున్నట్లు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (పారిశుధ్యం, ఎంటమాలజీ) రాహుల్‌రాజ్ తెలిపారు. ఈ లెక్కన గ్రేటర్ వ్యాప్తంగా 300 పోర్టబుల్ ఫాగింగ్ మెషిన్లు, 60 వెహికల్ మౌంటెడ్ ఫాగింగ్ మెషిన్లు వినియోగించనున్నారు. ఓవైపు కరోనా కట్టడిలో భాగంగా వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా క్రిమిసంహారక మందుల స్ప్రే జరుగుతున్నప్పటికీ, మరోవైపు దోమల నివారణ చర్యలు కూడా చేపట్టేందుకు ఎంటమాలజీ విభాగం సమాయత్తమవుతోంది. సిబ్బందికి రక్షణ కిట్లు జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఎంటమాలజీ విభాగం సిబ్బందికి సైతం పారిశుధ్య సిబ్బందితోపాటే ఏడాదికి సరిపడా సామాగ్రితో కూడిన రక్షణ కిట్‌ను అందజేయనున్నట్లు రాహుల్‌రాజ్ తెలిపారు. కిట్‌లో పది రకాల వస్తువులుంటాయన్నారు. ఒక్కొక్కరికి ఏడాదికి సరిపడా 56 మాస్కులు, రెండు జతల గ్లవుజులు, శానిటైజర్లు, 36 సబ్బులు, 6 లీటర్ల కొబ్బరి నూనె, రెయిన్ కోట్, రేడియం జాకెట్, క్యాప్, షూ, బాత్టవల్, కిట్‌లో ఉంటాయన్నారు. అభినందనలు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు, ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ సిబ్బంది పనితీరును వెల్లడిస్తూ జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం రూపొందించిన వీడియోను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లోని వారిని ఉద్దేశించి ఎంతో గొప్పగా పనిచేస్తున్న యోధులంటూ వారిని ప్రశంసించారు. కరోనా నివారణ విధుల్లో..వీడ్కోలు గురువారం పదవీ విరమణ చేయనున్న జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్‌ను అడిషనల్ కమిషనర్ రాహుల్‌రాజ్, ఇతర అధికారులు శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. గత సెప్టెంబర్‌లో జీహెచ్ఎంసీకి వచ్చిన డాక్టర్ అమర్ డెంగీ వ్యాప్తి తరుణంలో, ప్రస్తుతం కరోనా నివారణ చర్యల్లో అందరినీ కలుపుకొని పనిచేశారని వారు పేర్కొన్నారు. -
నగరంలో పెరుగుతున్న దోమల బెడద..
సాక్షి, సిటీబ్యూరో: కరోనా నేపథ్యంలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీని చేపట్టినట్లు చెబుతోన్న జీహెచ్ఎంసీ నిత్యం జరగాల్సిన దోమల నివారణ చర్యల్ని విస్మరించింది. చాలా ప్రాంతాల్లో ఫాగింగ్, తదితర కార్యక్రమాలు జరగడం లేదు. దీంతో స్లమ్స్‌లోనే కాకుండా పలు కాలనీలు, నివాస ప్రాంతాల్లో దోమల తీవ్రతతో జనం అల్లాడుతున్నారు. కరోనా లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటున్న ప్రజలకు దోమల స్వైర విహారం ఇబ్బందులు పెడుతోంది. నివారణ చర్యలు చేపట్టకపోతే త్వరలోనే నగరంలో దోమ కాటు తీవ్రమయ్యే పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీలో దోమల నివారణ కోసం పనిచేస్తున్న ఎంటమాలజీ విభాగంలో ఒక్కో యూనిట్‌కు 18 మంది కార్మికులు, ఒక సూపర్వైజర్ వంతున 125 టీముల్లో దాదాపు 2375 మంది పనిచేస్తున్నారు. గతంలో డివిజన్‌కు ఒకటి చొప్పున 150 పోర్టబుల్ ఫాగింగ్ మెషిన్లు మాత్రమే ఉండగా కొద్దికాలం క్రితం హైకోర్టు మందలింపులతో వాటిని 300కు పెంచారు. వీటిల్లో కొత్తవి అసలు వినియోగించడం లేరు. పెద్ద మెషిన్లు కూడా మరో 50 కొన్నారు. వెరసి దాదాపు 63 పెద్ద మెషిన్లున్నాయి. మొత్తం 150 పోర్టబుల్ ఫాగింగ్ మెషిన్లలో 130–140 వరకు మాత్రమే వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణాలనేకం. కరోనా భయాందోళనలతో చాలామంది కార్మికులు విధులకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో నివాసాలున్నవారు తమ స్వగ్రామాలకు వెళ్లి తిరిగి రాలేదు. గ్రామాల నుంచి వారిని రానీయడం లేరని, నగరానికి వెళ్లి ఊర్లోకి కరోనా తీసుకురావద్దని సంబంధిత గ్రామస్థులు వారిని అక్కడే నిలువరించినట్లు సమాచారం. దీంతో దాదాపు యాభై శాతం సిబ్బంది మాత్రమే పనిచేస్తుండటంతో ఆమేరకు ప్రభావం ఉంది. మరోవైపు దోమల నివారణ మందుకంటే తమకు కరోనా సోకకుండా ఉండేందుకు హైపోక్లోరైట్ పిచికారీనే కావాలని రాజకీయనేతల నుంచి పలువురు వీఐపీల వరకు కోరుతుండటంతో అధికారులు సైతం వాటికే ప్రాధాన్యమిస్తున్నారు. వివిధ వర్గాల నుంచి అందుతున్న ఫిర్యాదుల్లోనూ వీటిని కోరుతున్నవారే ఎక్కువగా ఉన్నారు. దోమల వల్ల వచ్చే మలేరియా, తదితరమైన వ్యాధులు నయమవుతాయి కానీ.. కరోనా వస్తే ప్రాణాంతకమనే తలంపుతోనూ చాలామంది హైపోక్లోరైట్‌నే కోరుతున్నారు. ఉన్న సిబ్బందిని ఆ కార్యక్రమాలకు వినియోగించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఎంటమాలజీ విభాగం సైతం రెగ్యులర్‌గా నిర్వహించే దోమల నివారణ చర్యల్ని మానుకుంది. దీంతో స్లమ్స్‌తో పాటు పలు కాలనీలు, నివాస ప్రాంతాల్లోనూ దోమలు క్రమేపీ పెరగుతున్నాయి. పరిస్థితి ఇదేవిధంగా ఉంటే ఇవి మరింత తీవ్రమయ్యే ప్రమాదమున్నందున దోమల నివారణపై కూడా అధికారులు ద్రుష్టి సారించాలని పలు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. మరోవైపు హైపోక్లోరైట్ స్ప్రే కూడా అన్ని ప్రాంతాల్లోనూ జరగడం లేదని, పరిమిత ప్రాంతాల్లోనే జరుగుతోందనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. -
గ్రేటర్ దోమ.. దొరకలే!
సాక్షి,సిటీబ్యూరో: సహజంగా పల్లె ప్రాంతాలతో పోలిస్తే పట్టణాలు.. నగరాల్లోని ప్రజల్లో సామాజిక చైతన్యం కాస్త ఎక్కువే. అన్ని విషయాల్లోనూ వారికంటే ఓ అడుగు ముందే ఉంటారు. ఇప్పుడు గ్రేటర్ వాసుల రక్తం రుచి చూసిన దోమలూ అలాగే మారాయి. నగరంలో వివిధ రోగాలకు కారణమవుతున్న దోమల రకాలను గుర్తించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేసిన ‘మస్కీట్’కు చిక్కకుండా అవి తప్పించుకుంటున్నాయంటే ఇక్కడి దోమలు ఎంతటి ముదుర్లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో దోమల నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించిన జీహెచ్ఎంసీ అధికారులు.. నగరంలోని ఏయే ప్రాంతాల్లో ఎక్కువ దోమలున్నాయో, అవి ఏ రకానికి చెందినవో గుర్తించేందుకు ‘మస్కీట్’ అనే ఉపకరణాలను నగరంలోని ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. తద్వారా డెంగీ కారక దోమలున్న ప్రాంతాల్లో నివారణ చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టాలని భావించారు. దేశంలోని కొన్ని నగరాల్లో మస్కీట్ల ద్వారా ఫలితం కనిపించిన నేపథ్యంలో నగరంలో వాటిని ఏర్పాటు చేశారు. ‘మస్కీట్’లోని లిక్విడ్, సెన్సార్లతో వెలువడే ప్రత్యేక వాసన ద్వారా ఆకర్షితమయ్యే దోమలు సదరుఉపకరణాల్లోకి చేరతాయని, తద్వారా ఏ ప్రాంతంలో ఎక్కువ దోమలున్నదీ, వాటిలోనూ డెంగీ దోమలు ఎక్కడ ఎక్కువగా ఉన్నదీ తెలుసుకోవచ్చని భావించారు. గత అక్టోబర్ నుంచి ఆ ఉపకరణాల్లోకి చేరుతున్న దోమలను లెక్కిస్తున్నారు. అయితే, ఆఉపకరణాల్లోకి చాలా స్వల్ప సంఖ్యలో మాత్రమే దోమలు చేరుతుండడంతో అధికారులు కంగుతిన్నారు. అక్టోబర్ నుంచి ఇప్పటి దాకా కూడా మస్కీట్‌కు ఆకర్షితమై అందులో చిక్కుతున్న దోమలు తక్కువ సంఖ్యలోనే ఉండడంతో అధికారులు ఆ ఉపకరణాల పనితీరుపై డైలమాలో పడి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. సదరు ఉపకరణాలకు ఒక్కోదానికి రూ.70 వేలు ఖర్చు చేశారు. అర కిలోమీటరు పరిధి వరకు దోమలను ఈ మస్కీట్ తనవైపు ఆకర్షిస్తుందని వాటి ఏర్పాటు సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఐదు ప్రాంతాల్లోని ఫలితాలను పరిశీలించి నగరంలో దాదాపు 500 ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఫలితం కనిపించలేదు. అయినప్పటికీ మరికొన్ని రోజులు ఆ యంత్రాలను పరిశీలించాక తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. రోజుకు 30 దోమలు కూడా చిక్కలేదు డెంగీ, చికున్ గున్యా జ్వరాలకు కారణమైన ఈడిస్ ఈజిప్టి, ఈడిస్ అల్బోపిక్టస్ తెగలకు చెందిన దోమలు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 4 మధ్య అంటే 21 రోజుల్లో అత్యధికంగా సికింద్రాబాద్ జోన్‌లోని బేగంపేటలో 616 మస్కీట్‌కు చిక్కాయి. అంటే సగటున రోజుకు 29 దోమలు చిక్కాయి. డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు ఆ ఏరియాలో 158 దోమలే చిక్కాయి. అంటే రోజుకు దాదాపు 16 దోమలు. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆ పదిరోజుల్లో కనీసం పది దోమలు కూడా మస్కీట్‌కు చిక్కలేదు. డిసెంబర్లో దోమల బెడద తక్కువే ఉన్నప్పటికీ, అక్టోబర్‌లో చిక్కిన దోమలు సైతం తక్కువే ఉండడంతో అధికారులు పునరాలోచనలో పడి, వాటి సహాయంతోనే దోమల లెక్కలు కచ్చితంగా తెలియవని భావిస్తున్నారు. ♦ 2019 డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు మస్కీట్లకు చిక్కిన దోమలు తక్కువే అయినప్పటికీ, వాటిలో మెదడువాపు, బోధకాలు వ్యాధులు కలిగించే క్యూలెక్స్ దోమలు ఎక్కువగా ఉండటం ఆందోళనకలిగిస్తోంది. ఆ పదిరోజుల్లో మస్కీట్లలో పడ్డ క్యూలెక్స్ దోమలు.. వాటి రకాలు ఏరియాల వారీగా ఇలాఉన్నాయి. క్యూలెక్స్ గెలిడస్(ఆడ, మగ).. క్యూలెక్స్క్వింకెఫేషియటస్(ఆడ, మగ) లెక్కలు ఇలా.. -
దోమలపై డ్రోనాస్త్రం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో దోమలు విజృంభిస్తున్నాయి.ప్రాణాంతక డెంగీ కేసులు పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్ని చర్యలు తీసుకున్నా నివారణ సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో బల్దియా దోమల నివారణకు ఆధునిక ఆయుధాలను ప్రయోగిస్తోంది. ఇందుకు టెక్నాలజీని వినియోగించుకుంటోంది. దోమ లార్వాలను తుదముట్టించేందుకు అవసరమైన మందును స్ప్రే చేసేందుకు ప్రత్యేక డ్రోన్లను వినియోగిస్తోంది. మరోవైపు కొత్తగా నానో టెక్నాలజీతో ప్రత్యామ్నాయ మందును స్ప్రే చేసే ప్రయోగం సైతం చేపట్టింది. డ్రోన్లతో ఇప్పటికే సత్ఫలితాలు వెలువడగా... ప్రత్యామ్నాయ మందు ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి. జీహెచ్ఎంసీకి చెందిన 650 ఎంటమాలజీ బృందాలు రోజుకు సగటున 1.40 లక్షల ఇళ్లలో తనిఖీలు చేస్తూ దోమల నివారణ మందు స్ప్రే చేస్తున్నాయి. ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాయి. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇవి ఇళ్లల్లో చేసే కార్యక్రమాలు కాగా...దోమలకు ఆవాసాలైన చెరువులు, సరస్సుల్లో యాంటీ లార్వా ఆపరేషన్లకు పడవలు వేసుకొని వెళ్లాల్సి వస్తోంది. ఫీకల్ స్లడ్జ్తో కూడిన చెరువుల్లోకి దిగినప్పుడు సిబ్బందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనికి పరిష్కారంగా టీహబ్‌లోని ఓ అంకుర సంస్థ దోమల నివారణ మందును స్ప్రే చేయడానికి తగిన నాసిల్స్తో కూడిన డ్రోన్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. దీన్ని తొలుత మియాపూర్ గుర్నాథం చెరువులో ప్రయోగించారు. సత్ఫలితాలు రావడంతో దాదాపు పది రోజుల క్రితం నగర మేయర్ రామ్మోహన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తగ్గిన లార్వా... ఒక లాడిల్ (సాంబారు గరిటె లాంటి పరికరం) పరిమాణంలోని (దాదాపు 40 మీ.లీ) నీటిలో లార్వాలు 120 నుంచి 20కి తగ్గాయి. లార్వా నివారణకు ఎంతో కాలంగా వాడుతున్న పైరిథ్రిన్, సిఫనోథ్రిన్ లాంటి ఆయిల్స్ స్ప్రేతోనే ఇది సాధ్యమైంది. డ్రోన్ ద్వారా చెరువు మొత్తం మందు పిచికారీ చేయడంతో ఇది సాధ్యమైందని భావిస్తున్నారు. దీని వినియోగం ద్వారా ఎంటమాలజీ కార్మికులు దుర్గందభరిత చెరువుల్లోకి దిగాల్సిన పని లేదు. అంతేకాదు దాదాపు 10 మంది నెల రోజుల పాటు చేసే పనిని డ్రోన్ ద్వారా ఒక్క రోజులో చేయడం సాధ్యమైంది. మిగతా చెరువుల్లోనూ... శేరిలింగంపల్లి జోన్‌లోని గుర్నాథం చెరువులో వచ్చిన ఫలితాలతో దుర్గం చెరువు, ఖాజాగూడ చెరువు, మల్కం చెరువు, గోపీ చెరువు, హైటెక్స్ దగ్గరి చెరువుల్లోనూ డ్రోన్‌తో స్ప్రే చేశారు. ఖైరతాబాద్ జోన్‌లోని అహ్మద్‌నగర్ నాలా, గోల్కొండ, లంగర్‌హౌస్, సాతం చెరువు తదితర ప్రాంతాల్లో కూడా డ్రోన్‌తో స్ప్రే ప్రారంభించినట్లు జోనల్ కమిషనర్ ముషారఫ్ ఫారూఖి తెలిపారు. గుర్రపుడెక్క తొలగింపునకు తాము డీవీడింగ్ యంత్రాలు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘ఎంటమాలజీ సిబ్బందితో చెరువుల్లో దోమల మందు పిచికారీకి దాదాపు నెల రోజులు పడుతుంది. 10మంది బృందం పని చేయాల్సి ఉంటుంది. చెరువు ఒడ్డు నుంచి దాదాపు పది అడుగుల లోపలికే తప్ప.. చెరువు మధ్యలోకి వెళ్లడం కుదరదు. అదే డ్రోన్ ద్వారా చెరువు మొత్తం స్ప్రే చేయొచ్చ’ని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ వి.వెంకటేశ్ తెలిపారు. డ్రోన్ ద్వారా ఒక పర్యాయం 10 లీటర్ల మందు తీసుకెళ్లొచ్చన్నారు. మూసీలోనూ... వివిధ చెరువులతో పాటు దోమలకు నిలయమైన మూసీలోనూ యాంటీ లార్వా ఆపరేషన్ చేపడుతున్నాం. దోమల నివారణకు డ్రోన్లను వినియోగిస్తున్నాం. మెరుగైన ఫలితాలు కనిపిస్తుండడంతో క్రమేపీ నగరంలోని అన్ని చెరువులకూ వీటిని వినియోగించే అంశాన్ని పరిశీలిస్తాం. – బొంతు రామ్మోహన్, మేయర్ త్వరలో నానోటెక్నాలజీతో... దోమల నివారణకు సంప్రదాయ మందుల స్థానంలో ప్రత్యామ్నాయ మందుగా నానో టెక్నాలజీ, సిల్వర్ పార్టికల్స్‌తో లార్వాలను నివారించవచ్చని ఓయూ ప్రొఫెసర్ ఒకరు కనిపెట్టారు. ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఈటీపీఆర్‌ఐ (ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) ఆమోదం తెలపడంతో పీసీబీకి కూడా లేఖ రాశాం. దాని స్పందనను బట్టి వినియోగిస్తాం. సిల్వర్ వాడకంతో మనుషులకు ఎలాంటి హానీ ఉండదు. ఇప్పటి వరకు లార్వాల నివారణకు డ్రోన్ల ద్వారా స్ప్రే కూడా ప్రపంచంలోనే ఎక్కడా లేదు. పైన వేలాడే తీగలు లేని, తగినంత ఓపెన్ ప్లేసెస్ ఉన్న చెరువులకు మాత్రమే డ్రోన్ వినియోగం సాధ్యం. ఇరుకు ప్రాంతాల్లో డ్రోన్ వెళ్లలేదు. గుర్రపుడెక్కను తొలగించేందుకు వీడిసైడ్స్కు కూడా డ్రోన్లను వాడుతున్నప్పటికీ, ఫలితాలను పరిశీలించేందుకు సమయం పడుతుంది. దాదాపు 25 ఎకరాల చెరువులోనైనా డ్రోన్‌తో ఒకే రోజులో స్ప్రే సాధ్యమవుతుంది. ఇందుకు డ్రోన్ అద్దె దాదాపు రూ.25వేలు. – హరిచందన దాసరి, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (లేక్స్ విభాగం) సత్ఫలితాలు ⇔ ప్రత్యేక డ్రోన్‌తో మందు స్ప్రే చేయడం ద్వారా నీటిలో లార్వాల సంఖ్య తగ్గింది. ⇔ 10 మంది బృందం నెల రోజుల పాటు పిచికారీ చేసే మందును ఈ డ్రోన్ ఒక్క రోజులోనే చేస్తుంది. ⇔ దీనితో ఒకేసారి 10 లీటర్ల మందు తీసుకెళ్లొచ్చు. ⇔ దాదాపు 25 ఎకరాలచెరువులోనైనా ఒకే రోజులో స్ప్రేసాధ్యమవుతుంది. -
దోమల నిర్మూలనకు కొత్త మార్గం
వ్యాధులను మోసుకొచ్చి అందించే దోమలను నియంత్రించేందుకు చైనా శాస్త్రవేత్తలు మరో కొత్త, వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. చైనాలోని రెండు ప్రాంతాల్లో జరిగిన ప్రయోగాల్లో తాము దోమలను విజయవంతంగా నియంత్రించగలిగామని జార్జ్‌టౌన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తెలిఆపరు. రేడియోధార్మికతతోపాటు వూల్బాకియా అనే బ్యాక్టీరియా రెండింటినీ ఉపయోగించడం ద్వారా తాము ఈ ఘనతను సాధించగలిగామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పీటర్ ఆర్మ్బ్రస్టర్ తెలిపారు. జికా, డేంగీ వ్యాధుల వ్యాప్తికి ప్రధాన కారణమైన ఆసియన్ టైగర్ దోమల నిర్మూలన కోసం తాము ఈ ప్రయోగాలు చేపట్టామని.. రేడియోధార్మికత ద్వారా దోమలు నిస్సంతులుగా మారితే.. వూల్బాకియా బ్యాక్టీరియా దోమ గుడ్లను నాశనం చేస్తుందని వివరించారు. రెండేల్లపాటు తాము గువాంగ్ ఝూ ప్రాంతంలోని రెండు ద్వీపాల్లో ఈ పద్ధతులను పరిశీలించి చూశామని చెప్పారు. దోమ గుడ్లలో 94 శాతం ఎదగలేకపోయాయని తెలిపారు. వ్యాధి వ్యాప్తికి కారణమైన ఆడ దోమల సంఖ్య కూడా 83 నుంచి 94 శాతం వరకూ తగ్గిపోయినట్లు తమ పరిశీలనల్లో తేలిందని వివరించారు. మగ దోమలను రేడియోధార్మికత ద్వారా వంధ్యత్వం వచ్చేలా చేయడం.. ఆ దోమలను ప్రకతిలోకి వదలడం ఈ పద్ధతిలో ముఖ్యమైన అంశమని అన్నారు. గతంలోనూ ఈ పద్ధతిని ఉపయోగించినప్పటికీ తాజాగా తాము బ్యాక్టీరియాతో కూడిన దోమలను ఉపయోగించామని.. ఫలితంగా ఆడదోమల గుడ్లు బలహీనంగా మారాయని వివరించారు. -
మరో మహమ్మారి!
ఉద్దానంపై మరో మహమ్మారి పంజా విసిరింది. ఏడు మండలాల్లో విస్తరించిన ఉద్దానం ప్రాంతం ఇప్పటికే కిడ్నీ వ్యాధులతో వణికిపోతుండగా..ఇప్పుడు బోధకాలు రూపంలో మరో భూతం చాపకిందనీరులా కబళిస్తోంది. దోమకాటు వల్ల సోకే బోదకాలు వ్యాధి (ఫైలేరియా) బాధితులు ఈ ప్రాంతంలో వందలాది మంది ఉన్నారు. కనీసం నడవడానికి కూడా వీల్లేనంతగా కాళ్లు ఉబ్బిపోయినా పేదరికం కారణంగా వైద్యానికి దూరమవుతూ మంచంపైనే మగ్గిపోతున్నారు. సర్కార్ స్పందించి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. శ్రీకాకుళం, కాశీబుగ్గ : ఉద్దాన ప్రాంతానికి చెందిన వందలాది మంది మూత్రపిండాల వ్యాధితో మంచం పట్టారు. వారిని చూసి కన్నవారు.. కుటుంబాలు కన్నీరుపెడుతున్నారు. బతికిం చుకోవడానికి అప్పులు చేసి.. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇలాంటి తరుణంలో బోదవ్యాధి అనే భూతం వారి జీవితాలను దహించడానికి చాపకింద నీరులా దూసుకొస్తోంది. ఈ ప్రాంతంలోని ఏ గ్రామంలో చూసినా పది మందికి తక్కువ కాకుండా ఫైలేరియా వ్యాధిగ్రస్తులు దర్శనమిస్తున్నారు. ఇప్పటికే ఉద్దానం, తీరప్రాంతం, మెట్ట ప్రాంతాల ప్రజలను కిడ్నీ వ్యాధి వణికిస్తోంది. వందలాది మంది మృత్యువతా పడ్డారు. తాజాగా బోదవ్యాధి వ్యాపిస్తుండడంతో ఈ ప్రాంతీయులు భయాందోళన చెందుతున్నారు. ఉద్దాన ప్రాంతంలోని ప్రధాన మండలాలైన పలాస, వజ్రపుకొత్తూరు, మందస, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, సొంపేట ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందిలో పది నుంచి 15 మంది వరకూ బోదవ్యాధితో బాధపడుతున్నారు. పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో 30 మంది, బ్రాహ్మాణతర్లాలో 20 మంది వ్యాధితో అల్లాడుతున్నారు. అలాగే లక్ష్మీపురం, బెండి, వజ్రపుకొత్తూరు, పూండి, పలాస, కాశీబుగ్గ, బైపల్లి, అక్కుపల్లితోపాటు గిరిజన ప్రాంతంలో కూడా ఈ వ్యాధి లక్షణాలతో వందలాది మంది మంచం పట్టారు. నడకయాతన.. బోదవ్యాధి బారిన పడిన వారు నడకకు కూడా నరక యాతన పడుతున్నారు. బరువెక్కిన శరీరంతో అవిటితనాన్ని అనుభవిస్తున్నారు. ఎటువంటి పనులు చేసుకోలేక కుటుంబాలకు భారంగా మారుతున్నారు. లేచి నిలబడి మంచినీరును సైతం తీసుకోలేక ఇతరులపై ఆధారపడుతున్నారు. ఇంజక్షన్లు నిలిపివేత.. గత ప్రభుత్వాలు ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను ఉచితంగా అందించేవి. సామాజిక ఆస్పతుల్లో ఇంజక్షన్లు అందుబాటులో ఉంచేవారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎడాదిలోపే బోదవ్యాధిగ్రస్తులకు ఇచ్చే ఇంజక్షన్ల సరఫరాను నిలిపివేసింది. దీంతో వ్యాధిగ్రస్తులు డబ్బులుపెట్టి చికిత్స చేయించుకోలేక, రోజురోజుకూ పెరుగుతున్న శరీర బరువురును భరించలేక మానసికంగా కుంగుపోతున్నారు. దినదిన గండంగా ఉంటున్న వీరి పరిస్థితిని చూసి ఆయా కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. తోడులేకుండా చిన్న పని కూడా చేసుకోలేక మంచానికే పరిమితిమవుతున్న వారిని చూసి కన్నీరు పెడుతున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడంలేదని బాధను వ్యక్తం చేస్తున్నారు. వయసు నిండకుండానే అవిటితనంగా మారుతున్న వారికి కనీసం పింఛన్ కూడా అందించడం లేదు. ప్రభుత్వం స్పందించి ఉచిత వైద్యంతోపాటు.. పింఛన్ అందేలా చూడాలని వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబాలు వేడుకుంటున్నాయి. శుభకార్యాలకు సైతం అందని ఆహ్వానాలు బోదవ్యాధి బారిన పడిన వారితో సహా.. వారి కుటుంబాలు వింతపరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తమను శుభకార్యాలు, ఉపాధి హామీ పథకం పనులకు కూడా పిలవడం లేదని చాలామంది బాధను వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మాతర్లా గ్రామంలో దాసరి బోగమ్మ, దాసరి వల్లయ్య, బడే జంగమయ్య, పైల నారాయణరావు, తలగాపు నర్సమ్మ, రోళ్ల బయ్యన్నతోపాటు 20 మందికిపైగా బోద మహమ్మారితో మంచానికే పరిమితమయ్యారు. నడవలేకపొతున్నాను నేను బిలాయ్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేసేవాడిని. గ్రామానికి వచ్చి వెళ్లేవాడిని ఆరుబయట పడుకున్నప్పుడు దోమలు కరిచాయి. అప్పటి నుంచి బోదవ్యాధి సోకింది. కాళ్లు వాపులతో అవిటివాడిలా ఇంటికే పరిమితమయ్యాను. ఎటువంటి వైద్య సేవలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. – గేదెల శ్రీరాములు, వ్యాధిగ్రస్తుడు, బొడ్డపాడు ఇంజక్షన్లు నిలిపివేశారు ఫైలేరియాసిస్ దోమకాటు కారణంగా బోదవ్యాధి సంక్రమిస్తుంది. మైక్రో ఫైలేరియా మనిషిశరీరంలోకి ప్రవేశించి తన పెరుగుదలను నెమ్మదిగా చూపుతుంది. శరీరంలో ఏ అవయవానికి సంక్రమించినా అది పెరుగుతుంది. మగవారిలో వృషనాలకు సైతం ఎఫెక్టు ఉంటుంది. మైక్రోరిలెన్ జ్వరంతో శరీరంలో లక్షణాలు చూపుతుంది. రక్తపరీక్ష ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. ప్రారంభంలోనే డయటిఇధైల్ కార్బన్జిన్ సిట్రస్‌ను 21 రోజులు శరీరంలోకి పంపించాలి. అంతకు మించిన స్టేజి దాటితే ఎవ్వరూ దానిని నయంచేయలేరు. ఇదివరకు సిప్రోల్ సర్జరీ చేసేవారు. లావుగా ఉన్న కాళ్లను సైజుతగ్గించే విధంగా వైద్యం అందించేవారు. ప్రభుత్వ ఆస్పపత్రిలో ఇంజక్షన్లు అందించేవారు. అయితే ఆ ఇంజక్షన్లు ఎముకలపై ప్రభావం చూపుతుండడంతో నిలిపివేశారు. పలాస ప్రభుత్వ ఆస్పత్రికి వారానికి పదిమందికిపైగా వ్యాధిగ్రస్తులు వచ్చి వెళ్తుంటారు. – డాక్టర్ ప్రకాశవర్మ, పలాస ప్రాంతీయ ఆస్పత్రి ఆస్పత్రి పర్యవేక్షులు -
గింజ రాక గిజగిజ!
దోమపోటు బారిన పడిన పంటను ఆవేదనతో చూస్తున్న ఈ రైతు పేరు దొడ్లె వెంకట్‌రెడ్డి. జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్‌కు చెందిన ఆయన.. మూడెకరాల్లో వరి వేశాడు. తొలుత పంట ఆశాజనకంగా కనిపించినా.. గింజ దశకు వచ్చే సరికి దోమపోటు తెగులు ఆశించింది. గత నెల రోజులుగా దాని ఉధృతి మరింతగా పెరిగింది. దాంతో రూ.8 వేలు ఖర్చు చేసి.. నాలుగు సార్లు పురుగుమందును పిచికారీ చేశాడు. అయినా దోమపోటు నియంత్రణలోకి రాలేదు. కోత దశకు వస్తున్న తరుణంలో దెబ్బతిన్న పంటను చూసి కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/హైదరాబాద్ : దోమ కా(పో)టుకు వరి రైతు విలవిల్లాడుతున్నాడు.. పంట చేతికందే దశలో దోమపోటు (సుడిదోమ) తెగులు ఉధృతి పెరగడంతో దిగాలు పడుతున్నాడు.. పురుగు మందుల కోసం వేలకు వేలు ఖర్చు చేస్తున్నా పంట దిగుబడి తగ్గిపోయేలా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు పాత జిల్లాల పరిధిలో వరికి దోమపోటు తెగులు సోకింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గాలిలో తేమ శాతం అధికంగా ఉండటంతో దోమపోటు ఉధృతి బాగా పెరిగింది. ముఖ్యంగా బీపీటీ–5204 వంటి సన్నరకాలు సాగు చేసిన రైతులకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. హెచ్ఎంటీ సోనా, జైశ్రీరాం, ఆమన్, అంకుర, తెలంగాణ సోనా వంటి సన్నరకాలతోపాటు 1010, బతుకమ్మ, కూనారం సన్నాలు వంటి దొడ్డు (స్వల్పకాలిక) రకాల వరికి కూడా దోమపోటు ఆశించింది. దిగుబడులు భారీగా తగ్గిపోయే అవకాశం ఉండడంతో రైతులంతా ఆందోళనలో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాల్లో వరికి దోమపోటు తెగులు ఆశించినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అధిక వర్షాలతో అనేకచోట్ల వరి ధాన్యం రంగు మారింది. దోమపోటుతో ధాన్యంలో తాలు శాతం పెరిగే అవకాశముండడం, వర్షాలతో రంగు మారడంతో మద్దతు ధర దక్కడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సగానికిపైగా పంటకు తెగులు! ఈసారి ఖరీఫ్‌లో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వరిసాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం పడింది. నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదలకు అవకాశం లేకపోవడం, ఇతర ప్రాజెక్టుల్లోకి ఆలస్యంగా నీరు చేరడంతో రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపారు. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలుకాగా.. ఈసారి 19.07 లక్షల (82%) ఎకరాల్లో మాత్రమే వేశారు. ఇందులోనూ సుమారు ఎనిమిది లక్షల ఎకరాల వరకు బీపీటీ–5204 వంటి సన్నరకాలను సాగుచేశారు. ఈ సన్న రకాలకు దోమపోటును తట్టుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. వీటితోపాటు దొడ్డు రకాల వరికీ తెగులు ఆశించింది. దీంతో నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సూర్యపేట, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి వంటి జిల్లాల్లో వరికి ఎక్కువగా నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా సాగైన వరిలో సగానికిపైగా అంటే సుమారు 10 లక్షల ఎకరాల్లో వరికి దోమపోటు ఆశించినట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారీగా పడిపోనున్న దిగుబడి దోమపోటు కారణంగా వరి దిగుబడులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఒక్కో ఎకరానికి సుమారు మూడు నుంచి ఏడు క్వింటాళ్ల వరకు దిగుబడి పడిపోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా తెగుళ్లను తట్టుకునే శక్తి తక్కువగా ఉండే బీపీటీ–5204 రకానికి ఎక్కువగా నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సాధారణంగా వరి ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని.. కానీ దోమపోటు కారణంగా 20 నుంచి 22 క్వింటాళ్లే దిగుబడి వస్తుందని చెబుతున్నారు. మిగతా రకం వరి దిగుబడులు కూడా నాలుగైదు క్వింటాళ్ల మేర తగ్గుతాయని స్పష్టం చేస్తున్నారు. ఎకరానికి ఐదారు వేల అదనపు భారం దోమపోటు ఉధృతంగా ఉండడంతో రైతులు పురుగు మందులు ఎక్కువగా వినియోగించాల్సి వస్తోంది. ఇప్పటికే పురుగుమందుల ధరలు పెరగగా.. మొత్తంగా సాగు వ్యయం పెరుగుతోంది. దోమపోటు నివారణ మందులను పిచికారీ చేయడానికి ఒక్కో ఎకరాకు ఒకసారికి రూ.వెయ్యి వరకు ఖర్చు వస్తోంది. అయితే ఉధృతి ఎక్కువగా ఉండడం, పంట దెబ్బతినే పరిస్థితి ఉండడంతో కొందరు రైతులు ఐదు పర్యాయాలు పురుగు మందును చల్లాల్సి వచ్చింది. దీంతో మొత్తంగా పురుగు మందుల ఖర్చుతోపాటు కూలీల ఖర్చు కలసి సాగు వ్యయం తడిసి మోపెడవుతోంది. తేమ పెరగడంతో ఉధృతి నెల రోజులుగా వాతావరణంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా దోమపోటు ఎక్కువగా ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉక్కపోత విపరీతంగా పెరగడం, గాలిలో తేమ శాతం 80 నుంచి 85 వరకు ఉండటం వంటివి తెగులు ఉధృతికి దోహదం చేస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. గత నెల రోజులుగా తరచూ కురుస్తున్న వర్షాలు, రైతులు నత్రజని ఎరువులు ఎక్కువగా వినియోగించడం కూడా తెగులు పెరగడానికి కారణమని పేర్కొంటున్నారు. వర్షాల వల్లే దోమపోటు ఇటీవల కురిసిన వర్షాలతో దోమపోటు ప్రభావం పెరిగింది. పురుగు మందులు చల్లాలని రైతులకు సూచనలు కూడా చేశాం.. – పార్థసారథి, వ్యవసాయశాఖ కార్యదర్శి 5 జిల్లాల్లో అధికంగా.. వర్షాలతో వాతావరణంలో వచ్చిన మార్పులు, తేమ శాతం, ఉక్కపోత పెరగడంతో దోమపోటు ఉధృతి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, వరంగల్ (పాత జిల్లాలు) జిల్లాల్లో ఎక్కువగా సోకింది. ఇటీవల శాస్త్రవేత్తల బృందం ఆ జిల్లాలో పర్యటించి వరి పంటను పరిశీలించింది. తెగులు కారణంగా దిగుబడి ఎకరానికి నాలుగైదు క్వింటాళ్లు పడిపోయే అవకాశముంది. దీని నియంత్రణకు పంట మొదళ్ల వద్ద మందు పడేలా పొలంలో కాలిబాటలు పురుగుల మందు పిచికారీ చేయాలి.. – ఆర్.జగదీశ్వర్, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్త మరింత అప్పుల పాలవుతున్నాం నా పేరు సీహెచ్ హన్మంతు నిజామా బాద్ జిల్లా మందర్న గ్రామం. మూడెకరాల్లో వరి వేశాను. గింజ వేసే సమయంలో దోమ పోటు ఆశించింది. పురుగు మందు పిచికారీ చేసినా.. మళ్లీ తెగులు తిరగబెడుతూనే ఉంది. ఇప్పటికే రూ.ఆరు వేల వరకు ఖర్చు చేశాను. ఇప్పటికే సాగుకోసం చేసిన అప్పులకు ఇది భారంగా మారింది. – సీహెచ్ హన్మంతు, మందర్న, నిజామాబాద్ జిల్లా మూడెకరాల్లో దోమపోటు వచ్చింది నా పేరు బొబ్బిలి సమ్మయ్య, వరంగల్ జిల్లా మాది మల్హర్ మండలం తాడిచెర్ల. ఐదు ఎకరాల్లో వరి పొలం వేసిన. కౌలుతో కలిపి ఐదు ఎకరాలకు రూ.80 వేల వరకు ఖర్చు వచ్చింది. అందులో పురుగుల మందులు, ఎరువులకే దాదాపు రూ.45 వేల వరకు ఖర్చు పెట్టిన. మొదట్లో ఎకరం పొలంలో అక్కడక్కడ దోమపోటు వచ్చింది. పురుగుమందులు కొట్టిన తగ్గినట్టే తగ్గి మూడెకరాలకు వ్యాపించింది. ఈ మూడెకరాల్లో వడ్లగింజ కూడా చేతికి వచ్చేట్టు లేదు. – బొబ్బిలి సమ్మయ్య, తాడిచెర్ల, వరంగల్ జిల్లా. రాష్ట్రంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం - 9.34 లక్షల హెక్టార్లు ఈ ఖరీఫ్ సీజన్లో సాగైన విస్తీర్ణం - 7.63 లక్షల హెక్టార్లు దోమపోటు ప్రభావిత జిల్లాలు: నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి తెగులు ఆశించిన విస్తీర్ణం: 10 శాతం నుంచి 20 శాతం వరకు.. (సుమారుగా) దిగుబడిపై ప్రభావం: ఎకరానికి 3 నుంచి 4 క్వింటాళ్లు తగ్గుదల -
ఉద్యమంలా దోమలపై దండయాత్ర
–నేడు జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు –జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఆదేశం కర్నూలు(హాస్పిటల్): దోమలపై దండయాత్ర– పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్ ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో జిల్లా కేంద్రం నుంచి జేసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను శనివారం మధ్యాహ్నం నగరపాలక సంస్థలు, గ్రామపంచాయతీలు, పురపాలక సంస్థల పరిధిలో తప్పక నిర్వహించాలన్నారు. ముఖ్యకూడళ్లలో ర్యాలీలు నిర్వహించి, పేదలుండే కాలనీల్లో పెద్ద ఎత్తున ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా వనం–మనం కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమం, వాటి సంరక్షణ, ట్రీగార్డుల ఏర్పాటు చేపట్టాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థల నుంచి విద్యార్థులను బందాలుగా ఏర్పాటు చేశామని చెప్పారు. మొత్తం 55వేల బందాలు ఉండగా, ఒక్కో బందానికి 10 ఇళ్లను కేటాయించి, వారి ద్వారా సదరు కుటుంబాల్లో వ్యాధులు రాకుండా చేపట్టాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. అందుకు అవసరమైన కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, ఫ్లిప్ క్యాలెండర్లు వైద్య ఆరోగ్యశాఖ సమకూరుస్తుందన్నారు. స్వయం సహాయ సంఘాల మహిళలను ఇందులో భాగస్వామ్యులను చేయాలన్నారు. ప్రతి అధికారి తమ కార్యాలయ పరిసరాల్లో కూడా పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి, సీపీవో ఆనందనాయక్, డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరిబాబు, డీపీవో ఆందన్, నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, డీఆర్డీఏ పీడీ రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.